Menu

Sansho Dayu – సినిమా సమీక్ష

 సినిమా: Sansho Dayu/Sansho, the Bailiff
దర్శకత్వం: కెంజి మిజోగుచి
దేశం: జపాన్
సంవత్సరం: 1954
అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం).

తర తరాలుగా జపనీయులు చెప్పుకుంటున్న జానపద కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. నాగరికత ఇంకా పూర్తిగా పరిమళించని రోజుల్లో ఈ కథ నడుస్తుందని సబ్-టైటిల్స్ ద్వారా తెలియచేయడంతో Sansho Dayu సినిమా మొదలవుతుంది.పదకొండవ శతాబ్దపు జపాన్ లో ఫ్యూడల్ వ్యవ్యస్థ నెలకొని వున్న రోజులవి. ప్రభువు ఆజ్ఞను మీరి బానిసలకు చదువు సంధ్యలు నేర్పించి, వారినీ మనుషుల్లా ఆదరించినందుకు గాను ఒక రాజ్య పాలకుడు అజ్ఞాత వాసానికి పంపబడతాడు.ఆరేళ్ళ తర్వాత ఆ రాజ్య పాలకుని కుటుంబం (తల్లి టమకి మరియు బిడ్డలు జుషియో, అంజులు) అతన్ని కలుసుకోడానికి దూరప్రాంతాలకు ప్రయాణం సాగిస్తారు. మార్గ మధ్యంలో వారికి జరిగిన మోసంతో తల్లి బిడ్డలు వేరు చేయబడి,ఆ తల్లి వేశ్య గాను, బిడ్డలు బానిసలు గానూ అమ్మేయబడతారు.

చిన్నపిల్లలని జాలి కూడా లేకుండా వారిని కొని వారిచే ఘోరమైన వెట్టి చాకిరీ చేపించమని అజ్ఞాపిస్తాడు Sansho అనే అధికారి. అత్యంత దీనమైన పరిస్థితుల్లో బాధాకరమైన జీవితాన్ని సాగిస్తున్న ఆ పిల్లలికి Taro అనే వ్యక్తి పరిచయం కాస్తా ఊరటనిస్తుంది. కష్టమో నష్టమో పెద్దయ్యే వరకూ ఈ కష్టాలని భరించాలని, ఆ తర్వాత అక్కడ్నుంచి బయటపడి తమ కుటుంబంతో ఏకమవ్వొచ్చని హితబోధ చేస్తారు. దాంతో పాటు అజ్ఞాతాంలోనికి వెళ్ళే ముందు తమ తండ్రి బోధించిన, “దయలేని వాడు మృగంతో సమానం. నీపై నీవు కఠినంగా ఉన్నప్పటికీ ,సాటి మనిషి పట్ల దయ చూపించు” అన్న సూత్రం వారిని ముందుకు నడిపిస్తుంది.

పదేళ్ళ తర్వాత జుషినో, అంజు ఆ బానిస గృహంలోనే పెరిగి పెద్ద వాళ్ళవుతారు. కానీ అక్కడ అనుభవించిన బాధల ఫలితంగా జుషినోలో ఎంతో క్రూరత్వం చోటుచేసుకుంటుంది. అంజు మాత్రం తండ్రి మాటను పాటిస్తూ అంత కష్టంలోనూ శాంతమూర్తిలా వుంటుంది. అనుకోకుండా ఆ అన్న చెల్లెల్లిద్దరికీ ఆ బానిస గృహం నుంచి పారిపోయే అవకాశం లభించినప్పటికీ, తన అన్నకు అనవసర భారం అవుతాననే ఉద్దేశంతో జుషినో ఒక్కడినే ఆ బానిస గృహం నుంచి పారిపొమ్మని ప్రోత్సాహిస్తుంది అంజు, ఆ వెంటనే తన ప్రాణాలూ అర్పిస్తుంది.

బానిస గృహం నుంచి బయటపడ్డ జుషినో, బానిస గృహంలో Sansho పెడ్తున్న హింసను, మరియు అతని ఆగడాలనూ అక్కడి రాజ్యపాలకునికి తెలియచేస్తాడు. ప్రభువుల ఆజ్ఞను Sansho శిరసావహిస్తున్నాడని అతని ఆగడాలు ఆపడం తన చేతుల్లో లేదని చెప్తాడు ఆ రాజ్యపాలకుడు. ఈ క్రమంలో జుషినో గతం తెలుసుకుని అతన్ని మరో రాజ్యానికి రాజ్యపాలకునిగా నియమించబడతాడు. జుషినోలోని క్రూరత్వం పూర్తిగా నశిస్తుంది. చిన్నప్పుడు తన తండ్రి నేర్పిన సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. తనకున్న పరిమిత అధికారంతో Sansho నడిపే బానిస గృహాన్ని ముట్టడిస్తాడు. అక్కడి బానిసలకు విముక్తి కలుగ చేస్తాడు. తన పని ముగియగానే తన పదవీ విరమణ చేసి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నాలు మెదలుపెట్టి చివరికి తన కుటుంబంలో మిగిలివున్న తల్లిని మాత్రం కలుసుకుంటాడు.

సినిమా మొత్తం ఎంతో బాధాకరమైన సన్నివేశాలతో పదకొండవ శతాబ్దపు రోజుల్లో జపనీయుల జీవితాన్ని కళ్ళకుకట్టినట్టుగా దృశ్యీకరించడంలో కెంజీ మిజోగుచి కనబర్చిన శ్రధ్ధ శ్లాఘనీయం. హాయిగా నవ్వుకోడానికో, సరదాగా కాలక్షేపం కోసమో ఈ సినిమా చూడడం కష్టం. నాగరికత వికసించిన క్రమంలో మానవుడు ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లలో బానిసత్వం ఒకటి. అలాంటి దురాచారాలను అణిచివేయడంలో ఎంతో మంది శ్రమ వుంది. అలాంటి ఒకరి కథగా ఈ సినిమా చూడొచ్చు. అలాగే పరిస్థితుల ప్రభావంగా చిన్నాభిన్నమైన ఒక కుటుంబ కథగా కూడా ఈ సినిమా చూడొచ్చు. అన్నింటికీ మించి సినిమా అనే ప్రక్రియలోని అన్ని శాఖల్లోనూ అత్యుత్తమ నైపుణ్యత కలిగిన ఒక సర్వాంగ సుందరమైన దృశ్య కావ్యంగా కూడా ఈ సినిమాని వర్ణించవచ్చు.

అకిరా కురసావా రూపొందించిన రోషోమాన్ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ Kazuo Miyagawa ఈ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమూ జపనీస్ ఇంక్ పెయింటింగ్స్ ను తలపిస్తుంది. ఈ సినిమాలో వెలుగు/నీడలతో Kazuo Miyagawa చేసిన ప్రయోగాలు అపూర్వం. నలుపు/తెలుపు కూడా ఇంత కలర్‌ఫుల్‌గా వుంటుందా అనిపిస్తుంది ఈ సినిమాలో ఫోటోగ్రఫీ.

ఈ సినిమాలో కెమెరా కేవలం చూసే ప్రయత్నమే చేస్తుంది; చూపించే ప్రయత్నం కాదు. క్లోజప్, పాయింట్ ఆఫ్ వ్యూ లాంటి అంశాలతో ఏదో ఒక్క అంశాన్ని ఉధ్ఘాటించే ప్రయత్నం చేయకుండా, సినిమాలోని ప్రపంచానికి కెమెరా కేవలం ఒక కిటికీ గానే ఉపయోగించాడు మిజోగుచి. ప్రతి సన్నివేశమూ మిడ్ షాట్ గానూ, అలాగే ఒకే ఫ్రేములో వేర్వేరు అంశాలను చేర్చే డీప్‌ఫోకస్ అనే ప్రక్రియ ద్వారా ప్రేక్షకుడు నిజాన్ని చూస్తున్నట్టుగా భ్రమ చెందడం మిజోగుచి సినిమాల ప్రత్యేకతగా భావించవచ్చు.

ఈ సినిమా జపాన్ కి చెందినప్పటికీ, ఈ సినిమాలోని కథ దేశ,బాష, జాతి, మతం లాంటి అడ్డుగోడలను అతిక్రమించి ప్రపంచంలోని ఏ మూలనున్న ప్రేక్షకున్నైనా కదిలించి వేయగలుగుతుంది.అలాంటి సత్తాకలిగిన అతికొద్ది సినిమాల్లో ఇది ఒకటి.

సినిమా అంటే ఏమాత్రం ఇష్టం వున్న వాళ్ళైనా తమ జీవితంలో ఒక్క సారైనా తప్పక చూడవలసిన సినిమాల్లో ఇది ఒకటి.ప్రముఖ రచయిత, సినీ విశ్లేషకుడు అయిన Gilbert Adair Sansho Dayu గురించి చెప్తూ ఇలా అంటారు: “Sansho Dayu is one of those films for whose sake the cinema exists.” ఈ సినిమా చూసిన వారెవరైనా ఆయనతో ఏకీభవించక మానరు.కెంజీ మిజోగుచి రూపొందించిన సినిమాల్లో మూడు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రఖ్యాతి గాంచాయి. అందులో ఒకటి Sansho Dayu. ప్రపంచంలోని అత్యుత్తమ పది సినిమాలలో ఒకటిగా ఈ సినిమాను చాలామంది పేర్కొంటారు. ఎవరో గొప్ప సినిమా అన్నారని కాదు కానీ ఈ సినిమా చూస్తే ఇది “the best” సినిమాగా అంగీకరించకపోయినా “the Perfect” సినిమాగా మాత్రం తప్పక ఏకీభవిస్తారు.

అంజు ఆత్మహత్య చేసుకొనే దృశ్యం: