Menu

మన సినిమా చదువులు

What is the use of education?

Perhaps the principal function of education is to give us a language that is capable of shaping and articulating what we already to know and experience, but cannot adequately communicate.

అయితే మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయిన సినిమా గురించి మన education system లో ఎక్కడా స్థానం లేదు. స్కూల్, కాలేజ్ ల్లో కాకపోయినా కనీసం విశ్వవిద్యాలయాల్లోనయినా సినిమా గురించి సినిమా అనే ప్రక్రియలోని వివిధ అంశాల గురించి గానీ బోధించటం లేదు. ఈ మధ్యనే కొన్ని ఫిల్మ్ స్కూల్స్ మన రాష్ట్రంలో మొదలైనప్పటికీ మనకి మొదటినుంచీ ఫిల్మ్ స్టడీస్ లేకపోవడం మూలాన అక్కడ కూడా అధ్యాపకులను ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా సినిమా గురించి మన వాళ్ళు ఇంకా ఇల్లిటరేట్ గానే మిగిలిపోయి రాష్ట్రం మొత్తం ఫిల్మిల్లిటరసీ బాగా పెరిగిపోయింది.

అసలే అంతంత మాత్రమే చదువులు చదివో లేదా చదువులు మధ్యలో ఎగ్గొట్టి, ఇంట్లోనుంచి పారిపోయో వచ్చిన వాళ్ళతో నిండిపోయిన మన చలనచిత్ర రంగంలో అసలు విద్యలేకపోతే పోయింది. కనీసం తమకి కూడు పెడ్తుందని నమ్ముకున్న సినిమా విద్యనయినా అభ్యసించాలన్న జ్ఞానం చాలామందికి లేకపోవడం విచారకరం.

ఈ సినీవిద్య ఎందుకంత అవసరమంటే, మొదట్లో చెప్పినట్టు ఈ విద్యనభ్యసించడం ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఒక భాషని మనం ఏర్పరుచుకున్నవారవుతాము.

ఉదా: మొన్నీ మధ్య “తీన్ మార్” సినిమాకి పవన్ కళ్యాణ్ “స్పాట్ డబ్బింగ్” చెప్పారన్నది ఒక హాట్ టాపిక్.సినిమా గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. నెట్ లోనూ ఎన్నో ఆర్టికల్స్ చదివాను కానీ ఎప్పుడూ ఈ స్పాట్ డబ్బింగ్ అనే పదం మాత్రం నాకెదరువలేదు. అసలు ఆ పదప్రయోగమే ఒక పెద్ద తప్పు. డబ్బింగ్ అంటేనే షూటింగ్ లో రికార్డ్ చేసిన సౌండ్ ట్రాక్ తీసి ఆ తర్వాత తీరిగ్గా మరో సౌండ్ ట్రాక్ ని ఫిల్మ్ మీద వాడడాన్ని డబ్బింగ్ అంటారు. ఇక స్పాట్ (ఆన్ ది స్పాట్) లో డబ్బింగ్ చెప్పడమంటే? అసలు అర్థం లేదు. సరే నాకే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కదా! అని గూగుల్ ని అడిగి చూశాను. స్పాట్ డబ్బింగ్ అనే పదం మొదటి సారిగా మన వాళ్ళే వాడినట్టున్నారు; ఎందుకంటే స్పాట్ డబ్బింగ్ అనే పదానికి సంబంధించిన లింకులన్నీ “తీన్ మార్” కి సంబంధించినవే. మరి ఈ స్పాట్ డబ్బింగ్ అంటే ఏంటి?

నా దృష్టిలో స్పాట్ డబ్బింగ్ గట్రా అంటూ ఏదీ లేదు. ఇది మనవాళ్ళ క్రియేషన్. నిజానికి అక్కడ సింక్ సౌండ్ (Synchronized sound recording) చేసి ఉంటారు. అంటే ఫిల్మ్ మీద చిత్రాలతో పాటు శబ్దాన్ని కూడా రికార్డ్ చెయ్యడమే కాకుండా అదే శబ్దాన్ని, మరో సారి డబ్బింగ్ అవసరం లేకుండా, మాస్టర్ ప్రింట్ వరకూ ఉపయోగించడాన్ని సింక్ సౌండ్ అంటారు.

మన దగ్గర సినిమా తీయడమంటే హడావుడి గందరగోళం కాబట్టి అక్కడ రికార్డ్ చేసిన డైలాగులు మనకే సరిగ్గా వినపడవు కాబట్టి చాలా రోజులు మన వాళ్ళు డబ్బింగ్ నే నమ్ముకున్నారు. కానీ ఈ మధ్యనే లగాన్, దిల్ చాహ్తా హై, రాక్ ఆన్ లాంటి సినిమాల్లో సింక్ సౌండ్ ఉపయోగించారు. నిజానికి నేడు హాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాల్లో సింక్ సౌండ్ ద్వారానే శబ్దాన్ని రికార్డ్ చేస్తారు. గతంలో జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ సింక్ సౌండ్ వాడడం జరిగింది కాబట్టి తీన్ మార్ లోనూ అలాంటి ప్రయోగమే చేసి ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే సింక్ సౌండ్ అనే ప్రక్రియకు మన వాళ్ళు స్పాట్ డబ్బింగ్ అని ఒక కొత్త పేరు తగిలించడమే. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.

ఇప్పుడు మరొక ఉదాహరణ.

మీరు ఈ వ్యాసం చదువుతున్నారంటే స్క్రీన్ ప్లే ఫార్మట్ గురించి ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. లేదంటే ఇదివరకే నవతరంగంలో వచ్చిన కొన్ని స్క్రీన్ ప్లే లు చూడవచ్చు. ఫిక్షనల్ ఫీచర్ ఫిల్మ్స్ కి సంబంధించినంతవరకూ ప్రపంచం మొత్తం స్క్రీన్ ప్లే రాయడానికి ఒక ఫార్మట్ విస్తృతంగా ప్రచారంలో ఉంది. అదే విధంగా యాడ్ ఫిల్మ్స్, ఇండస్ట్రయిల్ ఫిల్మ్స్ కి సంబంధించిన స్క్రీన్ ప్లే రాయడనికి కూడా ఇంకో రకమైన ఫార్మట్ ప్రచారంలో ఉంది. అయితే మన వాళ్ళు(ఈ తప్పు ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియదు) ఇండస్ట్రియల్ ఫిల్మ్స్ కి వాడాల్సిన స్క్రీన్ ప్లే ఫార్మట్ ని ఫీచర్ ఫిల్మ్స్ కి వాడేశారు. ఇక్కడే ఒక ఘోర తప్పిదం జరిగిపోయింది.అదేంటో పూర్తిగా తెలుసుకోవాలంటే మనం స్క్రీన్ ప్లే ఫార్మట్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్ళాలి.

ఈ వ్యాసం పరిధిలో చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఆడియో విజువల్ స్క్రిప్ట్ ఫార్మట్ ఎలా ఉంటుందంటే-పేజీ ని మధ్యలో రెండు భాగాలుగా విభజించి ఎడమవైపు గడిలో visual information,దానికెదురుగా కుడివైపు గడిలో audio information రాస్తారు.

ఉదా:

సీన్ 1 

 

విశాలమైన ప్రదేశం. దూరంగా ఎక్కడో ఒక విండ్ మిల్ కనిపిస్తోంది. 

 

గాలివీస్తున్న చప్పుడు. దూరం నుంచి ఎక్కడో విండ్ మిల్ భారంగా తిరుగుతున్న శబ్ద

ఇండస్ట్రియల్ ఫిల్మ్స్ లో డైలాగులు ఉండవు కాబట్టి ఈ పద్ధతి బాగా సరిపోతుంది.
అదే ఏదైనా ఫీచర్ ఫిల్మ్ స్క్రిఫ్ట్ లో నుంచి ఇద్దరు మాట్లాడుకునే సన్నివేశం తీసుకుందాం.

INT. మంత్రి గారి కారు లోపల – NIGHT

ఒక చిన్నపాటి టౌన్ లాంటి ప్రదేశం అది. రాత్రి కావడంతో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడ మాత్రమే వీధి దీపాలు డిమ్ గా వెలుగుతున్నాయి. చుట్టుపక్కలంతా చీకటిగానే  ఉంది. దూరంగా ఒక కారు వస్తున్నట్టుగా రెండు హెడ్ లైట్ల వెలుగు తెలుపుతోంది.నల్లటి స్క్రీన్ మీద తెల్ల అక్షరాలతో అదిలాబాద్, డిశెంబరు 28,2009, రాత్రి 11:34 అని సబ్ టైటిల్స్ పడుతాయి.

అటవీ శాఖ మంత్రి వీరబధ్రం ప్రయాణిస్తున్న కారు. రాత్రి కావటం చేత కారు డ్రైవర్ తప్ప మిగిలిన వాళ్ళంతా తూగుతున్నారు. కారు ముందు భాగంలో ఒక గన్ మ్యాన్ కూర్చుని ఉన్నాడు. వెనక భాగంలో మినిస్టర్ తో పాటు మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను అప్పుడప్పుడూ తూగుతూ మళ్ళీ మేలుకుంటూన్నాడు. మంత్రి మాత్రం గుర్రుపెట్టి పడుకుని ఉన్నాడు. కారు గతుకుల రోడ్డు మీదుగా మెల్లగా కదుల్తుంది. అప్పటి దాకా కునికి పాట్లు పడుతున్న గన్ మ్యాన్ కళ్ళు నలుముకుని, ఒళ్ళు విరుచుకుంటూ డ్రైవర్ వైపు తిరిగి….

గన్ మ్యాన్

ఆనంద్ రావ్, టైమెంతయింది?

గన్ మ్యాన్ వైపు కానీ, తన వాచీ వైపు కానీ చూసుకోకుండా

డ్రైవర్

పదకొండు దాటింది

గన్ మ్యాన్

ఆకలేస్తుంది గురూ, కొంచెం త్వరగా పోనీ…

అని చెప్పి గన్ మ్యాన్ కారు రేర్ వ్యూ మిర్రర్లో అప్పుడప్పుడూ తమని దాటి వెళ్తున్న స్ట్రీట్ లైట్ కాంతిలో కనిపించిన వెలుగుని చూస్తూ కూర్చున్నాడు.

CUT TO:

మామూలుగా హాలీవుడ్ లో కానీ ఇంకెక్కడైనా స్క్రీన్ ప్లే అనేది సాధారణంగా పైన చూపెట్టిన ఫార్మట్ లో ఉంటుంది. ఇలానే ఉండాలని ఎవరు చెప్పారంటే సమాధానం తెలియదు కానీ ఎన్నో దశాబ్దాలుగా ఈ ఫార్మట్ నే ఉపయోగిస్తూ వస్తున్నారనేది నిజం.

అయితే మన దగ్గర ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు డిసైడ్ చేశారో తెలియదు కానీ మన స్క్రీన్ ప్లే ఫార్మట్ పైన చూపించిన ఫార్మట్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడమే కాకుండా ఇంతకుముందు చూపించిన ఇండస్ట్రియల్ ఆడియో విజువల్ ఫార్మట్ లో మన స్క్రీన్ ప్లే రాయడం జరుగుతోంది. దశాబ్దాలుగా ఇలాగే మన వాళ్ళు స్క్రీన్ ప్లే రాయడం జరుగుతోంది కాబట్టి ఇది తప్పు అని చెప్పే ధైర్యం చెయ్యను కానీ మనం ఇప్పుడు వాడే ఫార్మట్ లో ఉండే కష్ట నష్టాలు ఏంటో చూద్దాం.

మనం సాధారణంగా చదివేటప్పుడు పైన్నుంచి కిందకి చదివేస్తాం. ఇప్పుడు మన కున్న ఫార్మట లో పైన్నుంచి కిందకి చదువుతూనే లెఫ్ట్ లో ఒక లైన చదివి మళ్ళీ రైట్ లో ఒక లైన చదవాలి. అంటే ఇందాక స్క్రీప్ట్ ని తెలుగు స్క్రీన్ ప్లే ఫార్మట్ లో రాస్తే ఈ కింది విధంగా ఉంటుంది.

Sc 1 INT. మంత్రి గారి కారు లోపల – NIGHT
ఒక చిన్నపాటి టౌన్ లాంటి ప్రదేశం అది. రాత్రి కావడంతో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడ మాత్రమే వీధి దీపాలు డిమ్ గా వెలుగుతున్నాయి. చుట్టుపక్కలంతా చీకటిగానే  ఉంది. దూరంగా ఒక కారు వస్తున్నట్టుగా రెండు హెడ్ లైట్ల వెలుగు తెలుపుతోంది.నల్లటి స్క్రీన్ మీద తెల్ల అక్షరాలతో అదిలాబాద్, డిశెంబరు 28,2009, రాత్రి 11:34 అని సబ్ టైటిల్స్ పడుతాయి. 

అటవీ శాఖ మంత్రి వీరబధ్రం ప్రయాణిస్తున్న కారు. రాత్రి కావటం చేత కారు డ్రైవర్ తప్ప మిగిలిన వాళ్ళంతా తూగుతున్నారు. కారు ముందు భాగంలో ఒక గన్ మ్యాన్ కూర్చుని ఉన్నాడు. వెనక భాగంలో మినిస్టర్ తో పాటు మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను అప్పుడప్పుడూ తూగుతూ మళ్ళీ మేలుకుంటూన్నాడు. మంత్రి మాత్రం గుర్రుపెట్టి పడుకుని ఉన్నాడు. కారు గతుకుల రోడ్డు మీదుగా మెల్లగా కదుల్తుంది. అప్పటి దాకా కునికి పాట్లు పడుతున్న గన్ మ్యాన్ కళ్ళు నలుముకుని, ఒళ్ళు విరుచుకుంటూ డ్రైవర్ వైపు తిరిగి….

 

గన్ మ్యాన్:

గన్ మ్యాన్ వైపు కానీ, తన వాచీ వైపు కానీ చూసుకోకుండా

డ్రైవర్:

గన్ మ్యాన్:

అని చెప్పి గన్ మ్యాన్ కారు రేర్ వ్యూ మిర్రర్లో అప్పుడప్పుడూ తమని దాటి వెళ్తున్న స్ట్రీట్ లైట్ కాంతిలో కనిపించిన వెలుగుని చూస్తూ కూర్చున్నాడు.

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆనంద్ రావ్, టైమెంతయింది?

 

పదకొండు దాటింది

ఆకలేస్తుంది గురూ, త్వరగా పోనీ…

 

ఇందాకే చెప్పినట్టు ఈ ఫార్మట్ లో డైలాగు రైట్ లోనూ యాక్షన్ లెఫ్ట్ లోనూ రాస్తారు. అయితే యాక్షన్ కంటే కేవలం డైలాగులే మన వాళ్ళకి ముఖ్యం కావడం వలన, అదీ కాక మన సినిమాలకి దర్శకులే స్క్రీన్ ప్లే రచయితలు కావడం వలన చాలా సార్లు మన స్క్రీన్ ప్లే లో లెఫ్ట్ లో మొత్తం ఖాళీగానే ఉంటుంది. అంటే చివరికి మన స్క్రీన్ ప్లే కేవలం డైలాగులు మాత్రమే ఉండే ఒక రేడియో ప్లే స్క్రిప్ట్ లా మిగులుతుంది. అదీ కాక చాలా సార్లు (ఇది నేను పర్సనల్ గా చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ తో మాట్లాడి తెలుసుకున్నాను) లెఫ్ట్ ని పూర్తిగా పట్టించుకోకపోవడం వలన చాలా సార్లు అవసరమైన విషయాలను షూట్ చేయడం మర్చిపోయి ఎడిటింగ్ టైం లో తంటాలు పడాల్సి వస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనకే కనుక ఫిల్మ్ స్టడీస్ విభాగం ఒకటుండుంటే ఇలాంటి కష్టాలు ఉండకపోను. మన సినిమాకంటూ ఒక భాష, దానికొక వ్యాకరణం దాంతోపాటే మనకి కావాల్సిన పదజాలం ఏర్పడి ఉండేవి. ఇప్పటికైనా మించిపోయింది లేదని నా అభిప్రాయం. అందుకే ఎప్పుడోకపుడు ఎవరో ఒకరు అన్నట్టు త్వరలోనే నవతరంగం ఫిల్మ్ స్టడీస్ విభాగం నెలకొల్పదలిచాము.

నవతరంగం గురించి మీకందరికీ తెలిసిందే. ఇక ఫిల్మ్ స్టడీస్ ద్వారా మేము ఏమేం చెయ్యాలనుకుంటున్నాం? అసలు నవతరంగంఫిల్మ్ స్టడీస్ యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాల గురించి త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటివరకూ శెలవు.

4 Comments
  1. jd.srinu May 30, 2011 /
  2. jd.srinu May 30, 2011 /
  3. visu May 31, 2011 /