Menu

మై డిన్నర్‌ విత్ ఆంద్రె (1981) – ఒక సమీక్ష

రచన:నాగరాజు పప్పు

షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ – కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది – బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. వీటికే రకరాకాల హంగులు కూర్చి కుర్చీల రూపురేఖలు ఎన్నో రకాలుగా మార్చవచ్చు.

కుర్చీలకి ఇలాటి రూపోటి కుదురుకొని – ఇక వీటి గతి ఇంతే, వీటి రాతని ఇంకెవడూ మార్చలేడని నిశ్చయం అయిపోయిందనుకొంటున్న తరుణంలో, ఓ శుభ ముహుర్తాన, “కుర్చీ అంటే ఇలాగే ఎందుకుండాలి” అని ఓ పిచ్చి ప్రశ్న ఓ ఇంజనీరుగారి తలపు తట్టింది. ఎద్దుల బండీలో, గడ్డివాముమీద సుఖాసీనుడై కునికిపాట్లు పడుతున్న ఓ రైతన్నని చూసాడేమో – వెంటనే ఆయనగారి మదిలో ఓ మెరుపు తళుకులీనింది. ఇంకేముందీ – బీన్‌బాగ్ అనే ఓ కొత్తరకం సుఖాసనం తయారైంది. బీన్‌బాగ్‌ని కుర్చీ అనడానికి ఎవ్వరికీ మనసొప్పదు – ఎందుకంటే అది కుర్చీ అనే నిర్వచనానికి లొంగదు. కాని, మూడు గంటల పాటు హాయిగా కూర్చొని, టి.వి.లో మాంచి సినిమా చూడాలంటే మాత్రం దీనికంటే ఉత్తమమైన ఆసనమూ మరోటి దొరకదు.

1981 దాకా ప్రపంచంలో వచ్చిన సినిమాలన్నీ కుర్చీలైతే, మై డిన్నర్ విత్ ఆంద్రె అనే సినిమా, వాటన్నిటినీ సవాల్‌ చేసిన బీన్‌బాగ్ లాటిది. ఏ రకంగానూ, దీనిని సినిమా అని గాని, కథ అని గాని అనడానికి కుదరదు, అలా అని, అనకుండా ఉండటానికి కూడా వీల్లేదు. ఈ సినిమా ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ముందుగా సినిమా అనే సాంకేతిక ప్రక్రియలోని ముఖ్యమైన అంశాలని ప్రస్థావించాలి.

కుర్చీలకి మూడు భాగాలున్నట్టే – అరిస్టాటిల్‌ కాలం నాటి నుండీ డ్రామాకి exposition, complication, conflict, climax అనే నాలుగు అంగాలున్నాయి. అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడ్డారు – ఇది ప్రస్థావన (exposition). అమ్మాయి పేదింటి పిల్ల, అబ్బాయి రాజకుమారుడు (అనార్కలీ సినిమా) – ఇది కథాంశం(Complication)[1] , అబ్బాయి తండ్రికి ఈ ప్రేమంటే ఇష్టం లేదు – ఇది సంఘర్షణ (Conflict) , చివరగా అమ్మాయి త్యాగమో, ఆత్మహత్యో చేసుకొంది, లేకపోతే – అమ్మాయి, అబ్బాయి కలిపి దేశాంతరాలు పారిపోయారు, ఇంకా కాకపోతే, కథ చివర్లో – అబ్బాయి తండ్రి ఉన్నట్టుండి మంచోడైపోయాడు – ఇది ముగింపు (Climax). సుమారుగా, 90% శాతం కథలన్నిటికీ – అది రామాయణమైనా, రోమియో-జూలియట్‌ అయినా – అమరిక, లేక ఆంగీకరణం [2] (organization) మాత్రం ఈ నిర్మాణాన్ని(structure) అనుసరించవలసిందే.

రచయితకాని, దర్శకుడు కాని – ఈ నిర్మాణ వ్యవస్థని (Structural Framework) అనుసరిస్తునే, తన సృజనాత్మకతని ప్రదర్శిస్తాడు. ఉదాహరణకి – కథని క్లైమాక్సుతో ప్రారంభించవచ్చు, లేదా కాంప్లికేషన్‌లోనే ఎక్కువ సమయం ఉపయోగించుకుని, కాన్‌ఫ్లిక్ట్, క్లైమాక్సులు కుదించవచ్చు. లేదా ఫ్లాఫ్-బాక్ లాటివి ఉపయోగిస్తూ – వెనక్కీ, ముందుకీ జరగవచ్చు. ఎంచుకొన్న కథాంశంలో ఈ నాలుగింటి మధ్యనున్న సంబంధాన్ని సృజనాత్మకంగా, కొత్తగా రూపొందించవచ్చు – ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణకాకుండా, ఒక వ్యక్తిలోనే జరిగిన సంఘర్షణని కాంప్లికేషన్‌, కాన్‌ఫ్లిక్ట్ గా ఎంచుకోవచ్చు.

ఈ తరహాలబట్టీ – ఆంగీకరణం కూడా స్థూలంగా – ట్రాజిక్, ఎపిక్, ఎపిసోడిక్, లిరికల్ అని మళ్ళా నాలుగు తరహాలు. మనం చూసే చాలా వరకూ డ్రామాలు, ఏక్షన్ సినిమాలు లాటివి ట్రాజిక్‌ సినిమాలకిందకే వస్తాయి (ఇక్కడ ట్రాజిక్‌ అంటే విషాదాంతమని అర్థం కాదు. కథార్సిస్ సిద్ధాంతానికి సంబంధించినది) పది పదిహేను కంటే ఎక్కువ ప్రథాన పాత్రలుంటే, లేదా కథకి కాని, సినిమాకి కాని నిడివి చాలా ఎక్కువుంటే వాటిని ఎపిక్స్ అంటారు – ఇతిహాసాలు, చరిత్రాత్మక చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి.

ఎపిసోడిక్‌ సినిమాల్లో – కథ ముక్కలు, ముక్కలుగా ఉంటుంది, వాటిని కలుపుతూ ఉండే అంతఃసూత్రం చాలా సున్నితంగా, ముళ్ళు, ముళ్ళుగా ఉండవచ్చు. కథనంలో కొన్ని లోపాలు ఉండటానికి ఆస్కారం ఉన్నది. స్వాతిముత్యం సినిమా ఎపిసోడిక్ సినిమాకి ఉదాహరణ. ఇందులో కథ ఫ్లాష్‌బాక్‌గా ప్రారంభం అవుతుంది. “నాకంటూ కథేమీలేదు, మీ నానమ్మ కథే నాకథ” అంటూ కథ ప్రారంభిస్తాడు శివయ్య. అతను చెప్పిన కథలో చిన్న కథలు చాలా ఉంటాయి. ఆ కథలో చాలా పాత్రలు ఒకసారి వచ్చి, వాటి పాత్ర అయిపోగానే కథలోంచి నిష్క్రమిస్తాయి – లలిత అన్నయ్య-వదిన, వూర్లో పూజారి, శివయ్య నానమ్మ, మరదలు, మావయ్య, లలిత అత్త, మామలు, గొల్లపూడి, సోమయాజులు – వీళ్ళందరూ – లలిత కథలో- అధ్యాయాల్లా ప్రవేశిస్తారు, పనవ్వంగానే నిష్క్రమిస్తారు. కొన్ని చోట్ల, శివయ్య, తనకు ప్రత్యక్షంగా తెలియని కథలు కూడా చెప్తాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఆస్పత్రినుంచీ వచ్చిన తర్వాత, గొల్లపూడి మరే సమస్యలూ సృష్టించలేదా, శివయ్య, లలితలకి రావల్సిన ఆస్తి వాళ్లకి దక్కందా, చిట్టి ఏమయిపోయింది, శరత్ బాబు లలిత,శివయ్యలని చూడటానికి ఎప్పుడూ రాలేదా, ఊర్లో ఎన్నాళ్ళనుంచో స్థిరపడిపోయిన చాకలి దంపతులు ఊరు విడిచి పట్ణం ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏమయి పోయారు లాటి ప్రశ్నలన్నీ వస్తాయి. కాని, అవన్నీ లలిత కథలో ప్రధానాంశాలు కాదు. బహుశా ఈ ప్రశ్నలు – మనవలు శివయ్యని అడిగే ఉంటారు, ఆయన వాటికేవో సమాధానాలు చెప్పే ఉంటాడు. ఇట్లాంటి లోటుపాట్లు ట్రాజిక్ ఆంగీకరణంలో కుదరవు. ఎన్నో చిన్న చిన్న కథలు కలిపి కూర్చిన దండలా ఉంటుంది స్వాతిముత్యం. ఇంగ్లిషులో ఫారెస్ట్ గంప్ సినిమా ఇలాటిదే.

లిరికల్ సినిమాలంటే – కథాంశాన్ని పైన చెప్పిన నిర్మాణంలో అమర్చడంలో చాలా వెసులుబాటు చూపించిన కథలు. విజయావారి కొన్ని సినిమాలు లిరికల్‌ సినిమాల కిందకి వస్తాయేమో. ఉదాహరణకి, మిస్సమ్మ సినిమాలో – మూడు, నాలుగు రకాల కాంప్లికేషన్సూ, కాన్‌ఫ్లిక్ట్సూ ఉంటాయి. ఒక పక్క, తప్పిపోయిన అమ్మాయి గురించిన కథాంశం, రామారావుకి, సావిత్రికి మద్య జరిగే కథాంశం, జమునకి, సావిత్రికి మధ్య నడిచే కథాంశం. మరోవైపు – రమణారెడ్డికి, సావిత్రి కుటుంబానికి మద్య జరిగే కథాంశం – ఇవన్నీ సమాంతరంగా కథలో నడుస్తుంటాయి. కాని, దర్శకుడు ఈ కథద్వారా చేరుకోదల్చుకొన్న లక్ష్యం మాత్రం పైకి కనిపించదు. ఈ సినిమా అప్పటి సమాజం మీద ఒక భాష్యం లాటిది. ఈ సంగతులన్నీ పాత్ర్రల మద్య జరిగే సన్నివేశాలలో మనకి స్పురింపచేస్తారు గాని, వాటికి కథా నిర్మాణంలో కొట్టొచ్చినట్టుగా అమర్చలేదు.

ఉదాహరణకి – మనుషులంతా ఒకటేనని, మన అభిప్రాయాలు, విశ్వాసాలు మనం పెరిగిన వాతావరణం మీద ఆధారపడుంటాయిగాని, వాటికి అంతకు మించిన వస్తుపరత్వం (objectivity) ఏమీ ఉండదనేది ఒక అంశం. దీనిని దర్శకుడు క్రిస్టియన్ మతాన్ని ఎంతగానో నమ్మిన సావిత్రి బతుకు తెరువుకోసం త్యాగరాజ కీర్తన పాడటంలో చాలా తెలివిగా సూచిస్తాడు. సినిమా ప్రారంభంలోనే “రాగసుధారస పానమూ చేసి రంజిల్లవే ఓ మనసా” అనే పాటని, ఆ పాట చిత్రీకరణలో బొట్టులేని ఓ క్రిస్టియన్ అమ్మాయిని, ఆ అమ్మాయి కుడిపాదం మీద పుట్టుమచ్చని చూపించి చాలా పోయెటిక్ గా సినిమా తాలుకూ ప్రస్థావన చేస్తారు. సిటిజెన్‌ కేన్ సినిమాలో, “రోస్‌బడ్‌” అనే ఒక మాట అర్థం ఏమిటి ఒక అప్రస్థుత అంశం మీద, మొత్తం సినిమాని ఎలా అమర్చారో, మిస్సమ్మలో సావిత్రి కుడిపాదం మీద పుట్టుమచ్చ అలాటిదే.

ఇవి కాకుండా, ఇంకెన్నో సామాజికాంశాలు ఈ చిత్రంలో ప్రథానాంశాలు. కాని అవి కథలో అంతర్భాగంగా ఉంటాయి. ఉన్నత విద్యలు అభ్యసించి, తన కాళ్ళమీద తాను నిలబడదామనుకొనే యువతి ఎదుర్కొనే సమస్యలు, వాటి మూలంగా ఆ యువతిలో తొణికిసలాడే నిస్సహాయత, ఉక్రో్షం కథానిర్మాణంలో కాకుండా – సావిత్రి వ్యక్తిత్వంలో చూపిస్తారు. ఇలాటి సమస్యలే మగాళ్ళకీ ఉన్నప్పటికీ, పాతుకుపోయిన సామాజిక వ్యవస్థ మగాడికి ఈ సమస్యలని తేలికగా ఎదుర్కోడానికి సాయపడుతుంది, వాటి సాయంతో యువకుడు బతక నేర్చిన వాడవుతాడు. సావిత్ర్రి వ్యక్తిత్వానికి, రామారావు వ్యక్తిత్వానికి మధ్యనున్న ‘కాంట్రాస్టు’ ద్వారా ఈ అంశాన్ని ఎత్తి చూపిస్తారు. ఒక సన్నివేశంలో – వీళ్ళిద్దరూ ఒక ఇంటిలో ‘దంపతులుగా’ చేరిన మొదటి రోజు రాత్రి – సావిత్రి, తన గదికి లోపల నుంచీ గడియ వేసుకొంటుంది, రామారావు కూడా దమ్ముకొట్టటానికి ఇటువైపు అదే తలుపుకి గడియ వేసుకొంటాడు. “మీరెందుకు గడియ వేసుకోటం?” అంటుంది సావిత్రి ఉక్రోషంగా. “ఏదో మా జాగర్త మాది లెండి” అంటాడు మనవాడు. లోపలివైపు గడియ ఆత్మరక్షణ, అభద్రతాభావం, బయటవైపు గడియ లౌక్యం, బతకనేర్చిన తనం.

ఇవి కాకుండా, నిరుద్యోగ సమస్యలు, చదువుకొన్న యువతీ యువకుల ప్రేమలూ, అప్పటి సమాజంలో చాంధసుల మీద (విశ్వనాథ?) – “మేం వేదాంతంలోనే ఛస్తాం” లాటి ఛణుకులూ ఇలాటివన్నీ కూడ ఈ కథా నిర్మాణంలో భాగం కానప్పటికీ, చమత్కారంగా కథలొ దర్శకుడు ప్రవేశ పెట్టిన అంశాలు – నిజానికివే ఈ కథకి ఆత్మ, అంతరాత్మానూ. అందుకే ఈ కథలో అందరూ హీరోలే, అందరూ విలన్లే. తన చిన్న పల్లెటూర్లో మంచి స్కూలు పెట్టాలనుకొనే జమీందారు రంగారావు, అక్కడ తన బ్రతుకుతెరువుకోసం తాపత్రయపడే అల్లూరి రామలింగయ్య జీవితంలో విలనే. సావిత్రి దృష్టిలో అందరూ విలన్లే. అలాగే ఏ పాత్ర కాపాత్ర్ర ప్రథాన పాత్రే ఈ సినిమాలో.

సమాంతరంగా నడిచే ఈ కథాంశాలన్నిటినీ చివర్లో ఇరవై నిమిషాలకి పైగా నడిచే క్లైమాక్సులో, అమానుషత్వానికి ప్రతీకైన రమాణారెడ్డిని వెలివేయడం ద్వారా, మిగిలిన పాత్ర్రలన్నీ ఏకమై, కథాంశాలన్నీ ఒక తాటిమీదకి తేబడతాయి. అంతవరకూ అసలు ఈ సినిమాలో రమణారెడ్డి ఎందుకు ఉన్నాడు అనిపిస్తుంది. ఇంత సంక్లిష్టమైన సినిమా కాబట్టే, మిస్సమ్మ సినిమా ముప్ఫైసార్లు చూసినా ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో గుర్తుంచుకోవటం చాలా కష్టం. లిరికల్ సినిమాలలో స్క్రీన్‌ప్లే సమర్ధవంతంగా నడిపించటం కత్తి మీద సాములాటిది. (ఇక్కడ లిరికల్ సినిమా అంటే, అది సినిమాలోని కథని సూచించదు, సినిమా నిర్మాణాన్ని, ఆంగీకరణాన్ని సూచించే వర్గీకరణ మాత్రమే. కథాపరంగానైతే, సంగీత సాహిత్యాలు మేళవించిన విశ్వనాథ్ సినిమాలు చాలా లిరికల్‌గా ఉంటాయి.)

మిస్సమ్మ సినిమాలో- పాత్ర్రల వ్యక్తిత్వాలలోకాకుండా, వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలనీ, సంఘర్షణలనీ సినిమా నిర్మణంలో చేరిస్తే – మిస్సమ్మ సినిమా కూడా – ఏ క్రాంతికుమారో, గెడ్డం కృష్ణో, దాసరో తీసిన – గొప్ప మహిళా చిత్ర్రమో, విప్లవ చిత్ర్రమో, సామాజిక చిత్ర్రమో అయ్యుండేది.

నిర్మాణం కాకుండా, సినిమాకి ప్రథానమైన అంశాలు మరికొన్ని ఉన్నాయి – చలన చిత్రం కాబట్టి, సినిమాలలో కదిలే “సీన్లు” ఉంటాయి. అంటే కథ మొత్తం ఒక గదిలోనో, ఒకే స్టేజి మీదనో జరగదు. లొకేషన్లు మారతాయి, బాక్‌గ్రౌండు మారుతూంటుంది. ఆపైన నేపథ్య సంగీతం, స్పెషల్ ఎఫెక్టులూ ఇలాటివన్నీ సరే సరి. వీటన్నిటితోపాటు రెండు గంటల సినిమా అంటే కనీసం పది పదిహేను పాత్ర్రలుండాలి కదా. లేకపోతే, సినిమా ఎవరు చూస్తారు? బోరు కొట్టదూ?

మై డిన్నర్ విత్ ఆంద్రె అనే సినిమాలో ఇవేవీ ఉండవు. ఇందులో సాంకేతికంగా అసలు కథంటూ ఏమీ ఉండదు. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఉన్నట్టుండి షాన్‌కి తన స్నేహితుడు ఆంద్రె నుంచి ఒక ఫోను్ వస్తుంది – డిన్నర్‌కి సాయంత్రం ఒక రెస్టారెంటులో కలుద్దామా అంటూ. కొన్ని సంవత్సరాల నుంచీ ఎవరికీ కనిపించకుండా మాయమైపోయిన ఆంద్రె నుంచీ హఠాత్తుగా ఫోనొచ్చేసరికి ఆశ్చర్యపోతాడు షాన్‌ – ఉత్సాహంగా, డిన్నర్‌కి ఒప్పుకొంటాడు. మిత్రులిద్దరూ న్యూయార్క్ లో ఒక పెద్ద రెస్టారెంటులో కలుస్తారు. డిన్నరు చేస్తున్నంతసేపు చాలా విషయాలు మాట్లాడుకొంటారు. అయిపోగానే ఎవరు దారిన వాళ్ళు వెళిపోతారు – ఇంతే కథ.

సుమారుగా రెండు గంటల పాటు నడిచే ఈ సినిమాలో ఒకటే సీను – మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకొంటూ భోంచెయ్యటం. కెమారా కూడా పెద్దగా కదలదు. ఇద్దరు నటులు – షాన్ వాలిస్‌, ఆంద్రె గ్రిగరి. ఆపైన ఒక వైటరు. ఇంతే ఈ సినిమాలో సరంజామా. చాలా మంది ఈ సినిమా సింగిల్ షాట్‌లో, రియల్ టైములో తీసేసారనుకొన్నారు. మొదటి సారి చూసినప్పుడు – మనకీ అలాగే అనిపిస్తుంది. అసలు ఒక్క సీను ఆధారంగా, అదీ పెద్ద కథ అంటూ ఏమీ లేని ఈ సినిమాని సినిమా అనడానికే మనసొప్పదు.

మొదటి సారి చూసినప్పుడు, కేవలం ఒక సంభాషణని సినిమాగా విడుదల చెయ్యటానికి వీళ్ళకెంత ధైర్యం అనుకొన్నాను నేను. కాని ఎంత ఆలోచించినా, ఈ ఇతివృత్తాన్ని సినిమాగా కంటే, మరే విధంగానూ చెప్పడానికి కుదరదు అనిపించింది. రెండోసారి చూసినప్పుడు, “వావ్‌ – ఎంత సహజంగా చిత్రీకరించాడు దర్శకుడు” అనిపించింది. ఆ తర్వాత మూడు, నాలుగు సార్లు చూసినా ఎప్పుడూ బోరు కొట్టలేదు.

సినిమా అనే ఒక సాంకేతిక, కళాత్మక ప్రక్రియలో ఈ సినిమా ఒక “అండర్‌స్టేట్‌మెంట్‌”. ఒక హాండీకామ్‌తో ఓ సంభాషణని చిత్రీకరించి దానిని సినిమాగా విడుదల చేసాసేరేమో అనిపిస్తుంది. అసలలా అనిపించడమే ఈ సినిమాలో గొప్పదనం – అంత సహజంగా ఉంటుంది. కాని, నిజానికి ఈ సినిమాని, కొన్ని వారాల పాటు, ఒక స్టూడియోలో షూటు చేసారు. ఈ సినిమాకి స్క్రిప్టు షాన్ వాలిస్ (ఈ సినిమాలో ఒక నటుడు) రాసాడు – ఆయనకి స్క్రిప్టు రాయటానికి ఒక సంవత్సరం పట్టిందట. సినిమాలో కూడ నటులిద్దరూ నిజజీవితంలో పేర్లనే వాడారు. వాళ్ళు మాట్లాడుకొనే విషయాలు కూడ కళలకి, కళారాధనకి, సౌందర్యం, సైన్సు, ఈసోటెరిక్స్ లాటి అంశాలకి సంబంధించినవే. ఆంద్రె, షాన్‌లిద్దరూ న్యూయార్కులో రచయితలగా, సినిమాలలో, థియేటర్‌లో పనిచేస్తుంటారు (నిజ జీవితంలో కూడా). ఆంద్రెకి కళ అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నలు తీవ్రంగా మదిని తొలిచెస్తుంటాయి – వాటికి సమాధానాల అన్వేషణ కోసం, అన్నీ వదిలేసి ప్రపంచం అంతా తిరుగుతాడు – సహారా ఎడారిలో, టిబెట్లో, ఇంగ్లాండులో తనకు ఎదురయ్యిన అనుభవాల గురించి షాన్‌తో చెప్తాడు. ఆంద్రె అభిప్రాయలతో షాన్‌ చాలావరకూ ఏకీభవించలేడు. ఏదో, మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతుంటాడు, కాని చాలా వరకూ మాట్లాడేది ఆంద్రెనే.

షాను మనందరిలాటి మామూలు మనిషి, హేతువాది. ఆంద్రె మట్టుకు, చాలా లోతైన అలోచనలు కలవాడు. ఆయన, ప్రపంచం అంతా తిరిగి చాలా అనుభవాలు గడిస్తాడు. కళల పట్లా, మనిషి మనుగడ పట్లా, మానవాళి భవిష్యత్తు పట్లా ఆయనకి నిశ్చయమైన అభిప్రాయాలు చాలా ఉంటాయి. కొన్ని, ఆథ్యాధ్మిక అనుభవాలు, దివ్య అనుభూతులు కొన్నిటికి లోనయ్యినట్టుగా అనిపిస్తుంది. వీటన్నిటినీ షాన్ ఒప్పుకోలేడు. వాదించటానికి ప్రయత్నిస్తాడు, కాని అంతకన్నా ఎక్కువగా, ఆంద్రె మాటలు అతన్ని ఆలోచనలో ముంచెత్తుతాయి. ఆంద్రె మాటలు, ఆలోచనలు, అభిప్రాయాలు, అతను చెప్పే కొన్ని అనుభూతులూ వింటే, అతని మీద గుర్జీఫ్‌, ఔస్పెన్స్కీల ప్రభావం ఎక్కువగా ఉందేమో అని నాకనిపించింది.

ఇద్దరు స్నేహితులు మాట్లాడుకొంటున్నప్పుడు – సంభాషణ ఒక సరళరేఖలా ఉండదు. మొదట్లో – మామూలుగా క్షేమ సమాచారాలు, తలాతోకా లేని విషయాలు ఉంటాయి, కాస్సేపు పోయిన తర్వాత, మెల్ల మెల్లగా ఇద్దరూ సన్నిహితమవుతారు, సంభాషణ కూడ లోతవుతుంది. మరికొంత సేపటికి తిరిగి మౌనం – ఇలా, సంభాషణ వచ్చిపోయే కెరటాల్లా ఉంటుంది. స్నేహితుల సంభాషణకి ముగింపు అంటూ ఏమీ ఉండదు. “నువ్వు చెప్పిన సంగతులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, మళ్ళా కలిసినప్పుడు మరికొంత వివరంగా మాట్లాడుకొందాం” అంటూ, భోజనం అవ్వంగానే ఎవరిదారిన వాళ్ళు వెళిపోతారు. ఈ సినిమాలో కూడ అంతే. ఈ సినిమాలో – కాంప్లికేషనూ, కాన్‌ఫ్లిక్టూ, క్లైమాక్సు అనేవి అస్సలు లేనే లేవు.

ప్రఖ్యాత ఫ్రెంచి దర్శకుడు లూయ్ మాల్ ఈ సినిమాకి దర్శకుడు. మాల్ చాలా కష్టపడి తీసిన సినిమాల్లో ఇదొకటనుకొంటా. కొన్ని చోట్ల, కెమారాకి నటుల మధ్య ఎంత దూరం ఉండలి అనేదాన్ని మిల్లిమీటర్లలో కొలిచాడట. రెస్టారెంటు బయట రాత్రి చిక్కబడుతున్న కొ్ద్దీ, లోపల దీపకాంతి ఎక్కువవుతూ ఉంటుంది, ఆ కాంతిలో మిత్రులిద్దరి ప్రతిబింబాలు పక్కనున్న రెస్టారెంటు కిటికీలకున్న అద్దాలపై ప్రతిఫలిస్తుంటాయి. వీళ్ళద్దరికీ, భోజన పదార్ధాలు తెచ్చిపెట్టే వైటర్‌ పాత్ర కూడా చాలా అద్బుతంగా పట్టుకొన్నాడు మాల్. అతనేం మాట్లాడడు. ఒక నీడలా అనిపిస్తాడు మనికి. మిత్రులిద్దరి మధ్య మాటలకందని ఒక రకమైన టెన్షనుంటుంది – అది వారి వ్యక్తిత్వాలకి, వారి అభిప్రాయాలకి సంబంధించినది. ఇది మాటల కందని టెన్షను, దానిని అధ్బుతంగా చిత్రించాడు మాల్. ఇక ఏ సమయంలో వైటరు మరో పదార్ధం తీసుకురావాలి, వైటరు వచ్చినప్పుడు – సంభాషణలో, మాటల్లో వచ్చే విరామం, ఆంద్రె మాటలు – ఇవన్నీ గమనిస్తే, ఈ సినిమా దర్శకత్వంలో ఎంత లోతుందో తెలుస్తుంది. ఆంద్రె మాటలు ఎంతో ఆశక్తిగా వినే షాన్ చాలా నెమ్మదిగా తింటాడు, ఆంద్రె మాత్రం, మాట్లాడుతూ, ఫోర్కూ, నైఫూ కదిలిస్తూ, ఏదో తింటుంటూనే ఉంటాడు. ఈ సహజత్వాన్ని ఊహించటం, ఆపైన దానిని చిత్రీకరించటంలో మాల్ చూపిన ప్రతిభ అనితర సాధ్యం.

ఇంతకు ముందు చెప్పిన కథానిర్మాణానికి, ఆంగీకరణానికి ఏ విధంగాను లొంగని ఈ సినిమాని ఏమూసలోకి నెట్టేయాలో తెలియక విమర్శకులు, ఇందులో సంభాషణలో ఉన్న తాత్వికత ఆధారంగా దీనిని ఫిలసాఫికల్‌ మూవీ అని ఒక లేబులు అతికించేసారు. 1981 లో ఈ సినిమా వచ్చిన తర్వాత, సినిమాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో సహజత్వాన్ని సాధించటం అనే విషయంలో చాలా మార్పులు వచ్చాయి. అంతకు ముందు వరకూ, సంభాషణ అంటే, కేవలం డైలాగులే అనే అపప్రధని ఈ సినిమా తొలగించింది. సంభాషణ అనేది ఒక పూర్తి సన్నివేశం – ఇట్లాంటి సన్నివేశాలు ఎలా చిత్రీకరించాలి అనే దానికి ఈ సినిమా ఒక పాఠ్యపుస్తకం లాటిది.

వైవిధ్యమైన సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్లందరూ చూడవలసిన సినిమా. సినిమా ప్రక్రియ మీద ఆసక్తున్నవారూ, సినిమాలుకాని, డాక్యుమెంటరీలు కాని తియ్యదలచుకున్న వాళ్ళు ఈ సినిమా చూడకపోతే అది నేరం. ఇంగ్లీషు సినిమాలలో డైలాగులు సులువుగా ‘ఫాలో’ కాగలిగేవారికి ఈ సినిమా ఎంత మాత్రం బోరు కొట్టదు. నా ఉద్దేశ్యంలో, మమ్మీలాటి అర్థం పర్థం లేని ఎడ్వచంర్ సినిమాల కంటే, ఈ సినిమా చూస్తే, అసలు సినిమా చూడటమే ఒక ఎడ్వంచరు అనిపించక మానదు.

ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ థీమ్‌తో “బ్రేక్‌ఫాస్ట్ విత్ బ్లైసీ”, “కాఫీ విత్ నీల్స్” లాటి కొన్ని అనుకరణలు కూడా వచ్చాయి. మొదట్లో, ఎవ్వరికీ అర్థం కాకపోయినా, మెల్ల మెల్లగా ప్రజాదరణ పొంది న్యూయార్క్ లో ఒక సంవత్సరం పాటు ఆడిందట. ఒక్క న్యూయార్కులోనే కాకుండ, అమెరికాలో మరో 900 థియేటర్లలో విజయవంతాగా నడిచింది కూడా.

ఇప్పుడు ఈ సినిమా డి.వి.డి దొరకటం లేదు. కలెక్టర్సు ఐటమ్ స్థాయికి చేరుకొన్న ఈ సినిమా డి.విడి ఇప్పుడు ఇంటర్నెట్ లో వందనుంచీ ఐదువందల డాలర్ల వరకూ ధర పలుకుతోంది ( ఎనిమిదేళ్ళ క్రితం ఈ డి,వి.డి ని నేను పన్నెండు డాలర్లకి కొన్నాను. At last I am rich). కాబట్టి, ఏదైనా లైబ్రరీనుంచీగాని, అద్దెకి గాని తెచ్చుకొని చూడవలసిందే. ఈ వ్యాసం రాసే సమయానికి, ఈబేలో ఐభై డాలర్లకి ఈ డి.వి.డి. వేలం చూసాను. డి.వి.డి. కొనుక్కొందాం అనుకొనేవాళ్ళు అక్కడ ప్రయత్నిస్తే, కొంత తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంది. ఈ వ్యాసం చివర్లో ఉన్న అమేజాన్ లంకె ద్వారా కూడా, డి.వి.డి. ఇంటర్నెట్టులో అమ్మే షాపుల వివరాలు దొరుకుతాయి.

ఈ సినిమాకి సంబంధించిన మరికొంత సమాచారం:
ఈ సినిమా స్క్రిప్టుని వాలిస్ షాన్ ఒక పుస్తకంగా విడుదల చేసాడు. అమేజాన్లో దాని లింకు.

ఈ సినిమాపై అమేజాన్లో సుమారుగా వందదాకా వీక్షకుల సమీక్షలూ, వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. వీటిని ఇక్కడ చదవవచ్చు.

ఈ సినిమాపై వికీపీడియా లింకు.

ప్రఖ్యాత సినీవిమర్సకుడు రోజర్ ఎబెర్ట్ ఈ సినిమాపై రాసిన వ్యాసాలు, ఈ సినిమా ప్రజాదరణ పొందడానికి చాలా తోడ్పడ్డయి. రోజర్ ఎబెర్ట్ ఈ సినిమా పై రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.

Footnotes:
[1] – Complication అనే పదానికి సామాన్యార్థకంగా (general meaning) సంక్లిష్టత లేక సమస్య అని చెప్పుకోవచ్చు. కాని ఈ పదం డ్రామా నిర్మాణంలో Complication అనే పరిభాషా పదానికి (technical term) ఉన్న అర్థాన్ని సరిగ్గా సూచించటం లేదు. అందుకే కథాంశం అనే పదాన్ని Complication అనే పరిభాషా పదానికి సమానార్థకంగా వాడాను.

[2] Organization అనే పదానికి సమితి, సంస్థ, సమీకరణం, కూర్చటం, ఓటింపు లాటి పదాలున్నాయి. ఈ పదాలు కూడా అంత సరిగ్గా ఇక్కడ కుదరటం లేదు. అమరిక అనే పదం చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, అమరిక అనే పదంలో సంక్లిష్టమైన ప్రక్రియ అంతర్భాగంగా తోచదు. ఇంగ్లీషులో organization అనే పదం – organ, organic అనే పదాలకీ చాలా దగ్గర సంబంధం ఉంది. తెలుగులో – ఆంగికం అంటే organic అనే నిర్వచనాన్ని నండూరి రామమోహన్ రావు గారు విశ్వదర్శనం పుస్తకంలో వాడారు. నాట్యశాస్త్ర పరిభాషలో కూడా ఆంగికం అంటే ‘Presentation’ అనే అర్థం ఉందనుకొంటాను. అందుకే, నేను ఆంగీకరణం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాను. అయితే, ఇటువంటి పదం ఒకటి ఉందో, లేదో నాకు తెలియదు. ఎవరైనా, ఇంతకన్నా సరియైన పదాలు తెలిస్తే చెప్పగలరు.

–నాగరాజు పప్పు (http://canopusconsulting.com/salabanjhikalu)

11 Comments
 1. వెంకట్ February 25, 2008 /
 2. వెంకట్ February 25, 2008 /
 3. sathish February 26, 2008 /
 4. కొత్తపాళీ March 17, 2008 /
 5. సుగాత్రి March 19, 2008 /
 6. ravi May 15, 2008 /
 7. ఉష April 11, 2010 /
 8. Venkat Gopu April 12, 2010 /
 9. Venkat Gopu April 12, 2010 /
 10. Darth Vader April 13, 2010 /
 11. vbsowmya August 8, 2014 /