Menu

Ugetsu-సినిమా సమీక్ష

సినిమా:Ugetsu

దేశం:జపాన్

దర్శకుడు:కెంజి మిజోగుచి

సంవత్సరం:1953

అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం)

16 వ శతాబ్దపు రోజులవి. జపాను లోని వివిధ రాజవంశీయుల మధ్య జరిగే అంతర్యుధ్ధం తీవ్రస్థాయిలో వుంటుంది. సైనికులు సామాన్య ప్రజల ఇళ్ళపై దాడి చేసి వారి సంపదను దోచుకుంటుంటారు. అలాంటి వాతావరణంలో ఒక పల్లెటూరిలో పక్క పక్క ఇండ్లలో నివసించే ఇద్దరు కుమ్మరి వాళ్ళు తమ భార్య మాటలు చెవినపెట్టకుండా అత్యాశకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. గెంజురో అనే ఒక కమ్మరి తాను చేసిన కుండలనూ, పింగాణీ పాత్రలను దగ్గరే వున్న పట్టణంలో అధిక ధరకు అమ్మి బాగా సొమ్ము చేసుకుందామని తన భార్య బిడ్డలతో బయల్దేరుతాడూ. మార్గ మధ్యంలో బందిపోట్లు దోపిడీ చేస్తారన్న భయంతో భార్య బిడ్డలను ఇంటికి తిరిగివెళ్ళమంటాడు. అతని భార్య మియాగి అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా వున్నదాంట్లో స్థిరంగా జీవిద్దాం అని ఎంత బ్రతిమిలాడినా ఆమె మాటను లెక్క చెయ్యకుండా త్వరలోనే చాలా డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అతనితోపాటే తోబీ అనే మరో కమ్మరి మరియు అతని భార్య కూడా వుంటారు. గెంజురోది డబ్బు పిచ్చయితే తోబీది మరో రకమైన పిచ్చి. ఎప్పటికైనా సమురాయ్ అవ్వాలని కలలు కంటుంటాడు. పట్టణంలో కుండలు పింగాణీ పాత్రలమ్మగా వచ్చిన డబ్బులతో ఆయుధాలు, సైనిక వస్త్రాలు కొనుక్కుని అక్కడ్నుంచి ఉడాయిస్తాడు. లేని పోని వ్యామోహాలతో జీవితాన్ని నరకం చేసుకోవద్దని అతని భార్య ఒహామా చెప్పిన మాటలు అతని మీద ఏమాత్రం పనిచేయవు.

కుండలు, పింగాణీ పాత్రలు అమ్మి గెంజురో బాగానే సొమ్ము చేసుకుంటాడు. ఆ డబ్బు తీసుకుని ఇంటికి బయల్దేరుదామనుకునే సమయానికి అతనికి ఒక అందమైన యువతితో పరిచయం అవుతుంది. ఆమె అందం అతన్ని మత్తెక్కిస్తుంది. దాంతో తన కుటుంబాన్ని మరచి ఆమెతో పరిచయం పెంచుకుని ఊరవతల వున్న ఆమె భవనానికి తరలివెల్తాడు. గెంజురోపై ఆ యువతి చూపిన మితిమీరిన ప్రేమ పెళ్ళిదాకా దారితీస్తుంది. ఇలాంటి సమయంలోనే అతన్ని ఆదుకుంటాడో సాధువు. అతను సానిహిత్యంగా మెలుగుతున్న ఆయువతి మానవమాత్రురాలు కాదని, తీరని కోరికలతో భూమిపై సంచరిస్తున్న ఒక ఆత్మ అత్ని తెలుసుకుంటాడు గెంజురో. చేసిన తప్పు తెలుసుకుని అక్కడనుంచి ఇంటి వైపు బయల్దేరుతాడు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని గెంజురో తెలుసుకోలేకపోతాడు; తమ ప్రయానం మధ్యలోనే ముగించి ఇంటివైపు బయల్దేరిన అతని భార్యా బిడ్డలను మార్గ మధ్యంలో సైనికులు ఆమె దగ్గర వున్న తిండికోసం దాడి చేస్తారు. ఆ ఘటనలో మియాగీ ఒక సైనికుడి కత్తిపోటుకి బలవుతుంది.

మరోవైపు తోబీ ఎలాగో కష్టాలు పడి చివరికి సమురాయ్ కావాలనే స్వప్నాన్ని నిజం చేసుకుంటాడు. అతను సాధించిన పేరు ప్రతిష్టలు తన భార్యకు తెలియచేయాలనే ఉద్దేశంతో తన బలగంతో కలిసి బయల్దేరుతాడు. మార్గమధ్యంలో విందు పొందు కొరకై ఒక వేశ్యా గ్రహంలోనికి చేరుతాడు తోబీ. తన భార్య తను సాధించిన ఘనత చూసి ఎంతటి ఆనందం పొందుతుందో అన్న ఆలోచనల్లో మునిగిపోయిన తోబి అదే వేశ్యాగ్రహంలో ఎదురైన తన భార్యను చూసి ధిగ్భ్రాంతి చెందుతాడు. తను చేసిన తప్పు గ్రహించి తన సమురాయ్ కలలకు స్వస్తి చెప్పి ఆమెతో కలిసి వారి వూరివైపు బయల్దేరుతాడు.

కథా పరంగా మనకీ ఇలాంటి కథలు ఎన్నో వున్నప్పటికీ ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి కాబట్టే ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించింది. నేటికీ సినిమా ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా పరిగణించడుతోంది.

పాత బ్లాక్-వైట్ సినిమా కదా అని ఈ సినిమాని తీసి పారెయ్యడం తగదు. 50 ఏండ్లకు పూర్వం నిర్మించిన ఈ సినిమాలో నేటికీ తెలుస్కోదగ్గ, నేర్చుకోదగ్గ అంశాలు ఎన్నో వున్నాయి. ముందుగా ఈ సినిమా కథాంశం విషయానికొస్తే ఈ సినిమా మూడు లఘు కథ ల అధారంగా రూపొందించబడీంది. ఉగెత్సు: వెన్నల్లో వర్షం కథలు, అనే 17వ శతాబ్దపు కథసంపుటంలోని రెండు కథలు మరియు Guy de Maupassant రచించిన ఒక కథలను కలిపి ఈ సినిమా స్క్రీన్‌ప్లే రచించడం జరిగింది. Parallel Narrative, Mutiple Narratives అనే ప్రక్రియలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నా యాభై ఏండ్ల క్రితమే చలనచిత్ర కథనం లో వివిధ ప్రయోగాలు చేసిన ఘనత జపనీయులకే దక్కుతుంది. కథలు కొరవడినాయనుకుంటూన్న ఈ రోజుల్లో మనకి ఎన్నో లఘు కథలు వున్నాయని మర్చిపోకుండా, వాటిని సరైన రీతిలో ఉపయోగించి కొత్త కథనాల్ని సృష్టించవచ్చని ఉగెత్సూ సినిమా చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మిజోగుచి మిగిలిన అన్ని సినిమాలలోలానే ఈ సినిమాలో కూడా కెమెరా అనవసరమైన కదలికలు కలిగివుండదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆయా సన్నివేశం జరిగే సమయంలో దగ్గరుండి పరిశీలిస్తున్నట్టుగా వుంటుంది. ఈ సినిమాలో కూడా మిజోగుచి ఎప్పటిలానే జపనీయుల చరిత్రలో స్త్రీలు అనుభవించిన కష్ట నష్టాలను చూపిస్తూ స్త్రీవాదానికి తన మద్దతు పలుకుతారు.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం లాంటీ అన్ని సాంకేతిక అంశాలతోపాటు, మేలైన నటనతో ఈ సినిమా ఉత్తమ సినిమాకి మంచి ఉదాహరణ. చాలా కాలంగా మిజోగుచి సినిమాలు చూసే అవకాశం దొరకడం చాలా కష్టంగా వుండేది. గత రెండేళ్ళలో విడుదలయిన DVD లు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న కారణంగా ఇప్పుడు ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళు సులభంగానే చూడవచ్చు.అవకాశం దొరికితే తప్పక చూడవల్సిన సినిమాలలో ఇది ఒకటి.

One Response
  1. sivajikcvag@gmail.com December 4, 2013 /