Menu

మన సినిమాకో భాష ఉందా?

టేక్ 1

మొన్నీ మధ్యన ఏదో చర్చల్లో మన సినిమాకి ఒక భాష, వ్యాకరణం లేకపోవడమే నేటి మన సినిమాల దుస్థితికి కారణమని నేనొక బోల్డ్ స్టేట్మెంట్ చేసేసాను. వెంటనే పక్కన ఉన్నవాళ్ళెవరో అసలు సినిమాకో భాష ఉండడమేంటి? అయినా మన సినిమాలు తెలుగు భాషలోనే కదా ఉంటాయి. ఇంకో కొత్త భాష ఎందుకు? అని నా మీద యుద్ధం ప్రకటించారు.

“సినిమా దృశ్య మాధ్యమం. అందుకే సినిమాలో దృశ్యం మాట్లాడాలంటారు. దృశ్యం మాట్లాడడమంటే కథ చెప్పకుండా చూపించగలగాలి. అలా చూపించాలాంటే ముందు సినిమా మాధ్యమానికో భాష అవసరం. ఆ భాషకో వ్యాకరణం అవసరం.అలాంటి భాష అంటూ మనకొకటుంటే మన సినిమాల పరిస్థితి ఇలా ఉండేది కాదని” నేనూ యుద్ధానికి రెడీ అయిపోయాను.

“అసలలా ఎందుకు అనుకోవాలి. ఇప్పుడు మన సినిమాల్లో ఉన్న భాషే మన సినిమా భాష ఎందుకు కాకూడదు? మన సినమాల్లో ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న వ్యాకరణమే సరైనది ఎందుకు కాకూడదని” అపోజిషన్ వారి అభిప్రాయం.

నిజమే ఎందుకు కాకూడదు? Why not? Gibberish is my native language అనుకుంటూ నా దారిన నేను వచ్చేశాను.

**********

టేక్ 2

తన రెండో సినిమా షూటింగ్ చేస్తున్న ఒక దర్శకుడిని కలవడానికి సెట్ కి వెళ్ళాం. కాఫీ బ్రేక్ లో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఆయన చెప్పుకొచ్చాడు.
“నేను టివి సీరియల్స్ కి దర్శకత్వం వహించే రోజుల్లో నేను సెట్ లోకి వచ్చానంటే ట్రాక్ ట్రాలీ, క్రేన్ తో సహా అన్నీ అందుబాటులో లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ చేసే వాడిని” అని గొప్పగా చెప్పుకొచ్చాడు.

“అన్నీ ఎందుకండీ? మీకు కావాల్సినవి మాత్రం తెచ్చుకుంటే అద్దె ఖర్చులన్నా తగ్గుతాయికదండీ” అని నేను అనుమానం వ్యక్తం చేశాను.

“అలా కాదండీ. నేను ఫలానా షాట్ తీసేటప్పుడు ఆ షాట్ తియ్యడానికి క్రేన్ ఉయోగిస్తే బావుంటుందనిపిస్తే? అప్పటికప్పుడు మనకి క్రేన్ కావాలంటే వెంటనే దొరకదు కదా! అందుకే ముందు జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుంటే మంచిది కదా” ఆయన అభిప్రాయం.

పాత బుద్ధులు పోలేదాయనకి. ఈ సినిమా షూటింగ్ లో కూడా ట్రాక్ ట్రాలీలు, అన్ని లెన్స్ లు, క్రేన్స్, జిమ్మీ జిబ్ ఇలా అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. షాట్ రెడీ అవగానే క్రేన్ ని బాగా పైకి పోనిచ్చి కెమెరా అంత ఎత్తులో పెట్టి హంగామా చేస్తున్నారు. ఇంత ఎత్తునుంచి కెమెరా పెట్టారంటే ఏదో చాలా ముఖ్యమైన షాట్ అనుకుని చూస్తున్నాను. తీరా చూస్తే ఆ షాట్ లో ఒక క్యారెక్టర్ ఆటో దిగి రోడ్ క్రాస్ చేసి ఇంకో వైపుకి వస్తాడు అంతే!

ఈ లోపల ఇంకో కాఫీ బ్రేక్.

కెమెరా అంత ఎత్తులో పెట్టి క్యారెక్టర్ ని లో యాంగిల్ లో చూపిస్తున్నారంటే ఆ పాత్ర vulnerable లేదా powerless అని చెప్పకుండానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారేమో అని అదే విషయం మిత్రునితో ప్రస్తావించాను.

రెండు రోజులు నుంచి కెమెరా సెట్ లోఉంచి కూడా ఉపయోగించడం లేదని నిర్మాత సణుగుడు భరించలేక ఆ షాట్ అలా తీసానని ఆయన చెప్పుకొచ్చాడు.

**********

టేక్ 3

కొంత కాలం క్రితం నవతరంగంలో బి.యన్.రెడ్డి గారి గురించి వ్యాసాలు ప్రచురిస్తూ ఉండగా ఆ మహానుభావుడి సినిమాలు మరోసారి చూసే అవకాశం దొరికింది.
మల్లీశ్వరి సినిమా చూస్తున్నాను.

మల్లీశ్వరి తన బావ (చిన్న పిల్లలుగా)గుడి దగ్గర ఆడుకుంటూ ఉంటారు. కెమెరా నెమ్మదిగా టిల్ట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లలిద్దరి పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని సెకండ్ల తర్వాత డిసాల్వ్ అయ్యి ఆ పాదాలో మార్పు కనిపించింది. కెమెరా టిల్ట్ అప్ చేస్తే వాళ్ళు పెద్ద వాళ్ళయి ఎన్టీయార్ భానుమతిలయ్యారు.

మూడు గంటలపాటు ఒక చీకటి గదిలో తెరమీద ప్రదర్శింపబడే బొమ్మలే సినిమా. కానీ ఆ మూడు గంటల్లో ఒక్కో సారి కొన్ని దశాబ్దాలపాటు జరిగిన కథను చూస్తాము. కొన్ని సార్లు ఒక గంటలో జరిగిన విషయాలనే మూడు గంటలపాటు చూపెట్టగలిగే అవకాశమూ ఉంది.

ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది expanding time and condensing time గురించి.

అరవై ఎళ్ల క్రితం వచ్చిన మల్లీశ్వరిలో బి.యన్.రెడ్డి గారు ఒక చిన్న సినిమాటిక్ డివైజ్ ద్వారా సమయాన్ని ఎలా condense చేశారో చూస్తే ఆశ్చర్యం అనిపించింది. నిజానికి భక్త ప్రహ్లాద లోనూ ఇలాంటిదే ఇక సినిమాటిక్ డివైజ్ వాడినట్టు గుర్తు.

ఎన్నో సినిమాల్లో హీరో పరిగెడ్తూ పరిగెడ్తూ చిన్నపిల్లాడినుంచి పెద్దవాడిగా ఎదిగిపోవడం మనకి చూసి అలవాటు అయిపోయి ఉండొచ్చు. కానీ సమయాన్ని condense చెయ్యడానికి ఈ డివైజ్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలిలాంటి సినిమాటిక్ డివైజ్ మొట్టమొదటి సారిగా ఎవరు ఉపయోగించారు? ఇది మన వాళ్ళ సొంత ప్రయోగమా? లేక ఏదైనా హాలీవుడ్ సినిమాలోనుంచి చూసి మన సినిమాల్లోనూ వాడడం మొదలుపెట్టారా?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావలనుకున్న నాలాంటి సినిమా ఔత్సాహికులకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి?

**********

టేక్ 4

ఎక్కడ చదివానో గుర్తు లేదు కానీ ఇది నేను కల్పించి చెప్తున్నది కాదు. సీన్ కల్పితమే కానీ జరిగిన విషయం కాదు.

మన అంటే తెలుగు సినిమా మొదటి రోజుల్లో…

సీన్: అప్పారావు తో సుబ్బారావు సంభాషణ

స్క్రీన్ మీద అప్పారావు సుబ్బారావు ల టూ-షాట్.

అప్పారావు: చెప్పండి. ఏదో మాట్లాడాలన్నారు కదా!

సుబ్బారావు: ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను

షాట్ ఛేంజ్. అప్పారావు మీద క్లోజప్.

అప్పారావు: భయపడకండి. మీ పరిస్థితి నాకు తెలుసు. మీరు వివరంగా చెప్తే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

షాట్ ఛేంజ్. అప్పారావు సుబ్బారావు ల టూ-షాట్.

ఇద్దరి మధ్యా కాసేపు నిశబ్దం.

షాట్ ఛేంజ్. సుబ్బారావు మీద క్లోజప్. సుబ్బారావు చెప్పడం మొదలుపెట్టాడు.

సుబ్బారావు: మొన్న రాత్రి నేను ఇంటికి ఆలస్యంగా వచ్చాను. వచ్చేసరికి ఇల్లు తాళం తెరిచే ఉంది. నాకు ఎందుకో అనుమానం వచ్చి…

సుబ్బారావు చెప్తూనే ఉన్నాడు. షాట్ ఛేంజ్ అయింది. ఇప్పుడు అప్పారావు మీద క్లోజప్. అతను ఆసక్తిగా వింటున్నాడు.

ఇంతలో సినిమా హాల్లో జనాల గోల మొదలయింది. కానీ ఈ లోగా షాట్ మారి సుబ్బారావు మీదకు వచ్చింది. అతను చెప్తూనే ఉన్నాడు. అతను చెప్పే విషయం ఎంతో ఆసక్తిగా ఉంది. షాట్ మారింది. ఎక్స్ట్రీమ్ క్లోజప్ లో అప్పారావు ఆసక్తి గా వింటున్నాడు. మళ్ళీ సినిమా హాల్లో జనాల గోల.

ఇప్పటికే మీకు విషయం అర్థం అయ్యుండాలి. ఒక వ్యక్తి మాట్లాడుతుండగా మరో వ్యక్తి రియాక్షన్ చూపడం దర్శకుడు అవసరమనుకున్నా మాకు అలాంటి అవసరం లేదు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళనే మేము చూడాలని ప్రేక్షకులు నిర్ణయించేశారు-డ్రామాలో లాగా. నిజానికి అసలు తప్పంతా ఇక్కడే జరిగిందేమో.

అందుకే ఇప్పటికీ మన సినిమాలన్నీ ఒక పెద్ద ఇంట్లోని హాలు (స్టేజ్) మధ్యలో జరుగుతాయి. అదీ కూడా ఎవరూ కూర్చోకుండా సినిమా ఆద్యంతం నిల్చుని, కెమెరా వైపు (ప్రేక్షకుల వైపు) చూస్తూ కథ నడిపించేస్తారు.

అంటే మన సినిమాలు డ్రామా ప్రభావాన్నుంచి బయటపడనే లేదన్న మాట!

**********

టేక్ 5

“నువ్వెంత కాదన్నా తమిళ పక్షపాతివి!”

ఒక్క మాటలో నా తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేశాడు ఆప్తమిత్రుడొకడు.

“అభాండం ఎలాగూ వేసేశావు కాబట్టి, అసలు నీ కంప్లైంట్ ఏంటో చెప్పు. ఆ తర్వాత తేలుద్దాం” అన్నాను

“అప్పుడెప్పుడో “సుబ్రమణ్యపురం” అనీ, ఆ తర్వాత “నాడోడిగళ్” అనీ మొన్నీ మధ్య “ఈశన్” అనీ మూడు చెత్త సినిమాల గురించి ఎక్కడపడితే అక్కడ పొగిడేస్తున్నావు. మరి ఆ సినిమాలంత గొప్పవైతే మన దగ్గర మూడింటికి మూడు ఎందుకు ఫ్లాప్ అవుతాయి?”

“నాయనా! హిట్టు ఫ్లాప్ లు మన చేతిలో ఉండవు. అవి మన దగ్గర ఫ్లాప్ అయినంత మాత్రాన మంచి సినిమాలు మంచివి కాకుండా పోతాయా?”
“ఇక్కడే తెలిసిపోతుంది నీ బుద్ధి. నీకు ఆ సాంబారు గాళ్ళ సినిమాలు ఎలా ఉన్నా నచ్చేస్తాయి.”

“నాయనా ఇక్కడ చర్చ మూడు సినిమాల గురించి కాబట్టి వాటి గురించి మాట్లాడుదాము.మొదట సుబ్రమణ్యపురం తీసుకుందాం. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ తో పాటు మరొక సీన్ గురించి చెప్తాను. అప్పటికీ ఆ సినిమాలో గొప్పతనం గురించి అర్థం కాకపోతే చూద్దాం”

“సరే”

“సుబ్రమణ్యపురం చూసి చాలా రోజులే అయింది. కానీ అందులో ఓపెనింగ్ సీన్ గుర్తుంది. ఉదయం నాలుగు ఐదు మధ్యలో కథ మొదలవుతుంది. మార్కెట్ కి కూరగాయలు తీసుకెళ్ళే లారీని కెమెరా ఫాలో అవుతుంది. దారి మధ్యలో ఉదయాన్నే లేచి తమ తమ పనులకు సిద్ధమవుతున్న చాలా మందిని చూస్తాం. ఈ దృశ్యాల మీద టైటిల్ సీక్వెన్స్ నడుస్తుంది. టైటిల్స్ కాగానే ఒక వ్యక్తి జైల్ నుంచి విడుదల అవుతాడు. అతను జైలు నుంది బయటకు వస్తుండగానే ఎవరో కత్తితో పొడిచేస్తారు.ఏ సినిమాకైనా ఓపెనింగ్ సీక్వెన్స్ ఎంతో ముఖ్యం. సుబ్రమణ్యపురం లో ఓపెనింగ్ సీక్వెన్స్ లోని దృశ్యాల ద్వారా దర్శకుడు చెప్పకుండానే చాలా విషయాలు చెప్తాడు. ఈ కథ మనం రెగ్యులర్ గా చూసే జీవితాల గురించి కాదు. ఉదయాన్నే లేచి తొమ్మిదింటికల్లా టిఫిన్ చేసి ఆఫీస్ వెళ్ళి సాయంత్రం ఆరింటికి తిరిగొచ్చి భార్య పిల్లలతో హాయిగా షికార్లు కొట్టే మన అందరిలాంటి వ్యక్తుల కథ కాదు ఇది. పగలంతా శ్రమించి నిద్రపట్టక ఏ అర్థరాత్రో నాలుగు చుక్కలేసుకుని పడుకుని మళ్ళీ ఉదయాన్నే అందరికంటే ముందు లేచి బ్రతుకుతో పోరాడే శ్రామికుల జీవితం ఇది. “

“ఈ ఓపెనింగ్ సీక్వెన్స్ కి అర్థం ఇది అని శశికుమార్ నీకు చెప్పాడా” వెటకారంగా అడిగాడు మిత్రుడు.

“అతను చెప్పినా చెప్పకపోయినా ఇది నా interpretation. ఇలా interpret చెయ్యడానికి అవకాశం ఉంది కాబట్టే ఆ సినిమా గొప్పదయింది. మన సినిమాల్లాగా అరటికాయ తొక్క తీసి నోట్లో కుక్కి బలవంతంగా నీళ్ళుతాగించే రకం సినిమా కాదది. ఎంతో కొంత ప్రేక్షకుడి intelligence కి వదిలేస్తారు” కోపంగా చెప్పాను

“సినిమా గురించి అడుగుతుంటే అరటికాయ, తొక్క తోలు అని ఏదో మాట్లాడతావేంట్రా….”

“అంటే ఈ మధ్య ఒక సినిమా చూసాను. మన తెలుగు సినిమానే. అందులో హీరోయిన తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నవాడికి డబ్బులివ్వడానికి ఒక పార్క్ కి వెళ్తుంది. బ్లాక్ మెయిలర్ ఫోన్ చేసి పార్క్ లో ఉన్న ఒక పోస్ట్ బాక్స్ లో డబ్బులేసి వెళ్ళిపొమ్మంటాడు. ఆ అమ్మాయి అలాగే చేసి కార్లో కూర్చుని ఎంతసేపటికీ ఎవరూ పోస్ట్ బాక్స్ దగ్గరకు రాకపోవడంతో అనుమానంగా తిరిగి పోస్ట్ బాక్స్ దగ్గరకు వెళ్ళి చూసేసారికి ఆ పోస్ట్ బాక్స్ కి కింద ఒక రంధ్రం ఉండడం చూసి విషయం తెలుసుకుని తనని బ్లాక్ మెయిల్ చేసే వాడు చాలా ఇంటెలిజెంట్ అని షాక్ అవుతుంది. అంతటితో ఆగితే సరిపోయేది. ఆ అమ్మాయి తను పోస్ట్ బాక్స్ లో డబ్బులు వెయ్యడం, అవి ఆ రంధ్రం లోనుంచి అక్కడే కింద వెయిట్ చేస్తున్న బ్లాక్ మెయిలర్ చేతిలో డబ్బు కట్టలు పడడం, అతను క్రూరంగా నవ్వుకోవడం ఫ్లాష్ కట్స్ లో చూపిస్తాడు. ఇక్కడ ఆ అమ్మాయికి బ్లాక్ మెయిలర్ ఎలా ఉంటాడో తెలియదు. అలాంటప్పుడు ఫ్లాష్ కట్స్ లో చూసిన దృశ్యాలు ఎవరి దృష్టి కోణంలో చూసినట్టు? ఒక వేళ point of view సంగతి వదిలేసినా కూడా పోస్ట్ బాక్స్ కి ఉన్న hole చూడగానే అందరికీ విషయం అర్థమయిపోతుంది. అలాంటప్పుడు ఆ విషయాన్ని అంత emphasize చేయడం ప్రేక్షకుడి intelligence కి పరీక్షే!”
“అంటే తమిళ్ వాళ్ళు ఇలా చెయ్యరా?”

“అందరి గురించి చెప్పను కానీ, పైన సుబ్రమణ్యపురం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందులోనే ఒక సీన్ ఉంది; నిజానికి సినిమాలోకెలా అధ్బుతమైన సీన్ అది. ఈ సీన్ ని మాటల్లో వర్ణించడం కష్టం కాబట్టి ఈ సీన్ చూపించి….”

వద్దు బాబూ ఇప్పటికి వంద సార్లు ఆ సీన్ చూపించి చావగొట్టింది చాలు…ఆ ఈశన్ అని ఏదో సినిమా అన్నావుగా అందులో గొప్పతనమేంటో చెప్పు.
“సుబ్రమణ్యపురం లోని గొప్ప సీన్ లా “ఈశన్” లోనూ ఒక సీనుంది. ఇందులో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తాగిన మత్తులో ఉన్న ఒకడిని వాంతి చేసుకునే వరకూ కొట్టాలి. ఈ సీన్ లో ముఖ్యంగా ప్రేక్షకులకు పోలీస్ స్టేషన్ లో జరిగే తతంగం గురించీ అక్కడికొచ్చే క్రిమినల్స్ గురించి జుగుప్స కలగాలి. అందుకోసమని వాంతి చేసుకోవడం చూపిస్తే సినిమా హాల్లో జనాలకి ఇబ్బంది. అందుకే ఈ సీన్ మొదలయ్యే ముందు పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రధారి ఆ క్రిమినల్ ని కొట్టబోతూ అక్కడే ఉన్న కుర్చీని తంతాడు.ఆ కుర్చీ వచ్చి తెర మొత్తాన్ని (తొంభై శాతం) కప్పేస్తుంది. ఒక నిమిషం పాటు అటు వైపు ఏం జరుగుతుందో మన ఇమాజినేషన్ కే వదిలేస్తాడు దర్శకుడు. ఈ విధంగా ప్రేక్షకులనీ తన సినిమాలో ఇన్వాల్వ్ చెయ్యగలిగాయి కాబట్టే పైన చెప్పిన తమిళ సినిమాల గురించి పొగిడాను”

“అయితే ఇప్పుడేమంటావు?”

“తీసింది రెండు సినిమాలయినా రెండింటిలోనూ కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో తనదంటూ ఒక ముద్రవేశాడు దర్శకుడు శశికుమార్. ముఖ్యంగా హింసను డైరెక్ట్ గా చూపించడంకంటే indirect గా చూపించడం ద్వారా ప్రేక్షకుడి మనసులో ఎక్కువ అలజడి కలుగచేయవచ్చు అనే సిద్ధాంతాన్ని అతను తన సినిమాల ద్వారా నిరూపించగలిగాడు.ఈ విధంగా దర్శకుడు తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకోవడాన్నే auteur థియరీ అంటారు” అని పక్కకు చూసే సరికి నా ఆప్తమిత్రుడు ఆల్రెడీ డీప్ స్లీప్ లో ఉన్నాడు.

**********

టేక్ 6

“ఏమిటి రామయ్యా ధీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?”

“ఏమీ లేదు. మన సినిమాకొక భాష ఉందా అని ఆలోచిస్తున్నాను? మన కంటూ ఒక భాష ఏర్పరుచుకుని వుంటే అది ఏంటి? అది ఎలా ఆవిర్భవించింది. దాని ఆవిర్భావం వెనుక ఎవరెవరు ఉన్నారు? అదే మన సినిమాకొక భాష లేకుంటే…ఎందుకు లేదు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి.”

“ఎక్కడ దొరుకుతాయి ఈ సమాధానాలు?”

నవతరంగం ఫిల్మ్ స్టడీస్…

“ఇదేంటి కొత్తగా?”

మరిన్ని వివరాలు త్వరలోనే

8 Comments
  1. krshany May 29, 2011 /
  2. kondaveeti nani May 29, 2011 /
  3. Sowmya May 30, 2011 /
  4. శ్రీ May 30, 2011 /
  5. balaji May 30, 2011 /
  6. balaji May 30, 2011 /
  7. పవన్ సంతోష్ May 12, 2015 /