Menu

భావవ్యక్తీకరణవాదం-ఒక పరిచయం

ముందుమాట: ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ అనే శీర్షికన ప్రచురింపబడుతున్న ఈ వ్యాసాలు కేవలం, పాఠకులకు ఆయా దేశాల్లో సినిమా ఎలా మార్పు దిశగా పయనిస్తూ వచ్చిందో అని తెలియచెప్పే పరిచయ వ్యాసాలు మాత్రమే. ఇవి ఆయా ఉద్యమాల గురించి చేసిన లోతైన విశ్లేషణా వ్యాసంగం కాదు. ముఖ్యంగా ఇదంతా తెలిసి రాస్తున్నది కాదు తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. పదజాలం ఉపయోగంలోనూ, భావవ్యక్తీకరణలోనూ మరియు సమాచారం పొందుపరచడంలోనూ దొర్లిన తప్పులను వ్యాఖ్యల రూపంలో తెలియచేస్తే సరిచేసుకోగలమని మనవి చేసుకుంటున్నాము.

భావవ్యక్తీకరణ వాదం

పరిచయం: ఇరవైయ్యో శతాబ్దపు తొలి రోజుల్లో ఐరోపా లో, ముఖ్యంగా జర్మనీలో వివిధ కళల్లో (సాహిత్యం, చిత్ర లేఖనం, నాటకం, భవన నిర్మాణ శాస్త్రం) చోటుచేసుకున్న సృజనాత్మక మార్పులు ఆయా కళల గతి మార్చి వేశాయి. ఈ మార్పులు ఒక్కో రంగంలో ఒక్కొక్క విధంగా జరిగినప్పటికీ వీటన్నింటినీ పెనవేసిన సిధ్ధాంతాలు మాత్రం దాదాపు ఒకటే. అప్పటి వరకూ ఉన్న సంప్రదాయంగా వస్తున్న కళాత్మక ఆలోచనలను సవాలు చేస్తూ నవ్య సిధ్ధాంతాలతో కళల ద్వారా తమ భావ వ్యక్తీకరణ చేయతలపెట్టిన కళాకారుల సమష్టి ఆలోచనలను ’భావవ్యక్తీకరణ వాదం’ అని పిలవచ్చు.

భావవ్యక్తీకరణ వాదం కళారంగంలో ఎగిసిన గొప్ప ఉద్యమం అని పేర్కొనవచ్చు. కాని ఇది ఒక ఉద్యమం అంటూ పేర్కొని కళాకారులు మూకుమ్మడిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టలేదు. ’భావవ్యక్తీకరణ వాదం’ అనే పదాన్ని Der Sturm (The Storm) అనే పత్రికలో Herwald Walden మొదటగా ఉపయోగించినప్పటికీ అప్పటికే ఫ్రైడ్‍రిచ్ నీషే 1872 లో రచించిన The Birth of Tragedy అనే గ్రంధంలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. గ్రీకుల ప్రాచీన నాటకాలను (Greek Tragedies) విశ్లేషిస్తూ రచించిన The Birth of Tragedy లో గ్రీకు ట్రాజెడీలు ముఖ్యంగా అపోలోనియన్ మరియు డయోనిశియన్ ధోరణుల మధ్య జరిగిన సంఘర్షణగా వర్ణిస్తారు.

అపోలోనియన్ ధోరణి లో అన్నీ సక్రమంగానూ, హేతుబధ్ధంగానూ వుంటూ సమాజం మానవుడు సృష్టించిన పరిధులు దాటకుండా వుంటాయి. అప్పటివరకూ కళాకారులు చేసిన కళాత్మక సృష్టి అపోలోనియన్ అని నీషే అభిప్రాయం. అన్ని కళ రూపలకంటే శిల్పకళలో అపోలోనియన్ ధోరణిని బాగా చిత్రించవచ్చని ఆయన అంటారు.

అదే డయోనిశియన్ ధోరణిలో సృష్టించిన కళారూపాల్లోని వస్తువులు మరియు అంశాలు మనం కళ్ళతో చూసే ప్రపంచపు ప్రతిరూపం కాకుండా స్వప్నావస్థలో వున్న మానవుని మదిలో మెదిలే అస్పృష్ట భావాలకు ప్రతిరూపమని నీషే అభిప్రాయపడతారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో డయోనిశియన్ ధోరణిలో చేసిన కళా సృష్టే ఐరోపా సంస్కృతికి సద్గతిని కలుగచేస్తుందని వ్యక్తం చేస్తారు నీషే.

నీషే చెప్పినట్టు అపోలోనియన్ ధోరణిలో సృష్టించే వాస్తవికత కాకుండా డయోనిశియన్ ధోరణిలో సృష్టించే ఆత్మాశ్రయత కళనే నేడు expressionism లేదా భావవ్యక్తీకరణ వాదం అని పిలవబడుతోంది.

ప్రఖ్యాత కళా చరిత్రకారుడైన Norbert Lynton మాటల్లో చెప్పాలంటే,

All human action is expressive; a gesture is an intentionally expressive action. All art is expressive – of its author and of the situation in which he works – but some art is intended to move us through visual gestures that transmit, and perhaps give release to, emotions and emotionally charged messages. Such art is expressionist.

ఆవిర్భావం:1905 లో జర్మనీ లోని డ్రెస్‍డెన్ అనే పట్టణంలో నలుగురు విద్యార్థులు(Fritz Bleyl, Erich Heckel, Ernst Ludwig Kirchner మరియు Karl Schmidt-Rottluff) స్థాపించిన Die Brucke (The Bridge) భావవ్యక్తీకరణవాదంలో తొలిమైలు రాయిగా వర్ణించవచ్చు.అప్పటి జర్మన్ సమాజంలో వ్యాపించి వున్న ఫ్యూడల్ భావాలు కళల్లోనూ విస్తృతంగా నెలకొనివుండేవి. అప్పటి వరకూ సంప్రదాయంగా వస్తున్న కళాత్మక విలువలను సవాల్ చేస్తూ నవీన పద్ధతుల ద్వారా కొత్త రకమైన చిత్ర కళను సృష్టించాలనీ, అలాంటి కళను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో మొదలైన ఈ బృందం తమ మ్యానిఫెస్టోగా “…who want freedom in our work and in our lives, independence from older, established forces.” అని ప్రకటించుకున్నారు. ఈ బృందంలోని సభ్యులు కొన్నాళ్ళకే వేరుపడినా భావవ్యక్తీకరణ ఒక వాదం లా ఏర్పడడానికి ఈ బృందం చేసిన కృషి మొదటి మెట్టుగా భావించవచ్చు.

The Bridge అనే బృందం ద్వారా కళారంగంలో పూర్తి స్థాయిలో మార్పుని తేలేకపోయినా తమలాంటి భావాలు కలిగిన కళాకారులు సనాతన భావాలు వదిలి సరికొత్త భవిష్యత్తులోకి పయనించడానికి ఒక వంతెనను మాత్రం నెలకొల్పగలిగారు Die Brucke సభ్యులు.

The Blue Raider:1911 లో Wassily Kandinsky చిత్రించిన చిత్రాన్ని ఒక కళా ప్రదర్శనలో ప్రదర్శనకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన నిర్వాహకుల వైఖరికి నిరశనగా ఏర్పడిన ఒక బృందం పేరు ’Der Blaue Reiter (The Blue Raider)’.1903 లో Wassily చిత్రించిన ఒక చిత్రాన్నుంచి ఈ బృందం ఆ పేరు సంతరించుకుంది.

భావవ్యక్తీకరణ వాదానికి కొన్నాళ్ళు ముందు కళా రంగం గతి మార్చిన అనుభూతి వాదపు (Impressionism) కళాకారులయిన వేన్ గో లాంటి చిత్రకారులుపయోగించిన పద్ధతుల వైపు ఆకర్షణ చెంది 1911 లో ఏర్పడిన ఈ బృందంలో అప్పట్లో ఎంతో మంది కళాకారులు సభ్యులుగా చేరారు. తమకంటూ ఒక మ్యానిఫెస్టో ఏమీ లేకపోయినా, అలాగే అందరూ ఉమ్మడిగా ఒకే రకమైన చిత్రలేఖన శైళిని అవలంబించకపోయినా కూడా, ’కళ ద్వారా తమ ఆత్మాశ్రయత అనుభూతులని, అధ్యాత్మికతను ప్రకాశింప చేయాలి’ అనే అంశం వీరందరినీ ఒక చోటుకు చేర్చింది.

కానీ 1914 లో మొదలయిన మొదటి ప్రపంచ యుద్ధం తో ఈ బృందం వివిధ కారణాల వల్ల విడిపోవాల్సివచ్చింది.1906 లో ఏర్పడిన The Bridge పై Blue Raider కొన్నాళ్ళు పయనించి ఆగిపోవాల్సి వచ్చినా ఈ ఉద్యమం మాత్రం ఆగిపోలేదు.

సాహిత్యంలో భావవ్యక్తీకరణవాదం: చిత్ర లేఖనంలో భావవ్యక్తీకరణ వాదం ఊపందుకున్న రోజుల్లోనే సాహిత్యంలోనూ ఇటువంటి మార్పులు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. అప్పుడు రాజ్యమేలుతున్న వాస్తవికవాదము మరియు నైసర్గిక వాదపు రచనలు పాత్రల బాహ్య ప్రపంచంలో జరిగే ఘట్టాల పరంపరగా మాత్రమే ఉండేవి. అప్పటి సాహిత్యానికి భిన్నంగా పాత్రల మదిలో మెదిలే అంతులేని ఆలోచనలను, అంతర్గత సంఘర్షణను చిత్రించడం మొదలుపెట్టారు రచయితలు. ఎలా అయితే చిత్రకళలో చూసినది చూసినట్టుగా కాకుండా ఒక వస్తువుని చూసినప్పుడు కలిగిన భావాన్ని భావవ్యక్తీకరణ వాద చిత్రకారులు చిత్రింప ప్రయత్నించారో అలాగే భావవ్యక్తీకరణవాద రచయితలు కూడా తాము సృష్టించిన పాత్రల బహుళ స్వభావాల మధ్య జరిగే అంత: సంఘర్షణను తమ రచనల్లో చిత్రించసాగారు. అలాగే నాటకరచయితలు కూడా బాహ్య ప్రపంచాన్ని సూచించే ప్రయత్నాలు పక్కకు నెట్టి పాత్రల స్వగతాన్ని తెలియపరిచే రచనలు చేయతలపెట్టారు.

మిగిలిన కళల్లో భావవ్యక్తీకరణ వాదం:1905-1930 మధ్య కాలంలో సాహిత్యం, చిత్ర లేఖనం లో జరిగినట్టే మిగిలిన కళలైన సంగీతం, శిల్పకళల్లో కూడా భావవ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు కళాకారులు.అప్పటి కళారంగం గతి మార్చిన భావవ్యక్తీకరణ వాదం సాధారణంగానే బహుళకళల సమ్మేళనమైన చలనచిత్ర ప్రక్రియనూ మార్పు దిశగా నడిపించింది.

ముఖ్యంగా జర్మనీలో 1920 ప్రాంతంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో అప్పటి సినిమా దర్శకులు భావవ్యక్తీకరణ వాదాన్ని బలంగా చిత్రించారు.ఈ కాలంలో వచ్చిన సినిమాలు మరియు దర్శకుల వివరాలు:

  • The Cabinet of Dr Caligari-Robert Weiner-1920
  • Nosferatu-F.W. Murnau-1922
  • Metropolis-Fritz Lang-1927
  • Sunrise-F.W. Murnau-1927
  • M-Fritz Lang-1931
  • Kameradschaft-Georg Wilhelm Pabst-1931

భావవ్యక్తీకరణ వాదం వివిధ కళల గతి మార్చి కొత్త ప్రక్రియలకు నాందిపలికినట్టే సినిమాల్లోనూ భావవ్యక్తీకరణవాదం ఎన్నో నూతన ప్రక్రియలకు చోటు కల్పించింది. 1930 నాటికి భావవ్యక్తీకరణ వాదం అనే ఉద్యమం చల్లారిపోయినప్పుడు ఈ వాదపు సినిమాలు కూడా రావడం ఆగిపోయినప్పటికీ అప్పటి సినిమాలు నేటికీ చలనచిత్రకారులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. 1930 ల తర్వాత వచ్చిన నిశా చిత్రాలు (Film Noir), భయానక చిత్రాల(Horro Films)  పై భావవ్యక్తీకరణవాద చిత్రాల ప్రభావం ఎంతగానో వుంది.

ముగింపు:భావవ్యక్తీకరణ వాదంలో కేవలం కళాకారుల ఆత్మాశ్రయత భావవ్యక్తీకరణ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఈ వాదం ద్వారా వెలువడిన పద్ధతులు, ప్రక్రియలూ, ఆయా కళల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు.

సినిమాల్లో భావవ్యక్తీకరణ వాదపు ప్రభావం గురించి త్వరలో ప్రచురించబోయే “సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం” వ్యాసంలో చదవండి.

4 Comments
  1. క్రిష్ August 21, 2008 /