Menu

California Dreamin’

]సినిమా:California Dreamin’
దేశం: రోమానియా
దర్శకుడు:Cristian Nemescu
కాలం:2008

ఈ సినిమా గురించి చెప్పేముందు ఈ సినిమా దర్శకుని గురించి చెప్పుకోవాలి.ఈ సినిమా దర్శకుడు Cristian Demescu. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తికాకూండానే ఒక ఏక్సిడెంట్ లో మరణించాడు. ఆయనకు నివాళులర్పిస్తూ పూర్తిగా ఎడిటింగ్ జరగకుండానే Cristian Demescu వుండగా ఎలా వుందో అలాగే ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ endless అని వుంటుంది. కానీ చాలా మంది రోమానియన్లు చెప్తున్నట్టుగా ఆ క్యాప్షన్ తప్పుదోవ పట్టించేదిగా వుందని నా అభిప్రాయం కూడా. Endless కి బదులుగా With out an end అని పెట్టడం సబబేమో!

గతంలో నాలుగైదు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన Cristian Demescu తన మొదటి చిత్రానికి మంచి కథను ఎన్నుకుని అధ్భుతంగా తీర్చిదిద్దాడు. తన మొదటి సినిమాతోనే అంతర్జాతీయ ఖ్యాతిని సాధించగలిగాడు. కానీ ఆ కీర్తి ప్రతిష్టలు అతన్ని చేరకముందే ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు.

రొమానియా లో 1990 లలో జరిగిన ఒక సంఘటన ఆధరాంగా ఈ సినిమా కథ రూపొందించబడింది. 1999 లలో యుగోస్లేవియా పై NATO ప్రకటించిన యుధ్ధం నేపద్యంలో కథ మొదలవుతుంది. ఈ యుధ్ధంలో సహాయపడడం కోసం అమెరికా నుంచి ఒక రాడార్ ను రొమానియాకు దిగుమతి చేసి, అక్కడనుంచి రొమానియా సరిహద్దుల్లోకి ఆ రాడార్‌ను తరలించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.ఆ రాడార్ ను రైల్లో తీసుకెళ్ళాలనే ఆలోచనతో దాదాపు 20 మంది అమెరికన్ సైనికులతో కూడిన ఒక సైనిక బలగం బయల్దేరుతుంది.

కొంచెం సేపు సజావుగా సాగిన వారి ప్రయాణానికి ఒక మారుమూల పల్లెటూర్లో పెద్ద బ్రేక్ పడుతుంది. ఆ వూర్లో స్టేషన్ మాస్టారు అందుకు కారణం! అమెరికన్లంటే విపరీతమైన ఏహ్యభావం పెంచుకున్న ఆ స్టేషన్ మాస్టారు రైలును ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. సరైన కస్టమ్స్ డాక్యుమెంట్స్ లేకుండా స్టేషన్ నుంచి ముందుకెళ్ళడం సాధ్యం కాదని మొరాయిస్తాడు. ఆయన బాధ భరించలేక అతనికి లంచం ఇవ్వాలని ప్రయత్నిస్తారు అమెరికన్లు. అయినా అతను ఒప్పుకోడు. చివరకు పై అధికారుల దగ్గరనుంచి ఫోను చేపించినా వినడు ఆ స్టేషన్ మాస్టారు. రూల్స్ కి వ్యతిరేకంగా తను ఏ పని చేయనని నొక్కి వక్కణిస్తాడు. ఇక చేసేదేమీలేక రైలునక్కడే ఆపేసి కాసేపు సేద తీరుదామనుకుంటారు. ఒక రొజు గడుస్తుంది. రెండు రోజులు గడుస్తాయి. కానీ ఏమీ జరగదు. ఈ లోగా అమెరికన్లు వున్న రైలు తమ వూర్లో ఆగుందని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడ గుమికూడుతారు. ఇదే సరైన అవకాశం అని గ్రహించిన ఆ వూరి మేయర్ గతంలో జరిపిన వేడుకలను మరోసారి జరిపి వాటికి అమెరికన్లను ఆహ్వానిస్తాడు.

సాధారణం గా అమెరికన్లంటే వుండే వ్యామోహం మూలంగా ఆ వూరి అమ్మాయిలందరూ అమెరికన్ సైనికుల వెంట పడతారు. ఇదే అదనుగా చూసుకుని కొంతమంది ఫ్యాక్టరీ కార్మికులు తమ సమ్మె మొదలు పెడతారు. అమెరికన్ల ముందు తమ పరువు తీయొద్దని మేయర్ వారితో మొరపెట్టుకున్నా వారు వినరు. అమెరికన్లను అంతగా గౌరవించి పూజిస్తున్న గ్రామస్తులను చూసి మండిపడతాడు స్టేషన్ మాస్టర్.

అదీ కాక తన సొంత కూతురే అమెరికన్ సైనికుడి వెంట తిరగడం భరించలేకపోతాడు. ఈ లోగా ఆ వూరి మేయర్ కు మరియు స్టేషన్ మాస్టర్ కి వున్న విరోధాన్ని గ్రహిస్తాడు అమెరికన్ సైనికులకు నాయకుడైన Captian Jones. స్టేషన్ మాస్టార్ గా వుంటూ వచ్చే పోయే రైళ్ళలోనుంచి సామాగ్రిని దొంగలించి ఎక్కువ రేటుకి ప్రజలకు అమ్ముతున్న అతని అన్యాయాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని గ్రామస్తులకు నూరిపోస్తాడు captain Jones. అయితే పోలీసు యంత్రాంగం స్టేషన్ మాస్టారి గుప్పెట్లో వుందని అతన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని చెప్తాడు మేయర్. మీకా భయం అవసరం లేదు. మీ వెంట మేముంటాము. మీతో కలిసి మేమూ అన్యాయాన్ని ఎదుర్కుంటాం అని దైర్యం చెప్పి యుధ్ధానికి రంగం సిధ్ధం చేస్తాడూ Jones

ఈ లోగా రావాల్సిన కస్టంస్ డాక్యుమెంట్స్ వస్తాయి, అమెరికన్లు హాయిగా అక్కడనుంచి బయల్దేరి వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత ఆ వూర్లో జరిగిన సంఘటనలు మిగతా సినిమాని నడిపిస్తాయి.

చూడడానికి ఇది రొమానియాలో ఒక చిన్న గ్రామంలో జరిగిన కథలా అనిపించినా అమెరికా ఎన్నో ఏళ్ళుగా పాఠిస్తూ వస్తున్న రాజకీయ విధానాలు ఈ సినిమా ద్వారా ఎంతో ప్రతిభావంతంగా చూపించారు ఈ సినిమాలో.

అమెరికా నడిపే యుధ్ధ రాజకీయాలను ఎత్తిపొడిచిన ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. వీలయితే తప్పక చూడండి. సినిమా అక్కడక్కడా కొంచెం పొడిగించినట్టు అనిపించినా అది ఈ సినిమా పూర్తి స్థాయిలో ఎడిటింగ్ కానందువలన అని అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యన రొమానియా సినిమాలకు పెరుగుతున్న ఆదరణకు ఇలాంటి సినిమాలే కారణం.

ట్రైలర్:

4 Comments
  1. శంకర్ October 8, 2008 /
  2. శంకర్ November 7, 2008 /