Menu

కేస్ నెం. 666/2013: క్రొంగొత్త శకానికి నాంది.

మనది అని చెప్పుకుంటున్న తెలుగు సినిమాలో చరిత్ర సృష్టించబడుతోందా? తెలుగు సినిమా తన బాల్యావస్థను దాటి యవ్వనంలోకి అడుగిడతోంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏందుకంటే, ఆ మార్పు కి నేను నేడు సాక్షిని కనుక. ఒక చిన్న హర్రర్ సినిమా, కేస్ నెం. 666/2013 మన తెలుగు సినిమా ఎదగలేదు, ఎదగదు అని ఈసడించుకున్న వారందరికి చెంపపెట్టుగా వస్తోంది. ఈ సినిమా వల్ల బాగుపడబోయేది, ఖచ్చితంగా తెలుగు సినిమాయే.

కథ:

నర్సాపూర్ అడవిలో హాలిడేకంటూ వెళ్లిన ముగ్గురు స్నేహితులు అదృశ్యం అయ్యారు. వారి అదృశ్యం వెనక రహస్యాన్ని ఛేధిస్తున్న ఒక జర్నలిస్టుకి పోలిసుల దగ్గర, కొన్ని మెమరీ కార్డులు దొరుకుతాయి. ఆ మెమరీ కార్డులలో ఆ స్నేహితులు అదృశ్యం కాక ముందు తీసిన వీడియోలు ఉంటాయి. ఆ జర్నలిస్టు వాటిని పరిశీలించటం మొదలుపెడుతుంది.

చైతన్య (గురు), దుర్గా (అనురాగ్), భాస్కర్ (నందకిశొర్) లు ఒకే అపార్ట్ మెంటులో అద్దెకుండే స్నేహితులు. వారి పక్క ఫ్లాటులో కొత్తగా ఈశ్వర్ (ఆదిత్య) చేరతాడు. అతని అమ్మయకత్వానికి ఈ ముగ్గురు స్నేహితులు జాలి పడతారు. అతనితో స్నేహం చేస్తారు. ఒక రోజు తాగిన మైకం లో తను నర్సాపూర్ అడవిలోని గెస్ట్ హౌజ్ లో దయ్యాలు వున్నాయని చెప్తాడు. అతని మాటలను స్నేహితులు తీసిపారేస్తారు. మాటా మాటా పెరిగి ఈశ్వర్ తో 25000 రూపాయలకు పందెం కాస్తారు ఆ స్నేహితులు. అలా నర్సాపూర్ అడవుల్లోకి బయలుదేరతారు ఆ ముగ్గురు. వారు ఆ గెస్ట్ హౌజ్ లో వారి అనుభవాలను వీడియో తీయాలనే షరతు.

ఆ అడవిలోకి వెళుతున్న దారిలో వారి ఒక డాక్యుమెంటరీ చిత్ర దర్శకుడైన, ఆనంద్ (చరణ్ తెజ) పరిచయం అవుతాడు. అతను ఆ నర్సాపూర్ చుట్టుపక్కల జరుగుతున్న క్షుద్ర పూజల మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఆనంద్ ప్రయత్నం. నలుగురు కలిసి ఆ దయ్యాల గెస్ట్ హౌజ్ కు చేరతారు. ఆ తరవాత? ఆ ముగ్గురు పందెం గెలిచారా? లేక ఆ గెస్ట్ హౌజ్ లో దయ్యాలు నిజంగానే ఉన్నాయా? అదృశ్యం అయిన స్నేహితుల ఆచూకి తెలుస్తుందా? ఆ వీడియోలు సాంతం చూసిన మహిళా విలేఖరి ఏం చేసింది?

ఈ ప్రశ్నలకు దొరికే జవాబులన్ని “కేస్ నెం. 666/2013″ లో దొరుకుతాయి. 81 ఏళ్ల ఘనమైన చరిత్ర అని ఘంటాపధంగా చెప్పుకునే తెలుగు సినిమాలో కథలులో కాని, కథనంలో కాని, సినిమా తయారీ లో కాని ఒకే మూస పద్ధతి ఉంటుంది. ఆ మూసను తుంగలో పడేసి, నవతరం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచడానికి వచ్చిన సినిమా ఈ “కేస్ నెం. 666/2013″. తెలుగులో తొలిసారిగా ‘ఫౌండ్ ఫూటేజ్” తరహాలో చేసిన ఈ ప్రయోగం తెలుగు సినిమాకు ఒక మేలిమలుపు. హాలివుడ్లో ఈ తరహా ప్రయోగం ఇంతకు మునుపే జరిగింది, ఈ తరహా చిత్రాలకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. “బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్” “పారానార్మల్ ఆక్టివిటీ” తదితర చిత్రాలు ఈ తరహా చిత్రాలలో తలమానికం. వీటి సరసన సగర్వంగా నిలబడుతుంది ఈ సినిమా.

ఇంతకీ ఈ ఫౌండ్ ఫూటేజ్ అంటే ఎమిటి? ఈ తరహా సినిమాల్లో, సాధారణంగా చిత్రాన్ని ఒక కెమెరామాన్ తీయకుండా, ఆ కథలో నటించే పాత్రధారులే చిత్రీకరిస్తారు. కెమెరా కదలికలు అంతా పాత్రధారుల చేతుల్లో మనింట్లో మనమే చిత్రీకరించే వీడియోలా ఉంటుంది. పాత్రధారుల నటన కూడా నాటకీయంగా కాకుండా సహజంగా ఉంటుంది. ఆ సహజత్వమే మనల్ని భయపెడుతుంది. ఎందుకంటే కల్పన కన్న నిజం భయంకరమైనది కాబట్టి. ఈ సినిమాలో భయపెట్టడానికి ధ్వని వాడకం ఎక్కడా లేదు. పైగా ఎటువంటి వాయిద్య సహకారం లేకుండా కేవలం నటీనటుల నటనతోనూ (ప్రవర్తన అనొచ్చేమో), కెమెరా కదలికలతోనూ థ్రిల్ కు గురవుతాడు ప్రేక్షకుడు. అందుకే ఈ చిత్రానికి నటులైన, చరణ్ తెజ, నందకిశోర్, గురు, ఆదిత్య మరియు అనురాగ్ చాలా కీలకం. వీరితో పాటు అతి ముఖ్య భూమిక పోషించిన ఛాయాగ్రాహకుడు, చక్రధర్ రావు, ఈ సినిమాకు అసలు సిసలు కథానాయకుడు.

అలాగే ఈ సినిమా రచయితల ద్వయం అయిన అరిపిరాల సత్యప్రసాద్, పూర్ణేష్ కొణతాల ఎక్కడా నాటకీయత అనేది లేకుండా చాలా సహజమైన కథను, మాటలను అందించారు. వారికి రెండు వీరతాళ్ళు. ఇక వీరితో పాటు తాము కన్న కలను సాకారం చేసి, తెలుగు సినిమా పరిశ్రమకే ఒక కొత్త మలుపునిచ్చిన నూతన దర్శక ద్వయం, వెంకట్ సిద్దారెడ్డి, పూర్ణేష్ కొణతాల (రచయిత కూడాను) బహుదా ప్రశంసనీయులు. ఈ చిత్రానికి ఏదెని వంక పెట్టాలి అనుకుంటే ఆ వంకలు దొరికే అవకాశం లేకపోలేదు. విమర్శుకులు మొదటి సగం చాలా సాగతీతగా భావించవచ్చు. ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకుడికి కొత్త కాబట్టి, అతనికి ఈ చిత్రాన్ని మొదటి సగం పరిచయం చేస్తుంది అని వారు చేసిన ప్రయత్నం అనవచ్చు. ఆ పిమ్మట అసలు కథ ముగిసిన తరవాత వచ్చే సన్నివేశాలన్ని కథనం లో మార్చవచ్చు అని కూడా అనొచ్చు, కాని ఈ చిత్రం చేసిన ప్రయోగం తెలుగు సినిమాకే తలమానికం కాబట్టి దర్శకులను క్షమించబుద్ధి వేసేస్తుంది. ఇక నిర్మాత కే. అశొక్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించి తెలుగు సినిమాకు ఎంతో మేలు చేసారు. ప్రయోగాలే కరువైపోతున్న తెలుగు సినిమాకు ఒక కొత్త దిశను చూపించారు.

మీరు తెలుగు సినిమా అభిమానిగా, కొత్త ఒరవడి ఆశిస్తున్నటయితే, ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. ఈ సినిమా గురించి ముందు ముందు మీరు ఇంకా ఎక్కువగా కూడా వినవచ్చు. ఆలశ్యం ఎందులకు, చూసేయండి.

రేటింగు: 3.75/5

నిర్మాత: కే. అశోక్ కుమార్

దర్శకత్వం: వెంకట్ సిద్దారెడ్డి, పూర్ణెష్ కొణతాల

తారాగణం: చరణ్ తేజ, గురు, నందకిషోర్, ఆదిత్య, అనురాగ్, నిఖిత మరియు ఇతరులు

రచన-మాటలు: సత్య ప్రసాద్, పూర్ణెష్ కొణతాల

ఛాయాగ్రహణం: చక్రధర్ రావు

కృష్ణ చైతన్య.