Menu

Life of Oharu – సినిమా సమీక్ష

సినిమా: Life of Oharu
దర్శకత్వం: కెంజి మిజోగుచి
దేశం: జపాన్
సంవత్సరం: 1952
అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం).

జపనీస్ సినిమాకు త్రిమూర్తుల్లాంటి వారిలో ఒకరయిన కెంజి మిజొగుచి ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఇది. 1952 లో వెనిస్ చలనచిత్రోత్సవంలో silver lion అవార్డు సాధించిన ఈ సినిమా ప్రపంచంలోని ఎందరో దర్శకులకు ఆదర్శంగా నిలిచింది. ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు Godard ఈ సినిమాను 12 సార్లు చూసారట. అంతే కాదు తన సినిమాలకు ఈ సినిమా ఎంతో ప్రేరణ కలిగించిందని కూడా అంటారు.

పదిహేడవ శతాబ్దం రోజుల్లోని జపానులో ఓహరూ అనే యువతి జీవిత కథే ఈ సినిమా.

తండ్రి సమురాయ్ కావడంతో అంత:పురంలో హాయిగా కాలం వెళ్ళబుచ్చుతున్న ఒహరూ, తక్కువ కులం వాడితో ప్రేమలో పడ్డ నేరానికి తన కుటుంబంతో పాటు వెలివేయబడుతుంది. అక్కడ మొదలయినా ఆమె కష్టాలు ఒక దాని తర్వాత ఒకటిగా ఆమెను సంఘంలో అట్టడుగు స్థాయికి చేరుస్తాయి.

ఊరి నుంచి వెలివేయబడి దూరంగా ఎక్కడో జీవిస్తున్న ఒహరూ అనుకోని పరిస్థితుల్లో పిల్లలు లేని ఒక రాజుకి వారసుడిని పుట్టించే పనిలో అంత:పురానికి చేరుకుంటుంది. అక్కడ చేరిన మొదటి రోజునుండే రాజు భార్యనుండి ఎంతో అవమానాన్ని ఎదుర్కుంటుంది. 9 నెలల తర్వాత ఆ రాజుకి వారసుడి నందించగానే అక్కడనుంచి తరిమివేయబడుతుంది. తన కూతురు రాజస్థానంలో వుండగా తనకిక భయమేల అనుకున్న తండ్రి చేసిన అప్పులు ఆమెను ఒక వేశ్యా గృహానికి అమ్మేసేలా చేస్తాయి. అక్కడ కూడా ఆమెకు కష్టాలే. డబ్బుతో ఎవర్నైనా కొనొచ్చనుక్నే ఒక వ్యక్తికి లొంగక పోవడంతో అక్కడ్నుంచి ఇంటికి తిరుగుముఖం పడ్తుంది. అక్కడ్నుంచి ఒకరింట్లో పని మనిషిగా కొన్నాళ్ళు పని చేసి తిరస్కరింపబడుతుంది. ఒక కష్టం తర్వాత మరొకటి ఎదురవుతున్న పరిస్థితుల్లో ఆమెను మెచ్చిన ఒక నిజాయితీ గల యువకుడు ఆమెను పెళ్ళాడడంతో ఆమె కష్టాలు కొన్నాళ్ళు తీరాయనిపించినా ఇంతలో అనుకోకుండా ఒహరూ భర్త మరణించడంతో కథ మళ్ళీ మొదటికొస్తుంది. చేసేదేమీ లేక భగవంతుని సేవలో జీవితం గడిపేయాలనుకునే రోజుల్లో అక్కడ జరిగిన ఒక సంఘటన ఆమెకు అక్కడ కూడా స్థానం లేకుండా చేస్తుంది. చివరకు కొందరి వేశ్యల సహకారంతో తనూ వేశ్యగా మారుతుంది.

కథాపరంగా అత్యంత విషాదకరమైన సన్నివేశాలు ఈ సినిమాలో వుంటాయి. ఈ సినిమాలో జరిగినన్ని కష్టాలు నిజంగా ఎవరిజీవితంలోనైనా సంభవిస్తాయా? అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఏ ఒక్క స్త్రీ కథగానో చూడడం కంటే జపనీస్ మహిళలు సంఘం సృష్టించిన పరిస్థితుల ద్వారా అనుభవించిన కష్టాలను ఈ సినిమా ద్వారా చూడవచ్చు.

ప్రపంచంలో సమాజంలో స్త్రీల యొక్క స్థానాన్ని తెలియబరుస్తూ, వారి సమస్యలపై ధృష్టి కేంద్రీకరిస్తూ చాలానే సినిమాలు వచ్చాయి. మన దేశంలో కూడా రిత్విక్ ఘాతక్ తన సినిమా ’మేఘా దాకా తారా’ సినిమాలో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలోని స్త్రీ పడే బాధలను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. అయితే ఇలాంటి సినిమాలన్నింటిలో ’Life of Oharu’ కి వున్న ప్రత్యేకత వేరు.

కెంజీ మొజొగుచి సాధారణంగానే స్త్రీ సానుభూతిపరుడు, అందుకు అతని జీవితంలో జరిగిన కొన్ని విషాధ ఘట్టాలే కారణం. అందుకే దాదాపు అన్ని సినిమాల్లోనూ (నేను చూసిన) మగవాడు తప్పుచేస్తే అందుకు కారణాలు అతని దుర్గుణాల గానూ, ఆడవాళ్ళు తప్పుచేస్తే అందుకు సంఘం సృష్టించిన పరిస్థితులు వుంటాయి. కెంజీ మిజొగుచి సినిమాల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆయన సినిమాలు ఒకప్పటి జపాను సాంఘిక పరిస్థుతులను వెలికి తీసే ఒక డాక్యుమెంట్ లా వుంటాయి తప్ప, హితబోధ చేస్తున్నట్టుగానో, నైతిక ధార్మిక సూత్రాలను వళ్ళిస్తున్నట్టుగానో వుండవు. ఆయన సినిమాల్లోని ఆ నిజాయితీ వల్లనే ఇప్పటికీ ఆ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఎంతో ఆదరణ లభిస్తుంది.

2 Comments
  1. Koresh March 15, 2008 /
  2. jean October 15, 2008 /