Menu

మిథునం

తనికెళ్ల భరణి “మిథునం” చూశాను.

నేను శ్రీరమణ ‘మిథునం’ కథాసంకలనం చదివే సమయానికి మిథునం కథ ఒక విశిష్టమైన గొప్పదనాన్ని సంతరించుకుంది. బాపు గారు మిథునం కథనచ్చి తన స్వయం చేతి దస్తూరితో ఈ కథను రాయడం ఈ కథను తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కథగా నిలిచిపోయేకథగా సాహితీవేత్తలు విమర్శకులు డిసైడ్ చేసేశారు. కానీ అంతా చేస్తే, నేను మొత్తం చదివేసరికీ నాకు బాగా నచ్చిన కథ “బంగారు మురుగు”. మిథునం సగం అర్థం కాలేదు, మిగతాసగం ఒక ముసలి బాపనయ్య తిండిగోలలాగా అనిపించింది.

కొంతకాలానికి ఆ కథ సాహిత్య అకాడమీవాళ్ళు ఇంగ్లీషులో అనువదించడం, ఎమ్.టి.వాసుదేవ్ నాయర్ అనే ఒక ప్రసిద్ధ మళయాళ దర్శకుడు సినిమాగా తియ్యడం జరిగాయి. ఆ సినిమాకి 48వ జాతీయ చలనచిత్రోత్సవం 2001 లో “పర్యావరణ రక్షణ” పై ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చేసింది. అప్పుడు నేనేమైనా మిస్ అయ్యానేమో అని మళ్ళీ చదివాను. అందరూ అచ్చతెలుగు కథ అంటున్న ఈ కథనాకైతే ఎక్కలేదు. బహుశా కథలో ఉన్న తీవ్రమైన బ్రాహ్మణ ఛాయలు, చిత్రమైన వంటకాల వర్ణనలు నా సంస్కృతికాకపోవడం వలన అర్థం కాలేదేమో అని సర్థిచెప్పుకున్నాను. మళయాళం సినిమాని చూసిన కొందరు తెలుగువాళ్ళు కూడా “అబ్బే తెలుగు కథలో ఉన్న చమక్కులు మళయాలంలో మిస్ అయ్యాయి” అనే చెప్పుకొచ్చారు. http://navatarangam.com/2009/08/oru-cheru-punchuri/

ఇప్పుడు తెలుగులో చూస్తుంటే కథచదివినదానికన్నా సినిమాగా అర్థమయ్యింది ఎక్కువ అనిపించింది. అప్పదాసు తిండిగోల వెనకున్న ఫిలాసఫీ, అనుబంధాల వెనకున్న అటాచ్ద్ డిటాచ్మెంట్, బుచ్చి మీదుండే అనంతమైన ప్రేమ, వాలుతున్నవయసులో భార్యభర్తల మధ్య ఉండాల్సిన బంధం ఇలా చాలా విషయాల్ని తనికెళ్ళ భరణి హృద్యగా తెరమీదికి తీసుకొచ్చారు.

ఇద్దరే పాత్రలతో రెండుగంటల నిడివి ప్రేక్షకుడిని కూర్చోపెట్టడం అంటే సాహసమే అనుకోవాలి. ఆ సాహసాన్ని విజయవంతంగా చేశాడు దర్శకుడు. బాలు నటన అక్కడక్కడా అతిగా అనిపించినా చివరకొచ్చేసరికీ అది పాత్రనైజమేమో అనిపించి సర్థుకుపోవచ్చు. లక్ష్మి నటన చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. సినిమాలో మెచ్చుకోదగ్గ విషయాలు గోలలేని వీణాపాణి సంగీతం, కళ్ళకి ఇంపైన సినెమాటోగ్రఫీ.

అక్కడక్కడా సినిమా కొంచెం రిపిటీటివ్ గానూ, మరికొన్ని చోట్ల రేడియోనాటకాన్ని తలిపించేలా చాలా వర్బల్ గానూ ఉన్నప్పటికీ చాలా మంచి ప్రయత్నంగా ఖచ్చితంగా నిలిచిపోయే సినిమా ఇది. లేటువయసులో తోడు ప్రాధాన్యత, దాంపత్యంలోని ఆనందపు లోటుపాట్లు, ప్రేమానురాగాల ప్రాముఖ్యతని విప్పిచెప్పే ఈ సినిమా పిల్లలు చూస్తే పెద్దోళ్ళకు చూపించి వాళ్ళ కళ్ళలోని ఆనందం చూడాలనుకుంటారు. పెద్దోళ్ళు చూస్తే పిల్లలకు చూపించి కనీసం కొంతైనా తెలుసుకోమ్మని సలహా ఇస్తారు. కాబట్టి రెండు విధాలా ఆడియన్స్ ని సంపాదించుకునే ఆస్కారం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్న తెలుగు సినిమా పరిస్థితుల్లో ఆ రెండూ జరగాలంటే మొదట ఎంత ఎక్కువ మందికి వీలైతే అంతమందికి చూపించే ప్రయత్నం జరగాలి. అది ఎన్ని ఫోరమ్స్ లో వీలైతే అన్ని చోట్ల జరగాలి.

సినిమా అయిపోయాక తన స్పందన తెలియజేస్తూ పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి “ఈ సినిమా చూశాక నాకు పెళ్ళికాలేదని ఫీల్ అవుతున్నాను. నిజంగా పెద్దఫూల్ ని ఇంత(సినిమాలో చూపినంత) ఆనందం మిస్ అవుతున్నాను.” అన్నారు. ఆయనకు పెళ్ళికోరిక కలగటం ఏమోగానీ నాకైతే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇరవైనాలుగ్గంటల టెలివిజన్ ఛానల్లు లేని ఇలాంటి రిటైర్మెంట్ లైఫ్ (విత్ సచ్ వైఫ్) ఉంటే బాగుండేమో అనిపించింది.

ఇది అచ్చతెలుగు సినిమా అనో లేక అమ్మానాన్నల ప్రేమకథ అనే కారణాలతోకాకుండా సాహిత్యం నుంచీ సినిమాలు రావాలి అనే ఒక ఉద్దేశంతో, ఈ సినిమా ఒక సఫలమైన ప్రయోగం అనే నమ్మకంతో, ఈ సినిమా చూశాక కొంత మానవసంబంధాల మీద ప్రేమానురాగాల మీద నమ్మకమొస్తుందనే ధీమాతో ఈ సినిమాని చూడమని రెకమండ్ చేస్తాను. త్వరలో అమెరికాలోకూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అక్కడివాళ్ళకి మరింతగా నచ్చే అవకాశం ఎక్కువ ఉందికూడాను. చూడండి.

చివరిగా…. శ్రీరమణ మిథునాన్ని మొదట మళయాళంలో తీసేసినట్టే మరిన్ని గొప్ప కథల్ని, నవలల్ని పరాయివాళ్ళు తీసెయ్యకముందే (త్వరలో బంగారు మురుగు కథకూడా మళయాళంలో రాబోతోందని వినికిడి) మనం తీసి కొంత గౌరవాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో తనికెళ్ళ భరణిగారి సాహసానికి, నిబద్ధతకూ సలాం చేస్తున్నాను.

One Response
  1. Venkat Uppaluri January 12, 2013 /