Menu

నలుగురు

టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సినిమా నిర్మాణం చాలా సులువైంది. దాంతో ఎవరు పడితే వారు సినిమా రంగంలోకి ప్రవేశించి అనుభవం ఉన్నా లేకున్నా విరివిగా సినిమాలను నిర్మిస్తున్నారు. మరి నిర్మించిన ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు వినిపించే మాట “చిన్న సినిమాని ఆ నలుగురు తొక్కేస్తున్నారని” ఎవరీ ఆ నలుగురు! సురేష్ బాబు, దిల్ రాజు, యన్.వి.ప్రసాద్, రామోజీరావు ఆ నలుగురులో ఉన్నారని కొంతమంది సినీ పెద్దల ఆరోపణ.

రాయలసీమ ప్రాంతంలో అత్యధిక థియేటర్లు యన్.వి.ప్రసాద్ తదితరుల చెతుల్లో ఉన్నాయని, అదే విధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు సురేష్ బాబు చేతిలో, దిల్ రాజు ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి తన లీజు వ్యాపారాన్ని భాగ విస్తరించారని ఫిలీం నగర్ లో గుసగుసల సారాంశం.

సాధారణంగా థియేటర్లని యాజమానుల నుండి లీజు దారులు రెండు లేదా మూడేళ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకుని తీసుకుంటారు. ఇరువురి అంగికారం ప్రకారం గడువుని పొడగించుకుంటు వెళతారు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. హైదరాబాద్ లో మంచి సెంటర్ లో థియేటర్స్ ని అద్దెకు తీసుకోవాలంటే వారానికి లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాతలు ఎవరైనా థియేటర్స్ కావాలంటే లీజుకు తీసుకున్న వారి దగ్గరికి వెళ్లాల్సిందే, అప్పుడు వారు అడిగే మొత్తానికి ఒక పద్దతి పాడు అంటు ఉండదు. వారానికి రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు పెరుగుతుంది. నిర్మాత పరిచయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఈ లెక్క మారుతూ ఉంటుంది. ఒకవేళ కర్మకాలి బ్రతిమిలాడో, బామాళో థియేటర్లు తీసుకున్న రెండో వారానికి నాలుగు లక్షలు అయిపోయే అవకాశం ఉంది. లేదంటే తమ వారసుల సినిమాలనో, పరిచయస్తుల సినిమాలనో లేక పెద్ద బడ్జెట్ సినిమాల సాకునో చెప్పి, తమ థియేటర్ నుండి సదరు చిన్న సినిమాల్ని ఎత్తేస్తారు. స్థూలంగా ఈ సిండికేట్ రాజకీయాలతో డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో జరిగే తంతు ఇది.

సినిమా రంగంలో నెగ్గుకు రావాలంటే, ఆ నలుగురి అడుగులకి మడుగులొత్తాల్సిందే, లేదంటే తమని తొక్కేస్తారనే భయం వారిని నిరంతరం వెంటాడుతునే ఉంటుంది. మరి దీనికి పరిష్కార మార్గం లేదా! ఎందుకు లేదు ఆలోచిస్తే ప్రపంచం చాలా పెద్దది, ఒకే లేవల్ లో ఆలోచిస్తే ఇక్కడే కాదు ఏ రంగంలో నెగ్గుకు రాలేరు. ఇలా అనుకునే ముందు ఇండస్ట్రీలో ఉన్న కొన్ని లొసుగులను తెలుసుకుంటే మరీ మంచిది.

ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ విధానం అంతా శ్లాబ్ సిస్టమ్. దీనికన్నా ముందు పర్సంటేజి విధానం అమలులో ఉండేది. ఈ విధానంలో నిర్మాతకి ఎంతో కొంత మేలు జరిగేది. ఈ పద్దతిలో నిర్మాతలకి, థియేటర్లకి మధ్యనే లావాదేవిలు నడుస్తాయి. దీనితో సిండికేటర్లకి సంబంధం లేదు. ఈ విధానం మళ్లి రావాలని చిన్న నిర్మాతలు కోరుకున్న, వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. ఎందుకంటే పెద్ద సినిమాలు నిర్మించే బడా నిర్మాతలు మొదటి వారం తమ సినిమాల హిట్ టాక్ రాగానే, మరికొన్ని వారాలు కూడ భారీగా కలెక్షన్సు వసూలు చేస్తాయి కాబట్టి థియేటర్లని వదులుకోరు. టిక్కెట్ల రేట్లు పెరగడం కూడ మరోక కారణం.

సినిమా రంగంలోనే కాదు. ఏ రంగంలోనైనా ఆ నలుగురు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఆ నలుగురే లేకపోతే ఏ వ్యవస్థ కలకాలం మనలేదనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఇండస్ట్రీలో ఈ నలుగురు కాకపోతే రేపు కార్పోరేట్ రంగంలోకి దిగుతుంది. కాబట్టి సాధ్యమైనంతగా ఆ నలుగురి గురించి ఆలోచించడం మానేసి, వాళ్లలో చిన్న నిర్మాతలు ఎలా చెరాలో ఆలోచిస్తే పరిష్కార మార్గం ఈజిగా దోరుకుతుంది.

ఏమిటా పరిష్కారా మార్గం! అంటే రాష్ట్రం మొత్తం మీద పదిహేను వందల నుండి రెండువేల థియేటర్ల వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆంధ్రాలో, మరికొన్ని నైజాంలో పోగా, మిగితావి సిడెడ్ లో ఉన్నాయి. వీటిలో నైజాం ఏరియా చాలా కీలకం, పైగా తెలంగాణాలో సినిమా తప్ప మరో వినోదం లేదు. అందుకే అన్ని కలెక్షన్సు. హీరోలు తమ రెమ్యునరేషన్ కి బదులుగా నైజాం ఏరియాని తీసుకోవడానికి బలమైన కారణం కూడ అదే. ఇప్పుడు ఈ రెండు వేల థియేటర్లలో అన్ని ఏరియాల ప్రదాన థియేటర్లని కలుపుకుని పదిహేను వందల థియేటర్ల దాకా, ఆ నలుగురు పంచుకున్న, ఇంకా ఐదువందల థియేటర్లు బ్యాలెన్స్ గా ఉంటాయి. ఈ బ్యాలెన్స్ థియేటర్లు లీజు దారుల చేతుల్లో కాకుండా సోంత యాజమానుల చేతుల్లోనే ఉంటాయి. ఇవీ ఎక్కువగా బి,సి సెంటర్లలలో ఉంటాయి. రాష్ట్ర జనాభ ప్రకారం చూసినా, దిగువ మధ్య తరగతి కుటుంభాలు నివసించే పల్లేలు, పట్టణాలు ఎక్కువ. సినిమాలని చూసేది కూడ వీళ్లే. (ఏ) సెంటర్ల థియేటర్లు ఉండేవి ప్రదాన నగరాలైనా హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లోనే ఉన్నాయి. అందరి దృష్టంతా ఈ (ఏ) సెంటర్ల పైనే ఉంటుంది. ఎందుకంటే ఒపనింగ్స్ భారీగా ఉంటాయి కనుకా, సంఖ్యా పరంగా తక్కువ శాతం ఉన్న (ఏ) సెంటర్లపైనే నిర్మాతల శ్రద్దంతా పెడతారు కానీ, సినిమా భాగా ఆడితేనే అక్కడ కనకవర్షం కురిసేది. లేదంటే అంతే సంగతులు. (ఏ) సెంటర్ క్లాస్ జనాలకి సినిమాయే కాకుండా మరెన్నో వినోధ సాదనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ బి,సి సెంటర్ల జనాలకి అలా కాదు. సినిమా తప్ప మరోకటి లేదు. సినిమా ఓ మోస్తారుగా ఉన్నా కలెక్షన్సు అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి. ఉదా : రెబల్. ఇక సినిమా బాగా ఆడితే చెప్పక్కర్లేదు.

(ఏ) సెంటర్ థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లో ఉన్నాయి కాబట్టి, అవి చిన్న నిర్మాతల దాక వచ్చే అవకాశాలు లేవు రానివ్వరు. ఇక మిగిలిన బి,సి సెంటర్ల థియేటర్లలలో అధిక భాగం సోంత యజమానుల చేతిలో ఉన్నాయి కాబట్టి, ఆ సెంటర్స్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చిన్న దర్శక, నిర్మాతలు కథ, కథనాలు అల్లుకుని హంగు ఆర్బటాలకి పోకుండా సినిమాలు నిర్మిస్తే (ఈ తరహా సినిమాలు ఎక్కువగా తమిళనాడులో వస్తాయి) (ఏ) సెంటర్లతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా బి,సి సెంటర్లలలో రిలీజ్ చేస్తే, సినిమా ఏ మాత్రం బాగున్నా మౌత్ టాక్ స్ప్రెడ్ అయి అదిరిపోయే కలెక్షన్సు వస్తాయి. ((ఏ) సెంటర్లు అంటే ఇక్కడ క్లాస్ సెంటర్ అని కాదు) ఇలాంటి సినిమాలు బాగా ఆడితే లీజు దారులకి ఆ సినిమాల కలెక్షన్స్ కావాలి కనుక, ఆడే సినిమాలను వారు వదులుకోక తమ థియేటర్లలలో ((ఏ) సెంటర్లు ) కూడ ఆ సినిమాల్నీ ప్రదర్శిస్తారు. ఉదా : ఈ రోజుల్లో అనే చిన్న సినిమా కలెక్షన్స్ చూసి దిల్ రాజు ఆ సినిమాని తీసుకోవడం జరిగింది.

ఇండస్ట్రీలో చాలా మంది చిన్న నిర్మాతలు, చిన్న సినిమాని చంపేస్తున్నారని గోల చేస్తారు కానీ, వాళ్ల సినిమాల క్వాలిటీ (డబ్బు కాదు) విషయంలో చాలా నాసిరకంగా ఉంటాయి. సినిమా సరిగ్గా లేకపోతే ఆ నలుగురే కాదు. ప్రపంచంలో ఉన్న ఏ నలుగురు ఆ సినిమాల్నీ బ్రతికించలేరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నది అదే. లోపం వాళ్లలో పెట్టుకుని ఆ నలుగురిని నింధించడం సబబు కాదు. గతంలో ఎప్పుడూ బాగా ఆడుతున్న సినిమాలని ఆ నలుగురు ఆపిన దాఖలాలు లేవు. మరెందుకు ఈ గొడవంతా! వాళ్లు థియేటర్లు లీజుకు తీసుకున్నది వ్యాపారం చేయడానికే గానీ ఖాళీగా రెంటు కట్టడానికి కాదన్నా సంగతి గ్రహిస్తే మేలు. చిన్న సినిమా బాగా ఆడితే వాళ్ల థియేటర్లలలో ఆడించడానికి ఏలాంటి అభ్యంతరం లేదనే సంఘటనలు ఈ సినిమాల విషయంలో జరిగాయి. ఉదా : ఆనంద్, ఈ రోజుల్లో, ఒక రోమాంటిక్ క్రైమ్ కథ.

ఆ నలుగురు కనుకా రాష్ట్రంలో ఉన్నా థియేటర్లని లీజుకి తీసుకుని ఉండకపోతే అసలు రాష్ట్రంలో ఏ ఒక్క థియేటర్ కూడ మిగిలి ఉండేది కాదు. అన్నీ షాపింగ్ మాల్స్ గా లేదా గోడాన్లుగా మారి ఉండేవి. ఇప్పటికే చాలా థియేటర్లు కనుమరుగయ్యాయి కూడా.

డిస్ట్రీబ్యూషన్ సమస్య ఇలా ఉంటే ఈ మధ్య కొత్తగా మరోక మాట ఫిలీంనగర్ లో వినిపిస్తుంది. కెనాన్ ఫైడితో తెరకెక్కిస్తున్న చిన్న సినిమాలకి అడ్డు కట్ట వేయడానికి కొందరు బడా నిర్మాతలు తమ పలుకుబడిని ఉపయోగించి శాటిలైట్ రైట్స్ రాకుండా చేస్తున్నారని వినికిడి. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒక వేళ ఆ బడా నిర్మాతల ఒత్తిడికి తలోగ్గి చాంబర్ ఇకనుండి ఫైడితో సినిమాలు నిర్మిస్తే అవి శాటిలైట్ రైట్స్ కి అనర్హం అని ఏక గ్రీవంగా తీర్మానం చేసి ఛానళ్లపైనా ఒత్తిడి తీసుకొస్తే, అప్పుడు చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటీ! ఫైడితో తీసినా సినిమాలని ఛాంబర్ వ్యతిరేకిస్తే, దానికి సరైనా కారణం లేకపోలేదు. ట్వంటీపోర్ క్రాఫ్స్ యూనియన్స్ లో సభ్యులైనా సినీ కార్మికులని ఫైడితో నిర్మించే చిత్రాలకు వర్కర్స్ గా తీసుకోకుండా తమ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారి వాధన. ఇటు చిన్న నిర్మాతల వైపు నుండి చూస్తే కూడ ఫైడితో తక్కువ ఖర్చలో అంటే పది నుండి ముప్పై లక్షల్లో సినిమాలని నిర్మించే చిన్న నిర్మాతలు యూనియన్స్ రూల్స్ ప్రకారం అన్నీ విభాగాల సినీ కార్మికులను తీసుకుని వారికి రోజువారి వేతనాలని చెల్లించడం బడ్జెట్ కి మించిన అదనపు భారంగా భావించి అన్నీ తామే అయ్యి సినిమాలని నిర్మించుకుంటున్నామని చిన్న నిర్మాతల విన్నపం. దాంట్లో తప్పేమి కనిపించడం లేదు. ఇలా చేయడం వల్ల ఛాంబర్ రూల్స్ ని వ్యతిరేకించి సినిమా నిర్మాణాలను చేపడుతున్నారని, సినీ కార్మికుల ఆవేధన. నిజానికి సినిమా నిర్మాణానికి కార్మికులు కావాలి గానీ, కార్మికుల కోసం ఎవరూ సినిమాలని నిర్మించరు. ఆ విధంగ చూస్తే ఇది రైటే. మరీ రేపు సినీ కార్మికుల బాధలను అర్థం చేసుకున్న ఛాంబర్ పై విధంగా నిర్ణయం తీసుకుంటే ఎలా! అప్పుడు చిన్న నిర్మాతలు కంగారు పడాల్సిన అవసరం లేదు.

శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలన్నట్లు 1941లో హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ ఫిలీం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేశారు ప్రముఖ నిర్మాత హెచ్.యం.రెడ్డి. వారి అధ్యక్షతన ఎర్పడినా సౌత్ ఇండియన్ ఫిలీం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని స్పూర్తిగా తీసుకుని ఈ సంస్థని ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుండే హైదరాబాద్ లో నైజాం సినిమా బిజినెస్ కార్యకలపాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఈ చాంబర్ కి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే పేరు ఉండేది. ఈ ఛాంబర్ లో నైజాం సర్యూట్స్ అన్నీ థియేటర్స్ దీని పరిధిలోకే వస్తాయి కాబట్టి ఈ మధ్యనే ఈ ఛాంబర్ కి తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని నామకరణం చేశారు. ఇప్పుడోస్తున్న యువతరాన్ని సినిమాల నిర్మాణం వైపు మళ్లించాలన్నా సదుద్దేశ్యంతో ప్రస్తుత ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఈ ఫిల్మ్ ఛాంబర్ కి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే అర్హత కూడ తీసుకొచ్చారు. ఈ ఛాంబర్ తరుపున ఇప్పటికే ఓ పది తెలుగు చిత్రాలకి సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఛాంబర్ లో కేవలం తెలంగాణ ప్రాంతపు దర్శక, నిర్మాతలే కాకుండా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల దర్శక, నిర్మాతలు కూడ బ్యానర్ రిజిస్టర్ చేయించుకుని సినిమాలు నిర్మించవచ్చు. ఈ ఛాంబర్ లో బ్యానర్ రిజిస్ట్రేషన్ కి రూ 1500/-, టైటిల్ రిజిస్ట్రేషన్ కి రూ 500/- తీసుకుంటారు. సినిమా నిర్మాణం పూర్తయ్యి సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయిన తరువాత శాశ్వత సభ్యత్వం కోసం అప్లై చేయాలనుకుంటే కేవలం రూ 6000/- లతో ప్రొడ్యుసర్ కౌన్సిల్ లో లైఫ్ మెంబర్ అయిపోవచ్చు. ఈ ఛాంబర్ ద్వారా కెనాన్ ఫైడితో సినిమాలు నిర్మిస్తే ఎలాంటీ అభ్యంతరం లేదు. పైగా ఈ ఛాంబర్ లో ఓ సౌలభ్యం కూడ ఉంది. దీంట్లో ట్వంటీ ఫోర్ క్రాప్ట్స్ యూనియన్స్ లేవు కనుక, ఎవరితోనైనా సినిమా పని చేయించుకోవచ్చు. సినీ కార్మికుల బెడదా ఇక్కడ ఉండదు. యూనియన్సు, కార్డ్స్ గొడవ అసలే లేదు. ఇది ఇప్పుడొస్తున్న కొత్తతరం దర్శక, నిర్మాతలకి ఓ వరం. ప్రస్తుతం చిన్న సినిమాలని నిర్మిస్తున్న చిన్న నిర్మాతలు ప్రాంతంతో సంభందం లేకుండా, ఈ ఛాంబర్ ద్వారా సినిమాలు నిర్మిస్తే ఆ నలుగురికి గట్టి పోటి ఇచ్చిన వారు అవుతారు కూడ. ఈ దిశగా చిన్న దర్శక, నిర్మాతలు అడుగులు వేసి ఆ నలుగురికి దిటుగా ఎదురు నిలిచి చిన్న సినిమాని బ్రతికించుకుంటారో లేక నలుగురితో నారాయణ అంటు అలాగే ఉంటారో తేల్చుకోవాలని ఆశిస్తూ జై తెలుగు సినిమా… జై జై తెలుగు సినిమా…

గమనిక : ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని 1941 లో స్థాపించిన వ్యక్తి హెచ్.యం.రెడ్డిది సీమాంధ్ర ప్రాంతం.

 

THE TELANGANA FILM CHAMBER OF COMMERCE (ESTD -1941)

7TH FLOOR, FLAT.NOS. 704 A&B,

NAVAKETAN BUILDING, S.D.ROAD,

NEAR CLOCK TOWER, SECUNDERABAD – 500 003.

PH: 040 – 27802830- 040 – 27806517.

EMAIL: hsfcc41@gmail.com.

బొమ్మ వేణుగౌడ్

 

4 Comments
  1. Kish October 3, 2012 /
  2. chakri October 3, 2012 /
  3. Chandram October 3, 2012 /
  4. mallikarjuna October 4, 2012 /