పూరీజగన్నాథ్ కలం బలంతో “రాంబాబు”

ఒక పిచ్చితల్లికి పుట్టిని అనాధ మెకానిక్ యాక్సిడెంటల్ గా జర్నలిస్టై కాబోయే ముఖ్యమంత్రిలాంటి నాయకుడిని ఛాలెంజ్ చేసి రాష్ట్ర రాజకీయాల్ని ఎలా మార్చాడు, ప్రజలకు ఎలా స్ఫూర్తినిచ్

చి నాయకుడుకాని నాయకుడయ్యాడు అనేది “కెమెరా మెన్ గంగతో రాంబాబు” సినిమా కథ. ‘కథ ఇది’ అని చెప్పానుకదా మరి కథలేదంటావేమిటని అడక్కండి. హిట్ సినిమాకి అలాంటి లాజిక్కులుండవు. అదే పూరీజగన్నాథ్ మాటల మహత్యం.

పవన్ కళ్యాణ్ కనువిందైన నటన, తమన్నాకు అతకని డబ్బింగ్,ర్యాండమ్ గా నవ్వుల్ని పూయించే ఆలి,బ్రహ్మానందం, తాగుబోతు రమేష్ ల కామెడీ, తళుక్కుమనే ఆండ్రియాలతో పాటూ ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ నటన, సీజన్డ్ కోటశ్రీనివాసరావు అభినయం, తనికెళ్ళ భరణి రొటీన్ పాత్ర ఇవన్నీ సినిమాను ఒక పెద్ద స్థాయి సినిమా చేశాయి. కథకన్నా కొన్ని బాగా పేలే దృశ్యాల్ని, సంభాషణల్ని నమ్ముకుని సినిమా మొత్తాన్ని ఒక కాలిక్యులేటెడ్ ప్యాకేజిగా చెయ్యడంలో పూరీ జగన్నాథ్ సఫలమైనట్టే. ఒకప్పుడు రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం చేస్తాడని రూమరొచ్చేలా చేసిన సినిమాల తరహాలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేత చెప్పించిన డైలాగులు అనిపిస్తాయి. చాలా సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ శ్రద్ధగా డబ్బింగ్ చెప్పి ఆ డైలాగుల సత్తా చాటడం గమనించదగ్గ విషయం. తమన్నా పాత్రగానీ, నటనగానీ, డబ్బింగ్ గానీ సరిగ్గా అతకక పెద్దగా పండలేదు. పాటల్లో యధావిధిగా అందంగా ఉంది.

సంగీతపరంగా పాటలు నిరాశపర్చినా నేపధ్యసంగీతం సినిమాలు బాగా పనికొచ్చింది. నేపధ్యగీతంలో భాస్కరభట్ల కలం కదం తొక్కింది. ఛోటా కె నాయుడు సినెమాటోగ్రఫీ చాలా అందంగా అమరింది. ఈ సినిమా హీరో పవన్ కళ్యాన్ అయినప్పటికీ అసలు హీరో మాత్రం పూరీజగన్నాథ్ లోని రైటర్. అతిశయమైన అతుకుల బొంతలాంటి కథకు ఆసక్తికరమైన దృశ్యాలు, ఆలోచించజేసి అబ్బురపరిచే కొన్ని మాటల నగిషీలతో అతుకులు కుట్టి అందంగా అమరేలా కొత్త డిజైన్ తయారు చేశాడు. రైటింగ్ బలంతో హైస్పీడ్ దర్శకత్వంతో ఈ సినిమా పూరీ చేసినా ప్రధామార్థంలోని డొల్లతనం, ద్వితీయార్థంలోని అనవసరపు సీన్ల బరువు ప్రేక్షకుడి మీద పడకమానదు. కాకపోతే క్లైమాక్స్ లోని బలం, పవన్ కళ్యాణ్ చివరి డైలాగ్ థియేటర్ విడిచినా మనసులో గుర్తుండటంతో అప్రయత్నంగా “బాగుంది” అనిపించజేసే సినిమా ఇది. చూడండి.