మంచి పుస్తకం ”దర్శక మహేంద్రుడు కే.వి.రెడ్డి”

img254

కదిరి వెంకట రెడ్డి నాయుడు అంటే మీలో చాలా మందికి తెలియక పోవచ్చు.? పోనీ కే.వి.రెడ్డి అంటే …??? కొంతమందికి తెలియవచ్చు.మాయాబజార్ సినిమా తెలుసు కదా…! తెలియని తెలుగువాడు వుండడు. ఆ సినిమా పేరు వింటేనే ముఖం మీద చిరునవ్వు, గర్వం, మనస్సులో ఆనందం వెల్లివిరుస్తుంది. అవును ‘వివాహ భోజనంబు విందైన వంటకంబు’ అనే పాటలో ఘటోత్కజుడి గా ఎస్.వి.రంగారావు గారి నట విశ్వరూపం ,మహా నటుడు ఎన్టీ రామారావు గారికి క్రిష్ణడుగా వేషం వేయించి దేవుణ్ణి చేసిన విధానం, శశిరేఖగా సావిత్రి నటన , ‘ఆహనా పెళ్ళంట’ పాటలో అభినయం, అభిమన్యుడిగా నాగేశ్వర రావు గారి నటన, అస్మదీయులు, తస్మదీయులు అనే మాటలు పుట్టించి,.. ‘ఎవరు మాటలు పుట్టించక పొతే మాటలెలా పుడతాయి ‘ పింగళి వారి గడుసు మాటలు వున్న సినిమానే మాయాబజార్.అటువంటి గొప్ప సినిమాను సృష్టించి మనకు అందించిన దర్శక పితామహుడు శ్రీ కదిరి వెంకటరెడ్డి అనే కే.వి.రెడ్డిగారు. మనం తరతరాలుగా ఒక తరం నుండి మరొక తరం వారికి వారసత్వ సంపదను పొందినట్టు మాయాబజార్ సినిమాను మనకి మనం పరిచయం చేసుకుంటున్నాం. వారు సృష్టించిన పాతాళ భైరవి సినిమా మాస్ సినిమాలకే మహారాజ అయితే , దొంగరాముడు సినిమా స్క్రీన్ ప్లే నిర్మాణాన్ని అద్యయనం చేసే వారికి పాఠ్యంశం గా అయింది.

 

కే.వి.రెడ్డి గారి గురించి సమాచారం అప్పటి సినీ సమకాలికులు చెప్పిన మాటాలు, అనుభవాలే ఇంత కాలం అందరు చెప్పుకునేవారు. కాని ఆయనకు సంబంధించిన సమగ్రమైన పుస్తకం మాత్రం ఇన్నేళ్ళలో ఏది రాలేదు అనే విషయం తెలుసుకున్న డా|| చాగం కొండారెడ్డి గారి ఇటీవల ”దర్శక మహేంద్రుడు కే.వి.రెడ్డి” అనే పుస్తకాన్ని అందమైన,అరుదైన ఫొటోలతో రచించి, ప్రచురించి సినిమా అభిమానులకు ,సినీ ప్రేమికులకు అందించారు.

 

ఈ పుస్తకం మొత్తం ఆరు విభాగాల్లో విభజించి , ఆయన జీవిత సంగ్రాహం నుండి ఆయన అప్పటి ప్రముఖుల అభిప్రాయాల వరకు పొందుపరచారు.

మొదటి విభాగంలో ఆయన జీవిత విశేషాలు,బాల్యం,వివాహం,సంసారం,పిల్లలు, కుటుంబ సంగతులు పూర్తిగా తెలియజేశారు.ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో పరిశోధించి తెలుసుకుని గ్రంధస్తం చేశారు. సినిమా నిర్మాణానికి , ఉత్తమ చిత్రాలను , ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించడానికి ఆయనకున్న సంస్కారం, వ్యక్తిత్వం కుడా తోడ్పడింది కాబట్టే ఆయన అంత మంచి సినిమాలను సృష్టిమ్చారేమో అనిపిస్తుంది.

 

ఆయన దర్సకత్వపు ప్రతిభ గురించి చర్చిస్తూ , ఆయన ఆలోచనా విధానం, తీయబోయే సినిమాను నిరంతరం తన కళ్ళతో దర్శించడం , పకడ్భంది ప్రణాళిక, ఎన్నుకున్న కథను సినిమాగా మలచడానికి అనేక సార్లు ఆ కథను పరిశీలించడం, సామాన్య ప్రక్షకుని అభిరుచిని దృష్టిలో వుంచుకుని సహజత్వానికి దగ్గరగా రూపకల్పన చేయడానికి కే.వి.రెడ్డిగారు ఎంతో తపనపడే వారని అర్థమవుతుంది.

 

సినిమా కథను తెరమీద ఎలా ఆడించాలో ఆయన సృష్టించిన 14 సినిమాలను, వాటి కథలను, దాన్ని తెరమీద నడిపించిన విధానాన్ని చూసి కాబోయే దర్శకులు ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన తీసిన జానపద చిత్రాలు పాతాళ భైరవి, గుణ సుందరి కథ అనే సినిమాల గురించి రాసి, పాతాళ భైరవి కథ, కథన శిల్పంలో సినిమా సినిక్ ఆర్డర్ ను ఇచ్చి ప్రతి సీన్ ను విశ్లేషించి, ఆ సినిమా కథను ఎలా నడిపించి ఒక క్లాసిక్ చిత్రంగా ఎలా మలిచారో రాసారు.

 

కే.వి. రెడ్డి గారు దర్శకులుగా మాయాబజార్, పాతాళ భైరవి చిత్రాలు నిర్మించి వుండకపోతే ఇప్పుడు తెలుగు సినిమాలు ఎలా ఉండేవో….? సామాన్య ప్రేక్షకులకు విపులంగా అర్థమయ్యే విధంగా కథ కథనాలు వుండాలన్నదే ఆయన సిద్దాంతం. ఆయన సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.

కే.వి.రెడ్డి గారి మిద రాసిన ఈ పుస్తకం ప్రతి సినీ రచయితా అద్యయనం చేస్తే జనరంజకమైన చిత్రాలను ఎలా సృష్టించవచ్చో బోధపడుతుంది.

ఎంతో కృషితో ఈ గ్రంధ రచనకు పూనుకున్న శ్రీ చాగం కొండారెడ్డి నిజంగా అభినందనీయుడు.

 

పుస్తక రచయిత- శ్రీ చాగ కొండారెడ్డి.

mobile-9666496468

అల్లం శశిధర్

1 Comment

1 Comment

  1. panuganti seshakala

    September 7, 2013 at 3:07 pm

    చాలా బాగుందండి. చాలా బాగా రాశారు మీరు. నేను దర్శకమహేంద్రు పుస్తకాన్ని చదివాను. చాలా బాగుంది. నాకు నచ్చింది. మీరు కూడా బాగా రాశారు. ఆ పుస్తకాన్ని గురించి ఇంకా విశ్లేషించవచ్చు. మీరు చాలా తక్కువే రాశారు.

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title