Menu

” క్లిష్టత. అదే అతని ప్రత్యేకత.”

2006 లో వచ్చిన Prestige సినిమాలో ‘ మైకల్ కేన్’ ఒక మాట చెబుతాడు, “The Audience wants to be fooled” అని. భయంకరమైన పోటీ ఉన్న ఇద్దరు ఇంద్రజాలికుల మధ్య జరిగే అతి ఘోర మస్తిశ్కయుద్ధమే ” ప్రెస్టీజ్ “.

చిన్నప్పటినుండి Algebra వల్ల నాకు గణితశాస్త్రం అంటే భయం.

పెద్దయ్యాక క్వాంటమ్ మెక్యానిక్స్ వల్ల నాకు Physics అంటే చలిజ్వరం. వాటిని చూసి దూరం పరిగెత్తెవాన్ని. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక రోజు అనుకున్నాను, ఈ చదువులు నా వల్ల కాదు అని. సరే ఏదైన సినిమా చూద్దాం అని నాకు తెలిసిన ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. అప్పట్లోనే వాడు కొత్తగా కొన్న కంప్యూటర్లో కొన్ని సినిమాలు దాచిపెట్టుకొని వున్నాడు. నాకూ మా స్నేహితుడికి ఒక వింత అలవాటుండేది. మేము కేవలం ఒక దర్శకుడి మొదటి సినిమా మాత్రమే చూడాలనుకునేవాళ్ళం. చూసేవాళ్ళం.

అలా Wachowski సోదరులు తీసిన “Bound”, Guy Ritchie తీసిన “Lock stock & two smoking barrels “, Aronofsky తీసిన “Pi”, Jean Pierre Jeunet మరియు Marc Caro కలిసి తీసిన “Delicatessen ” ఇలా అన్ని చూసినవే చూసి, మళ్లీమళ్లీచూసి ఆ కొత్త దర్శకుల కొత్తదనాన్ని ఎంతో ఆనందించేవాళ్ళం.

అప్పటివరకు అంతా బానేవుండేది. కానీ ఒక రోజు ఈ కొత్త దర్శకుల మొదటి సినిమాల వేటలో నా వలలోకి ఒక కొత్త సింహం చిక్కింది. అలా అని నేను అనుకున్నాను. నిజానికి దాని వలలో నేను చిక్కుకున్నాను. అది ఎంతో చురుకైన వేటగాన్ని కూడా బోల్తా కొట్టించగలిగే తెలివైన సింహం.

దాని పేరే “Christopher jonathan james Nolan”. చిన్నగా చెపితే, “Christopher Nolan”. ముద్దుగా చెపితే “Chris”.

మన ఇంట్లో దొంగలు పడితే లబో దిబోమంటాం. నానా హడావిడి చేస్తాం. “ఉన్నదంతా పోయింది, ఇంకేంటి?”, అని అనుకుంటాం. కానీ నోలన్ అలా కాదు. సాధారణంగా ఎవరూ చూడని కోణం నుండి అతను ఆ దొంగతనాన్ని చూసాడు. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని, అది చేసిన ఆ దొంగని స్పూర్తిగా తీసుకొని, ఒక తెలివైన కథని అళ్లాడు. దానికి తనదైన శైలిలో ఇంకా తెలివైన కధనం చేకూర్చాడు. అది అతని మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్. కేవలం ౩ లక్షల ఖర్చుతో, అందులోనూ ఆ సినిమాకి పనిచేసిన నటీనటులు ఆఫీసు పనిలో busy గా ఉండడం మూలంగా శని,ఆదివారాల్లో మాత్రమే షూటింగ్ చేస్తూ, అతనే కేమెరాని హ్యాండిల్ చేసి, తన దగ్గిర వున్న వస్తువుల్నే సినిమాలో props గా, set pieces గా వాడి ఒక సంవత్సరంలో తయారు చేసిన బ్రహ్మాండమైన low-budget మరియు 100% ఫ్యాట్-ఫ్రీ చిత్రం.

దాని పేరే “ఫాలొయింగ్”.

ఆ సినిమా మొట్టమొదటిసారి చూసిన తరువాత నేను మళ్లీ పరిగెట్టాలని అనుకున్నాను, కష్టమైన screenplay లకు దూరంగా. అప్పుడనుకున్నాను, ఆల్జీబ్ర ఫూల్ని చేసింది. పర్వాలేదు. క్వాంటమ్ ఫిసిక్స్ ఫూల్ని చేసింది. లైట్. కానీ ఒక సినిమా? ఇలా ఐతే ఎలా? కానీ అప్పుడు నేను గమనించిన విషయం ఏమిటంటే, ఆల్జీబ్ర, క్వాంటమ్ ఫిసిక్స్ నన్ను వెధవని చేసినప్పుడు నేను భయపడ్డాను. కానీ సినిమా నన్ను ఫూల్ని చేసినప్పుడు ఆనందపడ్డాను. పైగా వెధవనౌతానని తెలిసికూడా మళ్లీ చూడాలనుకున్నాను. చూశాను.

రెండోసారి ఫాలొయింగ్ చూసినప్పుడు, “అసాధ్యమైన నారేషన్ మరియు screenplay” అని అనిపించింది.

కానీ మూడోసారి చూశాక “కష్టమే! కానీ అసాధ్యం కాదు ఇలాంటి screenplay లు వ్రాయడం” అని అనుకున్నాను.

నాలుగవసారి చూశాక, నేనూ ఆలోచించడం మొదలుపెట్టాను.

ఇక అయిదవసారి “ఫాలొయింగ్” చూశాక, నేనూ ఒక కథ రాయగలిగాను. అప్పుడు అర్ధం అయ్యింది నాకు, సమస్యకి దూరంగా పరిగేడితే పని జరగదని. ఇష్టపడి నేర్చుకుంటే గణితం కష్టం కాదని, imagine చేసుకుంటే ఫిసిక్స్ ఎంతో easy అని. మళ్లీ మళ్లీ చూస్తే నోలన్ screenplay ని కూడా పిండి పిప్పి చెయ్యొచ్చని.

దర్శకుల యొక్క మొదటి సినిమాలు మాత్రమే చూడాలి అనుకున్న నాకు మొట్టమొదటిసారి ఒక దర్శకుడి రెండవ చిత్రం ఏలావుంటుందో, ఎలా తీస్తాడో, ఈ సారి ఎలా ఫూల్ని చేస్తాడో అన్న విపరీతమైన ఉత్సాహం కలిగింది. నన్ను అంతగా ప్రభావితం చేసిన Nolan మీద, అతని పనితనం మీద నేను అప్పటినుండే ఓ కన్నేసి ఉంచాను.

“ఫాలొయింగ్” వచ్చిన రెండు సంవత్సరాల తరువాత “మెమెంటో” వచ్చింది. మెదడులోని హిప్పోకాంపస్ చెడిపోతే మనిషి ఎప్పటికీ కొత్త జ్ఞాపకాలు ఏర్పర్చుకోలేడు. దానినే వైద్య పరిభాషలో “ఆంటెరోగ్రేడ్ ఆమ్నేసియా” అంటారు. మనం సరుకులు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకటి, రెండు వస్తువులు మర్చిపోతేనే “అయ్యో!” అనుకుంటాం. అలాంటిది, ఒక వ్యక్తి, తిండి, నిద్ర లాంటి కనీస అవసరాలు కూడా అసలు గుర్తుంచుకోలేని పరిస్థితి. అతడికి షార్ట్ టర్మ్ మెమోరీ లాస్. కలిసిన ఏ వ్యక్తినైనా, చూసిన ఏ వస్తువునైనా, చేసిన ఏ పనినైనా కొన్ని నిమిషాల తరువాత సమూలంగా మర్చిపోయే భయంకరమైన జబ్బు. కానీ అతని మెదడులో ముద్రించుకపోయిన ఒకేఒక్క విషయం, అతని భార్య హత్య. ఎప్పటికైనా కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. కానీ ఎలా? కనీస అవసరాలే గుర్తుపెట్టుకోలేని వాడు, చూసినదేదైనా నిమిషాల్లో మార్చిపోయే అతడికి అది ఎలా సాధ్యం? వింటున్న మనకే కష్టంగా అనిపిస్తుంది. కానీ Nolan కి “వింత కథ, అంతకంటే వింతైన screenplay” వెన్నె తో పెట్టిన విద్య. జ్ఞాపకాలు అనేవే తెలియని ఒక మనిషి మస్తీష్కం లోకి మనల్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు.

“మెమెంటో” లో మనం రెండు రకాల దృశ్యాలు చూస్తాం.

బ్ల్యాక్ అండ్ వైట్ సీరీస్ మరియు కలర్ సీరీస్.

బ్ల్యాక్ అండ్ వైట్లో చూసేవన్నీ కాలక్రమేణా జరుగుతుంటాయి.

కలర్లో చూసేవన్నీ Reverse గా జరుగుతుంటాయి.
నోలన్ తన Trademark ని తెలియజేయడానికి ఈ రెండు రకాల దృశ్యాలని చిత్రం చివరలో కలిపాడు. ఫలితం…అసాధారణమైన చిత్రం మరియు అనితరసాధ్యమైన కార్యం.

గొప్ప గొప్ప వైద్యులు, ఆరోగ్య నిపుణులు సైతం ఈ సినిమాని చూసి జ్ఞాపకాల యొక్క Neurobiology నీకానీ, ఆంటెరోగ్రేడ్ ఆమ్నేసియా బాధితుడి పరిస్థితినికానీ ఇంత ఖచ్చితంగా, కళ్ళకు కట్టినట్టుగా సినిమా చరిత్రలో ఇంతకు ముందు ఎవ్వరూ చూపించలేదు, బహుశా ఇక ముందు చూపించలేరేమో కూడా అని తేల్చేసి చెప్పేశారు. దీనితో నోలన్ ప్రపంచ దృష్టిని చూరగొనడం మాత్రమే కాకుండా చరిత్రలో ఎంతో తెలివైన వ్యక్తుల జాబితాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు, మెమెంటోకి కూడా “చనిపోయే ముందు తప్పక చూడవాల్సిన చిత్రాల జాబితా” లో స్థానం సంపాదించి పెట్టాడు.

నా దృష్టిలో మెమెంటో యొక్క గొప్పతనమెంటంటే ఈ చిత్రం ఒక పరీక్ష వ్రాస్తున్నట్టుగా ఉంటుంది. అందులో నటిస్తున్న కథానాయకుడు కానీ, దాన్ని చూస్తున్న ప్రేక్షకుడు కానీ ఒకే పనిలో నిమగ్నమై వుంటారు. “నిజం వెతకడంలో”. అంతగా sync అవుతారు వాళ్ళిద్దరూ.

అక్కడే నోలన్ ప్రత్యేకత మరియు గొప్పతనం ప్రపంచానికి తెలిసొచ్చింది. Anterograde Amnesia బాధితుడికి జ్ఞాపకల్లో వుండే క్లిష్టతని ప్రేక్షకుడుకూడా అదే విధంగా అనుభవించేట్టుగా చెప్పగలిగాడు నోలన్. ఇంతటి కష్టమైన కథమీద, అంతకంటే కష్టమైన కథనం మీద ఎంతో clarity ఉన్నందువల్ల నోలన్ “మెమెంటో” ని కేవలం 25 రోజుల్లో షూట్ చేయగలిగాడు.

మొట్టమొదటిసారి ఒక దర్శకుడి రెండవ చిత్రాన్ని చూశాను. మొదటిదాని కంటే చాలా బాగా తీశాడు. కేవలం అద్భుతమైన కథ వుంటే సరిపోదు, ఆ కథకి అత్యద్భుతమైన కథనాన్ని జోడిస్తే ప్రేక్షకులని ఆశ్చర్యంలో ముంచెయ్యొచ్చు అన్న విషయం అర్ధం చేసుకున్నాను.

ఈ సారి ఫూల్ అవలేదు. ఫీల్ అయ్యాను.

నా ఒంట్లోని ప్రతీ కణ౦ ఆలోచించడం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? రాస్తే ఇంతకన్నా గొప్పది, లేదా అసలు రాయకూడదు అని అనుకున్నాను.

ఫాలొయింగ్. చెక్.

మెమెంటో. చెక్.

“ఇప్పుడేంటి?, ఈ సారి ఎలా తీస్తాడు? ఇంకెంత ప్రభావితం చేస్తాడు?”, అని తన మూడవ చిత్రం కోసం ఎన్నో, ఎన్నెన్నో నిద్ర లేని రాత్రులు గడపడం వలన నాకు నిద్రలేమి వచ్చింది.

ఆంగ్లంలో నిద్రలేమిని “ఇన్‌సామ్‌నియా” (Insomnia) అని అంటారు.

చమత్కారం ఏమిటంటే, నోలన్ కూడా తన మూడవ చిత్రం పేరు “ఇన్‌సామ్‌నియా” అని అనౌన్స్ చేశాడు.

ఏదో నార్వేజియన్ సినిమాకి రీమేక్ అని చెప్పాడు. నటీనటులను ఎన్నుకున్నాడు. అల్ పాచినో, రాబిన్ విల్యమ్స్, హిలరీ స్వ్యాంక్ లాంటి హేమాహేమీలు అని తెలిసింది.

అల్ పాచినో, నేను ఎంతగానో ఇష్టపడే కథానాయకుడు. బుల్లెట్ కంటే వేగంగా Performance ని డెలివర్ చేస్తాడు.

మరి నోలన్? బుల్లెట్నే తయారుచేయగల తెలివైన, అంతకంటే సమర్ధవంతమైన దర్శకుడు.

చూస్తూ, చూస్తూ రెండేళ్ళు గడిచిపోయింది. నా ఇన్‌సామ్‌నియా తారా స్థాయికి చేరుకుంది. నా ఇన్‌సామ్‌నియా పోవాలంటే నోలన్ “ఇన్‌సామ్‌నియా” నే పరిష్కారం అని తెలుసు నాకు. 2002లో ఇన్‌సామ్‌నియా విడుదలయింది. చూశాను. తనదైన శైలిలో క్లిష్టత జొప్పించాడు. నోలన్ పనితనం గురించి తెలిసిన ఎవ్వరైనా ఇన్‌సామ్‌నియా అతని చిత్రమే అని గుర్తుపట్టి చెప్పేవిధంగా తీశాడు. అంతా బానేఉంది. అందరూ అదిరిపోయే పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. నోలన్ కి హాలీవుడ్ లో సుస్థిర స్థానం దొరికింది. వార్నర్ బ్రదర్స్కీ ఒక సారథి దొరికాడు. కానీ నాకే ఎక్కడో, ఏదో వెలితి.

బుల్లెట్(కథ) బాగానే తయారుచేసాడు,

బుల్లెట్ వదలడం(screenplay) కూడా ఖచ్చితంగానే వదిలాడు,

బుల్లెట్ కూడా అంతే వేగంగా (నటీనటుల నటన) ప్రయాణించింది, తగిలింది (బాక్స్ఆఫీస్ ఆలింగనం తో ఆహ్వానించింది), ఆ బుల్లెట్ తగిలినవాడు కుప్పకూలాడు(నోలన్ ఖాతాలో ఇంకొక విజయం).
కానీ నాకే, నేను అనుకున్న విధంగా, నా అంచనాకి తగ్గట్టుగా తగల్లేదు అని అనిపించింది.

ఇన్‌సామ్‌నియా…చూశాను.

మళ్లీ చూశాను.

మళ్లీ మళ్లీ చూశాను.

నోలన్ పనితనం తక్కువ కాలేదు, నా అంచనాలు మాత్రమే ఎక్కువయ్యాయని అర్ధం చేసుకున్నాను. నా ఇన్‌సామ్‌నియా కి కారణం కూడా ఆ అంచనాలే అని తెలుసుకున్నాను. అది తెలుసుకున్న రోజు రాత్రి నుండి నేను Time కి నిద్ర పోవడం మొదలుపెట్టాను.

కట్ చేస్తే 2005.

సచిన్ కొట్టే సెంచురీలా, ష్యూమేకర్ నడిపే ఫెర్రారీలా ఆ మూడు సంవత్సరాలు ఎంత స్పీడ్గా గడిచాయో అర్ధమే కాలేదు.

మొదట్లో ఒక ఊపు ఊపిన Batman సినిమాలు ఆ తరువాత రాను రాను ‘చూసేవాళ్ళకి తల పట్టుకోవడం, తీసే వాళ్ళకి జుట్టు పీక్కోవడం’ అన్నట్టు తయారయ్యాయి. ఏం చెయ్యాలో తెలియక నేల మీద పడ్డ చేప పిల్లలా కొట్టుకుంటుంది వార్నేర్ బ్రదర్స్. కొన్ని వేయిల కోట్లు పోసి ఫ్ర్యాంచిస్ కొనుక్కుంది. డబ్బుల మాట అటుంచితే పరువుకి సంబంధించిన విషయం. బాబ్ కేన్ అద్బుత సృష్టికి ప్రాణం పొయ్యటానికి ప్రాణం పోయినంత పనవుతుంది దర్శకులకి.
దర్శకుల్లో పలు రకాలు ఉంటారు. కాకులు, పావురాలు, కొంగలు, చిలుకలు, గద్ద్దలు. కానీ ఇలాంటి వాళ్ళు సరిపోవట్లేదు బ్యాట్‌మ్యాన్ ని హ్యాండల్ చేయడానికి.

రాబంధువు లాంటి వాడు కావాలి.

ప్రజలు మర్చిపోయిన బ్యాట్‌మ్యాన్ని తిరిగి వాళ్ళ తల మధ్యలో జొప్పించాలి. ఎలా? ఎవరు? అప్పుడే వాళ్ళకి మన నోలన్ గుర్తొచ్చాడు.

మన ఇంట్లో కంప్యూటర్ స్టక్ అయిపోతే దాన్ని balcony నుంచి కిందకి పడేయ్యలేం కదా. Reboot చేస్తాం.

నోలన్ కూడా బ్యాట్‌మ్యాన్ విషయంలో అదే చేశాడు.

ట్యాప్ నుండి నీళ్ళు సరిగ్గా రావట్లేదు అంటే పైప్ లో ఎక్కడో ఏదో ఇరుక్కున్నట్టు. నోలన్‌కి అర్ధం అయ్యింది. స్టైల్నే తప్ప ఎమోషనల్ డెప్త్ని దర్శకులు చూడట్లేదన్న విషయం తెలుసుకున్నాక నోలన్ బ్యాట్‌మ్యాన్ని పునాధుల నుండి తవ్వాడు.

పగిలిపోయి, చెదిరిపోయిన ఇటుకలన్నింటినీ తీసి పక్కన పారేసాడు.

ఒక్కొక్క ఇటుకని David S.Goyer సహాయంతో మొదటి నుండి శ్రద్ధగా అమర్చాడు.

“బ్యాట్‌మ్యాన్ బిగిన్స్” తో కథలో, కథనంలో సరికొత్తగా ముస్తాబయి మళ్లీ థియేటర్లలో కేకలు, అరుపులు పుట్టియ్యడానికి వచ్చేశాడు బ్రూస్ వేన్. ఫలితం…బాక్స్ ఆఫీస్ గంట, award ల పంట.
Warner Brothers కి అర్ధం అయ్యింది, బ్యాట్‌మ్యాన్ అనే రధానికి తగ్గ సారధి నోలనే అని.

ఇంగ్లీష్ లో ఒక మాట అంటూ ఉంటారు. ‘Good things come in threes’ అని. నోలన్ పుణ్యమా అని వార్నేర్ బ్రదర్స్ అతనికి Trilogy బాధ్యతలని అప్పగించింది. ఒక కొత్త శకం మొదలయ్యింది. క్రిస్టొఫర్ నోలన్ శకం.
ఇక్కడ నేను ‘బ్యాట్‌మ్యాన్ బిగిన్స్’ కథ కంటే నోలన్ గురించి ఎక్కువగా చెప్పడానికి కారణం, టెబుల్ మీద ఉన్న కోడిగుడ్డు కంటే ఇంకాసేపైతే కింద పడి పగిలిపోయే ఆ కోడిగుడ్దును ఎలా పట్టుకున్నాడు అన్న కథే ఆసక్తిగా ఉంటుంది. అలాంటి వాడి కథ చెప్పడంలోనే ఒక అర్ధం ఉంటుంది.

చేపకు ఈత,
పువ్వుకు పూత,
నోలన్కు క్లిష్టత. అదే అతని ప్రత్యేకత.

To be continued…
(ఇది మొదలుపెట్టి మూడు సంవత్సరాలవుతుంది. ఎందుకో ఇది పూర్తి చేయడానికి mood మాత్రం రావట్లేదు. వచ్చినప్పుడు మిగితాది పూర్తి చేస్తాను.)

నిజమైన నోలన్ అభిమానులు దీన్ని share చేస్తారు. copy paste కొట్టరు.

– Phanindra Narsetti

10 Comments
  1. krshany October 4, 2012 /
  2. Nagarjuna October 6, 2012 /
  3. VENKAT October 8, 2012 /
  4. Aravind October 15, 2012 /
  5. Krishna Chaitanya December 5, 2012 /
  6. durga ramesh April 17, 2013 /
  7. Geetha April 18, 2013 /
  8. vijay May 4, 2013 /
  9. vijay May 4, 2013 /
  10. Rajendraprasada Reddy August 2, 2017 /