Menu

చిత్రం భళారే తెలుగు చలన సిత్రం

సినిమా ఈజ్ బ్యుటిఫుల్. నాకు సినిమాతో పరిచయం ఎర్పడినప్పటి నుండి కల్గిన భావం. సినిమాతో నా మొదటి పరిచయం గ్యాంగ్ లీడర్ తో మొదలైంది. మంచి డ్రామా మూవీ. ఆ తర్వాత కొంత కాలానికి శివ, గీతాంజలి చూశాను. దాంతో సినిమా మీద ఆసక్తితో సినిమాలు చూడ్డం మొదలుపెట్టాను. మణిరత్నం, రాంగోపాల్ వర్మ, వంశీ ఈ బ్యూటిఫుల్ సినిమాలని రెండు దశాద్భాలా పాటు చూపించారు. ఆ తరువాత ఈ వరుసలోకి శేఖర్ కమ్ముల ప్రవేశించి తెలుగు సినిమాకి ఒక కొత్త సినిమాను పరిచయం చేసి ఇప్పుడు తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో తన అభిమానుల్ని ఆలోచించేలా చేసి తను అందరిలాంటి కమర్షియల్ డైరెక్టర్ అని చెప్పకనే చెప్పి బ్యూటిఫుల్ దర్శకుల సరసన నుండి వైదొలగాడు.

రెండు వేల ఏడులో హ్యపీడేస్ సూపర్ హిట్ అయినా సంధర్బంగా ఒక సినిమా పత్రిక ఇంటర్వులో తెలుగు సినిమా గురించి ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు “ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని ఒక రౌడీ ప్రేమించడం, ఆ రౌడి భారి నుండి హీరో, హీరోయిన్ ని రక్షించడం. ఇంతేనా తెలుగు సినిమా అని” చాలా చాలా భాదపడ్డాడు.

తెలుగు సినిమా పుట్టినప్పటి నుండి సక్సెస్ అయినా ప్రతి దర్శకుడు ఇదే చెబుతూ వచ్చాడు కానీ, మిగతా దర్శకుల కన్నా అంటే రాంగోపాల్ వర్మ తెలుగు సినిమాకి ఒక పంథాన్ని ఎలా అయితే ఎంచుకున్నాడో అదే విధమైన పంథాని ఇప్పుడున్న నవతరం దర్శకులలో శేఖర్ కమ్ముల ఎంచుకున్నాడు.

రాంగోపాల్ వర్మ క్రైమ్ ని ఎంత అధ్బుతంగా తెరకెక్కించగలడో అంతే అధ్బుతంగా అప్పర్ మిడిల్ క్లాస్ భావోధ్వేగాలని తెరకెక్కించగలడు. కాబట్టే రాంగోపాల్ వర్మకి, శేఖర్ కమ్ములకి పోలిక తేవడం జరిగింది. మిగతా దర్శకులకి ఒక్కోక్కరికి ఒక్కోక్క శైలి ఉన్నప్పటికి వీరిద్దరిది ప్రత్యేకమైన శైలి కానీ, ఇప్పుడు కొరుకుడుపడని అంశం ఏంటంటే పైన తెలుగు సినిమా గురించి అన్నీ డైలాగులు చెప్పిన శేఖర్ కమ్ముల ఇంతకు ముందు దర్శకులు చేసినట్టే ఇతను అదే పని చేశాడు. జనరల్ గా తెలుగు సినిమా దర్శకులు ఒక సినిమా హట్ అయ్యిందంటే దానిని మరిచిపోకుండా పదేపదే అదే సినిమాలను తెరకెక్కిస్తుంటారు.

అన్ని ప్రకటనలు చేసినా శేఖర్ కమ్ముల తిరిగి హ్యప్పిడేస్ నే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా తీయడం బ్యూటిఫుల్ కాదు. ఇప్పుడు యూత్ లో ఎవరి నోట విన్నా శేఖర్ కమ్ముల మాటే వినిపిస్తూ ఉంటుంది. ఈ వినిపించటం ఇతనితోనే ప్రారంభం కాదు.

తోంబైల్లో రాంగోపాల్ వర్మ రెండు వేల ప్రాంతంలో తేజ ఇంతకన్నా ఎక్కువ పేరు అంటే ఊళ్లో ఉన్న కుర్రకారు పని పాట మానేసి సినిమా హీరో అవ్వాలని తేజ ఆఫీస్ చూట్టు చాలా మంది తిరిగారు. అన్నీ మాటలు చేతలు చూపించిన తేజ తీసిన సినిమాలే మళ్ళి తీయడంతో జనం, సినిజనం తేజని మరిచిపోయి చాలా కాలం అయ్యింది. ఈ వారసత్వాన్ని కొనసాగించాలని బయలుదేరి హ్యపీడేస్ ని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా తీశాడు శేఖర్ కమ్ముల.

హ్యపీడేస్ సినిమాలో ఒక కాలేజి అందులో సినియర్స్, జూనియర్స్, లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ లో గోల్డ్ ఫేస్, బి ఫేస్ అందులో శ్రావ్, ఇందులో మధు. అందులో తెలంగాణ క్యారెక్టర్, ఇందులో తెలంగాణ క్యారెక్టర్ ఇలా చెప్పుకుంటు పోతే అనేకం. టూకిగా చెప్పాలంటే హ్యపీడేస్ ని కాలనీ బ్యాక్ డ్రాప్ లో తీసినా హ్యపీడేస్ 2 అనాలి. టైటిల్ హ్యపీడేస్ 2 అని ట్యాగ్ లైన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని పెట్టినా ఆడియన్స్ రిసీవ్ చేసుకుని ఎంచక్కా ముప్పై కోట్లు కలెక్ట్ చేసి పెట్టేవారు. ఆడియన్స్ ని ముందుగా ప్రిపేర్ చేస్తే బ్లైండ్ గా చూడకుండా మైండ్ తో చూస్తారు. ఈ సంగతి ఈగ విషయంలో రుజువైంది. గతంలో ఇదే తప్పిదం ఖలేజా విషయంలో కూడ జరిగింది. అదేమో కమెడీ సినిమా దానికి పెట్టిన టైటిల్ ఖలేజా అలా కాకుండా మజా అని పెడితే బాగా ఆడేది. తెలివైనా దర్శక దిగ్గజాలు ఇలా చేయడం బావ్వం కాదు.

అసలు తెలుగు సినిమా దర్శకులు ఎందుకిలా తయ్యారవుతున్నారంటే ఈ రోజుల్లో సినిమా అంటే ఎవ్వరికి అవసరం లేదు ఎందుకంటే యుట్యూబ్ లో కెమెరా పట్టుకున్న పతోడు ఓ సినిమా తీసి పెట్టేస్తున్నాడు. వింత ఏంటంటే యుట్యూబ్ డైరెక్టర్లకి, వెండితెర డైరెక్టర్లకి క్వాలిటీ (అంటే ఇక్కడ డబ్బు కాదు) విషయంలో పెద్దగా తేడా లేదు. సినిమా క్వాలిటి అనేది దర్శకుడి సినీ (సా)మాజిక స్పృహ మీద ఆధారపడి ఉంటుంది. విజయ రహస్యాలను చెప్పే సమాజ తీరు తెన్నులను విశ్లేషించమంటే కొరియన్ డివిడిల వెంట పడతారు.

ప్రపంచంలో ఎక్కడైనా నాలుగే నాలుగు రంగాల్లో ప్రవేశించటం అతికష్టం. అవి సినిమా, పాలిటిక్స్, క్రికెట్, పబ్లిషింగ్ స్వతహగా నైపుణ్యం ఉంటే తప్పా ఇక్కడ గడపడం చాలా కష్టం. ఈ నైపుణ్యానికి కొలమానం కొలబద్ద ఉండవు. అలాంటి నైపుణ్యాన్ని సంపాదించడం ప్రక్కన పెట్టి హీరోల చూట్టు ప్రదిక్షిణలు చేస్తుంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నిసార్లు బోల్తా కొట్టినా చేదు సారీ వెగటు అనుభవాలు ఎదురైనా హీరోలా మోజు, బూజు వదల్లేకపోతున్నారు. కథ విలువ తెలుసుకోకుండా కేవలం కాంబినేషను ప్రాజెక్ట్ సెట్ అవ్వడం పైనే వారి దృష్టంతా. ఒకవేళ ఎవరైనా కథ గురించి మాట్లాడితే వారిని అంటరాని వారిగా చూస్తారు. కాబట్టి తెలుగు సినిమా కథల, వెతల కొలిమిలో కాలి బుడిదవ్వాల్సిందే తప్పా కంటికి కానరాదు కథ. హిట్ అయినా సినిమాలు ఎందుకు ఆడాయో, ఫట్ అయిన సినిమాలు ఎందుకు పోయాయే క్షుణంగా పరిశీలించి పరీక్షిస్తే “మనవాళ్లు వట్టి వెదవాయిలోయ్” అన్నా గిరీషం డైలాగు గుర్తురాక మానదు. బయట ప్రపంచంలో వినిపించని మాట ఇక్కడ ఎప్పుడు అందరి నోళ్లలో నానుతు ఉంటుంది. జయపజయాలు మా చేతుల్లో లేవని కథలకి కరువొచ్చిందని తెలివిగా చేతులెత్తేస్తారు.

దిన వార మాస పత్రికలకి లేని కథల కరువు సినిమాలకెందుకో అర్ధం కాదు. కెవి. రెడ్డి, బియన్.రెడ్డి కాలంలో నిర్మాతలు గ్రామీణ ప్రేక్షకుల కోసం కథలు రాయమని రచయితలను కోరేవారట. అందుకని హీరో నిరుపేదగా, యాంగ్రి యంగ్ మెన్ గా తెరపైకొచ్చి ధనిక విలన్ ని చీల్చి చెండాడి ప్రేక్షక హృదయాలలో చొచ్చుకుపోయేవాడు. ఇప్పుడు ప్రతి కథ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరగాల్సిందే. లేదంటే ప్రక్క రాష్ట్రల్లో అంతే కానీ మన జిల్లాల్లో కాదు. ఇలా చేయడం వల్ల ఆర్టివిషియల్ షోనె తప్పా సినిమాలకి ప్రాంతీయ ఆత్మ అంటు లేకుండా పోతుంది. రాసుకున్న కథకి, పెడుతున్న టైటిల్ కి చూపించే స్ర్కీన్ ప్లే కి పొంతన లేకుండా పోతుంది. అలా ఎందుకు జరుగుతున్నట్టు? సినిమా కథలు రాసే దర్శక రచయితలకి రచన శాస్త్రం తెలియదు కాబట్టి సమస్య తప్పదు. కనుక తీస్తున్న సినిమాలకి ఎందరు ఘోస్ట్ రచయితలు ఉన్నా వాటి రూపురేఖలు చెడకుండా మొత్తం కథలో నాణ్యత దిగజారిపోకుండా కాపాడుకునే మార్గం ఏదైనా ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. ఆలోచించినవాడికి ఆలోచించినంతా మహదేవా అంటాడు ఈ వర్తమాన దర్శక రచయిత. పరిశ్రమని హడలేత్తిస్తున్న ఫ్లాపుల శాతాన్నీ తగ్గించుకోవాలన్నా ఈ పరిష్కార మార్గం ఆవశ్యకత కొంతైనా ఉంది.

తెలుగు సినిమా పుట్టి, పెరిగి ముసలి తనానికి వచ్చినా ఇంకా అనుభవాల మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నారు తప్పితే ఎలాంటి సినిమా శాస్త్రం పట్ల అవగాహన ఇప్పటికి లేదు. బహుశా ఎప్పటికి రాకపోవచ్చు. అలా పాతాళంలోకి పాతుకుపోయినా సినీశాస్త్రంలో ని కథల బాండాగారాన్ని పైకి తీసి చూసుకుంటే ఓ అద్భుత పరిష్కార మార్గం దొరుకుతుంది. ఏమిటా పరిష్కార మార్గం? వెరీ సింపుల్. శ్రమ అనుకోకుండా జీవన మూలాల్లోకెళ్లి గొప్ప కథకి ఏఏ అంశాలైతే పునాదిగా ఉంటాయో వాటిని స్తాపించడమే. ఇంతకి గొప్ప కథకి పునాది నెలకొల్పడం ఎలా? చాలా చాలా సింపుల్. ముందుగా తెరమీద కదిలే బొమ్మ అంటే మనిషి మనసు లోపలి ప్రపంచాన్ని ఆవిష్కరించే శాస్త్రమనే విషయాన్ని గ్రహిస్తే చాలు. అదే పునాది.

తెర మీద మనకి కనిపించే పాత్రలు నిజజీవితంలో నిత్యం మనకు తారాసపడే రకరకాల ఏమోషన్స్ కి సింబల్స్ గా ఉండెవే. అలాంటివి మనం చూస్తున్న సినిమాల్లో కనిపించినప్పుడే ప్రేక్షకుడు ఉద్వేగానికి లోనవుతాడు అని అంటుంది శాస్త్రం… శాస్త్రం… శాస్త్రం. శాస్త్రప్రకారం సినిమాలు తీయడమంటే ముందుగా తెలుగు సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలి.

అసలు తెలుగు సినిమా అంటే ఏంటి? తెలుగు మాట్లాడే వారి జీవన శైలిని కథ, కథన రూప భావ వ్యక్తికరణ చేసే ఒకానొక సృజనాత్మకతతో కూడిన సాంకేతిక ప్రక్రియ. క్లుప్తంగా చెప్పాలంటే తెలుగు మాట్లాడే ప్రజలకి సంభందించిన ప్రాంతీయ నెపధ్యం, కట్టు బొట్టు, ఆచార వ్యవహర సాంప్రదాయలు, బాష మాండలిక యాసలని అంతిమంగా వ్యక్తి మానసిక సంఘర్షణలతో కూడిన అంశాల్ని కథలుగా చేసుకుని ఆ ప్రాంతీయుల కోసం తీయబడ్డ చలన చిత్రం. సినిమాగా తీసిన కథ వాళ్లకి చేరు అవ్వాలంటే అది వారి జీవితాలకి దగ్గరగా ఉన్నప్పుడే దాన్ని చూడగలరు, వినగలరు, అర్ధం చేసుకోగలరు. ఏ సినిమానైనా ఆ ఉద్దేశ్యంతోనే తీస్తారు. అంతిమంగా అది ప్రేక్షకులకి నచ్చితేనే చూస్తారు. స్ధూలంగా ఏ భాష చలన చిత్ర చరిత్రలోనైనా జరిగేది ఇదే.

మరీ మన తెలుగు చిత్రాలు ఎప్పుడు ఒకే ప్రాంతీయతనే ప్రతిబింస్తాయి ఎందుకని? ఒక ప్రాంతంలో రెండు లేక మూడు ఉపప్రాంతాలుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల నేపధ్యంలో కూడ సినిమాలు తీస్తే అందరికి అమోధ యోగ్యం గాను కొత్త ప్రదేశం, వ్యక్తులు, అలవాట్లు, విజ్నానం, ఆడియన్స్ కి కలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మిగతా రెండు ప్రాంతాలను వేరు చేస్తు ఒకే ప్రాంతాన్ని హైలెట్ చేస్తు ఇదే సంకృతి, ఇదే నాగరికత నాగరిక లక్షణాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయలు ఈ నేల సొత్తే అన్న చందంగా ఉండకూడదు. అదీ భావ్యము కూడ కాదు. కమర్షిషల్ గా ఆలోచించినా ఎప్పుడు ఒకే ప్రాంత నేపధ్యంలో కథలు వస్తే కొంత కాలం తరువాత ప్రేక్షకులకి బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకు సినిమా కథల విషయంలో మన తెలుగు చలన చిత్ర రంగంలో జరుగుతున్న సంగతులను ఒకసారి సింహలోకనం చేసుకుంటే మనకి అవగతం అవుతుంది.

గత ఎనభై మూడేళ్లుగా వస్తున్న సినిమాలను ఒక్కసారిగా పరిశీలిస్తే తొంభై తొమ్మిది శాతం సినిమా కథల నేపథ్యం కట్టుబొట్టు ఆచార వ్యవహారాలు, యాసభాషలు అన్ని కూడ కోస్తా వారి జీవన శైలిలోనే చిత్రికరింపబడ్డాయి. సినిమాలు అలా తయ్యారవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఒక్కసారి మన తెలుగు చలన చిత్ర చరిత్రలోకి వెళితే స్వాతంత్రానికి పూర్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసులో మొదలైంది. అప్పటికి తెలుగు ప్రాంతం అంటే మద్రాసు ప్రెసిడెన్సిలో భాగంగా ఉన్నా కోస్తా ప్రాంతం, మరికొన్ని రాయలసీమ జిల్లాలు. తెలంగాణ ప్రాంతం అప్పటికి తెలుగు ప్రాంతం కాదు. ఉర్ధూ ప్రదాన భాషగా ఉన్నా నిజాంచే పరిపాలించబడే నైజాం అనే సంస్థానం. ఈ సంస్థానంలో మరాఠీ, కన్నడ, ఉర్ధూ, తెలుగు నాలుగు రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. అందులో అధిక సంఖ్యాకులు తెలుగువారు. నిజాం నిరంకుశ పరిపాలనలో పేపర్ చదవడమే మహాపాపం. ఇంకా సినిమా దాకా ఆలోచించే పరిస్ధితి లేదు తెలియదు. కోస్తా, ఆంద్ర ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సిలో భాగం. అది బ్రిటిష్ వారి పాలనా ప్రాంతం కాబట్టి అక్కడ అబివృద్ది కార్యక్రమాలు అనేకం జరిగాయి. దానిలో భాగంగానే విధ్యా, వైధ్యం, రక్షణ కలలు అందుబాటులోకి వచ్చాయి. అబివృద్ది పూనాదిగా కోస్తా వారి అడుగులు సినిమా వైపు మళ్లాయి. అప్పటికింకా తెలుగు ప్రాంతం అంటే కోస్తా జిల్లాలే కాబట్టి ఆ నేపథ్యంలో సినిమాలు నిర్మించబడ్డాయి అంటే అందులో తప్పేమి కనిపించడం లేదు.

1956 లో భాషప్రయుక్త రాష్ట్రంగా దేశంలో తొలి తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను కలుపుకోని ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి కూడా అంటే 1956 – 2012 వరకు ఇప్పటికి సరిగ్గా యాభై ఆరు సంవత్సరాలు ఐనప్పటికి ఇంకా కోస్తా ప్రాంతంవారి జీవనశైలిలో సినిమాలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మిగతా తెలుగు ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ ప్రేక్షకులు వినోదం కోసం తెలుగు సినిమా చూడాలంటే తమది కాని వేశ భాషలను, సంస్కృతి సాంప్రదాయలను, కట్టుబొట్టు, ఆచారవ్యవహరాలను అద్దెకు తెచ్చుకుని చూడాల్సిందే. చూస్తున్నారు చూపిస్తున్నారు. తెలంగాణ, రాయలసీమల నేపథ్యంలో కూడ సినిమాలు వచ్చాయి రాలేదనట్లేదు, కానీ తెలంగాణ అంటే నక్సలిజం, ఫ్యూడలిజం లేదా ప్రత్యేక తెలంగాణ. తెలంగాణ అంటే ఇదేనా? ఇక్కడి వారికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కుటుంబం, అమ్మనాన్న, అన్నఅక్కచెల్లి తమ్ముడు ఈ భవబంధాలు ఏమి లేవా? ఎంత సేపు పోరాటం, పేదరికం, బానిసత్యం ఇవేనా? పోని రాయలసీమని ఏమైనా గణంగా చూపించారా అంటే అది లేదు. నిరంతరం పగా ప్రతికారాలే వారి జీవితాలు, ఫ్యాక్షన్ దందాలే వారి జీవన పోరాటం. చివరికి పగకోసం సొంత కూతురినైనా చంపేంత కృర మృగాలని చిత్రికరిస్తారు. ఇది మేథావులైనా తెలుగు దర్శక నిర్మాతల తెలివి అనుకోవాలా అమాయకత్వం అనుకోవాలా అజ్నానం అనుకోవాలా వివక్ష అనుకోవాలా నేనేమి కరుడు గట్టిన తెలంగాణ తివ్రవాదిలా చెప్పడం లేదు. ఒక భాధ్యత గల తెలుగు భావి దర్శకుడిగా చెబుతున్నాను.

సినిమా అంటే కేవలం కలనే కాదు దానితో పాటు వ్యాపారం ముడిపడి ఉంది. ఆ వ్యాపరం మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఎనాడో భారత ప్రభుత్వం సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించింది. ఆ పరిశ్రమ కలకాలం నిలబడాలంటే దానికి కొత్త జవసత్వాలు కావాలి. లాభనష్టాలను శాస్త్రియ కోణంలో అధ్యాయనం చేయగలిగే దర్శక నిర్మాతలు కావాలి. ఏ వ్యక్తి కూడ సంపూర్ణ అవగాహన సంపాదించకుండా సినిమా నిర్మాణం, దర్శకత్వం చెపట్టకూడదు. సంపూర్ణ అవగాహన అంటే చేస్తున్న పని మీద ప్రారంభం నుండి ముంగింపు దాక ప్రయాణం తెలియాలి. సింపుల్ గా చెప్పాలంటే కామన్ సెన్స్ ఖచ్చితంగా అదే. ప్రపంచంలో ఏ పనైనా విజయం సాదించాలంటే కామన్ సెన్స్ కంపల్సరీ. ఉదా : ఒక వ్యక్తి దగ్గర ఇరవై వేలు ఉన్నాయనుకొండి ఏదైనా చిన్న వ్యాపారం చెద్దామని అతను అనుకుంటే కిరణ కొట్టు పెడితే బాగుంటుందని ఆ వ్యక్తి అనుకున్నప్పుడు చిన్న కుటుంబాలు, రోజువారి కూలీలు నివసించే రెహమత్ నగర్, బోరబండ లాంటి ప్రాంతాల్లో మంచి సెంటర్ కోసం వెతుకుతాడు. కానీ, బంజారా హిల్స్, జూబ్లిహిల్స్ లాంటి ఖరీదైనా ప్రాంతాల్లో సెంటర్ కోసం వెతకడు. ఇరవై వేలు పెట్టే కిరణ కొట్టు వ్యాపరికే అంత కామన్ సెన్స్ ఉన్నప్పుడు ఇరవై కోట్లు పెట్టి సినిమా తీసే తెలుగు దర్శక నిర్మాతలకి ఎంత కామన్ సెన్స్ ఉండాలి. ఆ సెన్స్ లేకనే గత కొంతకాలంగా తెలుగు సినిమా కుదేలవుతుంది. ఏ పరిశ్రమలోనైనా లాభాల వాట ఫిప్టి ఫిప్టి పర్సెంటేజ్ గా ఉంటే సినిమా రంగంలో లాభాల వాట 2 % . ఏంటి మరీ విడ్డూరం కాకపోతే గత ఎనభై మూడేళ్లుగా కేవలం కోస్తా ప్రాంతం నెటివిటిని ఆధారం చేసుకుని సినిమాలు నిర్మిస్తే సినిమా బిజినెస్ యాభై కోట్ల వరకు చేరుతుంది.

కేవలం తొమ్మిది జిల్లాల నేపధ్య పలితం అలా ఉంటే తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య పది. ఆ మాటకొస్తే కోస్తా కన్నా ఒక జిల్లా ఎక్కువ. కలెక్షన్స్ పరంగా చూసినా నైజాందే హవా. సినిమా గట్టిగా ఆడితే ఒక్క నైజాంలోన్ ఇరవై కోట్లు వసూలు చేస్తుంది. పైగా ఇక్కడ మాస్ జనం ఎక్కువ. ఇక్కడ సినిమాలు చూసే వారిలో మగవారి సంఖ్య ఎక్కవగా ఉంటుంది. ఆడవారు సినిమా బాగుందని చుట్టు ప్రక్కలవారు చెప్పుకుంటే అప్పుడు కుటుంబంతో సహా వెళ్లి చూస్తారు. సినిమా మీద ప్రేమ, అబిమానం తెలంగాణలో కన్నా ఆంద్రలోనే ఎక్కువ. అది అందరికి తెలుసు. అక్కడ మొదటి రోజు నుండి అన్ని తరగతుల ప్రేక్షకులు చూసే అవకాశం ఎక్కువే. గత పదేళ్లుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఎదిగింది. ఎంతగా అంటే ఈ ప్రాంతం కోసం ప్రత్యేక పేపర్, ప్రత్యేక న్యూస్ చానేల్ వచ్చేశాయ్. ఇక ఎంటర్ టైన్ మెంట్ చానలే తరువాయి.

ఇప్పటి వరకు కమర్షియల్ గా తెలంగాణ ప్రాంత నేపధ్యంలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడ రాలేదు. అంటే తెలంగాణ కల్చర్ లో సినిమాలు చిత్రికరించడానికి సరిపోయే అంతా సరుకు లేదా? గోరంతా పండుగైనా అట్ల తద్దిని కొండంత చేసి గోల గోల చేస్తు చూపిస్తారు. మరి తొమ్మిది రోజులు జరిగే బతుకమ్మ పండుగని ఇంకా ఎంత గొప్పగా చూపించొచ్చు. సంక్రాంతి, సంక్రాంతి ముగ్గు అందులో గొబ్బెమని చూపించినట్లు దసరా జమ్మి చెట్టుని పాలపిట్టని ఎందుకు చూపించరు. కమర్షియల్ గా తెలుగు సినిమాకి ఈ పది జిల్లాల నేపథ్యం సరిపోదా. ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాలలో తన ఉనికిని కాపాడుకుంటుంది.

ఇప్పుడు సినిమా రంగంలో కూడ ఆ పరిణామాలే సంభవిస్తే రేపు ప్రత్యేక తెలంగాణ వస్తే వైశాఖ్ వెళ్లి పోవాల్సిందే అన్న ప్రశ్న తలెత్తదు. ఇప్పుడు వస్తున్న నవతరం దర్శకులు తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తీస్తే జాతి పరంగా తెలుగు జాతి ఒక్కటే రాష్ట్రాలు రెండుగా విడిపోయినా సినిమా పరంగా మనం ఒక్కటే అనే భావనని తీసుకురావచ్చు. ఇలా చేయడం ద్వారా కొత్త నేపథ్య కథలకి పూనాది వేసినట్టు కూడ అవుతుంది. తెలంగాణ కోటి రతనాల వీణా. ఇంత పెద్ద భూభాగం, వివిధ వేషభాషలు, దక్కని హైదరాబాద్ సంస్కృతి బోనాల పండుగా, పిరేల పండుగా, సమక్క, సారక్క స్టేట్ ఫేస్టివల్, ఉత్తర దక్షిణ ప్రాంత కట్టుబొట్టు బౌగోళికంగా ఉత్తర భారతాన్నీ, దక్షిణ భారతాన్ని కలిపే మిశ్రమ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, చారిత్రక నేపధ్యం కూడ అంతే గొప్పది.

భారత దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంత పోరాటం జరిగిందో అంతే పోరాటం తెలంగాణ సాయుద పోరాటంలో జరిగింది. చరిత్ర తెలుసుకోవాలంటే ఔత్సాహిక దర్శకులు పుచ్చల పల్లి సుందరయ్యగారు రాసిన వీర తెలంగాణ సాయుద పోరాట గ్రంధం చదవచ్చు. ఈ చరిత్ర నేపథ్యంలో రంగ్ దే బసంతి లాంటి దేశ భక్తి కథలను బయటికి తీసుకురావచ్చు. తెలంగాణ నేపథ్యంలో కమర్షియల్ సినిమాలు తీస్తే ఆడతాయని కొందరికి అనుమానం రావచ్చు. ఆ అనుమానమే అక్కర్లేదని చెప్పడానికి చిన్న రుజువు ఉంది.

తెలంగాణాలో అల్పా సంఖ్యాకులైనా ముస్లీంలు కేవలం హైదరాబాదీ ముస్లీం సంస్కృతిని ఆధారం చేసుకుని లోకల్ మట్టి వాసనలా సినీ పరిమళాన్ని దక్కని ఉర్దూ శైలిలో అధ్భుత చిత్రాల్ని తెరకెక్కించి దానికి దక్కన్ వుడ్ అని నామకరణం చేసి తమ నావబ్ గిరిని చాటుకుంటుంటే నోరెళ్లబెట్టి చూస్తారు మనవాళ్లు. 2004 లో “ద అంగ్రేజ్” సినిమా తీస్తే దానికి వచ్చిన కలెక్షన్ లు రెండు కోట్లు. సినిమాకైనా ఖర్చు నలభై లక్షలు. అప్పుడు డిజిటల్ సినిమా లేదు. దానిని ఫిలింలోనే తీశారు. కేవలం హైదరాబాద్ లోనే అంత కలెక్షన్స్ వస్తే తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తీస్తే ఎంత కలెక్షన్ లు రావాలి. అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇదంతా చూస్తు చోధ్యం చూడడం తప్పా మనవారిలో చైతన్యం రాదా. హట్స్ ఆఫ్ టు హైదరాబాదీ ముస్లీం.

ఏ కథకైనా నేపథ్యం చాల ముఖ్యం. మంచి కథకు చక్కటి నేపథ్యం కుదిరితే సినిమా రక్తి కడుతుంది. ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా హైలెట్ చేస్తూ తెలుగులో తీసినా సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద కనక వర్షం కురిపించాయి. సమరసింహారెడ్డి, ఒక్కడు, వర్షం అందుకు ఉదాహరణ. కోనసీమ అనేది కోస్తా ప్రాంతంలో ఒక చిన్న ఉప ప్రాంతం. వారి ఆచారాలు, వ్యవహరిక భాష మిగతా ప్రాంతాల వారికంటే కాస్త బిన్నంగా ఉంటాయి. కోనసీమ మీద పూర్తి పట్టు ఉన్న పెద్ద వంశీ గారు చాలా సినిమాలు తీసి హిట్టు కొట్టారు. ఆ చిత్రాలు కోనసీమని కళ్లకి కట్టినట్టు చూపిస్తాయి. వాటిల్లో నేటివిటి, ఆ తెలుగుదనం, పాత్రోచిత సంభాషణ, ఆ మట్టి పరిమళం, ఆ పల్లే సొగసు ఉన్నాయి కాబట్టే లేడీస్ టైలర్ అంతగా ఆడింది.

కోనసీమ లాంటి చిన్న చిన్న ప్రాంతాలు ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ఉన్నాయి. శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, నెల్లూరు పరిసర ప్రాంతాలు, చిత్తూరు ప్రాంతం, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతం ఈ ప్రాంతాలన్నీ యాసభాషలలో జీవన శైలిలో ఒక ప్రాంతానికి మరోక ప్రాంతానికి వ్యత్యాసంలో చాలా తేడా ఉంటుంది. ఆ వ్యత్యాసంలోంచి నేపథ్యం మంచి కథ, పాత్రలు, సంభాషణలు, ఆహార్యం, నటన పుడతాయి. ఒక చిత్ర దర్శకుడికి తను నివసించే ప్రాంతం యొక్క బౌగోళిక తీరు తెన్నులు, పట్టణాలు, పల్లేలు, ముఖ్య ప్రదేశాలు తిరిగి తెలుసుకుంటూనే ఉండాలి. అప్పుడే అతనికి సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. కోస్తా తీరుతెన్నులతో వచ్చిన సినిమాలను ఆధరించిన ఆంధ్ర ప్రేక్షకులు ఇప్పుడు కొత్తగా తెలంగాణ నేపథ్యంతో సినిమాలు నిర్మిస్తే తెలంగాణాలో కన్నా ఆంధ్రాలోనే ఎక్కువ కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముందుగా చెప్పినట్టు ఆంధ్రవాళ్లు సినీ ప్రియులు. బాగుంటే దేన్నైనా చూస్తారు. ప్రాంతంతో పట్టింపు లేదక్కడా. అందుకు నిదర్శనం తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఎర్రసైన్యం, ఓసేయ్ రాములమ్మ చిత్రాలు ఆడి గణ విజయం సాధించాయి.

గత ఐదారు ఏళ్లుగా తెలంగాణ ప్రాంతం నుండి చాలా మంది దర్శకులు వచ్చారు. వీరు కూడ అదే నేపథ్యంలో తీయడం మరీ ముర్ఖత్వం. ఐదారేళ్ల క్రితం ఒక నిర్మాత వరంగల్ నేపథ్యంలో ఒక సినిమా తీసి హిట్ కొడితే ఆ నేపథ్యంలో ఓ ఐదారు సినిమాలు వచ్చాయి. తెలంగాణాలో వరంగల్ తప్పా మరే ఇతర ప్రాంతాలు లేవా. అంటే ఎవరో ఒకరు వెతికి పట్టుకోని ఒక కొత్త నేపథ్యంలో సినిమాలు తీస్తే గాని సదరు దర్శక నిర్మాతలకి అర్ధం కాదు కాబోలు.

ఈ మధ్య ఎనభై, తొంభై దశకాల్లో కామెడియన్ గా మెగస్టార్ హోదాని అనుభవించిన ఒక సినియర్ హీరోతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ఎన్.అర్.ఐ కొత్త దర్శకుడిగా అరంగేట్రం చేస్తు తన భాల్యంలో జరిగిన సంఘటనల స్పూర్తితో ఆ చిత్రాన్ని తెరకెక్కించానని చెప్పుకున్నాడు. చిత్రించిన సినిమా నేపథ్యం కోస్తా ప్రాంతం. సదరు దర్శకుడు పుట్టి పెరిగింది తెలంగాణ గ్రామంలో. ఆ దర్శకుడు తను పుట్టి పెరిగిన ప్రాంత నేపథ్యంలో కథ రాయకుండా కోస్తా నేపథ్యంలో కథ రాశాడంటే ఆ దర్శకుడ్ని తెలుగు సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో దీన్ని బట్టి పాఠకులు అర్ధం చేసుకోవచ్చు. ఈ దోరణి మారితే గాని కొత్త కథలు, కొత్త క్యారెక్టర్లు రావు.

తెలంగాణ, రాయ.లసీమ ప్రాంత నేపథ్యంలో కమర్షియల్ సినిమాలు తీయడం ద్వారా ఇప్పటికి యాభై కోట్లకి చేరినా తెలుగు సినిమా బిజినెస్ ని వంద కోట్ల వరకు తీసుకెళ్లి హిందికి దీటుగా దేశం నడిబొడ్డున తెలుగు సినిమా జెండాని ఎగరెయవచ్చు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో మార్పు రావడం జరుగుతోంది. నవతరం దర్శకులు సంఖ్య కూడ పెరుగుతుంది. ఈ వృద్ది ఇలాగే పెరిగి పెద్దదై తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్లాలని ఆశిద్దాం.

మన జాతి ఆంధ్ర జాతి, మన భాష తెలుగు భాష. ప్రాంతాలు వేరైనా, యాసలు వేరైనా పలికే భాష ఒక్కటే. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు సినిమా ఒక్కటే అని ప్రపంచానికి చాటి చెప్పుతూ ముందుకు నడవాలని ఆశిస్తూ జై తెలుగు సినిమా… జై జై తెలుగు సినిమా.

గమనిక : శేఖర్ కమ్ముల హ్యపీడేస్ ని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా తీసినప్పటికి థియేటర్ లో నాగరాజు క్యారెక్టర్ కి క్లాప్స్ ఈలలు కొట్టడానికి కారణం నేడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రాంతీయ విభేదాలని సున్నితంగా స్పృహించడమే. సమకాలిన కథల సంఘటనల, పాత్రల భావోధ్వేగపు ఫలితం ప్రేక్షకుల కరతాళ ధ్వనులు.

బొమ్మ వేణుగౌడ్

7 Comments
  1. Kriti September 29, 2012 /
    • venugoud September 30, 2012 /
  2. u mallikarjuna September 30, 2012 /
    • venugoud September 30, 2012 /
  3. Indian Minerva October 10, 2012 /
  4. RAJA December 21, 2012 /
  5. ANIL RAZ January 1, 2013 /