కళాత్మక తామరాకు నుంచి అర్బన్ అరిటాకు పైకి…..

sekhar-kammula

కె. విశ్వనాథ్ నుంచి శేఖర్ కమ్ముల వరకూ…

(ఉన్నత వర్గాల ప్రేక్షకుల్ని ఉద్దేశించినదిగా చెప్పబడే తెలుగు క్లాస్ సినిమా 30 ఏళ్ళ పాటుగా చేస్తున్న ప్రయాణాన్ని విశ్లేషిస్తూ సీనియర్ జర్నలిస్ట్, రచయిత జి. ఎస్ . రామ్మోహన్ ద సండే ఇండియన్ కి రాసిన వ్యాసం)

 

శేఖర్ అన్ని ఫంక్షన్లకు నన్ను పిలుస్తూ ఉంటాడు కానీ నాతో సినిమా చేయమంటే మాత్రం చేయడు… ఇది అక్కినేని నాగార్జున మాట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో ఆవిష్కరణ సభలో నిన్నగాక మొన్న చెప్పినమాట ఇది. నాగార్జున ఏదో పైపైకి మాట్లాడి ఉంటారని అనుకోనక్కర్లేదు. నిజంగానే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు కూడా పారితోషికం తగ్గించుకుని శేఖర్‌తో ఒక సినిమా అయినా చేయాలని ఉబలాటపడడం సహజం. ప్రతి జనరేషన్‌లోనూ ఒకరో ఇద్దరో దర్శకులుంటారు. వారు స్పెషల్, యూనిక్, క్లాస్ అనిపించుకుంటారు. హీరోలు వారి సినిమాలో ఒక్కదాంట్లోనైనా నటించాలని కోరుకుంటారు. ఏదో డబ్బుల కోసం ఇటొచ్చాం కానీ మేం కూడా క్లాసమ్మా అనిపించుకోవాలనుకుంటారు. బాక్సాఫీస్ బద్దలవుతున్న రోజుల్లో చిరంజీవి ఆపద్భాంధవుడు, స్వయంకృషి, రుద్రవీణ చేయడం అందులో భాగమే. 90లకు ముందు విశ్వనాథ్‌కున్న ఇమేజ్‌ని ఇపుడు శేఖర్ కమ్ముల భర్తీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే భర్తీ ప్రక్రియ పూర్తి కాకముందే శేఖర్ తన గురించి తాను ఎక్కువ ఊహించుకున్నట్టుగా కూడా అర్థమవుతోంది.

   “ఇక ముందు తెలుగు సినిమా గురించి మాట్లాడేవారెవరైనా లీడర్‌కు ముందు ఆ తర్వాత అని మాట్లాడుకుంటారు..” లీడర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా దర్శకులు శేఖర్ కమ్ముల అన్నమాటలివి. మామూలుగా శేఖర్ సిగ్గరి. పొదుపుగా మాట్లాడే అలవాటున్న వాడు. డబ్బాకొట్టుకునే బాపతు వాడు కాదు. మూడో రోజే డబ్బాలు తిరిగొచ్చినా టీవీ స్టూడియోల కొచ్చి మొకమంతా నవ్వులు పులుముకుని ఈ సినిమాను ఇంతటి సూపర్‌హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు అనే బాపతు కాదు. అయినప్పటికీ అంతకుముందు తెలుగుసినిమా వారెవరూ చేయనంతటి సాహసం చేశాడు. చాలా పెద్దమాట అనేశాడు. అంత (అతి) ఆత్మవిశ్వాసం కలగడానికి కారణం అతనికొచ్చిన పాపులారిటీ. చాలా తొందరగా పెద్ద గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. విశ్వనాథ్ ముప్ఫై ఏళ్ల కృషి తర్వాత కానీ అందుకోని గుర్తింపుని శేఖర్ పదేళ్లలోపే అందుకోగలిగాడు. అందుకు శేఖర్ స్వయంకృషితో పాటు సినిమా రంగంలోనూ బయటా వచ్చిన మార్పులు పనిచేశాయి. అంతకంటే ముఖ్యంగా టీవీ పనిచేసింది. శంకరాభరణం తర్వాత గానీ విశ్వనాథ్‌కు ప్రత్యేక గుర్తింపు రాలేదు. సినిమాలో మన పక్కింటి మనిషి లాంటి హీరో అంతరించి అతనొక ప్రత్యేక జాతిగా అవతరిస్తున్న కాలంలో విశ్వనాథ్ తనకంటూ వేరే ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోగలిగాడు. తెలుగుసినిమా స్వర్ణయుగం నుంచి ఇనుపగజ్జెల తల్లి కాలంలోకి ప్రయాణిస్తున్న సంధికాలంలోని వాడు విశ్వనాథ్. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు ముమ్మరమైన దశ అది. అది ఆరంభమైన తొలిదశలో అంటే 70ల్లో చాలా సినిమాలు ఆ థీమ్‌తో వచ్చాయి. ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమవుతుందన్న బెంగను గ్రామీణ సమాజపు కోణం నుంచి చూపించాయి. సోదరులంతా తిండిమానేసి శకునికి పెట్టినట్టు అంటే పోలిక బాగోదేమో కానీ నలుగురైదుగురు పిల్లలున్న ఇంట్లో అంతా చెమటను నెత్తురు చేసి ఒకడిని చదివిస్తారు. అతను పట్నంలో చదువుకుంటూ కలెక్టరో డాక్టరో అయ్యి అక్కడే పెద్దింటి ఆయన కూతురును పెళ్లి చేసుకుంటాడు. ఆ ఆడబిడ్డ ఆయన్ను పూర్తిగా మార్చేసి అతని కుటుంబానికి ఉపయోగపడకుండా చేస్తుంది. రూరల్ అర్బన్ లైఫ్‌స్టెయిల్స్ మధ్య ఘర్షణను నాటకీయంగా రూరల్ బెంట్ ఆఫ్ మైండ్‌తో చూపించడం ఆనవాయితీ. అప్పటికింకా ప్రేక్షకుల్లో ఎక్కువభాగం బీ క్లాస్ సీ క్లాస్ వాళ్లే. ఇప్పట్లాగా ఆరుక్లాసుల విభజన లేదు. పట్నంలో పెద్ద పార్టీ జరుగుతుండగా తండ్రి సొరకాయో, చేపలో తెస్తే విసిరేయడం తల్లిని పనిమనిషిగా పరిచయం చేయడం లాంటివి కొల్లలు. ఇక్కడి నుంచి మధ్యలో వ్యవస్థపై తిరుగుబాటు చేసే రెబల్ హీరో అనే తాత్కాలిక ఫేజ్‌ని పక్కనబెడితే పెద్ద గెంతు(తో) హీరో రౌడీలను చితకతన్నే దశకే. ఫైట్స్, స్టెప్పులు అనే కొత్తరకం ఫార్ములా ప్రవేశించాక అందులో వెరైటీల కోసం తిప్పలు పడడమే క్రియేటివిటీ అయిపోయింది. ఒకడు పదిమందిని కొడితే ఇంకో హీరో వందమందిని కొట్టాలి. ఒకడు కాలు కిందపెట్టకుండా అందర్నీ గాలిలోనే కొట్టేస్తే ఇంకొకడు కళ్లకు గంతలు కట్టుకుని కొట్టాలి. ఆ తర్వాత టాటాసుమోలను చేత్తో తిరగేయడం, రైళ్లను చేయికూడా పెట్టకుండానే కంటిచూపుతో ఆపేయడం ఇలా తెలుగు సినిమా చాలా దూరమే ప్రయాణించింది. సినిమాలో సెన్సిబిలిటీస్ అంతరిస్తున్న కాలంలో లేట్ సెవెంటీస్‌లో కుటుంబ కథాచిత్రాలు అంతరించి ఈ రకమైన కొత్తరకం హీరో అవతరించాడు. మధ్యతరగతి పాత్రలు పోయి ఒంటి చేత్తో వేలమందిని మట్టి కరిపించే హీరో అవతరించాడు. ఈ పరిణామానికి సంకేతాలుగా రెండు చిత్రాలు కనిపిస్తాయి. హాలీవుడ్ కౌబాయ్ కాపీకాట్ మోసగాళ్లకు మోసగాడు ఒకరకంగా వెస్టర్న్ పంథా చూపితే ఖైదీ మరోరకంగా డాన్స్ ఫైట్స్ డ్రామా ఎలిమెంట్‌ను మేళవించి హిట్ కొట్టింది. ప్రేక్షకుడు తనను తాను ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇండస్ట్రీ పెద్దలు అవగాహనకు వస్తున్న దశ. రియాలిటీ, లాజిక్ అనేవి అవసరం లేదు, తెరమీద మామూలు మనిషిని కాకుండా లార్జర్‌దాన్ లైఫ్ ఇమేజ్‌ని చూపించినా ప్రేక్షకుడు తాను చేయలేని దాన్ని తన చుట్టూ ఉన్నవాళ్లు చేయలేని దాన్ని ఒక అద్భుతం చూసినట్టు చూడగలడు అని గుర్తించిన దశ. హీరోయిన్, కథ రెండూ చిక్కిపోతున  దశ. సినిమా హీరో సెంట్రిక్‌గా మారుతున్న దశ. సినిమా వ్యాపారాత్మక కళనా కళాత్మక వ్యాపారమా అనే పనికిమాలిన చర్చకు ముగింపు పలికి ఇది పచ్చి యాపారం బాబయా, ఇక కళ అంటారా, ఆమెవరు బాబయా అని ప్రశ్నించే స్థితికి చేరుకుంటున్న దశ. సినిమా అంటే కళ కానిది విలువైనది అని గుర్తిస్తున్న దశ. సినిమారంగంలోకి రావడానికి ఏదో ఆకర్షణో మోజో అవసరం లేదు కేవలం లాభార్జన కోసం ఇతరత్రా వ్యాపారాల్లాగే చూడొచ్చు అని డబ్బుతో పులిసిన వారు గుర్తించిన దశ. బొడ్డుమీద యాపిల్ పళ్లు వేయడం ఒక కళారూపంగా మారుతున్న దశ. సినిమాలు అందవిహీనంగా రసహీనంగా మారుతున్నాయని క్లాస్ పీపుల్ వగచు వేళ వాళ్లని కేటర్ చేసే లక్ష్యాన్ని భుజాన వేసుకున్నవాడు కాశీనాధుని విశ్వనాథ్. గ్రామాల్లోని వర్ణసంస్కృతిని ఉన్నతీకరించి చూపడం, అప్పుడప్పుడే పట్నాలకు వలసపోయినవారి నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌ని సంతృప్తిపర్చడం అనే రెండు లక్ష్యాలను భుజానికెత్తుకున్నవాడు విశ్వనాథ్. మౌలికంగా చూస్తే సాహిత్యంలో విశ్వనాథకు ఎలాంటి అభిప్రాయాలున్నాయో సినిమా విశ్వనాథుడికి అవే ఉంటాయి. కాకపోతే విశ్వనాథ మరీ విద్యుత్ ప్రవేశాన్ని, రైళ్ల ప్రవేశాన్ని కూడా వ్యతిరేకించగలిగినంత ఛాందసుడు. సినిమా విశ్వనాథుడు మాత్రం గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని నేరుగా అనకుండా ఉపరితల రిఫార్మ్ రూట్ తీసుకున్నాడు. ఒక రకంగా వివేకానంద స్కూల్ అని చెప్పొచ్చు. కులం పోవాలి అనకూడదు. చిన్న కులాలు పెద్దకులాల ఆధిపత్యాన్ని ధిక్కరించకూడదు. ధిక్కరించడానికి అక్కడ అన్యాయమసలే లేదు. అందరూ ఎవరి ధర్మాలు వారు పాటిస్తూ కలిసి మెలిసి కాపురం చేసుకోవాలి. ఆచరణ చేత ఎవరైనా బ్రాహ్మల మెప్ప పొందొచ్చు. వారికి దగ్గరవ్వచ్చు. అది సప్తపది అయినా, సూత్రధారులైనా, స్వయంకృషి అయినా, శుభసంకల్పం అయినా చెప్పేది ఇదే. ఒకచోట అది యాదవులవ్వొచ్చు. ఇంకొకచోట చెప్పలు కుట్టుకునే దళితులవ్వవచ్చు. మరోచోట జాలర్లవ్వొచ్చు. నువ్వు ధర్మమార్గమువల్ల కానీ చదువువల్ల కానీ వ్యాపారంవల్ల కానీ ఉన్నతుడవై బ్రాహ్మల సరసన చోటు సంపాదించుకోవచ్చు. చదువు వల్ల ఉన్నతుడు కావడం సూత్రధారుల్లోనూ, వ్యాపారం వల్ల ఉన్నతుడు కావడం స్వయంకృషిలోనూ కనపడుతుంది. ధర్మం అనేది అన్ని సినిమాల్లోనూ అంతస్సూత్రంగా ఉంటుంది. ధర్మమార్గమనేదానికి సంప్రదాయ విధివిధానాలను పాటించు మార్గము అని ఇక్కడ అర్థం. ఏం చేసైనా అన్ని చిన్నచిన్నపాయలు వైదిక ధర్మమనే సముద్రంలో కలవాలి. ఒక్క ముక్కలో ఇది సంస్కరణవాదంగా కనిపిస్తూ భూస్వామ్య విలువలను ఉన్నతీకరించి చూపే వ్యవహారం. ఇంటి పెద్ద, ఊరి పెద్ద యాజులు గారిలానే ఉండాలి. ఇంటి ఆవిడ సోమిదేవమ్మ లాగే ఉండాలి. ఆడవాళ్లు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మరీ అవసరమైతే ఇంటిపెద్ద తానో మెట్టుదిగి తక్కువ కులం అమ్మాయిని చేరదీయవచ్చు. అది వారి ఔన్నత్యం. కానీ మహిళలు తాము అలాంటిది కోరుకుని ముందడుగు వేయకూడదు. మార్పు ఉన్నత స్థితిలో ఉన్నవారి ఔదార్యం వల్ల రావాలి తప్పితే ధిక్కారము వల్ల రాదు. పొరబడి సంప్రదాయాన్ని ధిక్కరిస్తే సిరివెన్నెలలో మూన్‌మూన్ సేన్‌కు పట్టిన గతే పడుతుంది. పాత్ర అర్థంతరంగా అంతమవుతుంది. సిగరెట్ తాగే అలవాటున్న (స్మోకింగ్‌ను ఆరోగ్యం అనారోగ్యం చర్చల్లో కాకుండా ధిక్కారం, సంప్రదాయ రాహిత్యం చర్చలో భాగంగా చూడడంలోనే ధర్మసూత్రం ఉంది.) ఇంకా శరీరం భర్తకు మాత్రమే అప్పగించవలెననే నైతికతను పాటించని తనను ధర్మము, సంప్రదాయము ప్రాణములుగా భావించే ఒక కళాకారుడు దేవతలాగా చూడడంతో న్యూనతలో పడి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ధర్మమే శాశ్వతం, పాత్రలు కాదు. సాగర సంగమంలో కూడా ఎన్ని సన్నివేశాలు దగ్గరగా వచ్చినా పరస్పరం ఆకర్షణ, ప్రేమ ఉన్నా కమల్ హాసన్, జయప్రద ఆఖరుదాకా పవిత్రంగా ఉంటారు. అన్ని నాట్యరీతులను కాచి వడపోసిన హీరో ఏమైనా చేస్తాడు కానీ ఆమె కుంకుమ బొట్టు వర్షంలో తడుస్తుంటే మాత్రం చూడలేడు. ఇలాంటి ఉదాహరణలు కొల్లలుగా చెప్పొచ్చు. చివర్లో కమల్‌హాసన్‌ను, జయప్రదను చంపేసే బదులు వారిని కలిపేసి పెళ్లి చేయవచ్చు. కానీ విశ్వనాథవారి సంప్రదాయం అనుమతించదు. సంప్రదాయాన్ని పరిరక్షించేబాధ్యతను ఒక తరాన్నించి మరో తరానికి అందించడం అనేది కూడా విశ్వనాథ్ సినిమాల్లో బలంగా కనిపించే అంశం. సాగరసంగమంలో  సంప్రదాయాన్ని పరిరక్షించే బాధ్యతను కమల్ హాసన్ నుంచి ఆయన శిష్యురాలు శైలజ తీసుకుంటుంది. శంకరాభరణంలో సోమయాజులు నుంచి తులసి తీసుకుంటుంది. సంప్రదాయానికి ప్రతీకలుగా ఆయన తీసుకున్న రూపాలు అంతరించిపోతున్న నృత్య సంగీత రీతులు. వాస్తవానికి ఆ రూపాలు ఆరంభంలో బ్రాహ్మణేతరులవే అయినా 20వ శతాబ్ది తొలినాళ్లలో వాటిని వారు చిన్నచిన్న మార్పులతో ఓన్ చేసుకున్నారు. ఆ రకంగా అవి క్లాస్ కళారూపాలుగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. గ్రామీణ వాతావరణంలో క్లాస్ అంటే సాంస్కృతికంగా పైనున్నవారి వ్యవహారాలే. అదీ కథ. ఆ రెండు కళారూపాలు జనాభాలో ఐదు శాతం కూడా లేని ఒక కులంలోని కొందరిలో ప్రాచుర్యం పొందినవి. గిలకబావి, బాదం చెట్టు వంటివన్నమాట. వాటిని కేవలం నృత్య, సంగీత రూపాలుగా కాకుండా సంప్రదాయానికి సూచికలుగా ఎస్టాబ్లిష్ చేయడంలో అనితర సాధ్యుడు విశ్వనాథ్. అవి ప్రధానంగా కొందరికే పరిమితమయినా ఆ కొందరు సంస్కృతీ సంప్రదాయాలను నిర్వచించగలిగిన స్థితిలో ఉన్నవారు. ఏ రంగంలోనైనా ఆధిపత్య సంస్కృతే సంస్కృతిగా ఉంటుంది. కాబట్టి అది మనందరి మహోన్నత సంస్కృతి అని ప్రచారం చేయడంలో పెద్దలంతా పోటీపడుతూ ఉంటారు. ఇపుడు విదేశాల్లో బాగా స్థిరపడి సొంత సంస్థలు నడుపుకుంటున్న రెండు శూద్రఅగ్రకులాలకు రూట్స్ అనుకున్నప్పడల్లా సంప్రదాయ నృత్యం గుర్తొస్తుంది. రవీంద్రభారతిలో ఫలానా ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి కూచిపూడి నాట్యప్రదర్శన రూపంలో బయటపడుతుంది. మన సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాల్సి అవసరం ఎందుకుందో దాన్ని ఏడేడు సముద్రాలకవతల ఉండి కూడా దాన్ని తామెట్లా ఆచరిస్తున్నామో వారు మనకు ఉపన్యసించగలరు. అట్లా దానికొక యాంటిక్ వాల్యూ ఉంది. దాన్ని ప్రధానవనరుగా తీసుకుని తాను చెప్పదలుచుకున్నది చెప్పిన వాడు విశ్వనాథుడు. అట్లా ఊరికే చెప్పదలుచుకున్నది చెప్పడం వల్ల మాత్రమే గుర్తింపు రాదు. ఎలా చెప్పాలో తెలిస్తేనే వస్తుంది. ఆ టెక్నిక్ తెలిసినవాడు విశ్వనాథ్. మానవసంబంధాలు, అందులో ఉద్వేగాలు తెరపై శక్తిమంతంగా ఆవిష్కరించగల నేర్పరి. ఎంత నేర్పరి అంటే ఆయన భుజానకెత్తుకున్న విలువలను వ్యతిరేకించే వారు కూడా సినిమా చూసి అరే భలే తీశాడే అనుకునేంత నేర్పరి. బాలచందర్, మణిరత్నంలాంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్. కాకపోతే బాలచందర్‌లో వ్యవస్థీకృత విలువలపై ధిక్కారం ఉంటుంది. విశ్వనాథలో సామరస్యం ఉంటుంది. వరకట్నం లాంటి అందరూ ‘బాహాటంగా’ వ్యతిరేకించే సబ్జెక్ట్‌ని ముట్టుకున్నా విమర్శ కటువుగా లేకుండా ఉండడం కోసం కామెడీ చేసి తేల్చేస్తాడు.

   విశ్వనాథ్ సినిమా గ్రామర్ తెలిసినవాడు. మౌనం విలువ తెలిసినవాడు. మాటల కంటే దృశ్యాలతో ఎక్కువ మాట్లాడిస్తేనే అది శక్తిమంతంగా ఉంటుంది అని ఎరిగినవాడు. జయప్రద వేరే వారి చిత్రాల్లో ఆ మాదిరి మౌనమేలనోయి అంటే అది బూతు అయిపోయేది. విశ్వనాథ్ ఎరోటికాగానే మిగిల్చారు. సాధారణ మెలోడ్రామాగా తేలిపోయే సీన్లు కూడా విశ్వనాథ్ చేతిలో పడితే కళాత్మకతను సంతరించుకుంటాయి. తల్లి ఆస్పత్రిబెడ్ మీద మరణిస్తూ ఉంటే కుమారుడు పూనకం వచ్చినట్టు డాన్స్ చేయడం ఇంకొకరి చేతుల్లోనైతే అభాసుపాలయ్యేది. ప్రత్యేకించి విలన్లు, హీరోలు అంటూ ఎవరూ ఉండరని రెండూ మనమేనని ధర్మసూక్ష్మం ఎరిగినవాడు విశ్వనాథ్. సూత్రధారుల్లో కొద్దిగా విలన్ షేడ్ ఉన్నా అక్కడ ఆ పాత్రను సింపుల్‌గా రిఫార్మం చేసి పడేస్తాడు. సామాజిక స్థితిగతుల గురించి అవగాహన ఉన్న వారంతా మంచి చెడూ వేర్వేరుగా ఉండవని గుర్తిస్తారు. కాకపోతే నిజమైన మార్పును కోరుకునేవారు ఆ మనిషి చెడుగా మారడానికి ఉన్న పరిస్థితులను నిర్మూలిస్తే తప్ప సమాజం మారదని అనుకుంటారు. విశ్వనాథ్ లాంటివారు సున్నితంగా చెపితే కూడా మార్పు సాధ్యమని నమ్మబలుకుతారు. ఆ మార్పు కూడా ముందుకు కాకుండా వెనక్కి చూపిస్తారు. ధర్మో రక్షతి రక్షిత: అనుకుంటారు. అదీ తేడా. విశ్వనాథ్ సున్నితంగా కాకుండా కాస్త బండగా చెప్పిన సందర్భం ఒక్కటే. అది స్వర్ణకమలం. అందులో వేద పండితులైన ఘనాపాఠిలకు లౌకిక పరమైన ఆఫీసుల్లో తగిన గౌరవం ఇవ్వకపోవడంపై వెంకటేశ్ చాలా ఆవేశపడతాడు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చిన్నపాటి ఉపన్యాసం కూడా ఉంటుంది. విశ్వనాథ్ కడుపు చించుకుని తన ఆక్రోశాన్ని తన అభిప్రాయాలను సూటిగా కోపంగా చెప్పింది బహుశా ఇదే సందర్భంలోనేమో. సినిమాకు కెప్టెన్ అయిన దర్శకుడి ప్రతిభ పాత్రధారుల ఎంపికలోనూ టీమ్ ఎంపికలోనూ బయటపడుతుంది. విశ్వనాథ్ మెజారిటీ సినిమాల్లో పనిచేసిన నటీనటులు, మాటల రచయితలు, పాటల రచయితలు, ఇతర టెక్నీషియన్స్ ఆయా రంగాల్లో పండితులు. భావానికి తగ్గ ఫీల్ ఇవ్వగల నేర్పరులు. సినిమా కేవలం డబ్బు, పేరు సంపాదించి పెట్టే సాధనం కాదు, అది కళాత్మక సాధనం కూడా అనే ఎరుక ఉండడం, మంచి టెక్నీషియన్ కావడం, వీటితో పాటుగా కొన్ని బలమైన అభిప్రాయాలు కలిగి ఉండడం విశ్వనాథ బలం. ఈ లక్షణాలు జమిలిగా ఉన్నవారెవరైనా ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. విశ్వనాథ్ వారసుడిగా ఇపుడు మనం చెప్పకుంటున్న శేఖర్ కమ్ములకు కూడా ఆ చివరిది తప్ప మిగిలిన లక్షణాలు కొద్దోగొప్పో ఉన్నాయి. ఆ చివరి లక్షణం లేకుండా కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలగడం అనేది 90ల తర్వాత మారిన సామాజిక వాతావరణం వల్ల సాధ్యమైంది. సారం కంటే రూపం ముఖ్యమైపోయిన దశ కదా!

డాలర్ డ్రీమ్స్‌లాంటి బాలారిష్టాలను పక్కనబెడితే శేఖర్ తన రాకను ఘనంగా చాటింది ఆనంద్‌తోటే. అయితే ఇతని సినిమాలు చూసినపుడు మనకి కలిగే ఇంప్రెషన్స్ ఏంటని అడిగితే మాత్రం తడుముకోకుండా జవాబు చెప్పడం కష్టం. క్లీన్, సెన్సిబుల్… అని మూడో పదం కోసం నీళ్లు నమలాల్సిందే. ఆ రెండు మాత్రం చెప్పడానికే లేదు. శేఖర్ రంగం మీదకు దూసుకొచ్చేసరికి అర్బనైజేషన్ కీలకమైన దశకు చేరుకుంది. అర్బన్ మిడిల్‌క్లాస్ ఒక పెద్ద క్లాస్‌గా అవతరించింది. ఇంటర్నెట్ పుణ్యమా అని వరల్డ్ ఎక్స్‌పోజర్ వచ్చింది. మల్టీప్లెక్స్‌లు కూడా వచ్చేశాయి. హెలికాఫ్టర్లు, సుమోలు లేపకుండా మామూలు మనుషులతో మామూలు లొకేషన్స్‌లో ఒళ్లు దగ్గరపెట్టుకుని బడ్జెట్ అదుపులో ఉంచుకుని సినిమా తీస్తే పెట్టిన డబ్బులు తిరిగొస్తాయనే నమ్మకాన్ని ఈ కొత్త మార్కెట్ ఇచ్చింది. దీంతో కాస్త చదువుకున్నవారు, సినిమా మీద నిజంగా ప్రేమ ఉన్నవారు రావడానికి మార్గం సుగమమైంది. ఈ కొత్త వాతావరణం దేశమంతా ఉంది. దిల్ చాహ్‌తాహై తర్వాత హిందీలో ఎన్ని మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయో చెప్పలేం. 70లు, 80 మనలాగే వాళ్లకు ఇనుపదశ అయినప్పటికీ ఆయా కాలాల్ని పట్టించే సినిమాలు ప్రతిదశలోనూ ఉన్నాయి. చష్మే బద్దుర్ నెహ్రూవియన్ ఆర్థిక విధానాల కాలాన్ని కళ్లకు కడితే దిల్ చాహ్‌తాహై 90ల తర్వాత మారిన భారతాన్ని చూపుతోంది. మన సినిమా దేన్ని పట్టిస్తుంది అంటే చెప్పడం కష్టం.

   ఇది వేలు, ఇది కాలు మడిస్తే వలిచేస్తా నీ తోలు వంటి బండ డైలాగులతో విసుగెత్తిపోయి ఉన్న అర్బన్ క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని ఇవాళ శేఖర్ లాంటి కొత్త దర్శకుస్తున్నారు. కొత్తగాలి వీస్తోంది. కాకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ సమస్య. థియేటర్ల సమస్యలైతే ఉన్నాయి. అవింకా పెద్దోళ్ల చెరలోనే ఉన్నాయి. ఏదో తిప్పలు పడి ఒక సినిమాను హిట్ అనిపించుకుంటే తప్ప ఈ హర్డిల్‌ను కొంతవరకైనా దాటలేరు. ఆనంద్‌తో ఆ హర్డిల్ దాటేశాడు శేఖర్. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలకు టానిక్ లాగా పనిచేసింది ఈ సినిమా. సెన్సిబిల్ అనే ముద్రపోకుండా ఈ హిట్ అనే బ్రహ్మపదార్థాన్ని చేరుకోవడానికి కొత్తతరం దర్శకులు చాలా విన్యాసాలే చేస్తున్నారు. ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్‌ను జోడించడమో లేక కమర్షియల్ వాల్యూ ఉన్న నటీనటులను ఆశ్రయించడమో చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల సమస్యలు రాకుండా ఉండడం కోసం ఫలానా బాబుగారినో వారి వారసులనో ఆశ్రయిస్తున్నారు. తమ ప్రొఫైల్‌లో ఇలాంటి సినిమాలు కూడా ఒకట్రెండు ఉండాలని వారు కూడా కోరుకుంటూ ఉండడం వల్ల కొందరికి అవకాశం లభిస్తోంది.

   శేఖర్ ఏం చేశాడు? తెలుగు సినిమాలో కరవైపోయిన నేటివిటీని పట్టుకొచ్చాడు. మామూలుగా ఎంత చెత్త తమిళ సినిమా చూసిన అది తమిళ సినిమా అని తెలిసిపోతుంది. కానీ తెలుగు సినిమాలో తెలుగుదనం అనేది దుర్భిణీ వేసి వెతికినా కనిపించదు. తెలుగుదనానికి కమర్షియల్ తెలుగు దర్శకులకు బొత్తిగా పడదనుకుంటా. ఈ గ్యాప్‌ని భర్తీ చేశాడు ఆనంద్. అలాగే చాలాకాలం తర్వాత విమెన్ కేరక్టర్‌ని బలంగా చూపించాడు. బలంగా అనగానే తిరుగుబాటు లాంటి వ్యవహారాల జోలికిపోకుండా మామూలు దైనందిన జీవితంలో కూడా మహిళ ఆత్మవిశ్వాసంతోనూ, ఆత్మగౌరవంతోనూ ఉండగలరని చూపించాడు. ఎలాంటి అభూత శక్తులు లేని మన పక్కింటి అబ్బాయిని తెరకెక్కించి అక్కడా మార్కులు కొట్టేశాడు. మామూలుగా నేటి అర్బన్ యూత్‌కి ఇష్టమైన పర్యావరణం వగైరాలను పనిలో పనిగా చూపించాడు. అర్బన్ యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో వారు ఇబ్బందిపడే సబ్జెక్ట్‌ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. చివరకు రాగింగ్‌ను కూడా ఒక నేరంగా కాకుండా అదుపులో ఉంటే ఫర్వాలేదన్న ధోరణిలోనే చూపించాడు. టీచర్ పాత్రను చాలా సినిమాలు వల్గరైజ్ చేస్తున్న వేళ అదే టీచర్ పాత్రకు స్టూడెంట్‌కి మధ్య ఇన్‌ఫాక్చుయేషన్ పెట్టి కూడా అది హద్దులు దాటకుండా చూడగలిగాడు. ఒక రకంగా యువదర్శకులకు ఉండే బడ్జెట్ పరిమితులే వారికి వరంగా కూడా పరిణమించాయి అని చెప్పొచ్చు. కాస్త తెలుగు దనాన్ని చూడగలుగుతున్నాం.

   శేఖర్ అర్బన్ యూత్ ఆశలను ఆకాంక్షలను సెన్సిబిలిటీస్‌ని చూపగలిగాడు. ఫీల్ గుడ్ మూవీస్ డైరక్టర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కొంతమందికి మాత్రమే పరిమితమైన రియాలిటీని రొమాంటిసైజ్ చేసి చూపాడు. సమాజంలోని వైరుధ్యాలతో అతనికి పెద్దగా సంబంధం లేదు. కాసేపు ఏ ఇబ్బందిలేని కాలక్షేపంగా మాత్రమే సినిమాని చూస్తే అతనితో ఇబ్బంది ఉండదు. పాప్ కార్న్ మనకు మంచిదా చెడ్డదా అంటే ఏం చెపుతాం. పీచు ఆరోగ్యానికి మంచిదే అని తప్ప. టీవీలాగే మనల్ని ప్రశ్నించని డిస్ట్రబ్ చేయని ఆలోచనలు రేపని కాలక్షేపాన్ని కోరుకునే వారు ఈ జనరేషన్‌లో చాలామందే ఉన్నారు. సమాజంలోని వైరుధ్యాలు, రాజకీయాలు, ఆధిపత్యాలు, సమానత్వ ఆరాటపోరాటాలు లాంటివేవీ ఆయన సినిమాల్లో కనిపించవు. లోతైన భావాలు కానీ ఆలోచనలు కానీ ఉండవు. బహుశా అదే ఇవాల్టి యూత్‌కు కూడా కావాల్సింది. పుస్తకాలతో కాకుండా టీవీతో వీడియోగేమ్స్‌తో సహవాసం చేసిన జనరేషన్‌కు, అందుబాటులో ఉన్న అన్ని ఆనందాలు త్వరత్వరగా పొందేయాలనే ఆరాటం ఉన్న జనరేషన్‌కు, పోస్ట్ స్టూడెంట్స్ యూనియన్ జనరేషన్‌కు ఉన్న సెన్సిబిల్ ఆప్షన్ శేఖర్.

   కాకపోతే లీడర్‌ను తన మాగ్న ఓపస్‌గా చెప్పకున్నాడు శేఖర్. తనకూ కొన్ని విశాల లిబరల్ భావాలున్నాయని చెప్పకుంటే పర్వాలేదు. ఆ సినిమాతో భరతమాత ఆనందతాండవం చేస్తుందని చెప్పాడు. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థకు పాజిబుల్ సొల్యూషన్ అని కూడా అన్నాడు. కానీ సినిమా అతన్ని అంతకుముందున్న స్థితినుంచి వెనక్కునెట్టింది. అతని అవగాహన ఇమ్మెచ్చురిష్ అని అర్థం చేసుకోవడానికి పెద్ద మేధావిత్వమేమీ అక్కర్లేదు. తండ్రి అవినీతితో సంపాదించిన వేల కోట్ల రూపాయలతో గద్దెనెక్కి నీతిమంతమైన వ్యవస్థను నెలకొల్పుతాననే లీడర్‌ను ప్రేక్షకులు ఆమోదించి ఆనంద తాండవం చేస్తారనుకోవడంలోనే అమాయకత్వముంది. సినిమా తీయగల నేర్పు, మరీ దిగజారి ఆలోచించకుండా మధ్యతరగతిలోని లిబరల్ సైడ్‌ని చూపించగలగడం వంటి కారణాలు తప్పితే శేఖర్ సినిమాల్లో భావ ధార అయితే కనిపించడం లేదు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల సినిమాల్లో పూసలో దారంలాగా ఒక ధార ఉంటుంది. అది శేఖర్ సినిమాల్లో లేదు… అర్బన్ సెన్సిబిలిటీస్ తప్ప. అదే ప్రత్యేకత అయితే ఇవాళ చాలామందే కనిపిస్తున్నారు. నందినీ రెడ్డి, నీలకంఠ, జాగర్లమూడి క్రిష్ లాంటివారు అదే బాటలో పయనిస్తున్నారు. గమ్యంలో ఉన్నపాటి సిన్సియారిటీ వేదంలో లేకపోయినా క్రిష్‌లో ఒక భావధార అయితే కనిపిస్తోంది. పూర్తి ఫార్ములా సినిమాలే తీసిన త్రివిక్రమ్‌లో కూడా లోతైన ఆలోచనలు ఉన్నట్టు అర్థమవుతుంది. మహేశ్ బాబును, ఫార్ములా మసాలాను పెట్టి కంగాళీ చేయకుండా సిన్సియర్‌గా చేసి ఉంటే ఖలేజా మంచి సినిమా అయ్యుండేది. ఏమైనా అర్బన్ సెన్సిబిలిటీస్‌ని గుర్తించిన దర్శకుడిగా ఆ పంథాకు మార్గనిర్దేశనం చేసినవాడిగా గుర్తింపు అయితే శేఖర్‌కు ఉంది. ఎలాంటి భావధారలేకపోయినా అర్బన్ యూత్‌లో ఐకాన్ స్టేటస్ రావడం ఇవ్వాల్టి సామాజిక స్థితికి సంకేతం. భావజాలం అనేదాన్ని భారంగా చూస్తున్న తరానికి అవసరమైన ఎంటర్‌టెయిన్‌మెంట్ ఇచ్చే సెన్సిబిల్ సినిమా వ్యాపారి శేఖర్. కారణమేదైనా కావచ్చు. ఇరవైయేళ్ల క్రితం సినిమా రంగంలో విశ్వనాథ్‌కు ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉండేవో అలాంటివన్నీ ఇవాళ శేఖర్‌కు ఉన్నాయి. ఈ ఇరవై యేళ్లలో వచ్చిన మార్పులు ఒక పెద్దమనిషిని నోస్టాల్జియాగా మార్చేశాయి. మరొక మనిషిని ఆ సీట్లో కూర్చోబెట్టాం. ధోవతి, పంచెకట్టున్న పల్లెటూరి పంతులు గారి స్థానాన్ని జీన్స్ వేసుకున్న పట్నపు కుర్రాడు ఆక్రమించారు. కాకపోతే శేఖర్ లాంటివాళ్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. పేరు ప్రతిష్టలకు సంబంధించి గతానికి వర్తమానానికి తేడా ఉంది. పాత రోజుల నాటి కీర్తి పాతపాటల్లాంటిది. జనం నోళ్లలో నానుతూనే ఉంటుంది. ఇవాల్టి ఫేమ్ ఇవాళ్టిపాట లాంటిది. నాలుగురోజులు ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది. ఐదో రోజు కనుమరుగవుతుంది. అంతా ఇన్‌స్టంటే. ఫేమ్ కూడా ఇవాళ ఎప్పటికప్పడు రీచార్జ్ చేసుకోవాల్సిన విషయమే.

– జి.ఎస్.రామ్మోహన్

21 Comments

21 Comments

 1. kumar

  September 5, 2012 at 5:54 pm

  vishwanth gariki shekharkammulaki polikenti babu?

  rendu jamalettina sagarasangamam lanti movie tiyaledu.

 2. Sowmya

  September 5, 2012 at 9:04 pm

  >>90లకు ముందు విశ్వనాథ్‌కున్న ఇమేజ్‌ని ఇపుడు శేఖర్ కమ్ముల భర్తీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది
  – :O really??

  అసలుకి వీళ్ళిద్దరూ తీసే సినిమాల మధ్య గానీ, వ్యక్తులుగా వీళ్ళ మధ్య గానీ ఏమన్నా పోలికలు ఉన్నాయంటారా? శేఖర్ ని విమర్శించాలి అనుకుంటే స్వతంత్రంగా విమర్శించాలి కానీ, మధ్యలో కే.వి. ప్రస్తావన, పోలిక అనవసరం ఏమో అనిపించింది.

 3. sunitha

  September 6, 2012 at 12:11 am

  నేను నవ్వలేక చస్తున్నా…. విశ్వనాధ్ గారితో శేఖర్ కమ్ముల పోలికేంటండి బాబు?
  నా వరకు అయితే “నక్క – నాగలోకం”
  వ్యాసంలో విశ్వనాధ్ గారి చిత్రాల గురించి బాగా విశ్లేసించారు. ముఖ చిత్రంగా విశ్వనాథ్ గారి ఫోటో పెట్టుంటే చాలా సంతోషించేదానిని.

  • naresh nunna

   September 7, 2012 at 7:07 am

   @sunitha: మీ పోలిక respectively అనుకోవచ్చా? విశ్వనాథ్- శేఖర్ : నక్క- నాగలోకం!
   Btw, నాగలోకం కాదు, నాకలోకం అంటే, స్వర్గ లోకం, Heaven, Elysium, Paradise,
   న+అకము = నాకము = దుఃఖము లేమి.
   “దురిత చయంబులందొలఁగఁద్రోవఁగఁ జాలు ప్రధాన కర్త కుత్తరగతి లాభవైభవము తంగెటి జున్నుగఁ జేయు గోవులెవ్వరు దగ వీనిఁగొల్తురని వారలఁ జొత్తురు వారు నాకమున్‌.

 4. shiva

  September 6, 2012 at 2:41 pm

  vistanath garito sekhar polchadam chaala baadhakaram.
  Sekhar kammula visualga kontameaningful ga teestaaru antavarake.
  viswanath gari gurimchi varnimdaaniki maatalu chalav.
  inkosaari aalochinchi comparison cheyyamdi

 5. aripirala

  September 6, 2012 at 4:01 pm

  శేఖర్ కమ్ములని విశ్వనాధ్ తో పోల్చడం గురించి ఎందుకు ఇంత మంది ఇబ్బంది పడిపోతున్నారో నాకు అర్థం కావడంలేదు. గమనించండి – శేఖర్ సినిమాలని విశ్వనాథ సినిమాలతో పోల్చలేదిక్కడ. ఒక మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా ప్రేక్షకులకి కొత్త పంథా చూపించినవారిగా ఇద్దరినీ పోల్చారు అంతే. అయితే విశ్వనాధ్ కి వున్న స్పష్టత, బలమైన ఆదర్శం శేఖర్ కమ్ములలో లేవని స్పష్టంగా చెప్పారు రచయిత. అప్పటి పరిస్థిలో అలా బలమైన ఆదర్శాన్ని, ఎవరినీ నొప్పించని సొల్యూషన్స్ ని కోరుకునే జనం వల్ల విశ్వనాథుడు హీరో అయ్యాడనీ, ఇప్పుడు ఎలాంటి సమస్యల గురించీ ఆలోచించని తరం వల్ల శేఖర్ హీరో అయ్యాడనీ చెప్పారు. బలమైన ఆదర్శాం (సరైనదైనా తప్పైనా) లేకపోతే ఆ స్టార్‌డం నిలబడటం కష్టమని శేఖర్ కమ్ములకి హెచ్చరిక కూడా వినిపిస్తోంది నాకు. ఒక ఇంటలెక్ఛువల్ వ్యాసం. మళ్ళీ మళ్ళీ చదివితే కాని అర్థంకాని రహస్యాలు చాలా వున్నాయి.

  • Truthful

   September 29, 2012 at 1:12 am

   1.I second you on this.

   2.బలమైన ఆదర్శాం: yes, the lack of this in Sekhar (with clear understanding of his immaturity in Leader) is the reason for some people saying “What nonsense? What’s this comparison i say” . Because, this section of audience,perpahs, is large enough and shift their mind set between viswanath, sekhar, v v vinayak and puri jaganth without any difficulty, and has been the patronage of telugu cinema.

 6. Brahma

  September 6, 2012 at 4:30 pm

  విశ్వనాధ్ గారికి శంకర భరణం ఎన్నో చిత్రం? శేఖర్ ఇప్పటివరకు ఎన్ని చిత్రాలు చేసాడు. రెండు వేరు వేరు కాల క్రమాలలో పని చేసిన ఇద్దరి మధ్య పోలిక తేవడం రచయిత లోని అమాయకత్వం తెలియజేస్తోంది. ఏ దర్శకుడయినా అప్పటి కాలానికి తగ్గట్టు, అప్పటి ప్రజల ఆలోచలనకు తగ్గట్టు మాత్రమె తీయగలడు. మరి ఇంకాస్త పాత తరం వారు విశ్వనాధ్ గారిని ఏ బీ యెన్ రెడ్డి తోనో పోలిస్తే ఆయన చేసిన చిత్రాలు కాని ఆయన పని కాని తక్కువ కావు కదా . నాకు తెల్సి శేఖర్ తను పెరిగిన, బ్రతికిన పరిస్థితుల ప్రభావం తో, తను చూసిన/చూడాలనుకున్న జీవితాన్ని ఆవిష్కరించారు. శేఖర్ సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు అన్నది ఎంత నిజమో శేఖర్ లో ప్రతిభ ఉన్న మాట అంత నిజం. ఇక పోతే లీడర్ సమయం లో శేఖర్ అన్న మాట కు అంత ప్రాముఖ్యత ఇవ్వడం అవసరమా. లీడర్ చాల మందికి నచ్చకపోయి ఉండవచ్చు కాని…. మీకు నచ్చక పోయి ఉండొచ్చు కాని…తూలనాడదగ్గ సినిమా అయితే కాదు .

 7. K మహేశ్ కుమార్

  September 6, 2012 at 7:05 pm

  మొదట్లో ఉన్న బ్రాకెట్లోనే “క్లాస్” సినిమా నిర్వచనం, మేకర్స్ పరిథిలో చర్చిస్తున్నట్టు వ్యాసకర్త చెప్పేసాడు. ఇక ఇష్యు ఏమిటి? అప్పటి క్లాస్ సినిమాల కర్త కె.విశ్వనాథ్ ఇప్పుడు క్లాస్ దర్శకుడిగా పేరుతెచ్చుకుంటున్న మేకర్ శేఖర్ కమ్ముల. ఇక వీరిద్దరి మధ్యా కంపేరిజన్ కాకపోతే విశ్వనాథ్ కూ వివి వినాయక్ కూ పోలిక తెస్తారా? అప్పటి విశ్వనాథ్ ఆడియన్స్ బేస్ ఇప్పటి శేఖర్ ఆడియన్స్ బేస్ కూడా ఒక్కటే. అప్పుడు లేని విలువలని పూజించడానికి, ముఖ్యమని అనుకోవడానికి ఆయన సినిమాలు చూస్తే, నిజజీవితంలో ఖచ్చితంగా లేవని, పాటించడం లేదని తెలిసిన మధ్యతరగతి నొస్టాల్జియా సిన్సియారిటీ పూత శేఖర్ ది. దొందుదొందే. కాబట్టి కంపేరిజన్ రైటే! 🙂

  • Truthful

   September 29, 2012 at 1:20 am

   1.అప్పటి విశ్వనాథ్ ఆడియన్స్ బేస్ ఇప్పటి శేఖర్ ఆడియన్స్ బేస్ కూడా ఒక్కటే.- Can you please elaborate?

   2. అప్పుడు లేని విలువలని పూజించడానికి, ముఖ్యమని అనుకోవడానికి ఆయన సినిమాలు చూస్తే, – this i think i have understood, but
   నిజజీవితంలో ఖచ్చితంగా లేవని, పాటించడం లేదని తెలిసిన మధ్యతరగతి నొస్టాల్జియా సిన్సియారిటీ పూత శేఖర్ ది – I did not get this second part. can you please explain.

 8. krshany

  September 8, 2012 at 12:09 am

  ఈ మధ్య చదివిన సినీవ్యాసాలలో చాలా సాధికారికంగా ఉన్న వ్యాసం ఇదేనేమో… చాలా విపులీకరించారు వ్యాసకర్త… బహుశా విశ్వనాథ్ చిత్రాలని ఆయన భావాలను చాలా చక్కగా అర్థం చేసుకుని వివరించారు… వ్యాసకర్త మీద అర్థం లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వారు తిరిగి ఈ వ్యాసం చదవగలరు….

 9. వేలమూరి శ్రీరామ్

  September 10, 2012 at 5:06 pm

  శేఖర్ కమ్ముల తో విశ్వనాథ్ గారి పోలికల సంగతి పక్కన పెడితే ,రచయిత కు
  విశ్వనాథ్ గారి సినిమా ల మీద ఉన్న సాధికారత స్పష్టం గా ఈ వ్యాసం లో
  కనపడింది , విశ్వనాథ్ గారి వీరాభిమానులు సైతం ఇంత పరిశీలనగా (పాజిటివ్
  గా ఐనా )రాసే అవకాశం లేదు . మంచి రచన .

 10. g s rammohan

  September 19, 2012 at 7:25 pm

  సండే ఇండియన్‌ సంపాదకుడు నున్నా నరేష్‌కి, నవతరంగం వారికి, స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. నేనేదో సినిమా మీద అధారిటీ అనే భ్రమలేమీ లేవు. నాకు తెలిసింది తక్కువ. నేను చూసిందీ తక్కువే. కాకపోతే సినిమాను సామాజిక కోణం నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని చాలాకాలంగా భావిస్తున్నాను. ఈ రంగంతో లోతైన అనుబంధం ఉన్నవారు ఆ పనిచేస్తే బాగుండునని ఎదురుచూస్తూ ఉన్నాను. సినిమా జనాన్ని ప్రభావితం చేసే శక్తిమంతమైన మీడియా కాబట్టి సీరియస్‌ పీపుల్‌ ఆ పనిచేస్తే బాగుండునని కూడా అనుకుంటున్నాను. అపుడెపుడో రాజీవ్‌ క్షణక్షణం మీద చేసిన విమర్శ, హరిగారు రాసిన వ్యాసం లాంటివి మినహాయిస్తే అటువంటి విశ్లేషణలు పెద్దగా కనిపింవచడం లేదు. ఆ లోటు లోటుగానే ఉండిపోతున్నది. అందువల్లే నాకు తెలిసిన పరిజ్ఞానంతో చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువభాగం జ్ఞాపకశక్తిమీద ఆధారపడిన పరిశీలనలే. అందులో ఎక్కడైనా ఒకట్రెండు ఫాక్చువల్‌ మిస్టేక్స్‌ కూడా ఉంటే ఉండవచ్చును. ఉదాహరణకు శేఖర్‌ కమ్ముల ఇకముందు సినిమా చరిత్ర గురించి మాట్లాడేవారు లీడర్‌కు ముందు ఆ తర్వాత అని మాట్లాడుకుంటారు అన్నట్టు రాశాను. ఆయన అలా అనలేదని సినిమా బదులు పొలిటికల్‌ సినిమా అనేపదం వాడారని తెలిసింది. అది నా పొరబాటే. ఇక అభిప్రాయాలు, విశ్లేషణ అనేవి మనం నమ్మే విషయాలమీద మన భావజాలం మీద ఆధారపడి ఉంటాయి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చును. సినిమా రంగాన్ని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో చర్చించాలనుకునే వారికి నవతరంగం చక్కని వేదిక అని నమ్ముతున్నాను. “సినిమాలు-మనవీ వాళ్లవీ” ప్రచురణ సినిమా మీద ఎంతో ప్రేమ ఉంటే ఉంటే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. సినిమా గురించి ఆరోగ్యకరంగా ఆలోచించేవారు ఇంతమంది ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగిస్తున్నందుకు భవిష్యత్తుపై ఆశను వెలిగిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
  జి ఎస్‌ రామ్మోహన్‌

 11. g s rammohan

  September 19, 2012 at 7:26 pm

  సండే ఇండియన్‌ సంపాదకుడు నున్నా నరేష్‌కి, నవతరంగం వారికి, స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. నేనేదో సినిమా మీద అధారిటీ అనే భ్రమలేమీ లేవు. నాకు తెలిసింది తక్కువ. నేను చూసిందీ తక్కువే. కాకపోతే సినిమాను సామాజిక కోణం నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని చాలాకాలంగా భావిస్తున్నాను. ఈ రంగంతో లోతైన అనుబంధం ఉన్నవారు ఆ పనిచేస్తే బాగుండునని ఎదురుచూస్తూ ఉన్నాను. సినిమా జనాన్ని ప్రభావితం చేసే శక్తిమంతమైన మీడియా కాబట్టి సీరియస్‌ పీపుల్‌ ఆ పనిచేస్తే బాగుండునని కూడా అనుకుంటున్నాను. అపుడెపుడో రాజీవ్‌ క్షణక్షణం మీద చేసిన విమర్శ, హరిగారు రాసిన వ్యాసం లాంటివి మినహాయిస్తే అటువంటి విశ్లేషణలు పెద్దగా కనిపింవచడం లేదు. ఆ లోటు లోటుగానే ఉండిపోతున్నది. అందువల్లే నాకు తెలిసిన పరిజ్ఞానంతో చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువభాగం జ్ఞాపకశక్తిమీద ఆధారపడిన పరిశీలనలే. అందులో ఎక్కడైనా ఒకట్రెండు ఫాక్చువల్‌ మిస్టేక్స్‌ కూడా ఉంటే ఉండవచ్చును. ఉదాహరణకు శేఖర్‌ కమ్ముల ఇకముందు సినిమా చరిత్ర గురించి మాట్లాడేవారు లీడర్‌కు ముందు ఆ తర్వాత అని మాట్లాడుకుంటారు అన్నట్టు రాశాను. ఆయన అలా అనలేదని సినిమా బదులు పొలిటికల్‌ సినిమా అనేపదం వాడారని తెలిసింది. అది నా పొరబాటే. ఇక అభిప్రాయాలు, విశ్లేషణ అనేవి మనం నమ్మే విషయాలమీద మన భావజాలం మీద ఆధారపడి ఉంటాయి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చును. సినిమా రంగాన్ని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో చర్చించాలనుకునే వారికి నవతరంగం చక్కని వేదిక అని నమ్ముతున్నాను. “సినిమాలు-మనవీ వాళ్లవీ” ప్రచురణ సినిమా మీద ఎంతో ప్రేమ ఉంటే ఉంటే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. సినిమా గురించి ఆరోగ్యకరంగా ఆలోచించేవారు ఇంతమంది ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగిస్తున్నందుకు భవిష్యత్తుపై ఆశను వెలిగిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • Truthful

   September 29, 2012 at 1:58 am

   విశ్వనాథ్ వారసుడిగా ఇపుడు మనం చెప్పకుంటున్న శేఖర్ కమ్ములకు కూడా ఆ చివరిది తప్ప మిగిలిన లక్షణాలు కొద్దోగొప్పో ఉన్నాయి.
   ఆ చివరిది – yes, is not there.
   మిగిలిన లక్షణాలు – many people have got కొద్దోగొప్పో
   Hence, మనం విశ్వనాథ్ వారసుడిగా శేఖర్ కమ్ములను చెప్పkOmu. Who has called him varasudu sir!?
   But there are many other interesting things i would like to ask you.
   1.What/which should be called as Class movie?
   2. I understood that you feel ‘Apple-on-Navel’ is not Art and not Class. Why do you feel so? If my understanding is wrong, please do correct me.
   3. What is the 6 class division?

 12. చంద్రం

  September 20, 2012 at 9:39 pm

  శేఖర్ కమ్ములని కె.విశ్వనాథ్ తో పోల్చడం…అనవసరమైన విషయం మీద పరిశోధన చేస్తున్నట్టుంది. ఈ చర్చ ఇంకోలా జరిగి ఉంటే ఇంకా బాగుండేదేమో? నాకెప్పుడూ శేఖర్ విశ్వనాథ్ ని replace చేస్తున్నాడనిగానీ, చేస్తే బావుండునని గానీ అనిపించలేదు. మద్యన శేఖర్ సినిమాలు విశ్వనాథ్ సినిమాలతో సరితూగుతాయా లేదా అన్నది అనవసరం. మహామహుల సాహచర్యంతో సినిమా గ్రామర్ ని అర్థం చేసుకున్న విశ్వనాథ్ మొదట్లో రకరకాలుగా సినిమాలు తీసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన format ఏర్పాటుచేసుకోవడంలో చాలా నేర్పుని ప్రదర్శించి, తరువాత ఎందరికో ఆ విషయంలో ఒకరకంగా మార్గనిర్దేశనం చేసాడు. ఒక కళాకారుడు తన కళలో తాదాత్మ్యంతో రససిద్దిని పొందినట్టుగా ఆయన క్రమంగా తన format లో ఉఛ్ఛస్థాయికి చేరుకుని దాన్ని పరిపూర్ణం చేసాడు. ఏ భాషలో నైనా సరే, ఈ ప్రక్రియని దిగ్విజయవంతంగా పుర్తి చేసిన వాళ్ళు అతి తక్కువగా కనిపిస్తారు. ఆ రకంగా చూస్తే శేఖర్ తనకందుబాటులో ఉన్న వనరులనించి ఏమేం ఏరుకుని తనకో కంప్లీట్ డిజైన్ తయారుచేసుకుంటాడన్నది ఇంకా స్పష్ఠం కావాల్సిఉందనే అనిపిస్తోంది. అంటే, ఇప్పుడు తాను తీసిన సినిమాల్లో డిజైన్ లేదని కాదు. దాన్ని శేఖర్ ఎంతదూరం తీసికెళ్ళగలడనేది (ఎందుకంటే, ఇంకో డిజైన్ లో శేఖర్ సినిమా తీయడాన్ని తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం జీర్ణించుకోలేరు కాబట్టి) శేఖర్ ని ఎవరితోనైనా పోల్చాలో, లేదో చెప్తుంది. అది విశ్వనాథ్ తోనే కానక్కరలేదు. ఆ పోలిక ఇప్పుడే (బహుశా ఎప్పటికీ) అవసరం లేదు కూడా. ఐతే, తప్పకుండా శేఖర్ సంస్కారవంతుడైన దర్శకుడు. ఆయన తన class ని మరింత పరిపూర్ణం చేసుకోగలిగితే అది తప్పకుండా తెలుగు సినిమాలో కొంత మార్పు తేవడం ఖాయం. ఆ రకంగా శేఖర్ సినిమాల గురించిన చర్చ జరగటం కూడా ముఖ్యమే.

 13. Alag Niranjan

  October 13, 2012 at 1:21 pm

  EE vyasam Viswanath ni Shekhar tho compare chesaru antam kanna……..aa kaala mana sthithigatula prakaram cinema annadi ela roopantharam chenduthodu visleshana cheppavachu.
  Oka telugu cinemane kadu hindi aina english aina korean aina chinese aina e bhasha aina e pratamina cinema anedi aanati kalamana paristhithulaki addam padutundi.Okappudu navalalu aa nati samjika sthithi gatulanu charchiste……cinema ane madyamam ippudu kalanugunanga aa aa samajika sthithi gatulaku darpanam.
  Ika ee reviw vishayanikosthe….idi oka manchi critic ga cheppukovachu……”Okarakanga cheppalante jorka jatka deerese lage” ane style lo. Reviewer atu Shekar lo ni Viswanath lo ni (Cinema making style lo) valla negitivities ni chala sunnithanga etti chuparu. Ee review cheppinattu Viswanath gari pantha lo.
  Ee review lo Viswanath gari chaturyam ” kulala kattugodalni kulustune agra varnala kinde nimna vargam vundali ane thematic” point ni chala baaga high light chsaru.
  Aa nati paristhithula prakaram aadadi haddulu kattubatlu sampradayalu ani Viswanath nammithe. Aa samajika paristhithulu alantivi…..
  Neti parstithulaprakaram aadadi atmabhimanam svatantra bhavam ani Shekhar naamaru.
  Ee nati parsthithulu evi……
  Darwin cheppinattu “Struggle for Existance”. Kalanugunanga manam mana alachana sarali marinatte Directors creativity marali.
  Anduku example Viswanath gari swarabhishekamina leka Shubhapradamina.
  Aa kalani Viswanath alachana sarali suit ayindi……
  Anta matram Shekhar maro Viswanth ana lemu.
  Evari paridulu vallavi evari pantha vallladi…….

 14. Kalpana

  October 23, 2012 at 9:02 pm

  ee article chaduvutoo, akkada reffer chesina vishwanath cinemalu nu gurtuchesukunte,…nijame kada!,…ayana appati parishitulanu ematram aveshapadakunda, ati sunnitanga vimarshichina teeruni chala chakkaga vivarincharu..
  ayana cinemalu chakkaga vishleshincharu.. Very brilliant observation and expression.

  Hero pakkinti abbayi nundi superhero(Buffoon) ayina vividha sangathulanu kooda chakkaga critical/humarous ga vivarincharu..

  I admire Shekhra’s Work, But I also agree with your analysis..
  tana cinemalo choopinche sensibilities, tana personality lo tana matallo kooda kanipistayi..
  kanee meeru reffer chesina lanti dailogues atani cinemallo and media llo kanipinche atani vyakthitvaniki saripovu..
  He already disappointed us with his latets movie ‘Life is Beautiful’..,
  atanu aa Happy days mind set nundi,..aa victory kick nundi bayatiki vachinatlu kanipinchaledu..

  ee geration lo oka chinna pata tho no dance tho no, ratriki ratre celebrities ayipotaru..,kanee, aa worship, aa popularity life chala short living..
  aa celebrity worship choosi manam chala sadhinchamu anukovadam moorkhatvam..

  I really beleive Shekhar is not that kind, But, I hope He keeps his feet planted firmly on the ground and continues to do the good work..

  in a nut shell, mee parisheelana , bhavavyaktheekarana chala bagunnayi..

 15. Sarath

  November 22, 2012 at 8:38 pm

  చాలా రోజుల తరువాత నవతరంగంలో ఒక మంచి వ్యాసం చదివాను. నాలాంటి సినీపామరుల ఆలోచనలని కూడా కలపెట్టే శైలిలో ఉంది. విశ్వనాధ్ సినిమాలలో రచయిత గుర్తించిన అంశాలు నిజమైనవే. అయితే మార్పు జరుగుతున్నప్పుడు అన్ని రకాల భావాలూ సంఘర్షిస్తాయి. విశ్వనాథ్ తన బాణీని చక్కగా వ్యక్తీకరించాడు. అంతరించిపోతున్న, అంతరించిపోవాల్సిన ఆవశ్యకత ఉన్న ఒకానొక వ్యవస్థలోని సానుకూల కోణాన్ని వీలైనంత చక్కగా ఆవిష్కరించాడు. అప్పుడు విశ్వనాథ్ ఆ పని చేసి ఉండి ఉండకపోయి ఉంటే ఇప్పుడు అలాంటి సినిమాలను రూపొండించే సందర్భం కానీ, అలాంటి సినిమా రూపకర్తలు కానీ మనకి దొరికి ఉండేవారు కాదు. విశ్వనాథ్ ఒక చారిత్రిక పరిణామం, అతను మార్పుని డాక్యుమెంట్ చేశాడు.
  అయితే విశ్వనాథ్ కానీ, శేఖర్ కానీ తమ సినిమాలాలో విధ్వంసాన్ని కూడా సున్నితంగా చూపారు, లేదా చూపగలిగారు. అవసరం లేకపోయినా కౄరత్వాన్ని, హింసని మోతాదుకు మించి (సెన్సారు నిబంధనలకు అనుగుణంగా) వ్యక్తీకరించే రాజమౌళి లాంటి దర్శకుల శైలికి ఇది భిన్నం.
  సినిమా అనే కళ, వీధినాటకాలు లాంటి కళారూపాల మౌలిక స్వభావమైన “జనంలో చైతన్యం” అన్న అంశాన్ని పక్కనపెట్టి, కేవలం వినోద సాధనంగానే మిగిలాకా తెర మీద విధ్వంసాన్ని, శాడిజాన్ని చూపించే ఎందరో దర్శకుల సినిమాల కన్నా శేఖర్ సినిమాలు ఉత్తమంగా నిలిచాయి. సినిమాలలో కన్నా తీవ్రమైన, దారుణమైన చిత్రీకరణతో, బ్యాక్ గ్రౌండు మూజిక్కులతో నిరంతర హింసా స్రవంతులని ప్రసారం చేసే టీవీ చానెళ్ళూ, అవినీతి, బురదజల్లుడు రాజకీయనాయకుల స్టేట్‌మెంట్‌ల పతాక శీర్షికలతో ఉండే పత్రికలు చదివి విరక్తితో, నిస్ఫృహతో ఉన్న జనానికి శేఖర్ సినిమాలు మండు వేసవిలో పన్నీటి జల్లులు, ఉదయాన్నే చేతికి అంది వచ్చే “మంచి కాఫీలు”.
  శేఖర్ సినిమాలలో లోతులేని మాట నిజమే, కానీ అందులో ఉండే తేలికదనం ప్రేక్షకుడిని థియేటర్లకి రప్పిస్తుంది. అతని విజయ రహస్యమ్ అదే. కళాకారులు సాహితీవేత్తలు మరిచిపోతున్న, గుర్తించటానికి నిరాకరిస్తున్న ఒక తరం భావోద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను శేఖర్ వ్యక్తీకరించాడు. మేధావులు గుర్తించ నిరాకరిస్తున్న ఒక మానవీయ అనుభూతిని అతను ఆవిష్కరించగలిగాడు, అందువలనే అతని సినిమాలు విజయం పొందాయి. కానీ లీడర్‌లో అతను చేసిన తప్పు పైన చెప్పిన అంశాలను వదిలి తనది కాని సబ్జెక్ట్‌ని ఎంచుకోవటమే. యుద్దం జరిగిందని సున్నితంగా, కళాత్మకంగా చెప్పొచ్చు కానీ యుద్దాన్ని ప్రత్యక్షంగా చూపుతూ అందులో సున్నితత్వాన్ని చూపించాలనుకుంటే అది లీడర్ సినిమాలాగా తయారు అవుతుంది. ఇలాంటి విషయాలు చెప్పలనుకుంటే “గోదావరి”లో అతను ఎంచుకున్న శైలి అయితే బాగుంటుంది. ఆ పరిధి దాటితే చూడటం కష్టమే.
  ఒక విషయంలో శేఖర్‌ని మెచ్చుకుంటున్నాను. ప్రధాన స్రవంతి కళారూపాలు మమ్మల్ని (పుస్తకాలతో కాకుండా టీవీతో వీడియోగేమ్స్‌తో సహవాసం చేసిన జనరేషన్‌ ????, అందుబాటులో ఉన్న అన్ని ఆనందాలు త్వరత్వరగా పొందేయాలనే ఆరాటం ఉన్న జనరేషన్‌కు ????, పోస్ట్ స్టూడెంట్స్ యూనియన్ జనరేషన్‌కు ???) పట్టించుకోని వేళ, మా అనుభూతులనీ, మా భావోద్వేగాలని, గ్లోబలైజ్ అవుతున్న వర్తమాన సమాజంలో మా ఉనికిని కాపాడుకోవటానికి, మారుతున్న యువతరం పాత్రల్లో రోల్ మోడల్స్ దొరకక్ ఇబ్బంది పడుతూ కూడా ప్రపంచ మానవులుగా ఎదగడానికి మేము చేస్తున్న సంఘర్షణనీ శేఖర్ పట్టించుకున్నాడు. యూత్ అంటే బ్యాచిలర్స్, సినిమా చూసి అనందించే వారు అనే# వెనకటి తరం భావజాలనికి బద్దులైన ముసలి వాళ్ళ చెంపచెళ్ళుమనిపించే అవకాశం మాకు ఇచ్చాడు. శేఖర్ సినిమాలు హిట్ చేస్తూ ఈ తరం చెపుతుంది ఒకటే మీరు అనుకునే సామాజిక భాద్యతలేని తరం కేవలం పుస్తకాల నుంచి మాత్రమే విజ్ణానం పొందట్లేదు మాకు నెట్, వీడియో గేములు కూడా ఉన్నాయి, మేము పోటీపడుతున్న వేదికలు విశ్వవ్యాపితం, ఒక్క కళాశాల కాంపౌండ్ మాత్రమే కాదు మా సంఘర్షణలు విశ్వవ్యాపితమైనవి మా ఉద్యమాల్ కూడా, అవన్ని నిర్వహిస్తూ కూడా మావైన సున్నిత అనుబూతులు, అనుభవాలకి మేము విలువనిస్తున్నాము అనేదే శేఖర్ సినిమాలు విజయవంతం చేస్తూ ఈ తరం ప్రేక్షకులు “ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన వృద్దులకు” ఇస్తున సందేశం.

 16. gs rammohan

  November 26, 2012 at 2:58 pm

  శరత్‌ ప్రశ్నించిన మూడు వాక్యాల్లో కొంతవరకు స్పీపింగ్‌ లక్షణం ఉన్న మాట వాస్తవం. అయితే అది ఈ జనరేషన్‌ను నిందించడం కోసం రాసింది కాదు. కన్సర్న్‌తో రాసింది. ఆ మూడు వాక్యాలను నేటి యువతరాన్ని తక్కువచేసి చూడడం కోసం రాసినవిగా కాకుండా ఒక దశను సూచించడానికి రాసినవిగా అర్థం చేసుకోవాలి. ఈ దశకు ఈ జనరేషన్‌ కంటే బయట వివిధ రంగాల్లో వచ్చిన మార్పులే ప్రధాన కారణం. ఆ మాటకొస్తే ఈ దశ కూడా అందరికీ అన్వయించలేం. ప్రధానంగా ఉన్న ధోరణులను సూచించడానికి మాత్రమే వాడిన వాక్యాలవి. వాటి లోతుపాతులను ఈ వ్యాస పరిధిలో చర్చించడం సాధ్యపడదు కాబట్టి అలా స్వీపింగ్‌గా వదిలేయాల్సి వచ్చింది. వేరే సందర్భంలో వాటిగురించి చర్చించుకుందాం. సున్నితమైన అనుభూతులు, అనుభవాలకు విలువనిచ్చే వారు అపోహపడకుండా ఉండడం కోసం ఈ చిన్న వివరణ.

 17. prudhvi raj

  April 1, 2013 at 4:47 pm

  kalatapaswi ni kalapipasa antantha matrm unna vanri tho pochadam sari kadani na abiprayam

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title