తెరపైన రణ్బీర్, తెరవెనుక అనురాగ్ హీరోలుగా – బర్ఫి

Barfi_pic

సినిమా తీసేవాళ్ళు ప్రొడ్యూసర్లకోసమో, ప్రేక్షకులకోసమో తీయవచ్చు. అవకాశం వున్న కొద్ది మంది దర్శకులు తమకోసమే సినిమా తీసుకోవచ్చు. అదేదీ కాదని సినిమా తీయడం కోసమే సినిమా తీస్తే…? అలాంటి సినిమాకి అద్భుతమైన నటీనటులు దొరికితే..? అప్పుడు తయారయ్యే సినిమా ఒక మాస్టర్ పీస్ లా మిగిలిపోతుంది. సరిగ్గా బర్ఫీ సినిమా లాగే.

పుట్టుకతోనే మూగ-చెవిటివాడైన బర్ఫీ (రణ్బీర్ కపూర్) కథ ఇది. అతని జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిల కథ ఇది. ఆరు నెలల్లో పెళ్ళి నిశ్చమైన శృతి (ఇలియానా) ఒక అమ్మాయి అయితే, ఆటిజం వల్ల మనిషి ఎదిగినా మనసు ఎదగని జిల్ మిల్ చటర్జీ (ప్రియాంక చోప్రా) మరో అమ్మాయి. అందీ అందని శృతి ప్రేమ అందకుండా పోతే, అప్పటిదాకా తోడు వున్న తండ్రి అనారోగ్యం డబ్బుతో తప్ప తగ్గని పరిస్థితి వస్తే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోడానికి జిల్ మిల్ ని కలుస్తాడు బర్ఫీ. మరో పక్క ప్రేమరాహిత్యానికి, అవమానానికి మధ్య నలిగిపోతున్న జిల్ మిల్ కి సంతోషపెట్టే స్నేహితుడిలా బర్ఫీ దొరికాడు. ఆ ఇద్దరూ కలిసి ఏ తీరాలకు చేరారు అన్నది మిగతా కథ.

అసలు కథను పక్కన పెడితే, శృతి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, బర్ఫీని వెంటాడే పోలీస్ ఇనస్పెక్టర్ (సౌరభ్ శుక్ల) కథ ఉపకథలుగా వస్తాయి. కథని మిస్టరీ తరహాలో నడిపిస్తూ, అడుగడుగునా నవ్విస్తూ సాగుతుంది. కాస్సేపు కిడ్నాప్ అని, కాస్సేపు మర్డర్ అనీ మలుపులు తిరిగుతూ, ప్రధాన పాత్రల జీవితంలో మలుపులని పరిచయం చేస్తుంది. అయితే ఇవన్నీ కాదు…  కథలో అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రెండు – ఒకటి బర్ఫీ పాత్ర, రెండు కథ చెప్పిన విధానం.

సినిమా మొత్తం బర్ఫీ పాత్ర నవ్వేస్తూ వుంటుంది. నవ్విస్తూ వుంటుంది. నవ్వటమే జీవితం అని గుర్తుచేస్తూ వుంటుంది. ఇలాంటి పాత్ర, ఇంత సహజంగా కళ్ళ ముందు ఇంతకు ముందు మనకి బహుశా కనపడి వుండదు. అందుకు దర్శకుడి ప్రతిభ, నటుడి ప్రతిభ అభినందించి తీరాల్సినవే. బర్ఫీతో పాటు మిగతా పాత్రలు కూడా సజీవంగా అనిపించడం వల్ల కూడా సినిమా గొప్పదనం పెరిగింది.

ఇక రెండో విషయంగా నేను ప్రస్తావించినది – కథనం. 1972, 1978, 2012 ఈ మూడు సంవత్సరాలలో కథ నడుస్తుంది. 2012 నుంచి మొదలు పెట్టి పాత్రధారులు ఒక్కక్కరుగా వారి వారి అనుభవాలు చెప్తున్నట్లు కథ మొదలౌతుంది. ఒక వరసలో కాకుండా ముందుకీ, వెనక్కీ మారుతూ వెళ్తుంది. అలాగని ఎలాంటి తికమక కలిగించకుండా స్క్రీన్ ప్లే రాయగలగడం కూడా చెప్పుకోదగ్గ విషయమే. సిటిజన్ కేన్, 500 డేస్ ఆఫ్ సమ్మర్ తరహా స్క్రీన్ ప్లే అలరిస్తుంది. అయితే ద్వితీయార్థంలో కాస్త నెమ్మదించి, అవసరం లేని కొన్ని మలుపులు తిరిగటం వల్ల కాస్త లోటుగా అనిపిస్తింది. అయినా దర్శకత్వ ప్రతిభ, నటీనటుల నటన అదంతా గమనించే అవకాశం ఇవ్వకుండా నడిపేస్తుంది.

నటీనటులంతా అద్భుతంగా నటించారని చెప్పాలేమో..! అందరినీ మించినది రణబీర్ కపూర్ నటన. మాటలు లేని పాత్ర కాబట్టి కేవలం హావభావాలతో ఆకట్టుకునే నటన ప్రదర్శించాడు. గత సంవత్సరం వచ్చిన రాక్ స్టార్ లాగా ఈ చిత్రానికి కూడా అవార్డులు అందుకోవడం ఖాయం. ఆటిజం వున్న అమ్మాయిగా ప్రియాంక మరో అద్భుత పాత్రకి జీవం పోసింది. ఈ ఇద్దరు నటులూ చేసింది శారీరికంగా/మానసికంగా వికలాంగుల పాత్రలైనా ఆ సెంటిమెంట్ మీద ఆడుకునే ప్రయత్నాలేవీ చెయ్యలేదు. అందుకు దర్శకుడు కూడా అభినందనీయుడు. మరో ముఖ్య పాత్రలో ఇలియానా కూడా మంచి నటనను ప్రదర్శించింది. ఇంతకాలం తెలుగులో నటించిన ఇలియానానేనా అన్న అనుమానం వచ్చినా రావచ్చు. మిగిలిన పాత్రలలో సౌరభ్ శుక్ల, రూపా గంగూలి, ఆశిష్ విద్యార్థి తదితరులు బాగా నటించారు.

చాలా తక్కువగా వినపడే మాటలు అర్థవంతంగా వుంటే, కోల్ కత్తా, ఉత్తర్ బెంగాల్, డార్జిలింగ్ వంటి అందమైన ప్రాంతాలు చక్కటి ఫొటోగ్రఫీతో కనువిందు చేశాయి. ఎడిటింగ్, సంగీతం చక్కగా సమకూరాయి కాబట్టి కథలో కలిసిపోయాయి. ఇలా వివరంగా చెప్పుకుంటూ పోతే మేకప్ నుండి లైటింగ్ వరకూ అన్నీ సరిగ్గా సమకూరాయి.  ఒక్క మాటలో దర్శక-రచయిత ప్రతిభ ప్రతి క్షణం కనపడుతుంది.

భారత సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన సినిమా..!  తెరపైన హీరో రణ్బీర్ కోసం, తెరవెనుక హీరో అనురాగ్ కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా…!

 

2 Comments

2 Comments

  1. prasad

    September 17, 2012 at 4:15 pm

    Yes this is a very good cinema

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title