బర్ఫీ

barfi_movie_wallpapers_20120828_1208177592

బర్ఫి, శృతి, ఝిల్మిల్ చటర్జీ – ఈ మూడు పాత్రల అందమైన అల్లిక మూడు గంటల బర్ఫి సినిమా. బర్ఫి డెత్ బెడ్ మీద వున్నాడన్న విషయం తెలిసి కోల్కతా లో వున్న శృతి (ఇలియానా) డార్జిలింగ్ కి బయల్దేరడంతో మొదలైన కథ, ఆమె జ్ఞాపకాల్లో లోకి ప్రయాణిస్తుంది.

 

మొట్ట మొదటి సీన్లో శృతి బర్ఫిని పట్టివ్వడం లో కథ లో ఎవరు ఎవరికి యేమిటి అన్నది అర్థం కాదు..(ఇక్కడి చేజింగ్ సీన్లో చాల వరకు రాజ్ కపూర్ కళలు కనపడతాయి రన్ బీర్ లో) పోలీస్ స్టేషన్ లో బర్ఫిని ఝిల్ మిల్ యెక్కడుందో తెలిసే వరకూ వదలం మీరు వెళ్ళండి అన్నపుడు శృతి మళ్ళీ గతం లోకి వెళ్ళడం తో కథ మొదలవుతుంది. చిలిపి తనం, ఉత్సాహం, ప్రతిక్షణాన్నీ ఒక అనుభూతిగా మలుచుకునే మూగ చెవితి వాడైన బర్ఫీ మన కళ్ళముందు ప్రత్యక్షం అవుతాడు. ఆక్షణం నుండీ సినిమా చివరి వరకూ బర్ఫీ పాత్రలో ఎన్ని చమక్కులు, మెరుపులు, నిరుత్సాహపు నిర్వేదాలు, ఆశలూ నిరాశలు, ఆ పాత్రతో పాటూ అతని జీవితాన్ని ప్రేమించేస్తాం!

 

శృతి తో ప్రేమలో పడ్డ బర్ఫీ ఆమెను పెళ్ళి చేసుకుంటాను అని ఆమె తల్లిదండ్రులకి చెప్పడానికని వెళ్ళి, అక్కడ ఆమె ఫియాన్సీ ని చూసి తనకన్నా అతడే ఆమెకు తగిన వాడని శృతి మీద ఆశని చంపుకుంటాడూ. ఈ లోగా ఝిల్ మిల్ చటర్జీ పాత్ర కథలోకి ప్రవేశిస్తుంది. తండ్రికి ఆపరేషన్ కి అవసరమైన డబ్బు కోసమని ఝిల్ మిల్ ని కిడ్నాప్ చేస్తాడు. ఆ వ్యవధిలో బర్ఫి చూపే ఆప్యాయతకు ఝిల్ మిల్ కి బర్ఫి అంటే కలిగే ప్రేమని దర్శకుడు యెంతో సున్నితంగా చిత్రీకరించాడు. వెన్నెల నీడల్లో చెట్ల గుబురుల్లో మిణుగురు పురుగుల్ని నీటి బుడగల్లో వెలిగిస్తూ చూపించిన తీరు అద్భుతం.

 

చనిపోయిన తండ్రి దుఖం లో, ఝిల్మిల్ ని ఆమె ఆయా దగ్గర వదిలి వచ్చే టపుడు ఝిల్ మిల్ అతడిని వదల్లేక బర్ఫి వెళ్ళే బస్ వెనకాలె పరిగెత్తుకు రావడం చూసిన బర్ఫి మొఖం లోని చిరాకు, విసుగు, అసహనం – మాటలు లేకుండా ఎంతో సహజంగా బాడీ లాంగ్వేజిలో చూపిస్తాదు రన్ బీర్.

 

చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న బర్ఫీకి అనుబంధాలపై నమ్మకం తక్కువ. తనకు ఆప్తులనుకున్న వాళ్ళందరికి ఒక పరీక్ష పెడుతుంటాడు (సినిమాలో చూడాండి.. :)ఆ ఫరీక్షలో అతడి చెయ్యి పట్టుకుని వదలకుండా ఝిల్ మిల్ అమాయకం గా నిలుచున్న తీరు నమ్మకం అంటే ఇదే సుమా అనిపిస్తుంది.

 

దాదాపుగా మూడు సార్లు కిడ్నాప్ డ్రామా నడిచిన తర్వాత, మన కళ్ళ ఎదురుగానే ఝిల్ మిల్ వున్న కార్ నదిలో మునిగి పోతుంది. అక్కడి నుండీ ఎన్నో ట్విస్టులున్నాయి. అది చూసి ఆనందించవలసిందే! మర్డర్ మిస్టరీగా ముగించాడా అని కొంచెం భయపడ్డాను. కాని కథలోని మలుపులు అమోఘం.

 

శృతి (ఇలియానా) సినిమా చివరలో “ఝిల్ మిల్ (ప్రియాంకా చోప్రా) సోచ్ సమఝ్ కే ప్యార్ కియా నహీ.. ప్యార్ కర్నే కే బాద్ కుచ్ సోచా హీ నహీ” — అంటే – లాభాలూ నష్టాలూ లెక్కల బేరీజు వేసుకుని ఝిల్ మిల్ ప్రేమించలేదు, బర్ఫీని ప్రేమించాక ఇక దేన్నీ లెక్క చెయ్యలేదు – అంటుంది! అదృష్టం ప్రతి సారీ శృతిని బర్ఫీ వైపు నడిపించినా.. తల్లి మాటల ప్రకారం బర్ఫి మూగ చెవిటి అసహాయతలు తమ ప్రేమ లో నిశ్శాబ్దాన్ని సృష్టిస్తాయేమో అనే సందేహంతొ కోల్కతాలో నివసించే ధనవంతుడ్ని పెళ్ళి చేసుకుని ప్రేమ విషయం లో పేదరాలిగా మిగిలి పోతుంది. భర్తను ఎదిరించి బర్ఫీ కి అండగా నిలుద్దామనుకున్నా అప్పటికే ఝిల్ మిల్ ని మనసు నిండా నింపుకున్న బర్ఫి ప్రేమని పొందలేక ఒంటరి గా మిగులుతుంది.

 

పాటల విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అద్భుతమైన సాహిత్యం, అంతకన్నా అందమైన సంగీతం. ఒక్క “సావ్లీసి రాత్ హో” కొద్దిగా అనుకున్నంత బాగా చూపించలేదన్న అసంత్రుప్తి తప్ప పాటలన్నీ రసగుళికలే

 

ప్రేమలోని ఇన్ని షేడ్స్ ని ఒకటే సినిమాలో చూపించడం, ఎక్కడా ఊపిరితిప్పుకోనివ్వని కథనం, ప్రియాంకా చోప్రా ముగ్ధత్వం – ఆటిస్తిక్ బాడీ లాంగ్వేజిని ఇంత అందంగా చూపించగలగడం కెమెర వర్క్ అయితే అంత అందంగా నటించిన ఘనత ప్రియాంకాదే. నటనలో బర్ఫిగా రన్ బీర్ తర్వాత ప్రియాంకాదే రెండో స్థానం. వీళ్ళిద్దరి అనుబంధానికి మూగ సాక్షిగా శృతి అంతరంగాన్ని కళ్ళల్లో పలికించింది ఇలియానా. మొత్తంగా ఇది ఒక డైరెక్టర్ సినిమా. అనురాగ్ బసు సినిమా.

– జయశ్రీ నాయుడు 

2 Comments

2 Comments

 1. అబ్రకదబ్ర

  December 19, 2012 at 12:55 am

  >> “ఇక్కడి చేజింగ్ సీన్లో చాల వరకు రాజ్ కపూర్ కళలు కనపడతాయి రన్ బీర్ లో”

  నిజానికి, అవన్నీ చార్లీ చాప్లిన్ కళలు. తాతగారు చాప్లిన్‌నుండి ప్రేరణ పొందారు మరి 🙂

  ‘బర్ఫీ’లో చాప్లిన్ సినిమాలవే కాక, ‘Singing In The Rain’ వంటి పాత హాలీవుడ్ మ్యూజికల్స్ కళలు కూడా కనిపిస్తాయి జాగ్రత్తగా పరికిస్తే.

  విజువల్స్, నేపధ్య సంగీతం, రణ్‌బీర్ నటన .. ఈ మూడిటి కోసమైతే ఈ సినిమా ఓ సారి చూడొచ్చు. ముఖ్యంగా విజువల్స్. ఈ మధ్య కాలంలో ఇంత అందంగా కెమెరా పనితనం కనపడ్డ హిందీ సినిమా ఇదే.

  ఇక కథగా ఇందులో పెద్దగా చెప్పుకోటానికేమీ లేదు. Agreed. It’s a different story. But there’s not much of it. ఆ సంగత్తెలిసే, దర్శకుడు కథనాన్ని ఎక్కువగా నమ్ముకుని బండి లాగించాడు. పెద్దగా లేని కథని ఆసక్తికరంగా చెప్పేందుకు స్క్రీన్‌ప్లేని ఏదో థ్రిల్లర్ కథాంశంలా జిగిబిగిగా అల్లి ప్రేక్షకులని గందరగోళ పరుస్తూ పోయాడు. అందుకోసం అతనెంచుకున్న మార్గం బర్ఫీని బాగా ఎరిగినవాళ్లతో అతని జీవితాన్ని flashbacksలో చెప్పించటం. ఇలా చెయ్యటం వల్ల లేనిపోని ఇబ్బందులు తలెత్తాయి: తాము లేని సన్నివేశాల్లో ఏమేం జరిగాయో కూడా పూసగుచ్చినట్లు వివరించేస్తారు వాళ్లు!

  నటీనటుల విషయానికొస్తే రణబీర్ అద్భుతంగా చేశాడు. హిందీ కథానాయకుల్లో ఇతన్ని మించిన నటుడు లేడు అని ఇంతకు ముందు విన్నా. ఇప్పుడీ సినిమా చూస్తే అది నూరుపాళ్లు నిజమనిపించింది. ప్రియాంకా చోప్రా పాత్ర మరెవరైనా ఆ మాత్రం చేస్తారు. బహుశా అంతకన్నా బాగా కూడా చేసేవాళ్లుండే ఉంటారు. ప్రియాంకతో పోలిస్తే ఇలియానా నటన నన్ను ఆశ్చర్యచకితుడ్ని చేసింది. ఆమెలో ఓ మంచి నటి ఉందని గుర్తించేలా చేసిన సినిమా ఇది. పిచ్చి పాత్రల్లో ఎవరు ఎలా చేసినా విమర్శకులు సాధారణంగా జైకొట్టేస్తారు. ప్రియాంకది మొదట్నుండి చివరిదాకా ఒకేలా ప్రవర్తించే పాత్ర. ఆ పాత్రతో పోలిస్తే ఇలియానా పాత్రకి లోతెక్కువ; and it has more shades to it, too. I think Iliyana did a far better job in this film than Priyanka.

  సినిమా ముగింపు సన్నివేశంలో బర్ఫీ, ఝిల్‌మిల్ మధ్య unconditional love గురించి శృతి చెప్పిన మాటలు కవితాత్మకంగా ఉన్నాయి కానీ అతిశయంగా అనిపించాయి. పసిపిల్లలు తమకి ఒక భద్రతాభావం, భరోసా ఎవరిస్తే వాళ్లతో అటాచ్ ఔతారు. పసిపిల్లల మనస్తత్వం కలిగిన ఝిల్‌మిల్‌కి బర్ఫీపై అంతకన్నా వేరే అనుబంధం ఉండే అవకాశం లేదు. If anybody calls that love, I have no problem with it. Whatever it is, it certainly is conditional. అలాగే, బర్ఫీకి ఝిల్‌మిల్ పైన ఉన్నదీ కేవలం conditional love మాత్రమే. Otherwise what’s the need for his ‘test’?

 2. టి.యస్.కళాధర్ శర్మ

  March 16, 2013 at 1:32 pm

  ee cinema intavaraku choodananduku baadhapaduthunna. Enduku choodaledante maa vooriki hindi cinemaalu raavu. vaati gurinchi yemi teliyadu….

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title