Menu

ప్రపంచ చలన చిత్ర చరిత్ర 15: త్వరలో విడుదల

కదిలే బొమ్మల్ని చూడాలనుకున్న మనిషి కోరిక ఫోటోలతో మొదలై, క్రమంగా సెల్యులాయిడ్ పైన ఎక్కి మాటలు నేర్చి, రంగులు అద్దుకోని, బ్లాక్ బస్టర్ సినిమాగా, ఆర్ట్ సినిమాగా, సమాంతర సినిమాగా రకరకాలు రూపాంతరాలు చెందుతూ వచ్చిన సినిమా తరువాత ఏ కొత్త పుంతలు తొక్కబోతోంది? ఒకప్పుడు నాటకాలు, బొమ్మలాటలు, సంగీత కచేరిలు (ఒపెరాలు) వంటి వినోధసాధనాలకు అదనంగా వచ్చిన చేరిన సినిమా, అలాంటి కళలనే మింగేసిందనే అపప్రధ కూడా మూటకట్టుకుంది. అయినా ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించారు. అందులో హాస్యాని చూసి నవ్వుకున్నారు. డ్రామా చూసి ఏడ్చారు. అలాంటి సినిమా రాబోయే కాలంలో, ఇప్పుడు పుట్టుకొస్తున్న సాంకేతిక విప్లవాల నేపధ్యంలో ఏ రకంగా రూపుదిద్దుకోనుంది? టీవీ వచ్చిన తరువాత సినిమా వీక్షకులు తగ్గిపోతున్నారన్న విమర్శల నేపధ్యంలో ఇంకా విస్తృతంగా పరుకుంటున్న ఇంటర్ నెట్, డైరెక్ట్ టు హోమ్ వంటి కొత్త పోకడల మధ్య నిలబడగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమలో జరుగుతున్న మార్పులను తెలుసుకోవాలి.

గత దశాబ్దంలో సినిమాని, సినిమా ప్రేక్షకులనీ ప్రభావితం చేసిన వాటిలో టెక్నాలజీది అగ్రస్థానం అని చెప్పుకోవాలి. టీవీలు, దాని అనుసంధానంగా వచ్చిన కేబుల్, డైరెక్ట్ టు హోం, ఇంకా ఇంటర్ నెట్ వంటి సదుపాయాలతో ఇంట్లోనే సకుంటుంబ సపరివారంగా సినిమాలు (హోమ్ థియేటర్లు) చూసే సౌలభ్యం వచ్చేసింది. ఇక పెరిగిపోతున్న న్యూక్లియర్ కుటుంబాలు, స్త్రీపురుషులు ఇద్దరూ పనిచేసే అవకాశాలు, ప్రపంచీకరణ కారణంగా పెరిగిపోయిన వలసలు, జాడ్యంలా పాకిపోయిన పైరసీ సినిమాలు ఇలాంటివి ఎన్నో సినిమా చూసే ప్రేక్షకుల్ని సంఖ్యని గణనీయంగా తగ్గించేస్తున్నాయి.

ఇదిలా వుండగా, సినిమా పరిశ్రమలో నిర్మాణ వ్యయం పెరగటం, ముఖ్యంగా ముడి రీలు, ప్రింట్ల ఖర్చులు అధికమవడం వంటి పరిణామాల నేపధ్యంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం ఎదురు చూడటం మొదలైంది. సరిగ్గా అప్పుడే పుట్టుకొచ్చిన మల్టీప్లెక్స్ లు తక్కువ బడ్జెట్ తో తీసిన చిన్న సినిమాలను ఆదరించడం మొదలయ్యాక సినిమా పరిశ్రమకి కొంత వూరట దొరికింది. ఈ పరిణామాలను మరి కొంచెం ముందుకు తీసుకెల్తే ముందు ముందు తక్కువ ఖర్చుతో తయారయ్యే సినిమా మరిన్ని వస్తాయని వూహించడం సహజం. అలాగే సినిమా చూసే వాళ్ళని తీసుకు రావటం కన్నా వారి దగ్గరకే సినిమాని తీసుకెళ్ళే రోజులు కూడా రాబోతున్నాయని మనం అనుకోవచ్చు.

సరిగ్గా అలాంటి అవసరం తీర్చేందుకు రాబోతున్నదే – డిజిటల్ సినిమా. సినిమా తీయటం మొదలు, ప్రొజక్షన్ దాకా మొత్త డిజిటల్ టెక్నాలజీలో జరగబోయే రోజులు ముందున్నాయి. డిజిటల్ సినిమాని అర్థం చేసుకోవాలంటే మనం ఫోటోలు తీసుకునే కెమెరానే ఉదాహరణగా తీసుకోవచ్చు. గతంలో రీలు వేసి ఫొటోలు తీసుకేనే “అనలాగ్” కెమెరాల నుంచి ఇప్పుడు చిప్ వేసి ఫోటోలను తీసుకునే  “డిజిటల్” కెమెరాకి ఎలా మారామో సరిగ్గా అలాగే సినిమా చిత్రీకరణ కూడా అనలాగ కెమరాల నుంచి 5డి, 7డి లాంటి డిజిటల్ కెమెరాలలోకి మారింది. అలా చిత్రీకరించిన సినిమాని కంప్యూటర్ లోకి దింపుకోని, ఎడిటింగ్ చేసిన తరువాత సాటిలైట్ ద్వారానో, హార్డ్ డిస్క్ ద్వారానో సినిమా థియేటర్ కి చేరుస్తారు. అక్కడ ఆ సినిమాని డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇదే డిజిటల్ సినిమా.

ప్రపంచంలో మొదటి డిజిటల్ సినిమా ప్రయత్నం 1998 లో జరిగినప్పటికీ ఆ తరువాత వచ్చిన “స్టార్ వార్స్ 2” (2003) సినిమా పూర్తిగా డిజిటల్ టెక్నాలజీలో తయారయిన చిత్రంగా పేరుపొందింది. ఆ తరువాత వాల్ట్ డిస్నీ వంటి ఎన్నో సంస్థలు ఇలాంటి సినిమాల మీద ఆసక్తి చూపించడంతో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సినిమా ఊపందుకుంది. భారతదేశంలో 2006లో విడుదలైన మళయాల చిత్రం “మూన్నమత్రోల్” మొదటి డిజిటల్ సినిమా. ఇక ఆ తరువాత ఎన్నో భాషలలో డిజిటల్ ప్రయోగాలు మొదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన “కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు”, “రక్త చరిత్ర”, “దొంగల ముఠా” వంటి సినిమాలు, ఇంకా “గగనం”, “సొంత ఊరు”, “గంగ పుత్రులు”, “ఈ రోజుల్లో” వంటివి ఎన్నో సినిమాల నిర్మాణం జరిగింది, ఇంకా జరుగుతోంది. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం మన టెక్నీషియన్లు పెంపొందించుకోవాల్సిన అవసరం వుంది.

ఇక ఈ సినిమాల ప్రదర్శించే థీయటర్లు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడే విధంగా తయారు చేయాల్సిన అవసరం కూడా వుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లు ఈ మార్పుకు సన్నధ్ధంగా వున్నాయి. యూ.ఎఫ్.ఓ, క్యూబ్ వంటి సంస్థలు సినిమా పరిశ్రమని ఈ దశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ పూర్తిగా ఉపయోగం లోకి వస్తే మల్టీ ప్లెక్స్ నుంచి ఎక్కడో చిన్న గ్రామంలో వున్న థియేటర్ లో నైనా సినిమాని ఒకేసారి విడుదల చెయ్యచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా పైరసీని అరికట్టేందుకు డిజిటల్ సినిమా దొహదపడుతుంది.

ఇదిలా వుంటే, ఇంటర్ నెట్ లో యూ ట్యూబ్,  ఫేస్ బుక్ వంటి సైట్ల రాకతో సినిమా ప్రదర్శన థియేటర్ కే పరిమితం అవ్వాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు వున్న డీటీహెచ్ పరిజ్ఞానంతో నేరుగా సినిమాని మన ఇంట్లోనే చూపించే రోజు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. నేరుగా డీవీడీ ద్వారానే సినిమాని విడుదల చేసే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే ఔత్సాహికులు డిజిటల్ కెమెరాతో, అతి తక్కువ బడ్జెట్ తో, చిన్నచిన్న్ సినిమాలు తీసి ఇంటర్ నెట్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా చిత్రోత్సవాలు సైతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి వారే ముందు ముందు డిజిటల్ సినిమాలు తీసి మీ టీవీలోనో, మీ కంప్యూటలోనో విడుదల చేసే రోజు ఎంతో దూరంలో లేదు. మార్పుకు సన్నధ్ధంగా వున్నాయి. యూ.ఎఫ్.ఓ, క్యూబ్ వంటి సంస్థలు సినిమా పరిశ్రమని ఈ దశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ పూర్తిగా ఉపయోగం లోకి వస్తే మల్టీ ప్లెక్స్ నుంచి ఎక్కడో చిన్న గ్రామంలో వున్న థియేటర్ లో నైనా సినిమాని ఒకేసారి విడుదల చెయ్యచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా పైరసీని అరికట్టేందుకు డిజిటల్ సినిమా దొహదపడుతుంది.

(చివరి వ్యాసం: ఎపిలోగ్)

One Response
  1. వెన్నరవి February 25, 2013 /