Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 14: మాస్ హీరోలు… మసాలా సినిమాలు..!

రెండొవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల జీవితంలో సినిమా ఒక ముఖ్య భాగం అయిపోయింది. కేవలం వినోద సాధనంగానే కాకుండా, ఆలోచనలు ప్రేరేపించే కళా ప్రక్రియగా, రాజకీయ వ్యాఖ్యానాలకి, దేశభక్తి ప్రభోదానికి ఒక సాధనంగా కూడా సినిమా మారింది. అయితే ప్రపంచ మొత్తం నెలకొన్న కోల్డ్ వార్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, అన్ని చోట్ల ఎక్కువైపోతున్న న్యూక్లియర్ కుటుంబాలు వంటి కారణాల వల్ల వినోదాత్మక ప్రేమ చిత్రాల జోరు పెరగడం మొదలైంది. ముఖ్యంగా బ్రిటన్ మ్యూజికల్ సినిమాలు, భారతదేశంలో దేవానంద్ లాంటి ప్రేమ హీరోల చిత్రాలు ప్రజాదరణ పొందాయి. మరోపక్క కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకోసం ప్రయోగాత్మకమైన చిత్రాల జోరు కూడా ప్రారంభమైంది. ఇవన్నీ కలిసి చిత్రపరిశ్రమకి కనీవినీ ఎరుగని ఘనవిజయాలు అందించడం మొదలైంది.

సినిమాకి మూల స్థంభం దర్శకుడే అన్న ఆయుటర్ సిద్దాంతం స్థిరపడటంతో దర్శకుల చిత్రాలు ఘనవిజయాలను అందుకున్నాయి. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపలా “గాడ్ ఫాదర్”, స్పీల్ బర్గ్ “జాస్”, జార్జ్ లూకాస్ “స్టార్ వార్స్” వంటి సినిమాలే అందుకు వుదాహరణ. ముఖ్యంగా జాస్, స్టార్ వార్ సినిమాల విజయాలు బ్లాక్ బస్టర్ సినిమాలకు దోహదం చేశాయి.

ఇదే సమయంలో ప్రేమ సినిమాలతో కలల రాకుమారుడు లాంటి రొమాంటిక్ హీరోలు ఒకవైపు మనసులుదోచుకుంటుంటే, మరో రకం హీరోలకి కూడా ఆరాధన మొదలైంది. వారే యాంగ్రీ హీరోలు. అప్పటి సమాజంలో వున్న అస్థిరత, నిరుద్యోగం, అవినీతి వంటి రుగ్మతలను ఓర్పుగా భరిస్తున్న ప్రేక్షకులు, వాటిని ఎదిరించే హీరోలకు బ్రహ్మరథం పట్టడం మొదలైంది అప్పుడే. పదిమంది మంచికోసం అవసరమైతే చెడ్డవాళ్ళని చంపేసే హీరోలను కూడా ఆదరించారు ప్రేక్షకులు. కథానాయకుడికి, ప్రతినాయకుడికి మధ్య వున్న వ్యత్యాసం క్రమ క్రమంగా కనుమరుగవడం కూడా చెప్పుకోదగ్గ పరిణామం.

ఆ తరువాత వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలు, బ్రూస్ లీ ప్రభావంతో వచ్చిన ఏక్షన్ సినిమాలు,  “ఇండియాన జోన్స్” వంటి వెస్ట్ సినిమాలు, “ఈ.టి.” తరువాత వచ్చిన గ్రహాంతరవాసుల కథలు, జాకీ చాన్ కామెడీ ఏక్షన్ సినిమాలు, “ఈవిల్ డెడ్” తరువాత హర్రర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సినిమా బిజినెస్ ని అమాంతంగా కోట్లనుకోట్లకి పెంచేశాయి. ఇదిలా జరుగుతుండగానే శృంగార సినిమాలు, ఏనిమేషన్ సినిమాలు కూడా ఊపు అందుకున్నాయి. టీవీ, కేబుల్ వంటి సాంకేతిక అభివృద్ధి కారణంగా అన్ని రకాల సినిమాకి డిమాండ్ పెరిగింది. అనూహ్య విజయాలను చవి చూసిన సినిమాలకు సీక్వెల్స్ తయారవడం కూడా మొదలైన కాలం ఇది.

ప్రపంచ సినిమా పరిశ్రమకి అనుగుణంగానే భారతదేశంలోకూడా సరిగ్గా అలాంటి మార్పులే జరిగాయి. దేవానంద్, సంజీవ్ కపూర్, ధర్మేంద్ర వంటి రొమాంటిక్ హీరోల మధ్యలోకి సరికొత్త విప్లవంలా దూసుకొచ్చాడు అమితాబ్ బచ్చన్. ఆయన నటించిన “జంజీర్”, “షోలే” (రమేష్ సిప్పీ), “దీవార్” (యాష్ చోప్రా) వంటి చిత్రాలతో ఇలాంటి ఏక్షన్ సినిమాల జోరు పెరిగింది. ఒక పక్క శ్యాంబెనగల్, గోవింద్ నిహలానీ వాంటి వారి పేరలల్ సినిమా ప్రయత్నాలు చేస్తున్నా, క్రమంగా ఏక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామా కలగలిపిన మసాలా సినిమాలు రావటం మొదలైంది. తెలుగులో కూడా ప్రేమకథల వుధృతికి ఆనకట్ట వేస్తూ ఏక్షన్, డాన్స్, రొమాన్స్ వంటివాటి ప్రాముఖ్యాన్ని పెంచిన ఘనత చిరంజీవి నటించిన “ఖైదీ” చిత్రానికే దక్కుతుంది. ఇలాంటి సినిమాల విజయం తరువాత మసాలా సినిమా అనేది ఒక కొత్త జాన్రాగా, ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన జాన్రాగా ప్రపంచానికి తెలియడం మొదలైంది. ఇలాంటి మనదేశ సినిమాల ప్రభావంతో హాలీవుడ్ లో కూడా సినిమాలు రావటమే అందుకు నిదర్శనం.

ఆ తరువాత హిందీలో ఖయామత్ సే ఖయామత్ తక్, మైనే ప్యార్ కియా, దిల్ వాలే దుల్హన్ లేజాయేంగే వంటి సినిమాలతో కొత్త తరం హీరోలు, కొత్తరకం కథలు విజయవంతమై భారతదేశ బ్లాక్ బస్టర్ యుగానికి మరింత దోహదం చేశాయి. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల శకం, తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ ల యుగం, మళయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి ఇలా దాదాపు ప్రతి భాషలో మాస్ హీరోలు స్టార్ లుగా రూపుదిద్దుకోవటంతో మాస్ సినిమా ప్రేక్షకులకు నచ్చిన సినిమాలుగా స్థిరపడిపోయాయి.

ఆ తరువాత సినిమా తీసే విధానాన్ని బలంగా ప్రభావితం చేసింది దర్శకులే అని చెప్పవచ్చు. తమిళంలో మణిరత్నం, తెలుగు నుంచి రామ్ గోపాల్ వర్మ, హిందీలో అనురాగ్ కాశ్యప్, విశాల్ భరద్వాజ్ వంటి దర్శకులు కొత్త కొత్త దారుల్లో ప్రయాణిస్తూ భారతదేశ సినిమాని దిశని దశని ప్రభావింతం చేస్తున్నారు. అలాగే అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ వంటి వారసులు హిందీలో, మహేష్ బాబు, రామ్ చరణ్, వంటివారు తెలుగులో ఇంకా అనేక బాషల్లో వారసుల రాకతో మరో కొత్త శకానికి తెరలేస్తున్నటు కనిపిస్తోంది.

(తరువాత వ్యాసం: రాబోయే కాలానికి సినిమా…)

5 Comments
  1. Varun August 5, 2012 /
  2. SHAFI August 5, 2012 /
  3. Alag Niranjan August 17, 2012 /
  4. RAJA December 21, 2012 /