Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 13: ప్రపంచ సినిమాపై ఆసియా బావుటా

1960 ప్రాంతంలొ అమెరికాలో తయారవుతున్న హాలీవుడ్ సినిమాలు వాస్తవికతని వదిలిపెట్టి, కేవలం హీరో హీరోయిన్ల పేరు ప్రఖ్యాతులమీద, స్టార్‌డమ్ మీద ఆధారపడి తీయబడుతున్నాయని విమర్శలు మొదలయ్యాయి. ఇటలీలో నవ్యవాస్తవిక చిత్రాలు, ఫ్రెంచ్ నవతరంగం చిత్రాల రాకతో హాలీవుడ్ సినిమాలలో లోపాలు ప్రస్ఫుటమయ్యాయి. అయితే  ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న సినీ వుద్యమాలని గుర్తించడంలో హాలీవుడ్ సినిమా, హాలీవుడ్ ప్రభావంలో వున్న యూరోపియన్ సినిమా కూడా విఫలమయ్యాయి. ఇదే అవకాశంగా ఆసియాలో నిర్మాణమౌతున్న ఎన్నో చిత్ర పరిశ్రమలు ఈ కొత్త దారిలో సాగిపోయాయి. ప్రపంచ సినిమా చరిత్రలో ఆసియా సినిమాలు మైలు రాళ్ళుగా నిలిచిన కాలం అప్పుడే మొదలైంది.

అప్పటి సినిమాలలో తలమానికంగా చెప్పుకొదగిన చిత్రాలలో జపాన్, చైనా, కొరియా తదితర దేశాల చిత్రాలతోపాటు భారత దేశ చిత్రాలు కూడా వుండటం విశేషం. ఈ దేశాలతో పాటు పాకిస్తాన్, ఫిలిపైన్స్, కంబోడియా వంటి దేశాలలో కూడా సినిమా తీసే విధానాలలో, కథ చెప్పే విధానాలలో ఎన్నో మార్పులు రావటంతో 1950-70 ప్రాంతం ఆసియా సినిమాకి స్వర్ణ యుగంగా భాసిల్లింది.

ఇలాంటి స్వర్ణ యుగానికి ఒకరకంగా జపనీస్ సినిమానే నాంది పలికిందని చెప్పవచ్చు. 1949లో యాసుజిరో ఓజు తీసిన “బన్షున్ (లేట్ స్ప్రింగ్)” అనే చిత్రం ఇలాంటి సినిమాలకు తొలి మార్గం ఏర్పరిచింది. అయితే ఆ తరువాత సంవత్సరం అకిరా కురసవా తీసిన “రోషమన్” చిత్రంతో జపాన్ సినిమా ప్రపంచ సినిమా పటంమీద ఆసియా జండా ఎగరేసింది. అతి తక్కువ ఖర్చుతో, కేవలం రెండు సెట్లతో, బహుళ కథనం (మల్టిపుల్ నరేటివ్) విధానంలో తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. 1951లో జరిగిన వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి గోల్డెన్ లయన్ రావటంతో ప్రపంచ సినిమా ప్రేక్షకుల దృష్టి ఆసియా వైపు మళ్ళింది. ఆ తరువాత కూడా అకిరా కురసవా ఇకిరు (1952), సెవన్ సమురాయ్ (1954), థ్రోన్ ఆఫ్ బ్లడ్ (1957) చిత్రాలద్వారా ప్రపంచ ఖ్యాతి పొందాడు. ఒక పక్క అకిర కురసవా చిత్రాలు సంచనాలు రేపుతుంటే మరో పక్క అదే దేశానికి చెందిన యాసుజిరో ఓజు తీసిన టోక్యో స్టోరీ (1953), ఇషిరో హోండా తీసిన గాడ్జిల్లా (1954) వంటి సినిమాలు బహుళ ప్రజాదరణ పొందాయి. అలా మొదలైన జపాన్ సినిమా ప్రస్థానాన్ని కెంజి మిజొగుచి, హిరోషి ఇనగాకి వాంటి వారు మరింత ముందుకు తీసుకెళ్ళారు.

ఇదే సమయంలో అనేక ఆసియా దేశాలలో దిగ్గజాల వంట్ దర్శకులు సినిమాలు తీయటంతో ఎన్నొ దేశాలలో సినిమా అనే మాధ్యమానికి స్వర్ణయుగమైంది. దక్షిణ కొరియాలో కిం కి యంగ్, యు హ్యున్‌మొక్; ఫిలిపైన్స్‌లో గెరార్డో డె లియోన్; పాకిస్తాన్‌లో మున్షీల్ దిల్, జహిర్ రెహాన్; కంబోడియాలో టీ లిం కున్ వంటి దర్శకులు వారిలో ప్రముఖులు.నిజానికి జపాన్ సినిమా కన్నా ముందే చైనా సినిమా ముందడుగులు వేసింది. “ద స్ప్రింగ్ రివర్ ఫ్లోస్ ఈస్ట్” (1947), మిరాడ్స్ ఆఫ్ లైట్స్ (1948), క్రోస్ అండ్ స్పారోస్ (1949) వంటి చిత్రాలు చైనీస్ చిత్రాలకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అయితే రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం, కమ్యూనిస్ట్ పరిపాలన కారణంగా చైనా సినిమా కొంత కుటుపడిందనే చెప్పవచ్చు. సినిమా అనే మాధ్యమాన్ని ప్రోపగాండకి వాడుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన కూడా కొంతవరకు చైనా సినిమాలని వెనకబడేలా చేసింది.

భారత దేశంలో వాస్తవిక చిత్రాలు అంతకు ఎంతో ముందే (1925లో వి. శాంతారాం షావ్‌కారీ పాష్) తీసి వున్నప్పటికీ ఇటలీ, ఫ్రెంచ్, జపాన్ చిత్రాల స్పూర్తితో సత్యజిత్ రే తీసిన “పథేర్ పాంచాలి” భారతదేశంలో సమాంతర సినిమా ఆవిర్భావానికి నాంది పలికింది. “అప్పు త్రయం”గా పిలవబడే రే సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడమే కాకుండా అకిర కురసవా, గోడర్డ్ వంటి మహామహులకు స్పూర్తిగా నిలిచాయి. ఈ తరం దర్శకులైన స్పీల్‌బర్గ్, డానీ బోయల్ వంటి వారుకూడా రే దర్శకత్వ ప్రతిభని మెచ్చుకున్నారంటే ఆయన ఎంతటి ప్రైభావంతుడో మనం వూహించవచ్చు.

అంతటి మహనీయుడి స్పూర్తితోనే ఆ తరువాత మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ తదితరులు సమాంతర సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళారు. బెంగాల్‌లో మొదలైన ఈ వుద్యమం క్రమంగా మళయాలం (ఆదూర్ గోపాల కృష్ణన్, షాజీ కరుణ్), కన్నడ(గిరీష్ కాసరవల్లి, గిరీష్ కర్నాడ్) వంటి అనేక భాషల్లోకి వ్యాప్తి చెంది ఎన్నో హిందీ ఆర్ట్ సినిమాలకు కారణమయ్యింది. శ్యాం బెనగల్, గుల్జార్ వంటి హిందీ దర్శకులు, స్మితపాటిల్, షబానా ఆజ్మీ, ఓంపూరి, నసిరుద్దీన్ షా, వంటి నటులు ఇదే పంధాని ఎన్నుకోవడంతో కొంతకాలం సమాంతర సినిమా కూడా ఊపు అందుకుంది. అయితే క్రమ క్రమంగా ఆర్ట్ సినిమా అంటే అవార్డులకోసం తీసే సినిమానే అన్న అభిప్రాయం పెరగడం, మరో పక్క కలల రాకుమారుడు లాంటి హీరోలు, మధ్యతరగతి కోపాన్ని, కసిని ప్రదర్శించే హీరోల రాకతో ఈ సమాంతర సినిమా చిత్రోత్సవాలకే పరిమితమైపోయింది.

(బొమ్మల వివరాలకు మౌస్ వాటిపైన కదపండి)

తరువాత వ్యాసం: బ్లాక్ బస్టర్ సినిమా