Menu

తిరువిళయాడల్

“తిరువిళయాడల్” అంటే భగవంతుని ఆటలు అని అర్థం. “తిరువిళయాడల్ పురాణం” తమిళ శైవ వాఙ్మయంలో ఒక భాగం. అందులోని అరవై నాలుగు కథల్లోంచి ఎంచిన నాలుగు కథలు కలిస్తే ఈ సినిమా. నలుపు-తెలుపుల తెలుగు సినిమాల్లో “నవరాత్రి” సినిమా నాకెందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ సినిమా తమిళ మాతృక తీసిన ఏ.పి.నాగరాజన్ ఈ తిరువిళయాడల్ కి కూడా దర్శకుడు. అదే ఏకైక కారణం ఈ సినిమా చూడ్డానికి. ఎందుకో గానీ నాకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. కథలు, కథనమే కాకుండా, నాకు పూర్తిగా అర్థం కాకపోయినా పాటలు, సినిమాలో నడిచిన చర్చలు కూడా అద్భుతంగా అనిపించాయి. రెండు మూడు రోజులుగా మళ్ళీ మళ్ళీ కొన్ని దృశ్యాలు చూస్తూనే ఉన్నాను. ఇందులోని దృశ్యాల గురించి, పాటల గురించి ఈ రెండ్రోజుల్లో నేను మాటలు కలిపిన అందరికీ చెబుతూనే ఉన్నాను. ఉండబట్టలేక, ఈ సినిమా గురించి పరిచయం చేద్దాం అనుకున్నా. కథ గురించి వివరించి, నాకు అనిపించింది చెప్పాలంటే పెద్ద వ్యాసమే అవుతోంది…ఏం చేస్తాం… 🙁 🙂

కథ – నేపథ్యం: పైన చెప్పినట్లు ఇది శైవుల గ్రంథం కనుక, శివలీలలు ఉంటాయి. కథను ఐదు భాగాలుగా చూడవచ్చు. మొదటి అరగంటా, చివరి సీన్లూ ఈ సినిమా కి నేపథ్యంగా అనుకుంటే, మధ్యలో వచ్చే తక్కిన నాలుగు భాగాలూ శివుడి ఆటల గురించి ఉదహరించే నాలుగు కథలు – వెరసి ఐదుభాగాలు. ఒకానొక సందర్భంలో నారదుడు ఒక ఫలం తీసుకు వచ్చి శివుడికి (శివాజీ గణేషన్) ఇస్తాడు. శివుడు పార్వతికి ఇస్తాడు. పార్వతి (సావిత్రి) తన పిల్లలకి ఇవ్వాలి అనుకుంటుంది. ప్రపంచం చుట్టి ఎవరు ముందొస్తే వాళ్లకి ఆ పండు ఇవ్వాలని వాళ్ళు తీర్మానిన్చుకుంటారు. సుబ్రమణ్యస్వామి తన నెమలి పై పర్యటనకు వెళ్ళగానే వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టు తిరిగి, ఇదే నా ప్రపంచం అనేసి పండు తనకే దక్కింది అంటాడు. ఇంతలోపు వెనక్కి వచ్చిన సుబ్రమణ్య స్వామి అలిగి కైలాసం వదిలేసి ఒక పర్వతం మీద ముని కుమారుడి వేషంలో తపస్సు చేసుకోవాలని తీర్మానిన్చుకుంటాడు. ఎవరేం చెప్పినా వెనక్కి రాడు. అప్పుడు పార్వతి అక్కడికి వెళ్లి -“బాబు, ఇదంతా మీ నాన్న గారి ఆటలు. ఇదేమి చూశావూ ఎన్ని ఉన్నాయి తెలుసా ఇలాంటి కథలు?” అంటూ చెప్పిన నాలుగు కథల తరువాత ఇతను మనసు మార్చుకుని కైలాసం తిరిగి రావడానికి నిశ్చయించుకుంటాడు. ఈ కథలు మొదలయ్యే ముందూ, వెనకా అవ్వయ్యారు (కే.బి.సుందరంబాళ్) కనిపిస్తుంది మనకి. కానీ, ఆ పాత్ర, ఆ పాత్రతో జరిగే సంభాషణలు – బహుశా ఆ పురాణంలో లేని భాగం అనుకుంటాను.

(ఇక్కడ ఈ నాలుగు కథలు చెప్పడం అనవసరం కావొచ్చు. ఎందుకంటే వికీలో ఈ కథలన్నీ వివరంగా ఉన్నాయి. కానీ, నాకు ఈ కథలు కూడా ఆసక్తి కరంగా అనిపించాయి. అందుకని నా తృప్తి కోసం రాసుకుంటున్నా.)

==స్పాయిలర్ వార్నింగ్==
కథ ౧: పాండ్య దేశంలో ఒక సారి రాజు (ఆర్.ముత్తురామన్) ఒక ప్రశ్న ఇచ్చి దాన్ని పరిష్కరించిన కవికి పెద్ద మొత్తంలో బహుమానం ప్రకటిస్తాడు. ధరుమి (నగేష్) అన్న వెర్రిబాగుల పూజారి ఈ ముక్క వినగానే ఎలాగైనా ఆ డబ్బు తనకొస్తే తన జీవితం సాఫీగా గడపవచ్చు అని తను పనిచేసే ఆలయంలోని చొక్కనాథుడి సమక్షంలో అనుకుంటూ ఉండగా శివుడు అక్కడ ఒక కవి రూపంలో ప్రత్యక్షమౌతాడు. పాండ్య రాజు ప్రశ్నకు సమాధానంగా తానే రాసిన కవితను ధరుమి కి ఇచ్చి రాజు వద్ద చదివి బహుమానం పొందమంటాడు. కొంత సంశయించినా, ధరుమి రాజు వద్దకి అది పట్టుకెళ్ళి వినిపిస్తాడు. రాజు వద్ద ఉన్న ఆస్థాన కవి నక్కీరన్ (ఏ.పి.నాగరాజన్) ఈ కవితలో దోషం ఉందని ధరుమిని అవమానించి పంపుతాడు. అది విన్న శివుడు ఆగ్రహంతో రాజు ఆస్థానానికి ఇందాకటి కవి రూపంలోనే వస్తాడు. వాదోపవాదాల మధ్య, వచ్చినది తను రోజూ పూజించే శివుడని గ్రహించినా కూడా దోషం దోషమే అని నక్కీరన్ పట్టు విడువడు. ఆగ్రహంలో శివుడు అతన్ని భస్మం చేస్తాడు. ఖంగారు పడి శరణు వెడుతున్న పాండ్య రాజు వగైరాలను చూసి చిరునవ్వు నవ్వి “ఇది నా ఆట మాత్రమే” అని, నక్కీరన్ ని మళ్ళీ మామూలు మనిషి గా వెనక్కి తెచ్చి, దేవుడైనా భాషలో చేసిన తప్పు తప్పే అని నిర్భయంగా చెప్పినందుకు అభినందిస్తాడు.

ఇదంతా విన్న సుబ్రమణ్య స్వామి “ఆయన ఎందుకిలా పరీక్షిస్తాడు భక్తులని?” అని అడిగితే “మీ నాన్న ఈ ఆటల్లో నన్ను కూడా వదలలేదు బాబూ…” అంటూ తన కథలు చెప్పడం మొదలుపెడుతుంది.

కథ ౨: ఇది పార్వతి దక్షుడి కూతురు “సతి”గా ఉన్నప్పటి కథ. దక్ష యజ్ఞం జరుగుతూ ఉండగా సతి అక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది. శివుడు అందుకు ఒప్పుకోడు. కాసేపు ఆవిడ వేడుకోలు అయ్యాక “సరే, పో” అంటాడు. “తిరిగి రమ్మని చెప్పరా?” అంటుంది ఆమె. “లేదు” అంటాడు ఆయన. సరే, దక్షయజ్ఞానికి వెళ్లి, అక్కడ తనకు, తన భర్తకు జరిగిన అవమానం తో ఆగ్రహించి, దక్షుడితో గొడవపడి కైలాసం తిరిగొచ్చిన సతి ని శివుడు బయటకు వెళ్ళమంటాడు. ఎంత బ్రతిమాలినా వినడు. ఇద్దరి మధ్య – “ఎవరు గొప్ప?” అంటే “ఎవరు గొప్ప?” అన్న వాదోపవాదాలు నడుస్తాయి. మాటల యుద్ధం తరువాత శక్తుల యుద్ధం కూడా అవుతుంది. ఉన్నట్లుండి, శివుడు సతిని భస్మం చేస్తాడు. ఆగ్రహంలో శివతాండవం చేస్తూ ఉండగా, ఇతర దేవతలు వచ్చి అతన్ని శాంతింపజేస్తారు. శివుడు శాంతించి, పార్వతికి మళ్ళీ జీవం పోస్తాడు. ఇది కూడా భగవంతుని ఆటల్లో భాగం – అంటూ ఈ కథ పార్వతీ దేవి సుబ్రమణ్య స్వామికి చెబితే అతను “బాగానే ఉంది నాటకం” అని ఆశ్చర్య పోతాడు.
(నేను చిన్నప్పుడు చదివిన దక్షయజ్ఞం కథ మరోలా ఉంటుంది కానీ, ఒక కథగా ఇది కూడా నాకు ఆసక్తికరంగానే ఉంది)

కథ ౩: శివుడి శాపవశాత్తూ పార్వతి మత్స్య కన్య కయర్కణ్ణి గా (సావిత్రి), తన అసలు స్మృతి లేకుండా జన్మిస్తుంది. ఆమె యుక్త వయసుకు వచ్చాక, కొంచెం విచిత్రంగా కనిపించే, ప్రవర్తించే చేపలు పట్టే వాడు (శివాజీ గణేషన్) ఒకడు వస్తాడు. ఆమె స్నేహ బృందాన్నీ, ఆమెనీ హడలగొట్టినా ఆమె అతని ప్రేమలో పడుతుంది. ఆ ప్రాంతాల వారిని వేధిస్తున్న ఒక తిమింగాలాన్ని ఒంటి చేత్తో చంపి, ఆ జాతి పెద్ద కూతురైన కయర్కణ్ణి ని వివాహమాడతాడు అతను. వెంటనే, వాళ్ళు శివ-పార్వతులు గా మారతారు, పార్వతికి తాను ఎవరన్నదీ తెలుస్తుంది.

ఈ రెండు కథలూ విన్నాక సుబ్రమణ్య స్వామి కొంచెం మెత్తబడినా, ఇంకా వెనక్కి రావడానికి సుముఖంగా ఉండడు. పార్వతి నాలుగో కథ చెబుతుంది.

కథ ౪: గాన కళలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హేమనాథ భాగవతార్ అందుకు తగ్గట్లే విపరీతమైన అహంకారం పెంచుకుంటాడు. ఒకసారి మరొక పాండ్య రాజు ఆస్థానంలో అఖండ గౌరవాలు పొందాక, ఆ రాజ్యంలో ఉత్తమ గాయకుడితో తాను పోటీ పడతాను అనీ, అతను ఓడిపోతే ఇక ఆ రాజ్యంలో ఎవ్వరూ పాడకూడదు అని ఒక రూలు పెడతాడు. ఇతనికి జడిసి ఎవ్వరూ పోటీకి సిద్ధపడరు. తుదకు, పరమ భక్తుడు, గుడిలో పాటలు పాడే బాణ భట్టార్ ని అతనితో పోటీ పాడమని రాజు ఆజ్ఞాపిస్తాడు. బాణ భట్టార్ భయంతో ఏం చేయాలో తోచక శివుడ్ని ప్రార్థిస్తాడు. అతను ప్రార్థనలో ఉండగానే శివుడు ఒక కట్టెలు కొట్టే వాడి రూపంలో పాండ్య రాజ్యంలోకి వచ్చి, కాసేపు ఊర్లో తిరిగి – చివరకి భాగవతార్ ఉన్న సత్రం బయట కూర్చుని కాసేపు గాత్ర కచ్చేరీ చేస్తాడు. లోపల నుంచి అది విన్న భాగవతార్ కు తన అహంకారం గురించి అప్పటికే కొన్ని ఆలోచనలు మొదలవుతాయి. బయటకు వచ్చి ఇతన్ని గురించి ఆరా తీస్తే, ఈ కట్టెలు కొట్టే వాడు – “నాకేమీ రాదు. చిన్నప్పుడు కొన్నాళ్ళు బాణ భట్టార్ వద్దకు వెళ్లాను. ఆయన నాకేం చేతకాదని గెంటేసారు. అప్పుడప్పుడు అప్పట్లో నేర్చిన పాటలని ఇలా పాడుకుంటూ ఉంటాను” అని చెబితే, “వీడే ఇలా ఉంటే, రేపు నేను అ బాణ భట్టు తో పోటీ పడాలా!” అని భయంతో తన ఓటమి అంగీకరిస్తున్నట్లు ఒక లేఖ రాసి, రాత్రికి రాత్రి ఊరు విడిచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఈ సంగతి బాణ భట్టుకి చెప్పి, తనేవరైనదీ తెలిసేలా చేసి తన విగ్రహంలోకి అంతర్థానమౌతాడు శివుడు.

ఇవన్నీ విన్నాక, శివుడు, వినాయకుడు కూడా అక్కడికి వచ్చాక – సుబ్రమణ్య స్వామి వెనక్కి రావడానికి అంగీకరిస్తాడు. అతను అలిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అడ్డుపడి అతన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలమైన తమిళ కవయిత్రి అవ్వయ్యారు మళ్ళీ వస్తుంది. అతన్ని కుటుంబంతో చూసి సంతోషించి ఆవేశంలో కవిత పాడుతుంది. తరువాత పార్వతి “ఒకటి, రెండు మూడు… ఇలా సంఖ్యల వారీగా శివుడ్ని స్తుతించు” అని అడిగితే, “ఒకటైన వాడు, ఒకరిలో రెండైన వాడు… ” ఇలాగ శివుడి గురించి మరొక పాట పాడుతుంది. చివర్లో – “ఫలం కోసం అలిగి వచ్చి ఈ కొండమీద ఉన్నాడు కనుక ఈ కొండ పళనిమలై” అని పిలువబడుతుంది అని శివుడు చెబుతాడు.
-ఇదీ ఈ సినిమా కథ.
==స్పాయిలర్స్ అయిపోయాయి==

ఈ సినిమాలో సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా చోట్ల మాటలు వింటూ ఉంటేనే పాటల్లా వినసొంపుగా అనిపించాయి. ఇక శివుడి దగ్గరకొచ్చి కయర్ కణ్ణి “ఆ ఈశ్వరుడు నిన్ను కాపాడు గాక” అనడం, ఇతర పాత్రలు కూడా శివుడి మారువేషాలతో శివుడి లీలల గురించి ప్రస్తావించడం, కట్టెలు కొట్టే వాడి రూపంలో శివుడు తన రెండిళ్ళ పూజరితనం గురించి చెప్పుకు వాపోవడం – ఇలాంటి చోట్ల సంబాషణలు బాగా చమత్కారంగా రాసారు అనిపించింది. ఉదాహరణకి : ధరుమి స్వగతంలో మాట్లాడుకుంటూ ఉండగా శివుడు కవి రూపం లో ప్రత్యక్షమై, రాజు ప్రకటించిన చాలెంజ్ గురించి అడుగుతాడు.
ధరుమి: “ఓహో, నేను ఏదో నా గోడు నేను చెప్పుకుంటూ ఉంటే వెనకే నుంచి రహస్యంగా వినేసావా?” .
శివుడు – “రహస్యంగా వినే అలవాటు నాకు లేదు. నువ్వు నాముందే చెప్పుకున్నావు ఇదంతా..”
ధరుమి – “ఓహో, నేను కళ్ళు మూసుకుని మాట్లాడుకుంటున్నా కదా…నువ్వు నా ముందు నిలబడి ఉన్నావా అప్పుడు?”.
శివుడు – “అవును, కళ్ళు మూసుకు పోయిన వారికి నేను కనిపించను”
ధరుమి – “ఓహో…ఏమిటీ దేవుడిలా మాట్లాడుతున్నావ్?”

ఇలా సాగుతుంది.
***
ఇక, నాకు ప్రత్యేకంగా నచ్చిన డైలాగ్ సీక్వెన్స్ – శివుడి కోపాగ్నికి బాలయ్యే ముందు సతి కి, శివుడికి మధ్య జరిగే వాదోపవాదాలు.
“సర్వం శివమయం”
“సప్తర్షులని, దేవతలనీ అందరిని అడిగి చూడండి… శక్తి లేనిదే శివుడు లేడు అనే అంటారు.”
“నోటికొచ్చినట్లు మాట్లాడకు. శివుడే ఈ ప్రపంచానికి మూలం”
“లేదు, శక్తే ఈ ప్రపంచానికి మూలం”
“శివుడు లేనిదే శక్తి లేదు”
“శక్తి లేనిదే శివుడు లేడు”.
“శివుడే గొప్ప”
“శక్తే గొప్ప”
“మగవాడు ఆడదాని కన్నా ఎక్కువ.” (శివుడి నోట… అర్థ నారీశ్వరుడి నోట ఈ ముక్క పలికించడం నాకు వింతగా అనిపించింది. కానీ, కోపంలో మనుషులు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు కదా. దేవతలు కూడా అంతే కాబోలు! అనుకున్నా 😉 )
“ఆ మగవాడు కూడా ఒక ఆడదాని నుండి వచ్చినవాడే”
“నువ్వు లేకున్నా నేను ఉండగలను”
“నేను లేక నువ్వు లేవు”.
…ఇలా సాగింది. దేవతలు మామూలు మనుషుల్లా కొట్టుకోవడం ఎందుకో గానీ నాకు నచ్చింది. 🙂
(ఇంక ఇదంతా జరుగుతున్నప్పుడు సావిత్రి ని చూడాలీ… రకరకాల ఎమోషన్స్ మార్చి మార్చి చూపిస్తుంది. మొదట క్షమాపణ అడుగుతున్న భార్య… తరువాత ఆయన ఎంతకీ వినకపోవడంతో క్రమంగా అది విసుగుతో కూడిన బాధ… తరువాత కోపం… తరువాత “నువ్వెంత అంటే నేనెంత” అనుకునే సందర్భంలో ఆ “ఏం చేస్తావో చేస్కో పో” తరహా నవ్వు : ఇలాగ రకరకాల మూడ్స్)
********
ఇక, ఈ సినిమా మొత్తం మీద నా మీద బాగా ముద్ర వేసినది అవ్వైయారు పాత్ర. అవ్వైయ్యారు నిజంగా ఎలా ఉంటుందో నాకు తెలియదు. అసలుకి చిన్నప్పుడు చదివిన ఏదో చిన్న కథ తప్ప ఆవిడ గురించి వివరం కూడా తెలియదు. కానీ, సుందరంబాళ్ ను చూడగానే “ఈవిడే అవ్వయ్యర్” అనిపించింది. నిజానికి ఈ కథలో అవ్వయ్యారు రావడం పూర్తిగా డి.పి. నే (దర్శకత్వ ప్రతిభ) అని నా అనుమానం (లేకపోతే, కైలాసంలో జరిగే కథలో భూమ్మీద తిరిగిన అవ్వయ్యారు ఎలా ఉంటుంది పురాణాల్లో??). ఏదేమైనా, ఆవిడది గొప్ప స్క్రీన్ ప్రేజేన్స్. అలాగే, అద్భుతమైన గాత్రం. ఆవిడ మాటలు-పాటలు ఎంతసేపైనా వినొచ్చు అనిపిస్తుంది నాకు. “పళం నీయప్పా…జ్ఞాన పళం నీ అప్పా” అన్న పాటని, చివర్లో వచ్చే “ఒండ్రానవన్” పాటని పూర్తిగా అర్థం అయినా కాకపోయినా మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నాను. ఇక, భక్తులు వచ్చి దేవుళ్ళకి సుద్దులు చెప్పే సన్నివేశం అయినందువల్ల కూడా, అవ్వయారు ఉన్న దృశ్యాలు నాకు బాగా నచ్చాయి అనుకుంటాను. అవ్వయ్యారు కీ కుమారస్వామికీ మధ్య జరిగే సంభాషణ, పద్యాలు, పాటలు అన్నీ చాలా గొప్పగా తీసినట్లు అనిపించింది.

ఇక పోతే ఈ పాత్ర సంబంధంలోనే నాకు మరొక్క సందేహం కూడా వచ్చింది. అవ్వయారు కుమారస్వామి ఒక కొండపైన ఈ సాధువు వేషంలో కి వచ్చేసాక అతన్ని ఇలా చేయకూడదు అని చెబుతూ పాడిన పాటలోనే ఒకచోట “పళనిమలై పై ఉండే మురుగా…” అంటూ సంబోధిస్తుంది. ఆ తరువాతి పాట కూడా : “పళం నీ యప్పా… జ్ఞాన పళం నీ యప్పా..తమిళ్ జ్ఞాన పళం నీ యప్పా” అని మొదలవుతుంది. ఆ పాట వింటూ నేను బహుసా అది పళనిమలై పై ఉండే పళనియప్ప గురించిన వర్డ్ ప్లే ఏమో అనుకున్నా. కానీ, చివర్లో ప్రసన్నుడైన కుమారస్వామితో శివుడు వచ్చి -పండు (పళం) గురించి అలిగి ఇక్కడికి వచ్చావు కనుక ఈ ప్రాంతం పళం-నీ అని నీ పేరుమీదే ఈ ప్రాంతం పళని అని పిలువబడుతుంది… అంటాడు. కనుక నాకు కొంచెం అయోమయంగా అనిపించేసింది.

కథనం మొత్తంలోనూ ఎక్కడికక్కడ తమిళ భాష గురించీ, తమిళ జాతి గురించీ సందర్భోచితంగా డైలాగులు జొప్పించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అది కూడా పూర్తిగా డి.పీ. యే నని నా నమ్మకం. లేకపోతే పాండ్య రాజు, అతని ఆస్థాన కవులూ వీళ్ళంతా తమిళం గురించి పొగుడుకున్నా అర్థం ఉంది. దేవుళ్ళు ఎందుకు పొగుడుతారు?! అయినా ఆ డయిలాగులు నాకు నచ్చాయి.. “ఎవ్వరు చెప్పినా వినని నేను నీ తమిళ వాక్కు కోసం ఆగాను…అంతే కానీ, అలక మాని కాదు” అంటాడు ఒక చోట కుమారస్వామి అవ్వయ్యారు తో. నా మట్టుకు నాకు అది నా భాష కాకపోయినా కూడా అలాగా దేవుళ్ళూ వాళ్ళూ కూడా మన భాష, దాని తియ్యదనం అనుకుంటూ మాట్లాడుకోవడం చాలా నచ్చింది.

చివరి కథలో – హేమనాథ భాగవతార్ తన పాట విని పారిపోయాక, కట్టెలు కట్టేవాడి రూపంలో ఉన్న శివుడు బాణ భట్టార్ ను చేరుకొని ఈ సమాచారం అందిస్తాడు. ఆశ్చర్యానందాలతో ఉన్న అతను శివుడితో – “నువ్వెవరు బాబూ?” అంటాడు. శివుడు శివాజీ గణేషన్ మార్కు నవ్వుతో, “నన్ను చూడు, నేనెవర్నో తెలీదూ?” అంటూనే మూల విగ్రహం వైపుకి పరుగెత్తుకుంటూ వెళ్లి అందులోనికి అంతర్థానమైపోతాడు – ఆ దృశ్యం కూడా నాకు విపరీతంగా నచ్చింది. శివాజీ ఎగురులాంటి పరుగుతో వెళ్లి ఆ విగ్రహంలో మాయమైనప్పుడు అదొక రకం పులకింత (మనసుది) కెవ్వున కేకేసి బయటకు దూకబోయి ఆగిందంటే నమ్మాలి. అది శివాజీ పరుగులో అందానికి కాదు. ఆ దృశ్యంలోని అందానికి. ఈ కథలో వచ్చిన పాటలు కూడా బాగున్నాయి – సబ్టైటిల్స్ పుణ్యమా అని భావం తెలుసుకున్నాక.

ఇవి కాక సినిమాలో సెట్స్, రంగులు – నాకు చాలా నచ్చాయి. ఎక్కడా బోరు కొట్టకుండా చెప్పారు కథలని కూడా. శివాజీ గణేషన్ నాలుగు పాత్రలూ నాలుగు రకాలుగా చేసాడు, అదీ బోలెడంత ఎనర్జీతో. ఆ తిమింగలాన్ని పట్టిన చేపలు వాడి గెటప్ లో శరీర భాష మాత్రం పరమ వెరైటీ గా ఉంది – ఎవరి ఆలోచనో గానీ! సావిత్రి సంగతి చెప్పనే అక్కర్లేదూ – నవ్వినా ఏడ్చినా ఆగ్రహంతో ఉరిమి చూసినా సావిత్రి సావిత్రే!! నగేష్ స్వగతాన్ని తమిళ సినిమాల్లోని గొప్ప సన్నివేశాల్లో ఒకటిగా అభివర్ణిస్తారట. ఈ టైపులో భావన నాకు ఇంకా కలగకపోయినా, ఈ చిత్రంలో నాకు బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ చూసిన సన్నివేశాలలో ఆ స్వగతం ఒకటి.

ఇలాగ చెప్పుకుంటూ ఉంటే ఈ సినిమా గురించి ఇంకా చెబుతూనే ఉంటానేమో. ఇంతా చెప్పాక క్లుప్తంగా ఒక్క ముక్కలో చెప్పడానికి ఏముంది కానీ…. మొత్తానికి, ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా. తమిళ పౌరాణికాలు నేనెప్పుడూ చూడలేదు (ఏవో కొన్ని తేజా టీవీ లో వచ్చిన కే.ఆర్.విజయ దేవీ మహిమ టైపు డబ్బింగ్ సినిమాలు తప్ప). ఇది చూసాక మాత్రం తప్పకుండా కనీసం నాగరాజన్ తీసిన తక్కిన పౌరాణికాలు అయినా చూడాలి అని అనిపించింది. అన్నట్లు చివరగా చెప్తున్నా ముఖ్యంగా చెబుతున్న ఒక్క ముక్క – మత విశ్వాసాలతో సంబంధం లేకుండా కూడా ఈ సినిమా చూడవచ్చు. అని నా నమ్మకం. కేవలం కొంచెం ఓపెన్ మైండ్ ఉంటే చాలు. నేనలాగే చూసాను అనే నమ్ముతున్నాను.

తిరు విళయాడల్ (౧౯౬౫) సినిమా వికీ లంకె,

మొత్తం సినిమా ఆంగ్ల సబ్-టైటిల్స్ తో

4 Comments
  1. Amar September 4, 2012 /
    • Sowmya September 5, 2012 /
  2. Sowmya September 6, 2012 /
  3. కొత్తపాళీ September 17, 2012 /