Menu

టైం పాస్ సినిమా సుడిగాడు

సుడిగాడు సినిమాలో నరేష్ హీరోయిన్ ను పడేయాలని భీభత్సంగా డాన్స్ చేస్తాడు. అతని డాన్స్ ను చూసి జడ్జి గా వున్నా సుందరం మాస్టర్ సూపర్ అని మెచ్చుకుంటాడు. శివశంకర్ మాస్టర్ ఇదేం డాన్స్, నువ్వు అరటి పండును పడేసి తొక్కను తిన్నావు అని చెబుతాడు. పోసాని కృష్ణమురళి కళాకారున్ని గౌరవించాలి అని వాదిస్తారు. సుడిగాడు సినిమా లో కూడా పండు అనే కథను వదిలి సీన్లు అనే తొక్కను ప్రేక్షకుల మీదకి పంపారు.

భీమిలేని శ్రీనివాసరావు గారు రీమేకును మేకు చేయడంలో మంచి నేర్పరి అనే పేరుంది. తమిళం లో హిట్ అయిన ఒక సినిమాని తెలుగులో సుడిగాడు గా తీసి ప్రేక్షకులను పడేయాలని భీభత్సమైన పబ్లిసిటి తో తీసారు. అయితే భీమినేని సినిమా అంటే సీన్స్ అనుకున్నాడు. ఎంత మంచి సీన్స్ అయిన కథను ముందు తీసుకెళ్లడానికి ఉపయోగపడాలి. గతంలో టి.వి.లో కొన్ని సినిమాల్లోని మంచి మంచి సీన్లను చూపించేవారు. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేసేవారు. ఆ సీన్లు సినిమాలో చూసినప్పుడు అంతగా బాగుండకపోవచ్చు. ఈ సినిమాలో అదే జరిగింది.

చాలా సినిమాలోని సీన్లను అనుకోని వాటిని ఒక దాని తర్వాత ఒకటిగా పేర్చుతూ, వాటిని కథ అనే సన్నని దారంతో గుదిగుచ్చి సుడిగాడుగా ప్రేక్షకుల మీదకు వదిలారు. తెలుగు సినిమా అంటే హీరో కథ. హీరో చేసే సాహసకృత్యాలు, హీరోయిన్ చేసే డాన్స్, విలన్ ని చివరికి అంతం చెయ్యడం, అనే ఫార్మేట్ లో చాలా కాలంగా ఇమిడిపోయింది. ఎవ్వరు ఎంత గొప్ప హిట్ సినిమా తీసిన ఈ ఫార్మేట్ లోనే తీయాలి. తప్పదు అనే అభిప్రాయం సర్వత్రా ఉంది.

హీరోయిజం కొన్న్ని సంవత్సారాలుగా ఉహించలేనంతగా, వాస్తవానికి దూరంగా, అతను ఒక అవతార పురుషుడు ఆన్నంత దూరం వెళ్ళిపోయింది. అభిమానులనే అల్లరి మూకను ఆనందపరచడమే హీరోయిజం అయిపొయింది. ఆ అభిమానులనుతృప్తి పరచడం కోసం మన తెలుగు హీరో ప్రపంచలో ఎవరు చేయలేని పనులు చేస్తున్నాడు. ఫలితం సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాయారు చేసిన స్పూఫ్ కధ ఈ సినిమా.

ఇక సుడిగాడు సినిమా కథ విషయానికొస్తే హీరో పుట్టడమే సిక్స్ ప్యాక్ తో పుట్టి, పుట్టి పుట్టగానే ఉచ్చపోసి ఫ్యాక్షనిష్టులను చంపుతాడు. అతని ఉచ్చకు అంత పవర్ ఉంటుంది. ఆ ఉచ్చ పోసినవాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే, వాడు అప్పుడే పుట్టిన హీరో అని తెలిసి ఆశ్చర్యపోయి హీరో ని తీసుకొని వచ్చి పెంచి పెద్దగా చేసి చంపి పగ తీర్చుకోవాలని అనుకుంటాడు ఫ్యాక్షనిష్టు. ఈ విషయం తెలుసుకున్న హీరో తల్లితండ్రులు ఆ పిల్లవాన్ని హీరో బామ్మకు అప్పజెప్పి దూరంగా వెళ్ళిపొమ్మని చెప్తారు . బామ్మ పసిహీరోని తీసుకెళ్ళి హైదరాబాద్ లో పెంచి పెద్ద చేస్తుంది. ఇక్కడి నుండి మన తెలుగు సినిమాలో వచ్చిన రకరకాల సినిమాల్లోని సీన్లను కలిపి కిచిడి లాగ వండి సుడిగాడు అనే సినిమా తయారైంది.

ఈ సినిమా రుచి ఎలా ఉందంటే లోకో భిన్న రుచి అన్నట్టు కొందరికి నచ్చవచ్చు. అల్లరి నరేష్ నవ్వించడం లేదు. నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం అన్ని వేళలా విజయం సాధించలేదు.

పాటలు, సంగీతం ఒకే ఫోటోగ్రాఫి బాగుంది. హీరోయిన్ నటించడం నేర్చుకుంటే నిలబడుతుంది. సినిమాలో ఉండాలి కాబట్టి బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, తాగుబోతు రమేష్ లు ఉన్నారు. బాయ్స్ గా నటించిన ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం, కొండవలసలు నవ్వించేందుకు చేసే ప్రయత్నం పర్లేదు.

ఈ సినిమాను మొదలు పెట్టడమే ఈగ సినిమాను చెప్పినట్లు చెప్పాలనుకున్నారు. కొంతవరకు బాగానే ఉంది. అయితే ఈగలో బలమైన కథ, కథనం ఉంది. ఇందులో అదే లోపించింది. మొత్తానికి ఒక టైంపాస్ సినిమా సుడిగాడు.

–రవికిరణ్