Menu

నన్ను దొంగిలించిన Malèna!

……….. నీడల గుట్టు మసకగా విప్పే
కంతల వెనక నక్కిన లేతప్రాయంలో
అర్థాలు తెలీని ఉద్విగ్నతని
తిట్టావు తొలిగా-

ఆ తత్తరపాటు క్షణాలకి
ఎవరు చెప్పారు
చీకటి కొంగు చేలాంచలాల కోసం
ఏళ్ళుగా ఎదగమని.
ఓరచూపులేసిన కొక్కేలకి
చర్మం ఒల్చిన
మాంసం ముద్దై వేలాడమని…….

……ఇది నా శారీరక గానాల దేహ చింతని nostalgicగా దశల వారీగా గుర్తు చేసుకుంటూ 1993లో నేను రాసుకున్న “నీడల్లేని చీకట్లో” కవితలోని ఓ భాగం.
2012లోంచి మాట్లాడితే, సుమారు 32 ఏళ్లనాటి జ్ఞాపకాన్ని మించిన, అనుభూతి కాలేనంత దూరమూ, అనుభవమై మిగిలిపోయినంత చేరువ ఐన ఒకానొక ఊసు:
నేనప్పడు ప్రి మెట్రిక్యులేషన్‌లో ఉన్నాను (ఆంధ్రా యూనివర్శిటీ purviewలో ఉన్న వాళ్ళంతా ఎస్సెస్సీ కంటే మెట్రిక్యులేషన్ స్టాండర్డ్ ఎక్కువని నమ్మేవారు). మా కాన్వెంట్ పైన రెండతస్తుల్లో ఉండేది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మూడు పోర్షన్లు- ఒక పెద్ద పోర్షన్‌లో మా కాన్వెంట్ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గారి ఫ్యామిలీ ఉండేది. పక్కదాంట్లో ‘ఆమె’ ఒంటరిగా ఉండేది. వయసు నాకంటే రెట్టింపు ఉండొచ్చు. ఆమె పేరు మాకెవ్వరికీ తెలీదు. అందరూ ఎల్‌త్విజటర్ గారూ అని మాత్రమే పిలిచేవారు. అంటే ఏమిటో అప్పట్లో తెలియదు. (దానికర్థం- హెల్త్ విజిటర్ అని అర్థమయ్యే దశాబ్దం నాటికి ఆమెక్కడో, నేనెక్కడో). తెలియాల్సిన అవసరాన్ని నేనెప్పడూ గుర్తించలేదు. కాన్వెంట్ టైమ్ ప్రకారం వస్తే ఆమె దర్శనం కష్టం. తన డ్యూటీకి తయారయ్యే హడావిడిలో లోనెక్కడో ఉంటుంది. అలానే, సాయంత్రం స్కూలు అయిపోయాక వెళ్లిపోతే, అప్పటికి డ్యూటీ నుంచి రాదు. అందుకే, స్కూలు టైమ్ కంటే చాలా ముందొచ్చి, పొద్దు గూగాక ఇంటికెళ్లే వాడిని.

ఆ కాంపౌండ్ గేటు తీసి లోపలికి అడుగు పెట్టగానే కుడిచేతి వైపు పెద్ద బావి. వెడల్పాటి బావి గట్టు మీద ఒక కాలు మడిచి బాసీపట్టు వేసుకొని విలాసంగా కూర్చొని వేపపుల్ల నములుతుండేదామె, నేనెళ్లే టైమ్‌కి. కిందకి చాపిన కాలిమీద చీర మోకాలు దాకా లేచి పోయుండేది. మూతికి తేనె రాసిన ఉడుములా నా చూపు ఆమె పిక్కలనంటి పైపైకి పాకాలని ప్రయత్నించి పట్టు చిక్కక పదేపదే జారిపోయేది పాదాలకి. నేను కొంచెం ఆలస్యమైతే ఇంటి పంచలో వాలుకుర్చీలో కాఫీ చప్పరిస్తూ కనిపించేంది. కనిపించని సంకెళ్లు తెంచుకోవడానికి పెనుగులాడేదేమో నిరంతరం, ఆమె ఒంట్లో అంగాంగం దానికనుగుణంగా చలించేవి అశాంతిగా. వాలు కుర్చీలో చేతులు వాల్చుకునే చెక్కమీద ఒక కాలెత్తి పెట్టి కూర్చునేది, కాఫీ సేవిస్తూ. ఆ వాలు కుర్చీ పక్కగా ఆమె ఇంటి పంచలోంచి పైకి ఇరుకైన స్పైరల్ మెట్లుండేవి, మా ప్రిన్సిపాల్‌గారు పైకి రావడానికి. స్టూడెంట్స్‌కి వేరేవైపు వెడల్పాటి మెట్లు. నేను మాత్రం ప్రిన్సిపాల్ గారి మెట్లే వాడేవాడిని. పొద్దున పూట, వాలుకుర్చీలో ఆమె వగలమారి భంగిమల్ని టాప్ వ్యూ లోంచి దాగుడుమూతల ఆటలోలా చూస్తూ ఆ గుండ్రని మెట్లని మెల్లమెల్లగా ఎక్కడం మరో జన్మకి కూడా వెంటొచ్చే అనుభవం.

ముందొచ్చిన రోజు రెండు దృశ్యాలు, కొంచెం వెనకబడితే రెండో దృశ్యం…… అంతే ప్రాప్తం! అయితే, దృశ్యంలో మార్పు లేపోయినా, ఏనాడు మొనాటనస్‌గా ఉండేదే కాదు. ఎందుకంటే, ఈక్షణంలో కనిపించిన ఆమెకి, మరుక్షణంలో కనిపించే ఆమెకి పొంతనుండేది కాదు కాబట్టి. క్షణక్షణానికీ ఏదో కొత్తగా దొరుకుతుండేది ఆమెలో. పోగుబడిందేందో చూద్దామని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండేది కాదు. బట్టలు కూడా ఆమె మూడ్స్ ప్రకారం కవళికలు మార్చుకునేవనుకుంటా. ఇంట్లో ఉన్నప్పడు కట్టే చీరలు అరకొరగా ఆపసోపాలు పడుతూ తన ఒంటిమీద సొలసి సోలిపోతున్నట్టుండేవి. డ్యూటీకెళ్లేటప్పడు పూలని కట్టిన పొట్లంలా ఒద్దికగా ఉండేవి.
మా కాన్వెంట్‌కి ఖాళీ స్థలం లేదు ఆడుకోడానికి (చాలా కాన్వెంట్లకి ఉండేది కాదు కూడా). అందుకే సాయంకాలం గవర్నమెంటు హైస్కూలు గ్రౌండ్స్‌కి తీసికెళ్లేవాళ్లు. ఆటలంటే ఆసక్తి లేని వాళ్లు ఇళ్లకి వెళ్ళిపోయేవాళ్లు. నేను పెద్ద చదవరిలా స్కూల్లో ఉండిపోయేవాడిని. నేనెప్పడూ స్కూలు ఫస్ట్ అవ్వడం వల్ల, ఆయమ్మలనుంచి అయ్యవార్ల దాకా నా తెలివితేటలు, బుద్ధిమంతనం వంటి గుణగణాలు కీర్తించే వాళ్ళు కాబట్టి ఏ ఇబ్బందీ ఉండేదీ కాదు.

మా క్లాస్ రూమ్ కిటికీ దగ్గరదే నా డెస్క్. దాంతో, ఇక సాయంత్రాలు దానిమీద పుస్తకాలు ముందేసుకొని కూర్చొని, ఆమె రాకకోసం చూస్తుండే వాడిని. మచ్చుకైనా చెట్లుండని మా వూళ్లో, ఆ వీధి చివర్న మాత్రం ఉండేది, జడలు విరబోసుకొని నా కోసమే అన్నట్టు. అది అడ్డుండటం వల్ల ఆమె దగ్గరకొచ్చేంత వరకూ తెలిసేది కాదు. వీలు కాదని తెల్సినా, నా చూపు చెట్టు కొమ్మల్ని, ఆకుల్ని చీల్చి ముందుకెళ్లాలని విఫలయత్నం చేసేది. నిత్యం ప్రొద్దున వెళ్లేటప్పటికీ తిరిగి వచ్చేటప్పటికీ ఆమె ముఖంలో పిసరంత మార్పుండేది కాదు. అంతే తాజాగా ఉండేది. మూడు మూడు మెట్లు దూకుతూ వెళ్లేవాడిని కిందకి. తన ఇంట్లోకి వెళ్లేముందు మా ప్రిన్సిపాల్‌గారి భార్య ( నేను ‘అత్తమ్మ’ అనే వాడ్ని) తో కబుర్లు కొట్టడం ఆమెకి రివాజు. ఓనమాలు దిద్దడానికే ఉన్న పెద్ద పలక లాంటి ఆమె వీపు, ఉట్టిమీద వెన్నకుండల కింద చుట్టకుదుర్లు పేర్చినట్లుండే ఆమె నడుం మడతలు… క్షణం వృధాపోకుండా తదేక దీక్షగా చూడటం నాకు పరమ రివాజు. ముఖమెంత తాజాగా ఉన్నా, కోస్తా తీరాల వాళ్లం కాబట్టి ఉప్పిరిసే చెమట నుంచి తప్పించుకోలేం. చెమట్లు ఎక్కువ పట్టే శరీరతత్వం కాబట్టి, నా చూపులు తచ్చాడిన మేర పటికబెల్లం పలుకులు తళుక్కుమంటూనే ఉండేవి. ఆమె లోపలికెళ్లి, మఫ్టీలోకి మారొచ్చిన తర్వాత దృశ్యమే నన్ను అలవాటు కాలేనంత ఇబ్బంది పెట్టేది. వస్తూ వస్తూ ఆమె రోజూ చేపలో, రొయ్యలో….మరేవో జీవజాలాల్ని తీసుకొచ్చేది. చీర మోకాళ్ళ పైకి మడిచి, కామరతీదేవికి కూడా సాధ్యంకాని భంగిమలో కూర్చొని, నిలకడ లేని పైటని నిర్లక్ష్యం చేస్తూ, చేపల్ని బండకేసి రుద్దుతూనో, రొయ్యల్ని వేరుశెనగపప్పల్లా వలుస్తూనో ఉండేది. ఆమె సహజ పరిమళం, ఈ మృత జీవాల దుర్గంధం కలగలసి, ఇంగ్లీషు టీచర్ చెబుతున్న Figures of Speechలో oxymoron అనుభవంలోకి వచ్చేది. మొదట్లో దూరదృశ్యానికే పరిమితమైన నన్ను, ఆమే ఆ కార్యక్రమంలో భాగస్వామిని చేసింది. బావిలోంచి నీళ్లుతోడి ఆమె చెప్పినప్పడల్లా పోయాలి. ఇంట్లో పూచికపుల్లని కూడా ఎత్తి పక్కన పెట్టని నేను, ఆమె కోసం బావిలో నీళ్లేంటి, పాతాళగంగనే తేగలనన్న బడాయిలు పోయేవాడ్ని లోలోపల. కానీ, కొండలు, లోయలు తిరగలేదు కాబట్టి తెలియదు గానీ, మేడమీంచి కిందకి, బావిలోపలికి చూడాలంటే మాత్రం తగని భయం; కళ్ళు తిరిగేవి. వెడల్పాటి బావి చప్టా మీదెక్కి నీళ్లు తోడేవాళ్లు తోటి సాహసికులు. నేను మాత్రం, చాలా కష్టంగా వంగి తోడి తీసేటప్పటికి బొక్కెన సగమే ఉండేవి నీళ్లు. ఈ బావి లోతులోకి చూడటానికి భయపడేవాడినే గానీ, నూరు నూతుల లోతుండే ఆమె cleavageలోకి తొంగితొంగి చూడటంలో ఏ జంకూ ఉండేది కాదు. ఇంత చూస్తానే గానీ, ఆమె ఒంటి రంగేమిటో తెలియదు. నలుపు, ఎరుపు, చామన ఛాయ….అంటూ మనుషుల రంగు చాలామంది ఇట్టే చెప్పేస్తారు. తనదే, కాదు నేను చూసే ఏ స్త్రీ ఒంటి రంగూ నాకు అర్థం కాదు, ఎంత పరకాయించి చూసినా. కొంకర్లు తిరిగే నరాల్లో నలుపెరుపు నెత్తురు, చూపుకి పొరలు కప్పే కుంకుమ జీర, ఆవురనే నిట్టూర్పు, బావురుమనే అడియాశ, దిక్కుతోచక విరిగే మెటికల అసహనం…అన్నింటినీ paletteలో కలగలిపితే వచ్చే వర్ణం. ఆ వర్ణం వివర్ణమౌతూ కూర్చున్న చోటినుంచి తనింట్లోకి వెళ్లిపోవడంతో పగటి ముఖాన మసకచీకట్లు కమ్మేసేవి; నేను ఇంటి ముఖం పట్టేవాడ్ని ఈసురోమని.
ఓ రోజు, భుజాన పుస్తకాల సంచేసుకుని ఎప్పటిలానే మౌనంగా విక్రమార్కుడిలా వెళ్లిపోతున్న నాకు మా అత్తమ్మ (ప్రిన్సిపాల్ గారి భార్య) ఒక చిన్న పని చెప్పింది. ప్రిన్సిపాల్ గారి చిన్నబ్బాయి నా క్లాస్‌మేట్. వాడు కూడా ఇంట్లో లేకపోవడం వల్ల వెనక పోర్షన్‌లో తాళాలిచ్చి ఏదో తెమ్మని పురమాయించింది అత్తమ్మ. నిజానికి కింద రెండు పోర్షన్లే, పెద్దవి. అంత పెద్ద ఇల్లు తనొక్కదానికీ అనవసరమని ఎల్‌త్విజటర్‌గారు అనడం వల్ల మధ్య చెక్క పార్టీషన్ పెట్టి రెండుగా విడదీశారు. అలా విడదీయగా వేరైన వెనక పోర్షన్ కూడా తమకింద ఉంచేసుకుని స్కూలుకి సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్స్, ఫైల్స్, బీరువాలు సర్దేశారు ప్రిన్సిపాల్ గారు. ఇంటికి సంబంధించిన సామాను కోసం దాంట్లో ఓ చిన్నగది వాడేది అత్త. ఆ గదిలోకి వచ్చి, అత్త చెప్పిన వస్తువు కోసం వెదుకుతుంటే పక్కనుంచి చిన్న కూనిరాగం, నీళ్ళ చప్పడు వినిపించాయి. బాత్‌రూమ్‌లో ఆమె స్నానం చేస్తుందని అర్థమయ్యింది. మేథ్స్‌లోనే అనుకున్నా గానీ, ఈ విషయాల్లో కూడా నా బుర్ర అంత చురుకుగా పనిచేస్తుందని తెలియదు. చప్పడు లేకుండా లోన తలుపు తీసి, ఆమె పోర్షన్ వైపు వచ్చాను పిల్లిలా. నిజానికి మొత్తం రైలు కంపార్ట్‌మెంటులా ఒకే ఇల్లు కాబట్టి, హాలుకి, వెనక రూములకి మధ్య ఉంటాయి టాయిలెట్, బాత్ రూమ్‌లు. వాటికి హాలులోంచి, ఇటు బెడ్రూమ్‌నుంచి కూడా తలుపులు ఉంటాయి. సామాన్లు డంప్ చేసిన వెనక పోర్షన్‌కి బాత్రూమ్ అక్కర్లేదు కాబట్టి ఆమే విచ్చలవిడిగా వాడేసుకునేది. బాత్రూమ్, టాయ్‌లెట్లవి ప్రిన్సిపాల్ గారింట్లో పాతకాలం రేకు తలుపులు. దానికి నకలు లాంటి ఈపోర్షన్ లో దేవదారు చెక్కతో అయితే చేయరు కదా అన్న నా ఊహ నిజమే; బాత్రూమ్ తలుపుకి కావాల్సినన్ని కన్నాలున్నాయి. ఎంత ఎండైనా, ఉక్కైనా చిరు చెమటైనా పట్టని నాకు, బాత్రూమ్ కంతలోకి కన్ను పెట్టాక చెమట్లు దిగ్గారిపోయాయి. నీళ్ళ చప్పడు, ఆమె హమ్, ఇంకా ఏ శబ్దాలూ వినిపించనంత ఎక్కువగా, ఏదో డప్పకొడుతున్నట్టుగా వినిపిస్తుంది నా గుండె కొట్టుకునే రొద. ఇదంతా మొదటిసారి యాతన మాత్రమే. ఇది మరిగిన తర్వాత రెండోసారికే గొప్ప అనుభవ పరిణితి వచ్చేసింది. రోజూ ఇంటికెళ్ళడం మరింత ఆలస్యమయ్యేది. స్నానమంటే రెండు చెంబులు కుమ్మరించుకోవడం కాదని, నదులోల్లని స్నానమనే యోగమని, నా స్నాయువుల్ని చూపుడు వేలితో మెలిపెట్టి లాగే ఆగమని నాకర్థయ్యిందప్పడే.

అన్ని సార్లు చూసినా, ఆమెని అనాచ్ఛాదితంగా చూడలేకపోయాను. నలుగు కలిసిన పసుపు పూత కప్పేసేది కాసేపు. అంటు అశాశ్వతమై, ఎండిన నలుగు పిండి రాలిపోతున్నప్పడు నగ్నమౌతున్న ఆమె ఒంటిని నీళ్లు జలతారు తెరలై మూసి, మెరిసి మురిసేవి. ఆ తర్వాత నురగకళ్ళు మిటకరిస్తూ సబ్బు పొరలుగా, పరిమళంగా ఆమెని కప్పేసేది. చివరికి నీలాకాశం లాంటి బొచ్చు తువ్వాలు ఒంటి లాక్కునే సరికి నేను పరారు.

అయినా, ఆశకీ ఓ హద్దుండాలి. ఇంత నష్ట జాతకుడికి అంత సజావుగా ఎందుకు జరుగుతుంది? ఏం అనుమానమొచ్చిందో ఏమో గానీ, ఓ రోజు హఠాత్తుగా తలుపు తీసిందామె, టవల్ కప్పకొని. అడ్డంగా దొరికిపోయాను. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లో సాధారణంగా సున్నా మార్కులకంటే తక్కువొచ్చే నేను, ఆ రోజు కాస్త ఫర్వాలేదనిపించాను క్షణంలో పారిపోయి. నాలుగు రోజులు దొంగ నొప్పులు నటించి స్కూలుముఖం చూస్తే ఒట్టు. ఐదో రోజు స్కూలు టైమ్‌కి ఆలస్యంగా వచ్చాను, ఆ టైంకి ఆమె వెళ్లిపోతుందని. స్టూడెంట్లు వాడే మెట్లమీద గత్తరలాడుతూ వెళ్తున్న నన్ను కేకేసిందామె, రమ్మంటూ. నా పై ప్రాణాలు పైనే పోయాయి. గత్యంతరం లేక వెళ్లాను. ఇంట్లోకి తీసుకెళ్లి తెగ తిట్టింది. ఆ తిట్ల verbatim గుర్తున్నా చెప్పలేను. నా మగటిమి (?)ని కురచన, పలచన చేసేవని చెప్పాల్సిన పని లేదనుకుంటా. అంత భయంలోనూ ఆమె ధీరత్వానికి ముచ్చటేసింది. ‘వాళ్ళకి చెబుతా,’ ‘వీళ్ళకి చెబుతా…. ‘ అనకుండా, దేన్నైనా తానే హేండిల్ చేయగలనన్న ధీమా వల్ల ఆమె మరింత నచ్చింది. ఆమె లోకువ చేసినట్టు గిల్లితే పాలుగారేలా ఉన్నాయా నా బుగ్గలు అని రోషంగా ఆమె డ్రస్సింగ్ టేబుల్ నిలువుటద్దంలో చూసుకున్నాను మధ్యమధ్యలో. ఏదీ ఏమైనా వీటివల్ల నా మీద ఆమెకేదో అధికారమొచ్చేసింది. నాకు పనుల పురమాయింపు ఎక్కువయింది. వక్కపొడి తెచ్చిపెట్టమని, కుంకుడు కాయలు కావాలని (కుంకుడు పులుసు తలంటు పొయ్యమని అడగొచ్చుగా), చివరికి మాంసం తెమ్మని కూడా. నన్ను ఏదైనా తెమ్మనడం కాదు కదా, బైటకి పంపించడాన్ని కనీసం ఊహించని మా అమ్మ, నాన్నగారు నేను మాంసం కొట్టుకి కూడా వెళ్లినట్టు తెలిస్తేనా……..
ఆమె ఠంచనుగా ఇచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకునే వాడ్ని. వస్తువులన్నీ నా డబ్బుల్తో కొనే వాడిని.

ఓ నెల తర్వాత ఒకసారి మళ్లీ వెనక పోర్షన్ ముక్తిద్వారంలోంచి ఆమె రహస్య స్నానమందిరంలోకి ప్రవేశించే అవకాశం కోసం ఆత్రపడ్డాను. ఆ తలుపు తనవైపు గొళ్ళెం పెట్టేసినట్టుందామె, తెరుచుకోలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. పార్టీషన్‌కి పుస్తకాల చెక్క బీరువాలు ఆనించివుంటాయి. అటుపక్క ఆమె శయ్యా మందిరం. బీరువాల్ని మధ్య సందు చేసుకుని వయసుడిగే చీలలు తప్పించే ప్రయత్నాలేవైనా చేసినా, అంత శ్రమకి తగ్గ ఫలమేముంటుంది, దుప్పట్లు ముసుగేసిన ఆకారంలో ఎత్తుపల్లాల్ని ఊహించుకోవడం మినహా.

అయితే, ఆమె నాకొకరోజు అప్పగించిన పని, నన్ను తీవ్రమైన ఉపాయాల దిశగా నెట్టింది. ‘మిమ్మల్ని సాయంత్రం ఇంటికి రమ్మంది ఆంటీ,’ అని ఒకానొక పురుషాధముడికి వార్త చేరవేయడమే ఆ నా పని. ఇరుగు పొరుగునుంచి, మా టీచర్ల దగ్గర కూడా ఎల్‌త్విజటర్ గారి ‘రంకు’కి సంబంధించి చాలా గుసగుసలు చేరేవి నా చెవులకి. కానీ, వాటి గురించి నాకు ఆసక్తి ఉండేది కాదు. (అప్పటికి చలాన్ని చదవకపోయినా) ఒక భర్త- ఒక భార్య, ఊహలు, ప్రత్యూహలు, ప్రతిక్షేపణల తద్దినాల కంటే, తనకిష్టమైన మగవెధవల్ని షెడ్యూల్లు, టైమ్‌టేబుళ్లు వేసుకుని పిలిపించుకునే ఆమె పద్ధతే అపురూపంగా ఉండేది. అదీ కాకుండా, అంతటి సొగసు చిలకడదుంపని ఎవడో ఒక్కడే దాచేసుకోవడం ఆస్తి పోగేసుకోవడం కంటే పెద్ద నేరమని కూడా అనిపించేది నాకు ఆ వయసులోనే. ఫోన్‌లు వంటి ప్రసారమాధ్యమాలు దాదాపు లేని ఆ రోజుల్లో, నేనామె వార్తాహరుడ్ని కావడం నాలో కొత్త మాయోపాయాలకి కారణమయింది. ఆ ఉపాయాల ఫలితమే- ‘స్కూల్లో నైట్ అవుట్’ పథకం. ‘కంబైన్డ్ స్టడీ’ బాగుంటుందని, స్కూల్లోనే రాత్రిళ్లు కలిసి చదువుకుందామని కొంతమంది మిత్రుల్ని పోగేశాను. నేనొకందుకు అంటే, వాళ్ళు మరొకందుకు ‘సరే’ అన్నారు. చదువు మీద మా శ్రద్ధకి ప్రిన్సిపాల్‌గారు బహుముచ్చట పడ్డారు. ఇంట్లో రాత్రి భోజనం చేశాక, నాన్నగారు వదిలివెళ్లేవారు.

ఓరోజు సాయంత్రం ఆమె ఒకానొక ప్రియుడికి సందేశాన్ని మోసుకెళ్లిన శుకాన్నీ, పికాన్నీ అయిన anxietyలో కబురు చెప్పి ఇంటికెళ్లాక అన్నం సహిస్తే ఒట్టు. మొదటిసారి అమ్మ చేసిన చింతచిగురు పప్ప నోటికి చేదుగా తగిలింది. నాన్న గారి కోసం వెయిట్ చేయడంలో చెప్పలేనంత అసహనం. చాలా ముఖ్యమైన పాఠాలు చదవాలని హడావిడి చేసి నాన్నని బయల్దేరదీశాను. క్లాసురూముల్లోనే చదువు. సాధారణంగా రాత్రి తొమ్మిదిన్నర, పదిగంటల కల్లా మిత్రులు గుర్రుపెట్టేస్తారు. ఒకరిద్దరు టెర్రాస్ మీద కెళ్లారు, కొత్తగా నేర్చుకుంటున్న సిగరెట్లుమీద కొత్త అభ్యాసానికి. ఆ రోజు గడియారం ముళ్లని పట్టుకొని వేలాడాలనిపించింది. ఎట్లయితేనేం, పదిగంటలకి వెనక పోర్షన్‌లోకి చేరుకున్నాను. ఆరున్నర అడుగుల ఎత్తున్న నిగూఢమైన, నిరపాయకరమైన చెక్క కంతలకి నా కన్ను సరిపోయేలా బీరువాల మధ్య సన్నని ఎడంలో కింద పుస్తకాల దొంతర్లు సర్దుకున్నాను ముందే. దొమ్మరి పిల్ల తీగమీద నడిచిన దానికంటే ఏకాగ్రతతో, ప్రాణం నిలవడానికి అవసరమైనంత మేరకే ఊపిరి తీస్తూ, ఆమె మదనమందిరంలో ఝంటి తేనెల జంట జుగల్ బందీ కచేరి సన్నాహాలు ఎంతవరకూ వచ్చాయో చూసే తొలిప్రయత్నం చేశాను. మళ్లీ మలిప్రయత్నమన్న మాటేలేదు (మొదటిది ముగిస్తేగా, మరొకటి, ఇంకొకటి అన్న ప్రసక్తి ఉండేది). మెడలాక్కుపోయి, పూసలు గుదిగుచ్చిన వెన్నెముక వణికిపోయి, పిక్కలు తిమ్మిరెక్కి, మునివేళ్ళమీద లేచిన పాదాలు గుంజుకుపోతున్నా, కనురెప్పల చొరవని కూడా సహించనంత తదేకమయ్యింది కన్ను. ఆ కన్ను తనని తాను చూసుకోగలిగితే, తలకిందులో, కుడిఎడమలో అయ్యి వంకర్లు పోయినా, చంచల బింబమైన ఆమె రూపాన్ని సూక్ష్మమోక్షంగా చూడగలిగేది. చూస్తున్న కొద్దీ తేటతెల్లం కాకపోగా, మరిన్ని బిగుతైన చిక్కుముళ్లు పడిపోవడమేనా ఈ అతను- ఆమెల పెనుగులాటల మహా రహస్యపు మర్మం? ఆమె…పెక్కు ‘ఆమె’లుగా కన్పించేదని కదా చెప్పాను. ఇప్పడామె ఒక్కటిగానే ఓ సహస్ర! మాటిమాటికీ అతను ‘విజయం’ అభినయించలేక జారిపోతున్నాడని, పదేపదే ఎదురవుతున్న ఓటమికి చిన్న బుచ్చుకుంటున్నాడని మీసాల నూగు వస్తున్న నాకు ఒక హెచ్చరికలా అర్థమైపోయింది.

అది మొదలు, అడపాదడపా స్కూల్లో జాగరణలకి ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతున్నాయి. కానీ, అంతకుముందులా ఆమె ముఖంలోకి చూడలేకపోయాను. ఒకవేళ ఎంత ప్రయత్నించి కష్టంమీద చూసినా, పొంచి దూకే సివంగిలా అన్పించి మళ్లీ మళ్లీ కోరుకునే గగుర్పాటు వంటి పులకింత పుట్టేది. బహుశా ఈ తొలి వాయొరిస్టిక్ బులపాటాల ఫలితమేమో, ఇప్పటీ కొందరు మంద మందాకినుల ముఖాలు చూస్తుంటే, ఆ తాదాత్మ్య క్షణాల్లో ఆ ముఖం ఎలా ఉంటుందో అన్న ఆలోచనలు ముసురుకుంటాయి, కందిరీగల సరసంతో. దొంతికళలు రేపే ఆమె దొమ్మి చూసింది మొదలు, ఆ అభిసారిక ప్రతిరోజూ ఎవరికో ఒకరికి కబురు పంపిస్తే బాగుణ్ణని కోరుకునే దశనుంచి, ఆ దిశగా నేను కూడా చొరవ చూపించి ఆమెని ప్రేరేపించే చనువుల దిశగా ఓ మెట్టు ఎదిగాను.

నా బతుక్కి ఏదీ సవ్యంగా ఏడ్చింది కనక, ఈ వ్యవహారం అలా సాగిపోతుందని పేరాశ పడటానికి! కుర్రాళ్లు రాత్రిళ్లు స్కూల్లో సిగరెట్లు తాగుతున్నారని, పక్కడాబా మీదకి దూకుతున్నారని చుట్టుపక్కల గొడవై ప్రిన్సిపాల్ వరకూ వెళ్లింది పంచాయితీ. సీనియర్లు రవి, వెంకటేశర్లు వల్ల సిగరెట్ల నింద, పక్క డాబా అనంతలక్ష్మీ కోసం దూకెళ్లిన సాగర్ వల్ల మరో నిందతోడై అందరికీ వడ్డింపులు జరిగాయి. అసలు నైటౌట్ ఆలోచనే నాది కావడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువ జరిగాయి. నా ఒంటిమీద ఎర్రగా తేలిన వాతలు నన్ను ఏనాడూ గద్దించి కూడా ఎరగని నాన్నగారి కంట పడనే పడ్డాయి.
‘ఇంత ఒద్దికైన మా అబ్బాయి సిగరెట్లు తాగాడని అనడానికి మీకు నోరెలా వచ్చిందండీ….’ అంటూ అమ్మ, ప్రిన్సిపాల్ గారి మీద పొట్లాటలో నాన్నకి వత్తాసు రావడంతో, జరగకూడని డామేజ్ జరిగేపోయింది- నేను అర్థాంతరంగా స్కూలు మార్చేయబడ్డాను.

ఏళ్లుగా కొట్టుకుపోతున్న ఏరు ఎటు తీస్కెళ్తే అటుగా కొట్టుకుపోతున్న నాకు, ఆమె మరెప్పడూ ఎదురవ్వలేదు. కానీ 32 ఏళ్ల తర్వాత తళుక్కుమంది, ఈ తలపోతల దారిలో. ఇది అసందర్భం ఎంతమాత్రం కాదు.

Giuseppe Tornatore అనే ఇటాలియన్ సినీ దర్శకుడు నన్ను దొంగతనం (plagiarize) చేసిన నేరం గురించి చెప్పటానికే ముందు నా స్వకీయపురాణం విప్పింది. ‘తెలుగు ఆఫ్ ద వెస్ట్‌’గా పేరు పొందిన తన ఇటాలియన్ భాషలో ఆ దర్శకుడు Malèna అనే ఒక సినిమాకి రచన, దర్శకత్వం అందించాడు. నా అనుభవాన్ని కాపీ చేసి తెరకెక్కించటమే కాకుండా, ఆ కథకి సంబంధించిన క్రెడిట్‌ని అంతర్జాతీయ స్ర్కీన్‌ప్లే రచయిత Luciano Vincenzoniకి అంటగట్టడంతో నా కడుపుమంట మరింత రేగింది,
ముందుగా Malèna చిత్రకథ సంక్షిప్తంగా:

అది 1940; రెండో ప్రపంచయుద్ధంలో ఇటలీ పాలుపంచుకుంటున్న కాలం. సిసిలీ అనే ఊళ్లో Renato అనే కుర్రాడు, తనకి రెట్టింపు వయసున్న కథానాయిక Malènaతో తొలిచూపు మోహంలో పడతాడు. Nino Scordia అనే ఓ సైనికుడి భార్య Malèna. కళ్ళు చెదరగొట్టే అందం ఆమెది. Nino ఇటలీ తరఫున యుద్ధంలో పాల్గొంటాడు కాబట్టి ఆమె ఒంటరి. బ్రహ్మచెముడు ఉన్న తండ్రి లాటిన్ బోధించే ప్రొఫెసర్. తండ్రిని తరచూ కలిసి ఆయనకు సేవలు చేయడం హీరోయిన్ అలవాటు. ఊరంతటికీ ఆమె లోకువ కావటానికి కారణం ఆమె అందమే తప్ప మరోటి లేదు. Renato క్లాస్‌మేట్ల స్థాయి బుడతల నుంచి, కాటికి కాలు చాపిన ముసలాడి వరకూ మగాళ్లందరూ ఆమెను పక్కమీదకు లాగాలని చూసేవాళ్లే. స్థాయీభేదాలు లేకుండా అందరూ ఆమె ‘బజారుతనం’ గురించి చిలవలు పలవలు అల్లేవారే. ఆడవాళ్లకయితే ఆమె ఒక కులట. తమ కాపురాలకు ఎసరు పెట్టి, తమ పచ్చని సంసారాలను కూల్చటానికి దాపురించిన మోహినీ పిశాచి.

‘మొదటిసారి ఆమెను చూసినప్పుడు నాకు పన్నెండున్నరేళ్లు….’ అంటూ Renato నరేషన్‌తో మొదలై, అతని నరేషన్ వాయిస్ ఓవర్‌గా వినిపిస్తున్నప్పుడే సినిమా ముగుస్తుంది. కాబట్టి ఈ కథనంతా ఆ కుర్రాడి కళ్లలోంచే చూస్తాం మనం. ఆమె శీలంమీద ప్రచారంలో ఉన్న పుకార్లన్నీ అబద్ధాలని Renato తన ద్వారా తెలియజేస్తాడు. ఆమె ఇంటిమీదకి ఎగబాకిన కొమ్మల మీంచి ఆ ఇంటి వెంటిలేటర్ కన్నంలోంచి లోపల దృశ్యాలను తన కంటి ద్వారా ప్రేక్షకులకు చూపిస్తాడు Renato. దూరమైన భర్త ఫొటోని కావలించుకుని డ్యాన్స్ చేస్తుందే కానీ, పరాయి మగాడినెవరినీ తలవదామె. ఒక సైనికాధికారితో ఆమెకు నిప్పు లేని పొగలాంటి సున్నితమైన స్నేహముంటుంది. Malèna తన సొంతమన్నట్టు ఊరి దంతవైద్యుడు ఆ సైనికాధికారితో ఓ అపరాత్రి గొడవకి దిగి ఊళ్లోళ్ల నోళ్లల్లో Malèna పేరు మరింత నానేలా చేస్తాడు. ఆ డెంటిస్టు భార్య Malènaను కోర్టుకు లాగుతుంది, కాపురాలు కూలుస్తోందన్న ఆరోపణతో. కూతురు మీద అపవాదుల్ని ఆకాశరామన్న ఉత్తరం ద్వారా తెలుసుకుని, వాటిని నమ్మి, ఆమె తండ్రి కూడా దూరమవుతాడు. కోర్టు ఆమె నిర్దోషిత్వాన్ని నమ్ముతుంది. కానీ, ఆ తీర్పు వల్ల ఆమె తరఫు న్యాయవాది ఆమె శరీరాన్నే తన ఫీజుగా గుంజుకుంటాడు. ఈలోగా ఆ గ్రామం మీద బాంబుదాడులు జరిగి, ఆమె తండ్రి చనిపోయి తను మరింత ఒంటరవుతుంది. మరోపక్క భర్త కూడా చనిపోయిన వార్తలు.
అయినవాళ్లు లేక, లోకులు వెయ్యి కళ్లతో పొంచి, కాకులై పొడిచినప్పుడు తిండి గడవటమే కష్టమైపోయినప్పుడు Malèna వేశ్యగా మారుతుంది. జర్మన్ సైనికులతో కూడా గడుపుతుంది. యుద్ధం ముగిసి ఇటలీ ఓడిపోయాక, వూరి ఆడవాళ్లంతా పోగై ఆమెని అమానుషంగా కొట్టి బజారుకీడుస్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె వేరే వూరు వెళ్లిపోతుంది. చనిపోయాడనుకున్న ఆమె భర్త తిరిగొచ్చి, భార్య కోసం వెదుకుతున్నప్పుడు Malènaని కించపరిచి, తనను అవమానపరిచిన స్థానికులతో గొడవ పడతాడు. ఆమెకు అంటగట్టిన జారత్వం ఆమెలో లేదని, భర్తని మాత్రమే ప్రేమిస్తోందని అనామక ఉత్తరం ద్వారా ఆమె భర్తకి తెలియజేస్తాడు Renato. అతను భార్యను వెదుక్కుంటూ వెళ్లి, ఓ ఏడాది తర్వాత ఆమెతో తిరిగి వస్తాడు. Malèna, ఇప్పుడు శ్రీమతి Malèna అనే గౌరవప్రద (నిరపాయకర)మైన కొత్త హోదాలో ఉండటం వల్ల, ఎంతో కొంత అందవిహీన కూడా అయింది కాబట్టి ఆ ఊరి ఆడవాళ్లు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. సంచిలో నుంచి కిందపడిన పళ్లు ఆమెకి అందించడం ద్వారా మాత్రమే ఆమెతో తొలిసారి (చివరిసారి కూడా) మాట్లాడతాడు narrator Renato. యవ్వనపు మలుపు తీసుకోబోతున్న తన బతుకుదారి మొగసాలలో నిలిచిన మందారం ఆమేనని Renato చెప్పటంతో సినిమా ముగుస్తుంది.

Malèna చిత్ర కథ సారాంశం విన్నాక (చదివాక) ఇందులో ఇటలీ దర్శకుడి చౌర్యమేమిటని మీరడగొచ్చు. మా చీరాలకి, Renato సిసిలీకి ఉన్న శబ్దసామ్యం దగ్గర్నించి మొదలెడతాను నా ఆరోపణ నిరూపణల పర్వం:
నాకప్పుడు 13 ఏళ్లు, ఆమెకి 28. Renatoక్కూడా 13 ఏళ్లు, Malènaకి సుమారు మా ఎల్‌త్విజిటర్ గారి వయసే. ఈమెలానే Malèna కూడా బుల్లి కథానాయకుడికి అతడి యవ్వనం నూనూగు మీసమై మొలవబోతున్న ఉత్సవ సందర్భాన్ని తెలియజెప్పిన తొలి స్త్రీమూర్తి.

దేశకాలాలు వేరయినా, మనుషులు, సమాజం ఒకేరకమైన వంచనాత్మక నైతిక దుర్గంధాన్ని వెదజల్లుతాయని ఆమె వెనక చీరాల పొరుగు, Malèna వెనక సిసిలీ పౌరులు కూసిన కారుకూతలు నిరూపిస్తాయి. తోటి విద్యార్థులు, ఊళ్లోని మగాళ్లతో సహా Malènaని కాముక దృష్టితో చూస్తూ, పలచన చేసి మాట్లాడటం సహించలేకపోతాడు Renato. ఆ మాటకొస్తే, వాడు ఆమెని అంతకంటే భిన్నంగా ఏమీ చూడడు. జర్మన్ సైనికులతో ఆమెచనువుగా ఉండటం చూసి మూర్ఛపోయిన వాడు, తొలి అనుభవాన్ని అందించిన వేశ్యలో కూడా Malènaనే ఊహించుకుంటాడు. Malèna అండర్ వేర్‌ని దొంగతనం చేసుకొచ్చి, రాత్రి ముఖంమీద కప్పుకున్న Renatoకి ఉన్నంత fetishistic తీవ్ర మోహాలు నాకప్పుడు లేవు కానీ, మా ఎల్‌త్విజిటర్ గారి మీద నాకున్నదేమీ పవిత్ర దృష్టేం కాదు కదా. అయినా, క్లాస్‌మేట్లు (సీనియర్లు కూడా) ఆమెని ఉద్దేశిస్తూ, ‘దాన్ని ఒక్కరాత్రి…,’ ‘అది పరమ బజారు…,’ వంటి కామెంట్లు చేసినా, ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఆమె నడతకి బుగ్గలు నొక్కుకున్నా, సహించలేకపోయేవాడిని. కాబట్టి, నా టీనేజీ వ్యవహారం కచ్చితంగా తెలియకుండా, Malènaలో అటువంటి సన్నివేశాలే కల్పించడం కుదిరే పని కాదు. ఒట్టి యాధృచ్ఛికం అనలేం కాబట్టి ఇది నిస్సందేహంగా భావ చౌర్యమే.

కథా చౌర్యం గురించి పక్కనపెట్టి, నిర్మాణ సాంకేతికత గురించి చెప్పుకోవల్సివస్తే, Malèna ఒక గొప్ప సినిమా. ఒక పకడ్బందీ కుట్రలాంటి స్ర్కీన్‌ప్లే. దర్శకుడు చాలా మితభాషి, క్లుప్తంగా చెప్పేశాడు. అంత పెద్ద సంగతిని అంత సంక్షిప్తంగా చెప్పాలంటే కొన్ని విషయాలు మింగేసి, మరికొన్ని దాచేసి ఉంటాడా? లేదు. చెప్పీ చెప్పకుండా between the lines వదిలేసింది చాలా ఉంది. ప్రేక్షకుడి నుంచి ఒక నిశితమైన చూపుని డిమాండ్ చేశాడు ఆ దొంగ దర్శకుడు. 1940ల్లో రెండో ప్రపంచయుద్ధ వాతావరణం, యుద్ధం మారుమూల గ్రామాల మీద, అక్కడి బతుకుల మీద చూపించే ప్రభావం, నాటి ఇటలీ సామాజిక చిత్రం, ఫాసిస్టు నేత ముస్సోలినీ ఉత్థాన పతనాలు, మిత్ర, అక్ష బలగాల మధ్య ఘర్షణ, జయాపజయాలు, అవి జనసామాన్యం ఆలోచనలపై చేసే గారడీ.. ఎన్నింటినో ఆవిష్కరించాడు దర్శకుడు Giuseppe. ప్రేమ, కామం, కుటుంబం, సమాజం.. వంటి అనుభూతులు, వ్యవస్థల గురించి చలామణిలో ఉన్న ఆదర్శాలకి, మనుషుల ఆచరణకి మధ్య ఉన్న అగాథాన్ని చాలా ప్రతిభావంతంగా ఎత్తి చూపుతాడు. ఓ 13 ఏళ్ల కుర్రాడు తాను చూసి చెబుతున్నదో, లేదా గుర్తు తెచ్చుకొని పలవరిస్తున్న కథ ప్రధానంగా అనిపిస్తూ తెరముందు కదులుతుంటే, ఏకకాలంలో తెరమీద నీడలుగా ఒక సీరియస్ సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాన్ని మరో సమాంతర కథగా నడిపించడం ఒక అద్భుత విన్యాసం. ప్రపంచ ప్రఖ్యాత మహా రచయితలు ఇటువంటి ఫీట్ అక్షరాల ద్వారా సాధించారు. దాన్ని దృశ్యంగా వెండితెర మీదకి ఎక్కించటం కొందరికే సాధ్యమైంది. ఆ కొందరిలో Giuseppe ఒకడయ్యాడు.
Malènaని ఒళ్లమ్ముకునే స్థితికి దిగజార్చిన పరిస్థితుల మీద చెప్పరాని అసహనముంటుంది Renatoకి. కానీ అదొక చేతకాని కోపం, చేవలేని పౌరుషం. సిసిలీకి వచ్చిన జర్మన్ సైనికులతో Malèna చనువుగా ఉండటం ప్రత్యక్షంగా చూస్తాడు. తనతో పాటు ఊరు ఊరంతా చూస్తుంది. ఊరంతటికీ ఆమె ఓ outsider, నోటి తీటని తీర్చుకోవడానికి పనికొచ్చే object. అందుకే రకరకాల ‘రంకు’ వ్యాఖ్యలు పులుముతారు. ‘దీనికి ఒకేసారి ఒక్కడు సరిపోడురా.. ‘……. ఇంకా నోటికేదొస్తే అది. వెన్నెల లాంటి ఆమె బింబం అద్దంలాంటి కోనేరులో తళతళలాడటం, పందులు దొర్లే బురదగుంటలో పరావర్తించడం …. రెండింటినీ ఒకేలా చూడటం ఏ ప్రేమికుడికీ సాధ్యం కాదు. అందుకే అంత అంతఃసంఘర్షణ. ఆ ఘర్షణని తట్టుకొని నిలదొక్కుకునే వయసు కాదు, అందుకే ఆ పసి ప్రేమికుడు స్పృహ తప్పి పడిపోతాడు. వాడికి గాలి సోకిందని అనుకుంటుంది వాడి తల్లి; వాడు ఎదకొచ్చాడని బ్రోతల్‌కు తీసుకెళ్తాడు తండ్రి. కానీ, Renato అంతరంగ సంక్షోభం Giuseppe మాత్రమే అర్థం చేసుకున్నాడు. అలా అర్థం చేసుకోవడానికి అతనికున్న అవకాశాలు రెండే రెండు:
ఒకటి- నా అనుభవాన్ని అతను, Luciano కూడబలుక్కొని తస్కరించి ఉండటం;
లేదా,

రెండు- 1926 మార్చిలో పుట్టిన Luciano, ఆ తర్వాత 30 ఏళ్ళకి 1956 మేలో పుట్టిన Giuseppeలకి కూడా అది స్వానుభవమై ఉండటం.

కానీ, నాతో మరీ ఇంత సారూప్యాన్ని నమ్మబుద్దిగాక రెండవ అవకాశాన్ని కొట్టేశాను. Copyright చట్టం కింద వీరిద్దరినీ ఎలా ఇరికించాలా అని నేను మల్లగుల్లాలు పడుతుంటే, “మానవానుభవాలన్నీ సీమాసమయసందర్భాలకతీతం, విశ్వజనీనం” అంటూ పెద్ద పెద్ద మాటలతో Copyleft కార్యకర్తైన ఓ మిత్రుడు నన్ను చల్లార్చే ప్రయత్నం చేశాడు. ఆంతటితో ఆగాడా? గొంతులో ఎగతాళి దాచే ప్రయత్నం కూడా చేయకుండా నన్నిలా అడిగాడు: “అవున్రా వురేయ్! 2000లో రిలీజైన Malènaని నీ కళ్ళపడకుండా దాచడంలో కూడా Giuseppe కుట్ర ఉందని మరో యాగీ చెయ్యవు కదా?”
** ** **

– నరేష్ నున్నా

13 Comments
 1. Srisail Reddy Panjugula August 8, 2012 /
 2. డా.దార్ల August 8, 2012 /
 3. SP Jagadeesh August 8, 2012 /
 4. Ravi August 13, 2012 /
 5. naresh nunna August 19, 2012 /
 6. Geetha August 31, 2012 /
  • naresh nunna September 1, 2012 /
 7. Indian Minerva October 10, 2012 /
 8. uma April 8, 2013 /
 9. శ్రీరామ్ వేలమూరి May 1, 2013 /
 10. Padmapadmapv August 7, 2017 /
 11. Mohannaidu Karri August 8, 2017 /
 12. Gorantla Sai August 8, 2017 /