Menu

అతిశయోక్తుల “జులాయి”

హీరోకి విలన్ ఒక ఛాయారూపం మాత్రమే. ఇద్ధరి వేగం, ఆలోచన, శక్తి సమానమే కానీ ఉద్దేశాలే హీరోని హీరో చేస్తే విలన్ ని విలన్ గా మిగులుస్తాయి. ఇలాంటి ఫ్రార్మాట్ లో హాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. సోనూసూద్ లాంటి స్మార్ట్ విలన్స్ బొంబాయి నుంచీ దిగుమతి అయ్యాక విలన్ ప్రాధాన్యతతో కొన్ని (కందిరీగ లాంటి) సినిమాలు వచ్చినా, విలన్ హీరోకి ఒక ఆల్తర్ ఇగో అనేస్థాయి ట్రీట్మెంట్ తో వచ్చిన సినిమా ఇదే. కథాకథనపరంగా ’జులాయి’ హాలీవుడ్ ఫార్మాట్ లో వచ్చిన టాలీవుడ్ సినిమా.

హాలీవుడ్ కథాకథనానికి తెలుగుపైత్యాన్ని జోడించి, అతితెలివి సీన్లు, ఆడంబరపు మాట్లు(మాటలు) అద్దకం చేస్తే తయారైన పుల్లగూర ఈ సినిమా. రవి నారాయణ (అల్లు అర్జున్) ఒక అతితెలివి ఉన్న జులాయి. ఈజీమనీ సంపాదిస్తే చాలనుకునే కుర్రాడు. తండ్రి (తనికెళ్ళ భరణి) ఆదర్శవాది. తండ్రి ఆశయానికి జులాయిహీరో ఆశకీ మధ్య జరిగే సరదాగానే మొదలైన ఘర్షణ జులాయి హీరో జీవితాన్ని ఒక రాత్రిలో ఎలా మార్చింది, చివరికి హీరోకివచ్చే రియలైజేషన్ ఏమిటి అనేది అసలు కథ. సినిమా ఆరంభం గమ్మత్తుగా సాగినా, కథను మీరి జరిగే హీరోయిన్ (మధుగా ఇలియానా) ఎపిసోడ్స్, రాంజేంద్రప్రసాద్ ఫ్యామిలీ కామెడీ, అందులోని పానకంలో పుడక బ్రహ్మానందం హాస్యం, ఎమ్మెస్ నారాయణ నవ్వించే ప్రయత్నం కొన్ని నవ్వుల్ని పండించినా, కొంత చిరాకు తప్పించకమానవు. ద్వితీయార్థంలోని విపరీతమైన అతిశయోక్తుల హీరో-విలన్ ఆలోచనలు సీరియస్ మూడ్ లో కూడా సిల్లీ ఫీలింగ్ కల్పించి నవ్విస్తాయి.

త్రివిక్రం కలంబలం ఎప్పటిలాగే సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. దర్శకత్వ ప్రతిభకి చోటా కె నాయుడు కెమెరా తోడై అలరిస్తుంది. దేవీప్రసాద్ సంగీతం అనవసరంగా సినిమాను అడ్డుకుంటూ సాగుతుంది. చాలా వరకూ పాటలు సినిమాకు అవసరం లేదు. పైగా ఎండ్ క్రెడిట్స్ లో స్వోత్కర్ష పాటొకటి. అల్లు అర్జున్ కంట్రోల్డ్ నటన సినిమాకు సహజత్వాన్ని తీసుకొస్తే, ఇలియానా బక్కచిక్కిన అందాలు నిరాశపరిస్తాయి. నటన విషయంలో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మిగిలిన నటుల్లో రాజేంద్రప్రసాద్ కొంత హాస్యాన్ని అందించినా మరీ బిగుసుకుపోయినటించినట్టు కొన్ని సీన్లలో తెలిసిపోయి ఇబ్బంది కలిగిస్తుంది.

అల్లుఅర్జున్, ఇలియానా, త్రివిక్రం, దేవీశ్రీప్రసాద్ వంటి నాలుగు బలమైన కారణాలు ఈ సినిమా చూడటానికి ఉన్నా, అవన్నీ ఒకసారి చూడటానికే సరిపోతాయి. కాబట్టి ఒకసారి చూసెయ్యండి.

One Response
  1. K.Pavan kalyan August 19, 2012 /