Menu

తొక్కవలన “దేవుడు చేసిన మనుషులు”

 

కథలేని కథని మడతకాజాలాగా మడతెట్టి రెండుసార్లు చుట్టేసి, నవ్వించే కామెడీ క్యారెక్టర్లతో,అడ్రస్ లేని అనాధలనే సెంటిమెంటుతో కట్టె-కొట్టె-తెచ్చె అన్నట్టు శ్రీమహావిష్ణువుతోనే చెప్పించేసిన పూరీజగన్నాథ్ మాయా చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’.

దైవనిర్ణయంగా కలిసి బ్రతకడానికే పుట్టిన అనాధలైన ఒక థాయ్ లాండ్ అమ్మాయి (ఇలియానా)-ఒక హైదరాబాద్ అబ్బాయి (రవితేజ) ఒక “తొక్కలో” ఇంటర్వెషన్ వల్ల ఎలా కలిసారు అనేదే ఈ తొక్కలో సినిమా మూలబిందువు. రెండుసార్లు తొక్క తొక్క అనేసానని ఇది తొక్కలో సినిమా అనుకోకండి. నిజానికి ఇది తొక్కవలన జరిగే సినిమా. ఎమ్మెస్ నారాయణ తినే తొక్కని ట్విస్టుగా పెట్టుకుని లక్ష్మీదేవి-లక్ష్మీనారాయణుడు (కోవై సరళ-బ్రహ్మానందం) మనుషులతో ఆడుకునే చదరంగమే ఈ చిత్ర కథ.

హైదరాబాద్ లో సెటిల్మెంట్లు చేసుకునే రవితేజ (పాత్ర పేరు కూడా రవితేజే) సి.ఐ సుబ్బరాజు తరఫున థాయ్ లాండ్ మాఫియాడాన్ ప్రకాష్ రాజ్ తో ఒక సెటిల్మెట్ చెయ్యడానికి థాయ్ లాండ్ కి వచ్చి అక్కడున్న టాక్సీ డ్రైవర్ ఇలియానాతో ఎలా ప్రేమలో పడ్డాడు, అదే కథని పూరీ జగన్నాథ్ మనకు రెండుసార్లు ఏ వేరియేషన్ తో చూపించాడు అనేది ఈ సినిమా.

దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మి ఈ సినిమా చూస్తే అనుమానాలేవీ రావని పూరీజగన్నాథ్ సినిమా ఆరంభంలోనే వాయిసోవర్ లో చెప్పేశాడు కాబట్టి, సినిమాలో లాజికల్ లూప్ హోల్స్ వెతక్కపోతే ఒక మహత్తరమైన మ్యాజిక్ రియలిజం కథ అవుతుంది. అస్సలు బ్రెయిన్ యూజ్ చెయ్యకుండా కూచుని చూస్తే కనీసం ముఫైసార్లు పగలబడికాకపోయినా ఒక మోస్తరుగా నవ్వుకోవచ్చు. పనిలోపని ఆలి(గోలి) కామెడీ ట్రాక్ లో పూరీమార్క్ మెట్టవేదాంతం కూడా కనుక్కోవచ్చు. కొంత అభినందించొచ్చుకూడా.

రవితేజ తన యధాలాపమైన నటనతో లాగించేస్తే, బక్కచిక్కిన ఇలియానా అక్కడక్కడా నటనలో మెరిసింది. ప్రకాష్ రాజ్ నటన రోటీనైనా పాత్ర ఆసక్తికరంగా ఉంది. ఫిష్ వెంకట్ నటన, అలీ కామెడీ ట్రాక్ నవ్వులు పుయ్యిస్తాయి. విష్ణుమూర్తి లక్ష్మీదేవులుగా బ్రహ్మానందంని కోవైసరళనీ ఎంచుకోవడమే సినిమా టోన్ ని సెట్ చేసి ఒక ఫార్సికల్ కామెడీగా సినిమాను తయారుచేసింది. వాళ్ళిద్దరీ సీరియస్గా చర్చించుకున్నా ప్రేక్షకుడు నవ్వుతూ చూసేలా చేసింది.

శ్యాం కె నాయుడు సినెమాటోగ్రఫీ థాయ్ లాండ్ అందాల్ని ప్రతిభావంతంగా తెరకెక్కిస్తే, శేఖర్ ఎడిటింగ్ రెండుగంటల నాలుగు నిమిషాల వ్యవధిలో బోర్ కొట్టకముందే సినిమాని వేగంగా ముగించేస్తుంది. రఘు కుంచే సంగీతం సినిమాలో చెప్పుకోదగ్గ అంశం. పాటలలో హోరుకన్నా గాయకుల గళాలు వినపడటం రిలీఫ్ గా ఉంటే, నేపధ్యసంగీతంలో కూడా గోల లేకుండా ఉంది.

సినిమాలో కథలేకపోయినా, ఉన్న కాస్తోకూస్తో కథని రెండుసార్లు చూపించినా సాంకేతిక వర్గం సహాయంతో, పూరీజగన్నాథ్ తనలోని రైటర్ బలంతో దర్శకత్వాన్ని చాలా సులువుగా నెరపేసిన భావన తప్పకుండా కలుగుతుంది. ఏదో తన సరదా కోసం పూరీజగన్నాథ్ ఈ సినిమా చేసిన ఫీలింగ్ రాక తప్పదు.

నిమ్నస్థాయి అంచనాలతో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సాగిపోతుంది కాబట్టి, ఇలాంటి తొక్కలో సినిమాలే మన ప్రేక్షకులు ఆశిస్తున్నారు కాబట్టి, సినిమా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండేఅవకాశమే ఎక్కువ.

5 Comments
  1. venkat August 15, 2012 /
  2. Naresh August 15, 2012 /
  3. sasank August 23, 2012 /
  4. Kumar August 25, 2012 /
  5. sunitha August 27, 2012 /