పూరీ చేసిన మనుషులు

1973 ఆగష్టులో విడుదలైన మహా నటులు యన్.టి.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘ దేవుడు చేసిన మనుషులు’ సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన సాయంత్రం యన్.టి.ఆర్ గారు ఆ సినిమా రచయిత త్రిపురనేని మహారధి గారిని పిలిచి ‘ ఇన్ని రోజులు నేను నటించిన ఈ సినిమా కధ ఏంటసలు’ అని అడిగి ,విని,బాగుందని చెప్పి మద్రాస్ వెళ్లిపోయారట. తర్వాత ఆ సినిమా సూపర్ హిటై , తెలుగు చిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.

సరిగ్గా నలభై సం|| తర్వాత ఈ రోజు విడుదలైన కొత్త ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో అయితే అసలు కధ లేకుండా (దర్శకుడే ప్రకటించాడు) కేవలం ఒక మాస్ హీరోని , హాట్ హీరోయిన్ని , ఒక మాఫియా డాన్ ని పట్టుకుని రెండు గంటల నాలుగు నిముషాల పాటు ఫస్టాఫ్ లో ఒక సినిమాని,సెకండాఫ్ లో మరో సినిమాని ఒక ఫార్స్ గా చూపించాడు.

ఈ సినిమా కధకి మూల కారణం ఓ అరటితొక్క కావడం గొప్పగా చెప్పుకోవాల్సిన ‘తొక్కలో విషయం’.

(లేని) కధ విషయానికొస్తే హీరో రవితేజ ఓ ఆనాద. సెటిల్ మెంట్లు చేసే ఓ మధ్యవర్తి. అతని క్యారెక్టర్ ఎస్టాబ్లిస్ కూడా సరిగా చేయలేదు. ఇక హాట్ హీరోయిన్ ఇలియానా బ్యాంకాక్లో టాక్సీ నడుపుకుని బతికే ఓ ఆనాద. ఇక ప్రకాష్ రాజ్ విషయానికొస్తే ఓ మాఫియా డాన్ అని అందరు చెబుతుంటారు కానీ… సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. డాన్ కి తక్కువ బఫూన్ కి ఎక్కువగా ప్రవర్తిస్తుంటాడు. ఇతను కూడా అనాధ కావడం మరో జోకు. సినిమా మొత్తం చూస్తే ఇదంతా అనాధల అయోమయ గోలలా వుంది.

ఇక వైకుంటం శ్రీ మహా విష్ణువు , లక్ష్మీదేవిలుగా బ్రహ్మానందం, కోవై సరళలు ఆదిశేష తల్పం మీద కూర్చుని కాలక్షేపం బటానిలుగా కబుర్లు చెప్పుకుంటూ ఈ ముగ్గురి చుట్టూ కధ అల్లటం కోసం అరటి తొక్కతో చిచ్చు పెడతారు. ఒక అరటి తొక్కను తొక్కి ఒకడు జారి పడతాడు. అక్కడి నుండి ఒక దాని నుండి ఒక సంఘటనలతో సుబ్బరాజు అనే పోలిస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ మనిషిని హైదరాబాద్ లో కాల్చి చంపుతాడు. దాంతో ప్రకాష్ రాజ్ తన అనుచరులతో సుబ్బరాజును చంపమని ఆదేశిస్తాడు. సుబ్బరాజు ప్రకాష్ రాజ్ కు భయపడి రవితేజను రాయబారిగా బ్యాంకాక్ వెళ్లి సెటిల్ మెంట్ చేయమని పంపిస్తాడు. రవితేజ బ్యాకాక్ కి వస్తాడు. అక్కడ నుండి కధ మొత్తం బ్యాంకాక్ లో నడుస్తుంది. బ్యాంకాక్ లో రవితేజ ఆలితో కాసేపు కామెడి,ఇలియానాతో లవ్వు,డ్యుయట్స్ తో పాటు ప్రకాష్ రాజ్ తో సెటిల్ మెంట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ప్రకాశ రాజ్ కన్ను ఇలియానా మీద పడుతుంది. ఇలియానానిస్తే సెటిల్ మెంట్ కి ఒప్పు కుంటానంటాడు. అక్కడ నుండి రవితేజకు ప్రకాష్ రాజ్ కు జగడం ప్రారంభం అయి చివరికి ఏం జరిగింది అన్నది అరటితొక్క తొక్కడం వాళ్ళ జరిగిన ఫస్టాఫ్ కధ.

ఇక అరటి తొక్క తొక్కకపోతే కధ ఎలా జరిగి ఉండేదో సెకండాఫ్ లో జరిగే మరో సినిమా కధ. ఫస్టాఫ్ కధ కి పూర్తిగా విరుద్ధం గా సెకండాఫ్ కధ నడుస్తుంది.

అయితే ఫస్టాఫ్ లో చక్కగా వినోదాత్మకంగా నడిపిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చే సరికి కంగారు కంగారుగా , గందరగోళంగా చేయడంతో సినిమా పట్టు తప్పింది. ఫస్టాఫ్ లాగే సెకండాఫ్ కధను కూడా నడిపి ఉన్నట్లయితే బాగుండేది.

ఇక ప్రకాష్ రాజ్ వింత ప్రవర్తన ఎందుకో అర్థం కాదు. సినిమాలో ధాయలాండ్ భాషను వాడి చికాకు పుట్టించాడు. కొంత వరకు అలీ కామెడి బెటర్. గతంలో వచ్చిన ‘మా ఊర్లో మహా శివుడు ‘ అనే సినిమాలో నుండి గుడ్డివాడిగా నటించే సీన్ ని కాపీ కొట్టాడు. ఆర్టిస్టులు అందరు బాగా చేశారు. ఫోటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు. పూరి గారు భవిష్యత్తులో కధ లేకుండా సినిమా తీయకూడదు. అతని సినిమాల్లో బలమే కధ, కధనం, క్యారెక్టర్ . దాన్ని నిర్లక్షం చేయకూడదు. చివరిగా చెప్పొచ్చేదేమిటంటే… టోటల్ గా ఈ సినిమాతో పూరి జగన్నాధ్ తొక్క మీద కాలేశాడు. ఇటువంటివి పునరావృత్తం కాకుంటే ఆయనకి మంచిది.

సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

నటీనటులులు: రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోవై సరళ, సుబ్బరాజు, అలీ, ఫిష్‌ వెంకట్‌, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు

కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు,

సంగీతం: రఘు కుంచె,

పాటలు: భాస్క రభట్ల,

ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్‌.శేఖర్‌,

ఫైట్స్‌: విజయ్‌,

డాన్స్‌: ప్రదీప్‌ ఆం థోని, దినేష్‌,

సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,

సహనిర్మాత: భోగవల్లి బాపి నీడు, రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్‌,

ప్రొడక్షన్‌ డిజెనర్‌: చిన్నా,

నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

విడుదల:ఆగస్టు 15,2012

 - అల్లం శశిధర్

shashidhar.allam@yahoo.com