Menu

మణిరత్నం హ్యాంగోవర్ తో “అందాల రాక్షసి”

 

మౌనరాగం-గీతాంజలి-ప్రేమిస్తే సినిమాలు చూశారా! బహుశా మొదటి రెండూ ఈ తరంవాళ్ళు చూసుండరు. అందుకే వీటిని కలగలిపి ఈ తరంవాళ్ళ కోసం కొత్తప్యాకేజిలో కాకుండా అవే సినిమాల్ని అదే పాత ప్యాకేజిలో కొత్త నటీనటులతో తీసిన అందమైన రాకాసి (బడ్జెట్) సినిమా “అందాల రాక్షసి”. సినిమా కథాకాలంకూడా 1991-92 కాబట్టి బహుశా ఆ కాలపు భావావేశాల్ని పండించడానికి తీసిన ఒక మిథికల్ లవ్ స్టోరీగా చెప్పుకోవచ్చు.

గౌతమ్ (రాహుల్ రవీంద్రన్) డబ్బున్న కుర్రాడు. మిథున(లావణ్య) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని పరిస్థితుల మధ్యన ఇద్దరికీ పెళ్ళి కుదురుతుంది. పెళ్ళయ్యే ముందే మిధున సూర్య (నవీన్ చంద్ర) అనే తన చనిపోయిన ప్రేమికుడిని మర్చిపోలేకపోతున్నానని, కొంత సమయం కావాలని గౌతమ్ ని కోరుతుంది. ఇద్దరూ కలిసి ఒక హిల్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ మెల్లమెల్లగా మిథున గౌతమ్ ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అంతా సరైన దారిలో నడుస్తోందనుకునే సమయంలో అసలు సూర్య చనిపోలేదనే నిజం గౌతమ్ కి తెలుస్తుంది. ఆ తరువాత గౌతమ్ ఏంచేశాడు? మిథున ఇద్దరి ప్రేమ మధ్యన ఎలా మిగిలింది? అనేది కథ.

కథ పాతదే. పాతకథలాగే ఉంది. కథనంలో,పాత్రల తీరుతెన్నుల్లో కూడా అప్పటి మణిరత్నం సినిమాల ధోరణే కనిపిస్తుంది. పాత్రల భావుకత, ప్రవర్తన, ఆలోచనలు, కీచుగొంతులేసుకుని డైలాగుల్ని ‘సహజంగా’ అరవడాలు లాంటివి ముప్పై సంవత్సరాలకు పై బడిన ప్రేక్షకులకి ఒక నొస్టాల్జిల్ ట్రిప్ లాగా అనిపిస్తాయేమోగానీ ఇప్పుడు ఇవన్నీ 2012 లో తెరమీద చూస్తుంటే కొంత నవ్వొస్తుంది. క్లైమాక్స్ తమిళ సినిమాలని కూడా తలపిస్తుంది.

నటీనటుల నటన అందరిదీ చాలా బాగుంది. కొత్తవాళ్ళైనా సరే వాళ్ళు కెమెరా ముందుకి ఎంత కాన్ఫిడెన్స్ తో కనిపించారో అంతే నమ్మకాన్ని ప్రేక్షకులకి కలిగిస్తారు. రాహుల్ రవీంద్రన్ అర్బన్ లుక్స్, నవీన్ చంద్ర రఫ్ గెటప్, లావణ్యలోని ముగ్ధత్వం ఈ సినిమాకోసమే ఉన్నాయా అనిపించకమానదు. అంతగా నప్పాయి. మిగతా పాత్రల్లో సివిఎన్ నరసింహారావు, ప్రగతి (అక్కడక్కడా శారద గారిలోని అతి కనిపించినా) నటన బాగున్నాయి. బామ్మ పాత్రకూడా బాగుంది.

సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే దృశ్యపరంగా ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలల్లోకీ బెస్ట్. సినెమాటోగ్రఫర్ మురళి ఫ్రేమింగ్, లైటింగ్, కెమెరా మోమెంట్స్ తెరని కాన్వాస్ గా మలిచి మన కళ్లముందు ఆవిష్కరించేస్తుంది. చంద్రశేఖర్ ఎడిటింగ్ కొంచెం పదునెక్కువయ్యుంటే బాగుండేది. సీన్ల కూర్పు చాలా నిదానించింది. అప్పుడప్పుడూ ప్రేక్షకులకి సహన పరీక్షకి గురిచేస్తుంది. రథన్ సంగీతం ప్రేమకథలకు కాలవసిన సరంజామాని అందించింది. ముఖ్యంగా చెప్పుకోవలసింది కళాదర్శకుడి గురించి. పేరు నేను టైటిల్స్ లో చూడలేకపోయానుగానీ, ఈ సినిమాలో దర్శకత్వం, ఛాయాగ్రహణం తరువాత అగ్రపీఠం ఇతడికే దక్కుతుంది.

అద్భుత దృశ్యకావ్యంగా ఈ సినిమాని మలిచిన దర్శకుడు హను రాఘవపూడి అభినందనీయుడే, ప్రేమలోని (పాత)భావోద్వేగాల్ని మళ్ళీ తట్టిలేపిన ప్రతిభావంతుడే, కానీ ఈ సినిమాలో చాలా చోట్ల ఎంత ఇండల్జెన్స్ కనిపిస్తుందంటే ఈ సినిమాని తనకోసం మాత్రమే తీసుకున్నాడా అనిపించేంత గుబులేస్తుంది. మణిరత్నం హ్యాంగోవర్ మీరితే మంచి భవిష్యత్తున్న దర్శకుడు. అనుకున్న బడ్జెట్లో (సినిమా బడ్జెట్ ప్రస్తావనలు, కలెక్షన్ల వివరాలూ అప్రస్తుతం. కానీ ఈ సినిమా “ఇంతలో అనుకున్నది ఇంతలో తీశారంట” అని పదేపదే పరిశ్రమ చర్చించుకున్న విషయంకాబట్టి సినిమా చూస్తున్నంత సేపూ క్వాలిటీని మెచ్చుకున్నా ఇంత భారీ (దాదాపు ఏడు కోట్లని వినికిడి) బడ్జెట్టుతో కొత్తవాళ్లతో ఇలాంటి సినిమా తియ్యడమా అనే ప్రశ్న ఉదయించక మానదు) సినిమా తియ్యగలిగితే అత్యుత్తమ దర్శకుడిగా తెలుగులో రాణించగలడు.

5 Comments
  1. SUMAN August 19, 2012 /
  2. durga August 23, 2012 /
  3. Srikanth August 29, 2013 /