Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 5: సినిమా పరిభాష దిశగా తొలి అడుగులు

అప్పటికి కదిలే చిత్రాలన్నింటిని సినిమాలుగానే పరిగణించేవారు.. అయితే 19వ శతాబ్దం చివర్లో వచ్చిన సినిమాలన్నీ సంఘటనా చిత్రాలే కాని పూర్తి నిడివి చిత్రాలు కావు. వుదాహరణకి లుమినరీ సోదరులు తీసిన తొలి చిత్రంలో లుమినరీ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కార్మికులు కనిపిస్తారు. ఇలాగే ప్లాట్‌ఫారం మీదకు వస్తున్న రైలు, స్ప్రింక్లర్‌తో ఆడుతున్న తోటమాలి, మనదేశానికి వస్తే లార్డ్ కర్జన్ డిల్లీ దర్బారు, కుస్తీపోటీలు ఇలాంటివన్నీ చిత్రీకరించేవారు. అయితే సినిమా ద్వారా ఒక కథ చెప్పవచ్చని, అప్పటికే ప్రాచుర్యంలో వున్న నాటకాలను సినిమాలుగా చూపించాలనే ఆలోచన ఇంకా ఎవరికీ రాలేదు.

సినిమాలో కథ చెప్పడమే కాకుండా అసలు సినిమా తీసే విధనంలో కూడా అప్పటికి మార్పు రావల్సి వుంది.. ఆ రోజుల్లో సినిమాలు కేవలం ఒక నాటకాన్ని చూస్తున్నామా అనిపించేట్టుగా ఒక చోట కెమెరాని స్థిరంగా వుంచి తీసేవారు. అప్పటికి కదులుతున్న బొమ్మలను చూసి అందరూ ఆనందించినా సినిమా – నాటకం మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసే మార్పు రావలసివుంది. ఇంకో రకంగా చెప్పాలంటే సినిమాకి తనకంటూ ఒక పరిభాష ఏర్పడాల్సివుంది. అలాంటి పరిస్థితిలో ఆ దిశగా ప్రయత్నాలు చేసి సినిమాకు ఒక అస్థిత్వాన్ని ఏర్పరచినవారు ఇద్దరున్నారు. వారే సినీంద్రజాలికుడు జార్జ్ మిలీస్, దర్శకమాంత్రికుడు ఎడ్విన్ పోర్టర్.

జార్జ్ మిలీస్

తొలినాళ్ళలో చాలా మంది ఔత్సాహికులాగానే జార్జ్ మిలీస్‌కూడా లుమినరీ సోదరుల చిత్రాలను చూసే ప్రభావితుడయ్యాడు. 1895, డిసెంబరు 28న ప్యారిస్‌లో జరిగిన ప్రదర్శన చూసి తనూ ఇలాంటి సినిమా చేయాలని భావించాడు. జార్జి అప్పటికి వృత్తిరీత్యా ఇంద్రజాలికుడు. తనకి తెలిసి ఇంద్రజాల విద్యకన్నా సినిమా పెద్ద ఇంద్రజాలమని అతను భావించాడు. 1896 ఫిబ్రవరిలో సొంతంగా ఒక కెమెరా కొని తన సినిమా ప్రయత్నాలు ప్రారంభించాడు. మొదట ఇతరులు తీసిన సినిమాలను ప్రదర్శించడంతో మొదలై తనే స్వంతంగా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.

అతని సినీమాయాజాలానికి బీజం వేసిన సంఘటన 1896లో జరిగింది. ప్యారిస్ పుర వీధుల్ని తన కెమెరాతో చిత్రీకరిస్తుండగా ఆ కెమెరా మధ్యలో ఆగిపోయింది. ఆ విషయం తెలియని మిలీస్ అలాగే చిత్రీకరించాడు. తరువాత వచ్చిన చిత్రాన్ని చూస్తే అందులో మనుషులు మాయమౌతున్నట్టు, వస్తువులు మారిపోతున్నట్టు కనిపించింది. ఆ దృశ్యం చూసిన మిలీస్ సినిమా ద్వారా కనికట్టు చేయవచ్చని అర్థం చేసుకున్నాడు. తనకి తెలిసిన ఇంద్రజాలాన్ని సినిమాతో కలిపి ప్రయోగాలు ప్రారంభించాడు. అలా మొదలైనవే స్పెషల్ ఎఫెక్ట్స్. మిలీస్ చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్‌లో చెప్పుకోదగ్గవి – తొలి డబల్ ఎక్స్‌పోజర్, స్ప్లిట్ స్క్రీన్ (తెరపై వేరు వేరు సంధర్భాలలో చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టు భ్రమ కలిగించడం), మొదటిసారిగా డిసాల్వ్ వాడటం చేశాడు. ఎక్కువగా ఫాంటసీ చిత్రాలకే పరిమితమైన మిలీస్ తీసిన చిత్రాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందినది – “ఏ ట్రిప్ టు ద మూన్ (1902)”. మరీ ముఖ్యంగా మనిషి ముఖంలా వున్న చంద్రుడి కన్ను పైన రాకెట్ దిగడం అప్పట్లో సంచలనాత్మకమైన దృశ్యంగా చెప్పుకునేవారు. ఇలాంటి ప్రయోగల్తో మిలీస్ ట్రిక్ సినిమాకి, డబల్ ఏక్షన్ సినిమాలకి, ఆఖరికి చాలా వరకు మన విఠలాచార్య తరహా సినిమాలకి బీజం వేశాడు.

ఎడ్విన్ ఎస్. పోర్టర్

1900 ప్రాంతంలో పోర్టర్ ఇంగ్లాండ్‌లో ఒక చోటి నుంచి మరో చోటికి తిరుగుతూ చిన్న ప్రొజెక్టర్  సాయంతో సినిమా ప్రదర్శనలు ఇచ్చేవాడు. అయితే అతని ప్రొజక్టర్ అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఎడిసన్ మానుఫాక్చరింగ్ కంపెనీలో చేరాడు. తన ప్రతిభతో అచిరకాలంలోనే మెకానిక్ స్థాయి నుంచి దర్శకుడిగా ఎదిగాడు. ఎడిసన్ అప్పటికే కెనిటోస్కోప్ (ఒక చెక్కపెట్టెలా వుండి ఒకసారి ఒకరే చూసే అవకాశం వున్న యంత్రం) తయారు చేసాడు. ప్రపంచమంతా ప్రొజక్టర్ దిశగా ప్రయోగాలు చేస్తుంటే సినిమా గుంపుగా చూసేది కాదని, కేవలం ఒకరు ఒకసారి చూసే కెనిటోస్కోప్‌లకే ముందు ముందు వ్యాపారం వుంటుందని ఎడిసన్ నమ్మాడు. ఎడిసన్ కూడా ఒక ప్రొజక్టర్ కనిపెట్టాడు కాని, అది లాభాలు తెచ్చేది కాదని ఆయన భావించాడు. అనుకున్నదానికి భిన్నంగా ప్రొజక్టర్లు కెనిటోస్కోప్‌ల కన్నా ఎక్కువగా అమ్ముడుపోయేవి అప్పట్లో.  ఆ కారణంగా ఎడిసన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నాడు. అదీ గాక డబ్బు విషయంలో ఎడిసన్ పొదుపరి కావడంతో పోర్టర్ చేయదలచిన ప్రయోగాలన్నీ చెయ్యలేకపోయాడు.

జర్జియస్ మిలీస్ చిత్రాలను చూసి వాటివల్ల ప్రభావితుడై అదే రకమైన చిత్రాలను రూపొందించాడు పోర్టర్. అప్పట్లో కాపీ రైట్‌లు లేకపోవడంతో మిలీస్ తీసిన సినిమాలనే మళ్ళీ తీసేవాడు పోర్టర్. అలా తీస్తూనే స్వయంగా “ద ఫినిష్ ఆఫ్ బ్రిజెట్ మెకీన్ (1901)”, “జాక్ అండ్ ది బీన్‌స్టాక్ (1902) వంటి చిత్రాలు తీసాడు. ఆ తరువాత తీసిన “ద లైఫ్ ఆఫ్ అన్ అమెరికన్ ఫైర్‌మాన్ (1903)” అనే చిత్రం సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఒక ప్లాట్, ఏక్షన్ సన్నివేశాలతో పాటు క్లోజప్ కూడా మొదటిసారి గా ఈ చిత్రంలోనే కనిపిస్తుంది.

అన్నింటినీ మించి ఆ తరువాత తీసిన “ది గ్రేట్ ట్రైన్ రాబరీ (1903)” చెప్పుకోదగ్గది. 1900లో జరిగిన ఒక ట్రైన్ దోపిడీ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు పోర్టార్. తొలి వెస్ట్రన్ సినిమాగా చెప్పుకునే ఈ చిత్రంలో మొదటి సీను నుంచి చివరి సీనువరకు పూర్తి ఏక్షన్ చిత్రంగా రూపొందించారు. అద్భుతమైన ఎడిటింగ్, రకరకాల దృష్టికోణలు (ఏంగిల్స్) చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యంతో నోర్లు వెళ్ళబెట్టారు. సినిమా చివరిలో ఒక పాత్రధారి క్లోజప్‌లో కెమెరా వైపు తిరిగి చెతిలో రివాల్వర్ ఎక్కుపెట్టే పేల్చే సన్నివేశానికి అదిరిపోయి, బయటికి పరుగులు తీసారు.

కానీ ఇలా పరిగెత్తిన జనమే మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలని కోరుకోవడంతో సినిమా మరింత వృధ్ధిలోకి వచ్చింది.

(వచ్చేవారం: సత్తు నాణేనికి సినిమా)