Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 4: భారత సినీ దర్శకులకే “దాదాసాహెబ్”

భారతదేశంలో తొలి సినిమా ప్రదర్శన 1896లో బాంబేలో జరిగింది. లుమినరీ సోదరులు తీసిన ఆరు చిత్రాలను అక్కడ ప్రదర్శించారు. అయితే ఆ చిత్రాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఒకటుంది. “ది అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ అట్ లా సియోటాట్ స్టేషన్” అనే ఈ చిత్రంలో కెమెరా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ పైన వుండగా ఒక రైలు దూసుకుంటూ వచ్చి ఆగడం కనిపిస్తుంది. లుమినరీ సోదరులు అనేక దేశాల్లో ఇచ్చిన ప్రదర్శనలో ఈ చిత్రాన్ని కూడా జతపరిచారు. అయితే ఈ చిత్రాన్ని ప్రదర్శించిన చాలాచోట్ల ఆ రైలు తమ మీదికే వస్తోంది చాలామంది ప్రేక్షకులు భయపడిపోయి, సినిమా హాలులోనించి బయటికి పరుగెత్తేవారు. అయితే ఆ అనుభవానికి భిన్నంగా భారత దేశంలో ఈ చిత్రం ప్రదర్శన జరిగినప్పుడు చాలా తక్కువ మంది భయపడ్డారు. అప్పటికే బొమ్మలాట, తోలుబొమ్మలాట వంటి ప్రదర్శనలకు, ఫోటోగ్రఫీకి అలవాటు పడిన భారతీయులకి అదేం పెద్ద విచిత్రంలా గోచరించలేదు కాబోలు.

ఇలాంటి చిత్రాలకు భారతీయ ప్రేక్షకులు భయపడక పోగా, అప్పటికే స్వదేశీ, స్వపరిపాలన వంటి భావాల ప్రభావంలో వుండటం వల్లనేమో, మనమే సినిమా సొంతగా సినిమాతీస్తే బాగుంటుందని అనే ఆలోచించటం మొదలుపెట్టారు. అలాంటి ఆలోచన చేసినవారిలో చెప్పుకోదగినవాళ్ళు సేవ్ దాదా, హిరాలాల్ సేన్, రాంచంద్ర గోపాల్ తదితరులు. అయితే లుమినరీ సోదరుల ప్రదర్శన చూసి ప్రభావితుడై పూర్తి నిడివి చిత్రం తీయటంలో సఫలమైనవాడు – దుంఢిరాజ్ గోవింద్ ఫాల్కే (దాదా సాహెబ్ ఫాల్కే)

ఫాల్కే అప్పటికే మంచి ఫోటోగ్రాఫర్. లుమినరీ సోదరుల నియమించిన జెర్మనీ ఇంద్రజాలికుడు కార్ల్ హెర్జ్‌తో కలిసి కొన్ని ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చివున్నాడు. అద్భుత చిత్రకారుడు రాజారవివర్మ దగ్గర పనిచేశాడు.  అయితే ఈ పనులేవీ ఆర్థికంగా కలిసిరాక పోవటంతో ఏం చెయ్యాలా అని ఆలోచనలో వున్నాడు. అతని జీవితగతిని, భారతీయ సినిమా భవితవ్యాన్ని మార్చివేసే సంఘటన 1910లో క్రిస్‌మస్ రోజున జరిగింది.

ఆ రోజు బాంబేలోని అమెరికన్ – ఇండియన్ సినిమాలో “ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్” అనే సినిమా ప్రదర్శన జరిగింది. ఆ సినిమా చూడటానికి వచ్చిన అనేక మంది పురప్రముఖులతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే కూడా వున్నాడు. అప్పటికే ఆయన లుమినరీ సోదరులు తీసిన చిత్రాలతో మొదలుపెట్టి అందుబాటులోవున్న అన్ని సినిమాలు చూశాడు. బాంబేలో జరిగిన ప్రతి సినిమా ప్రదర్శనకి వెళ్ళాడు. సినిమాకి సంబంధించిన అన్ని పుస్తకాలు తిరగేశాడు. సినిమా హాలు కూర్చోని సినిమా వైపు కాకుండా ప్రొజక్టర్ వైపు తిరిగి చిత్రంగా చూస్తాడని అతని గురించి విచిత్రంగా చెప్పుకునేవారు.

అలాంటి ఫాల్కే ఆ రోజు “ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్” చూస్తూ తాను సినిమా తీయాలని బలంగా నిర్ణయించుకున్నాడు. అక్కడ తెర పైన క్రీస్తుకు బదులు రాముడు కృష్ణుడు ఆయనకికనిపించడం మొదలుపెట్టారు. బయటికి వస్తూనే “సరిగ్గా “లైఫ్ ఆఫ్ క్రైస్ట్” లాగానే నేను కూడా మన కథలతో సినిమా తీస్తాను” అంటూ ప్రకటించాడు.

ప్రకటించడానికైతే ప్రకటించాడు కానీ సినిమా తీయడానికి అవసరమైన పరికరాలు కానీ, సాంకేంతిక పరిజ్ఞానం కానీ అప్పటికి ఇంకా భారతదేశంలేదు. తన ఇన్సూరెన్స్ కాగితాలను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఇంగ్లాడు వెళ్ళి సినిమా తీయటానికి అవసరమైన సంగతులన్నీ నేర్చుకోని తిరిగి భారతదేశం వచ్చాడు.

ఇక మొదలైంది అసలు ప్రహసనం. తాను తియ్యబోయే సినిమాకి డబ్బులు పెట్టే నిర్మాతలకోసం అన్వేషించాడు. యష్వంత్ నాదకర్ణి అనే స్నేహితుణ్ణి ఎలాగైనా ఒప్పించాలని అతనికోసం ఒక సాంపిల్ చిత్రం తీసాడు. ఒక పూల కుండీలో ఒక బఠాణీ విత్తనం నాటి, రోజుకు ఒక ఫ్రేం చెప్పున తీస్తూ మొక్క మొలిచి ఎదిగేదాకా తీసాడు. అన్ని ఫ్రేములు కలిపి ఒక సినిమాగా నాదకర్ణీకి చూపించాడు. తన కళ్ళ ఎదుటే బఠానీ మొక్క పుట్టి పెరగడం కనిపించే సరికి అతని ఆశ్చర్యానికి అవధుల్లేకుండా పోయాయి. నాదకర్ణి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.  “బర్త్ ఆఫ్ ఎ పీ ప్లాంట్” అనే ఆ చిత్రమే భారత చలన చిత్ర చరిత్రలో తొలి ట్రిక్ ఫిలిం.

నాదకర్ణి నిర్మాతగా తొలి సినిమా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అనుభవం లేని ఆర్టిస్టులు, ఆడ వేషానికి మొగ వేషానికీ రెండిటికీ మొగవారు, కెమెరా దృష్టిలో పెట్టుకోని నటించడం, డైలాగులు పలకడం తెలియని రోజులు.. ఇలా అష్టకష్టాలు పడుతూ, సడలని ఆత్మవిశ్వాసంతో తొలి భారత సినిమాని సృష్టించాడు దాదా సాహెబ్ ఫాల్కే. ఆ సినిమా పేరు – “రాజా హరిశ్చంద్ర”

హిందీ, ఇంగ్లీషు టైటిల్స్‌తో మే 3, 1913న తొలి ప్రదర్శన జరిగిన ఈ తొలి భారతీయ మూకీ సినిమా ఘనవిజయం సాధించింది. తెరపై తమకి తెలిసిన కథ చూసి భారతీయులు ఎంతో సంతోషించారు. ఇక అక్కడి నుంచి భారతీయ సినిమా ప్రస్థానం ప్రారంభమైంది.

 

భారతీయ సినిమాలో తొలి బాత్‌టబ్ సీన్ తొలి మూకీ చిత్రం “రాజా హరిశ్చంద్ర” చిత్రంలోనే వుందన్న సంగతి మీకు తెలుసా? అయితే అప్పటి కాల మాన పరిస్థితులను బట్టి పూర్తి వస్త్రధారణతోనే ఆ సన్నివేశం తీయడం జరిగింది. హరిశ్చంద్రుడు తన భార్య తారామతిని పిలవడానికి ఆమె అంతఃపురంలో ప్రవేశించినప్పుడు, తారామతి, ఆమె చెలికత్తెలు జలకాలాడుతుంటారు. అయితే ఆ పాత్రలు వేసింది ఎవరూ ఆడవారు కాదు, మగవారే..!!

(వచ్చేవారం: చంద్రమండల యాత్ర)
One Response
  1. Sowmya July 10, 2012 /