Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 12: సినీచరిత్రలో “నవతరంగం”

అన్నీ అమర్చినట్లు అందుబాటులో వుంటే అద్భుతాలు జరగవు. ప్రతిబంధకాలు ఎదురైనప్పుడే సృజనాత్మకత పెరిగి కొత్తకొత్త ఆవిష్కారాలు జరుగుతాయి. ఈ విషయం రెండో ప్రపంచయుద్ధం తరువాత వచ్చిన సినిమాలని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రపంచయుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వత్తిడుల నేపధ్యంలో తయారైన ఎన్నో సినిమాలు ప్రపంచ చలనచిత్ర గతినే మార్చేశాయి. ఇలాంటి సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఇటలీ నవ్యవాస్తవిక చిత్రాలు (Italian Neo-realism), ఫ్రెంచ్ నవతరంగం చిత్రాలు (French new wave). ఈ ఇటాలియన్ చిత్రాలు చలన చిత్ర నిర్మాణంలో అనూహ్యమైన మార్పులు తీసుకు వస్తే ఆ మార్పులను ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత మాత్రం ఫ్రెంచ్ సినిమాలకే దక్కుతుంది. సినిమా అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదని,  సినిమా అనేది ఒక కళని నిరూపించిన ఈ ఫ్రెంచ్ సినిమా విప్లవం నిజంగా సినిమా చరిత్రలో ఒక  “నవతరంగం”

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఫ్రాన్స్ జర్మనీ  అధీనంలో వుండటం వల్ల అమెరికాలో తయారయ్యే ఇంగ్లిషు సినిమాల దిగుమతి నిషేదించబడింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రెంచ్ సినిమాల పరిస్థితి మారిపోయింది. ఒక దశాబ్దం పాటు ఫ్రాన్స్‌లో విడుదల కాని సినిమాలన్నీ ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. అప్పుటి ఫ్రెంచ్ ప్రభుత్వం అస్థిరంగా వుండటం, యుద్ధం కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థికపరిస్థితి సినిమాలపైన కూడా ప్రభావాన్ని చూపింది. అప్పటికే సినిమా ఒక  “పరిశ్రమ”గా మారి కేవలం ఆ పరిశ్రమలో వున్నవారికే అవకాశాలు ఇస్తూ,  బడ్జెట్ విషయంలో ఆంక్షలతో సినిమాలు తయారౌతున్నాయి. ముఖ్యంగా సినిమా కథ విషయంలో ఏ మాత్రం సృజనాత్మకత లేకుండా సాహిత్యంలో వున్న కథలను, యథాతధంగా తీస్తున్న రోజులవి. సరిగ్గా అప్పుడే ఫ్రాన్స్‌లో “సినిమాథెక్” అని పిలవబడే సినిమా క్లబ్‌లు మొదలయ్యాయి. పతనావస్థకు జారుకున్న ఫ్రెంచ్ సినిమాలను కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తయారౌతున్న ఎన్నో సినిమాలను చూసేందుకు ఈ సినిమాథెక్‌లు అవకాశం కల్పించాయి. అలా ఆండ్రీబెంజిన్ అనే సినీప్రేమికుడు మొదలుపెట్టిన ఒకానొక సినిమాథెక్ (ఆబ్జెక్టిఫ్ 49)లో ఫ్రెంచ్ సినీవిప్లవానికి బీజం పడింది.

అప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లా సినిమా చూడటానికి క్లబ్బులకి వెళ్ళిన టీనేజి కుర్రాళ్లలోనే ట్రుఫా, గొడార్ట్, జాక్వియస్రివెట్, ఛభ్రోల వంటి మహామహులు వున్నారు. అయితే వారంతా కలిసి పని చెయ్యడానికి దోహదపడే మరో కీలకమైన మార్పు ఆ తరువాత కొంత కాలానికి జరిగింది. ఆ మార్పు పేరు కాషియర్డూ సినిమా అనే ఫిల్మ్ పత్రిక. ఈ సినిమా పత్రికలో వ్యాసాలు రాస్తూనే ట్రుఫా, గొడార్డ్ తదితరులు ఒకరికొకరు దగ్గరయ్యారు.

వీళ్ళంతా కలిసి అప్పుడు వస్తున్న “తాతల నాటి సినిమాల”ని బాహాటంగా విమర్శించేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సినిమా విప్లవాలను ముఖ్యంగా ఇటాలియన్ నవ్యవాస్తవికచిత్రాలను, గ్రిఫిత్, బస్టన్కీటన్, చాప్లిన్, స్ట్రోహిమ్ మొదలు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ వరకు సినిమా దర్శకులను పరిచయం చేస్తూ వారి గొప్పదనం గురించి వ్రాసేవాళ్ళు. అప్పట్లో హాలీవుడ్‌లో సైతం దర్శకులు స్టూడియోల “ఉద్యోగులుగా” వుంటూ, స్టూడియోల కోసం చిత్రాలు తీసేవారు. అలా తయారైన సినిమాలు స్టూడియో చిత్రాలు అవుతాయి కానీ దర్శకుడి చిత్రాలు కావని వారు వాదించేవారు. సినిమా అనేది దర్శకుడు రాసే పుస్తకంలాంటిదనీ, కెమెరా దర్శకుడి చేతిలో కలం అనీ చెప్పేవాళ్ళు. ప్రతి సినిమాలో దర్శకుడి సంతకం కనపడాలని కోరుకునేవాళ్ళు. అలాంటి సినిమాల గురించి రాసేవాళ్ళు. అలాంటి దర్శకుల కోసం వెతికేవాళ్ళు. అలాంటి సినిమాలు తీయాలని కలలు కనేవాళ్ళు. వారు కలలు కన్న చిత్రాలు తీసేందుకు వారికి త్వరలోనే అవకాశం వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలైంది”నవతరంగం”.

చాబ్రోల్ తీసిన “లీబ్యూసెర్జ్” (1958) మొదటి ఫ్రెంచ్ నవతరంగం సినిమా అని చెప్పబడుతున్నా నిజానికి ట్రుఫా తీసిన “ది 400 బ్లోస్” (1959), జూలియస్ఎట్జిమ్ (1962), గొడార్డ్ తీసిన “బ్రెత్‌లెస్” (1960) ఈ రకమైన సినిమాలలో తలమానికమైనవి. అప్పుడు వస్తున్న సినిమాలకి భిన్నంగా తయారైన ఈ నవతరంగం చిత్రాలు త్వరలోనే ప్రపంచవ్యాప్తమయ్యాయి. తక్కువ బడ్జెట్‌లో తయారయ్యే ఈ సినిమాలలో క్లుప్తమైన డైలాగులు, త్వరత్వరగా మారిపోయే సన్నివేశాలు, పొడవైన ట్రాకింగ్ షాట్లు, పాత్రలను “ఎస్టాబ్లిష్” చేసే సన్నివేశాలు లేకపోవటం ఇలాంటివి ఎన్నో ప్రేక్షకుడికి కొత్తగా పరిచయమయ్యాయి. అన్నింటి కంటే ముఖ్యంగా జంప్ కట్ అనే టెక్నిక్ మొదటిసారిగా వాడింది కూడా నవతరంగం సినిమాలలోనే (బ్రెత్‌లెస్). ఇవన్నీ ఒక ఎత్తైతే కథ చెప్పే విధానంలోనే పెనుమార్పును తెచ్చింది ఈ ఫ్రెంచ్ విప్లవమే. పాత్రలు, ఆ పాత్రలు చెప్పే పొడవైన డైలాగులు, వివరమైన సీన్లు కాకుండా దర్శకుడి చేతిలోని కెమెరా కథ చెప్పడం మొదలుపెట్టింది. కెమెరా కలంగా మారింది. దర్శకుడు కథకుడుగా మారాడు.

అలా 1958లో మొదలైన ఈ విప్లవం దాదాపు 1964 దాకా నిరాటంకంగా సాగింది. ఒక్క ఫ్రాన్స్ లోనే కాకుండా క్రమక్రమంగా ఐరోపా మొత్తం పాకి దాదాపు ప్రపంచంలో వున్న ప్రతిసినిమా పరిశ్రమని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేసిన ఘనత ఫ్రెంచ్ నవతరంగానికి దక్కుతుంది.

 

జంప్‌కట్ ఎలా పుట్టిందంటే..

ఫ్రెంచ్ నవతరంగం అనగానే గుర్తొచ్చే సినిమా గొడార్డ్ తీసిన బ్రెత్‌లెస్. ముఖ్యంగా ఆ సినిమాలోవాడిన జంప్‌ కట్ టెక్నిక్. జంప్‌కట్ అంటే కదులుతున్న సన్నివేశంలో మధ్యలో కొన్ని క్షణాలపాటు తొలగించి సన్నివేశం అనూహ్యంగా కదిలినట్లు భావన కల్పించడం. నిజానికి ఈ సినిమా నిడివి ఎక్కువైందని దాన్ని గంటన్నరకి కుదించాలని భావిచాడు గొడార్డ్. అయితే సినిమాలో అత్యధిక భాగం పొడవైన సన్నివేశాలు వుండటంతో ఏదీ తొలగించలేక తర్జభర్జనపడ్డాడు.అప్పుడే గొడార్డ్ మిత్రుడు జీన్ పీరీ సలహా మేరకు సన్నివేశానికి ప్రధానమైనంత వరకు వుంచి మిగతాది కత్తిరించాడు. దానివల్ల వచ్చిన అనూహ్యమైన కదలిక ఎంతోప్రసిద్ధమై చివరికి జప్‌కట్‌గా సినిమా పరిబాషలో స్థిరపడింది.

(బొమ్మల వివరాలకు మౌస్ ని బొమ్మ పైన కదపండి)

(తరువాత: ప్రపంచ సినిమాపై ఆసియా జండా)

One Response
  1. గీతాచార్య July 30, 2012 /