Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 9: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు…

1905 ప్రాంతానికల్లా సినిమా ప్రపంచపటంపైన బుడిబుడి అడుగులు మొదలుపెట్టింది. 1912 థామస్ ఎడిసన్ ఒక్క రీలుకి మించి సినిమా వుండకూడదని నియత్రించడంతో అమెరికాలో సినిమా ఒక రీలుకే పరిమితమైపోయింది. ఇలాంటి నియంత్రణ లేని ఆస్ట్రేలియా, యూరప్ లలో నాలుగు ఐదు రీళ్ళ సినిమాలు కూడా తయారయ్యాయి. ఎడిసన్ శాసనాన్ని తప్పించుకోడానికి ఎడిసన్ ట్రస్ట్ సభ్యులు కూడా మూడు నాలుగు రీళ్ళ సినిమాలు రూపొందించినా వాటిని విడి విడిగా ఒక వారం తరువాత మరికటి విడుదల చేసేవారు. ఒక రకంగా ఇవే తొలి సీక్వెల్ చిత్రాలని చెప్పవచ్చు. అయితే ఇవే సినిమాలను ఇతర దేశాలలో ఒకటే చిత్రంగా విడుదల చేయటం, అక్కడ అవి విజయం పొందడంతో ఐరోపా ఖండంలో పెద్ద చిత్రాల రూపకల్పన మొదలైంది. 1912 కల్లా ఎడిసన్ ప్రాభవం తగ్గిపోయి, హాలీవుడ్ సినిమాలు పుంజుకోవడంతో అమెరికాలొ కూడా నాలుగైదు రీళ్ళ సినిమాలు మొదలయ్యాయి.

దాదాపు ఇదే సమయంలొ ప్రాముఖ్యం కలిగిన మార్పు ఒకటి జరిగింది. అది సినిమాలొ నటించిన నటీనటుల పేర్లు సినిమా ప్రారంభంలొ వేయటం. అప్పటి వరకూ దర్శకుడి పేరు మీద చలామణీ అయ్యే సినిమ క్రమంగా నటీనటుల పేరు మీద చలామణీ అవడం మొదలైంది. ఈ ప్రక్రియే అనామకంగా వుండిపోయిన నటులని, హీరో హీరోయిన్లుగా, క్రమక్రమంగా స్టార్లుగా మార్చేందుకు దోహదమయ్యింది. ఈ స్టార్లకు ఇమేజ్ కూడా పుట్టుకురావటంతో సినిమా కథలు నటీ నటుల ఆధారంగా మారడం మొదలైంది. ఎడిసన్ ని కాదని ఏర్పాటైన స్టూడియోలు క్రమ క్రమంగా “స్టార్” సినిమాలు తీయబోయి చేతులు కాల్చుకున్నాయి.

అమెరికాలో ఈ విధంగా సినీ ప్రస్థానం సాగుతుంటే ఫ్రాన్స్ లో ప్యాథే కంపెనీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇదే తరహాలో “గౌమోంట్” లాంటి మరిన్ని సంస్థలు పుట్టుకొస్తుంటే మరో వైపు “ఫిల్మ్ ది ఆర్ట్” అనే సంస్థ 1908లో కళాత్మకమైన సినిమాలే తీస్తానంటూ ముందుకు వచ్చింది. అప్పటికి ఫ్రాన్స్ లో ప్రాచుర్యంలో వున్న “కామెడీ ఫ్రాన్చైజీ” లోని నటీనటులను నటింపజేస్తూ సినిమాలు మొదలుపెట్టింది. కాలక్రమంలో ఇలాంటి సినిమాలే ఆర్ట్ సినిమాలుగా స్థిరపడ్డాయి.

ఐరోపాలో సినిమాలకు తొలి దేశమైన బ్రిటన్ అదే సమయంలో రాసి పరంగా పెరిగినా వాసి లేక ప్రపంచ సినిమా పైనా ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోవటం విచిత్రం. అయితే అంత కంటే విచిత్రమేమిటంటే అప్పటివరకూ సినిమా ప్రపంచంలో పేరుపడని ఇటలీ, డెన్మార్క్, స్వీడన్, రష్యా, జెర్మనీలలో సినీ ప్రస్థానాలు చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి చెందాయి. ఇటలీలో వారి సంస్కృతిలో బలమైన చారిత్రక చిత్రాల నిర్మాణం మొదలైంది. ఎక్కువ సంఖ్యలో నటులతో, స్థాయి పరంగా పెద్ద సినిమాలు మొదలయ్యాయి. 1911లో వచ్చిన “లా కడుటా డీ ట్రోయా”,  1912 “క్వో వాడిస్” (గియోవన్ని పాస్ట్రోన్ దర్శకత్వం) చిత్రాలు ప్రపంచ సినిప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేశాయి. 1914లోనే రెండున్నర గంటల సినిమా తీసిన ఘనత ఇటలీ సినిమాది. అలాగే “క్రిటెనెట్టీ” (బుర్రతక్కువవాడు)  అనే పాత్రతో అనేక “స్లాప్ స్టిక్ కామెడీ” చిత్రాలు కూడా ఇటలీలొ నిర్మతమయ్యాయి.

రష్యా, స్వీడన్, జర్మనీలలో సినిమాలు మొదలైనా మొదటి ప్రపంచయుద్ధం మొదలయ్యే నాటికి చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. ఆ సమయంలో చెప్పుకోదగ్గ చిత్ర పరిశ్రమ డెన్మార్క్ లో వెలిసింది. మొదట్లో ఫ్రెంచ్, బ్రిటన్ సినిమాలను అనుకరిస్తూ సాగినా కొంతకాలానికి తమకంటూ ఒక మార్కెట్ ను తయారు చేసుకోవడంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారు. విగ్గో లార్సన్ దర్శకత్వంలో వచ్చిన “డెన్ హ్వైడ్ స్లావండీ” (ఒక తెల్ల బానిస) వంటి చిత్రాలు యూరప్ లో వున్న బానిస విధానాన్ని ఎండగడితే, “అర్బన్ గాడ్” దర్శకత్వంలో వచ్చిన “అఫ్ గ్రుండెన్” అనే సినిమా సర్కస్, శృంగారం, అసూయ, మర్డర్ మిస్టరీ వంటి వైవిధ్య కథాంశాల కలబోతగా వచ్చింది. (కుడి వైపు బొమ్మ)

ఇక భారతదేశంలొ 1913లో దాదాసాహెబ్ ఫాల్కే మొదలుపెట్టిన “రాజా హరిశ్చంద్ర” తరువాత, ఆయన దర్శకత్వంలోనే వచ్చిన మోహినీ భస్మాసుర (1913), సత్యవాన్ సావిత్రి (1914) మినహా మరే చిత్రమూ తయారు కాలేదు. హిందీ చిత్ర పరిశ్రమ తరువాత ఏర్పడిన తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలు అప్పుడప్పుడే మొదలౌతున్న సమయమది

ఏది ఏమినా అప్పటి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచ సినిమాని అమెరికన్ సినిమానే ఏలిందని చెప్పవచ్చు. ఒక్క ఫ్రాన్స్ లో మినహాయించి మిగిలిన అన్నిదేశాలలో అమెరికన్ సినిమా ప్రాంతీయ సినిమాని పక్కకి తోసి మొదటి స్థానానికి ఎగబాకింది. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా యూరోపియన్ నిర్మాతలు సినిమాలు తీయలేని పరిస్థితికి రావటంతో, అమెరికన్ సినిమా తిరుగులేని జయకేతనం ఎగురవేసింది.

 

(తరువాత: మాటలు నేర్చిన మాయాజాలం)

2 Comments
  1. chakri July 18, 2012 /
  2. Rahul Sankrityan July 21, 2012 /