Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 8: సినీ ప్రపంచానికి ఛార్లీ ఛాప్లిన్ చేసిన నిశ్శబ్ద సేవ

ఛార్లీ చాప్లిన్ ని తెరపైన చూడగానే పెదాలపై చిరునవ్వు, కళ్ళలో తడి ఒకేసారి పుట్టడం అందరికీ అనుభవమయ్యే సత్యం. ఈ అనుభవం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో కాక యావత్ ప్రపంచానికి కలగడం కేవలం చాప్లిన్ మాత్రమే సాధించిన అద్బుతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో అసంఖ్యాక అభిమానులు కలిగిన నటుడు, అప్పటికీ ఇప్పటికీ ఒక్క ఛార్లీ చాప్లినే అంటే అతిశయోక్తి కాదేమో. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంతో బాధలు పడుతున్న ప్రపంచాన్ని నవ్వించడానికా అన్నట్లు చాప్లిన్ కూడా 1914లోనే తెరపై “ది ట్రాంప్” అవతారం ఎత్తాడు. ఆ తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసిన ఆర్థిక మాద్యం (గ్రేట్ డిప్రషన్) వచ్చినా, నియంత హిట్లర్ ప్రపంచాన్ని గడగడలాడించినా ఛార్లీ చాప్లిన్ ప్రజల్ని నవ్విస్తూనే వున్నాడు. ఆ యుద్ధాన్ని, ఆర్థిక బాధల్ని, ఆఖరుకు హిట్లరుని కూడా కథా వస్తువు చేసి నవ్వించగలిగాడు. ఎన్నో బాధలు పడి ఎదిగినవాడు కావడం వల్లనేమో, ఎలాంటి బాధనైనా తీర్చగల నవ్వుల టానిక్ లను తయారు చేశాడు.

ఛాప్లిన్ నాటకాలు వేస్తూ ఇంగ్లాడు వదిలి అమెరికా వచ్చినప్పుడు ప్రముఖ హాస్య ద్వయం లారెల్ అండ్ హార్డీలలోని స్టాన్లీ (లారెల్) జఫర్సన్ తో కలిసి ఒకే గదిలో వుండేవాడు.  కీస్టోన్ కంపెనీలో అప్పటికే వైదొలిగిన ఫోర్డ్ స్టెర్లింగ్ స్థానంలో ఛాప్లిన్ కు అవకాశం దక్కింది. మొదట్లో ఎంతో ఇబ్బంది పడి “మేకింగ్ ఎ లివింగ్” (పక్కన వున్న చిత్రం అందులోనిదే) సినిమాలో నటించాక అతనిని దాదాపు వెళ్ళగొట్టేందుకు సిద్ధమైంది యాజమాన్యం. కానీ అలా జరగకపోవడంతో చాప్లిన్ కు ది ట్రాంప్ పాత్రలో నటించేందుకు అవకాశం వచ్చింది. వదులైన బ్యాగీ పాంటు, కురచ కోటు, పెద్ద పెద్ద బూట్లు, చిన్న టోపి, చేతిలో కర్ర వంటి చిత్రమైన వేషధారణతో, అమాయకంగా కనిపించే “ది ట్రాంప్” పాత్రని చాప్లిన్ మొదటిసారి 1914 లో విడుదలైన “కిడ్ ఆటో రేసెస్ ఎట్ వినీస్” చిత్రంలో ధరించాడు. అప్పుడు అతను ధరించిన బట్టలు, టోపీ, బూట్లు ఏవీ అతనివి కాకపోవటం విశేషం. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారం అందుబాటులొ వున్న వారి బట్టలు, టోపి, బూట్లు తీసుకొని ఆ పాత్ర రూపకల్పన చేశాడు చాప్లిన్. అలా “ది ట్రాంప్” పాత్రకి తన ప్యాంట్ ఇచ్చినవాడు “రోస్కో “ఫాటీ” ఆర్బకల్” అనే సీనియర్ నటుడు. ఆ ట్రాంప్ పాత్ర చేతిలో వుండే కర్ర తప్ప మిగిలినవి ఏవీ చాప్లిన్ సొంతవి కావు. అలా మొదలైన “ది ట్రాంప్” పాత్ర అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచానికి ఆప్తమైంది. 1936లో విడుదలైన మోడర్న టైమ్స్ లో ఆ ట్రాంప్ పాత్రని చివరిసారిగా ధరించాడు చాప్లిన్.

మూకి సినిమాలు అనగానే మనకు గుర్తుకువచ్చే సినిమాలలో మొదటివి చాప్లిన్ వి. అలా చాప్లిన్ మూకీ సినిమాకే తలమానికంగా నిలిచాడు. 1920 ప్రాంతంలో మూకీ సినిమాలు పోయి టాకీ సినిమాలు వస్తున్నా, తాను మాత్రం మూకీ సినిమాలే తీస్తాను అని నిర్ణయించుకొని, సినిమా జగత్తులోనే చివరిదైన మూకీ చిత్రాన్ని నిర్మించిన ఘనత కూడా ఆయనదే (సిటీ లైట్స్ 1931). ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచమంతా టాకీ సినిమాల వైపు పరుగులు తీస్తుంటే, మూకీ సినిమానే నిజమైన సినిమా అని నమ్మి అదే కొనసాగించిన ఘనత చాప్లిన్ ది. అందుకు కారణమూ లేకపోలేదు – కేవలం దృశ్య ప్రధానమైన మూకీ సినిమాలో తెరపై జరుగుతున్నదేమిటో ప్రేక్షకుడు అర్థం చేసుకోవాలంటే, నటీనటుల అద్భుతమైన నటనతో పాటు, సినీ పరిభాష ఆమూలాగ్రం అర్థం చేసుకున్న దర్శకుడు కావాలి. చాప్లిన్ ఆ రెండు విషయాలలో ఎంతో పరిణితి సాధించాడు. కేవలం ఒక కనుసైగతో, భుజాలు ఎగరెయ్యటంలో, అమాయకమైన చూపులో ఎన్నో భావాలను పలికించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. పేజీలకొద్ది డైలాగులు చెప్పలేని విషయాన్ని ఒక్క దృశ్యంలో చెప్పగలిగిన దర్శకత్వ ప్రతిభ కూడా ఆయనకే సొంతం. అందువల్లే మూకీ సినిమాల కాలంనాటి మేధావులను లెక్కిస్తే ముందు వరుసలో చాప్లిన్ వుండి తీరుతాడు.

మూకీ సినిమాలకీ, స్లాప్ స్టిక్ కామెడీ చిత్రాలకీ ఒక గ్రామర్ ని, ఒక గ్లామర్ ని సృష్టించిన ఘనత ఆయన సొంతమని మనకి తెలుసు. అయితే ఆయన వల్ల ప్రపంచ సినిమాకి కలిగిన ముఖ్యమైన ప్రయోజనం మరొకటి వుంది. అదేమిటో తెలుసుకోవాలంటే ఆ సమయంలో హాలీవుడ్ పరిస్థితి గురించి కొంత తెలుసుకోవాలి. 1910 ప్రాంతంలో ఎడిసన్ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ డీ.డబ్లూ. గ్రిఫిత్ హాలీవుడ్ స్టూడియో విధానానికి తెర తీస్తే, 1919 కల్లా అంటే దాదాపు ఒక దశాబ్దం తరువాత, అదే స్టూడియోలు సినీ రంగంపై గుత్తాధిపత్యాన్ని సాధించాయి. కళాకారులను కాంట్రాక్ట్ పద్దతిలో కుదుర్చుకుని, తక్కువ జీతాలు ఇస్తూ, పంపిణీదారులతో, థియేటర్ యాజమాన్యంతో కుమ్మక్కై, లేదా తామే స్వయంగా సినిమాలను పంపిణీ చేస్తూ, సొంత ధియేటర్లు నడుపుతూ సుమారు ఎనిమిది పెద్ద స్టూడియోలు సినిమారంగంపైన పట్టు సాధించాయి. అన్నింటికన్నా ముఖ్యంగా సినిమా నిర్మాణ వ్యయం నియంత్రణ పేరుతో, సృజనాత్మకత పైన ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం నచ్చని నలుగురు కళాకారులు తామే స్వయంగా ఒక సొంత స్టూడియో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ నలుగురే – ప్రముఖ నటీమణి మేరీ పింక్ ఫోర్డ్; నటుడు, రచయిత, దర్శకుడు డగ్లస్ ఫేయిర్ బ్లాంక్స్; డీ.డబ్ల్యూ.గ్రిఫిత్ మరియూ ఛార్లీ చాప్లిన్. ఈ నలుగురు కలిసి స్థాపించిన ఆ సంస్థ పేరే “యునైటెడ్ ఆర్టిస్ట్స్” (పక్క చిత్రం యునైటెడ్ ఆర్టిస్ట్స్ అగ్రిమెంట్ సంతకం చేస్తున్న చాప్లిన్)

ఈ యునైటెడ్ ఆర్టిస్ట్ సంస్థ ముందు అంత విజయవంతం కాకపోయినా, చాప్లిన్ చిత్రాల పుణ్యమా అని కొంత పుంజుకుంది. మళ్ళీ 1940లలో యునైటెడ్ ఆర్టిస్ట్స్ పతనానికి లోనైంది. ఆ తరువాత ఇదే మిత్రబృందం మరికొంత మందితో కలిసి “సొసైటి ఆఫ్ ఇండిపెండెంట్ మోషన్ పిక్చెర్ ప్రొడ్యూసర్స్ (SIMPP)” అనే సంస్థనూ స్థాపించారు. ఈ రెండు సంస్థలు అవి విజయవంతమైన సినిమాలు తీసినంతకాలం స్టూడియో విధానాన్ని ఎండగడుతూనే వచ్చాయి. ఒకస్థితిలో SIMPP ఒక పేరుమోసిన స్టూడియోపై కేసు వేయటం కూడా జరిగింది. 1948లో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన ఒకానొక తీర్పుతో ఈ స్టూడియో అరాచకాలకు అడ్డుకట్ట పడింది.

ఏది ఏమైనా చాప్లిన్ మరియు అతని మిత్రులు చేసిన ఈ ప్రయత్నాలవల్లే స్టూడియోలు తీసే “స్టార్” సినిమాలు పోయి, ప్రపంచ వ్యాప్తంగా “ఇండిపెండెంట్ సినిమా” ఉద్యమానికి తొలి అడుగుపడింది. ఆ విధంగా ఛార్లీ చాప్లిన్, తన సినిమాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్యనటుడిగా మిగిలిపోకుండా, సినిమా చరిత్రలో కీలకమైన మార్పులకు కారణం కూడా అయ్యడు.

ఆ నలుగురు: డగ్లస్ ఫేయిర్ బ్లాంక్స్, మేరీ పింక్ ఫోర్డ్, ఛార్లీ చాప్లిన్, డీ.డబ్ల్యూ.గ్రిఫిత్

(తరువాత వ్యాసం: ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచ సినిమా)

One Response
  1. Sripal July 18, 2012 /