Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 7: థామస్ ఆల్వా ఎడిసన్ vs గ్రిఫిత్

ప్రపంచ సినిమా చరిత్రలో మైలురాళ్ళుగా చెప్పుకొదగ్గ ఎన్నో ఆవిష్కరణలకు మూలమైన థామస్ ఆల్వా ఎడిసన్ క్రమ క్రమంగా సినిమా తీయాలనుకునే ఔత్సాహికుల పాలిట విలన్ లా తయారయ్యాడు. అప్పటికే సినిమా ప్రక్రియకి సంబంధించిన ఎన్నో పేటంట్లను సొంతం చేసుకున్న ఎడిసన్, అవి వాడాలనుకునే వారిపై భారీ సుంకాలు విధించడంతో సినిమా తీయటం అనేది కొందరికే పరిమితమైపోయింది. ఒకవేళ ఎవరినా ఎదిరించినా, చట్టపరంగా కేసులు వేసి వేధించేవారు. 1908 నాటికే ఇలాంటి కేసులు వందల సంఖ్యలో వేయబడ్డాయి. సినిమా వ్యాపారం దాదాపు బూర్జువా పోకడలు పోతున్న సమయమది.

ఎడిసన్ లా ఎన్నొ పేంటెంట్ లు సొంతం చేసుకున్న ఇతర సంస్థలు అన్ని కలిసి ఒక జట్టుగా ఏర్పడ్డాయి. 1908 జరిగిన ఈ చారిత్రక ఆవిర్భావమే ఆ వ్యవస్థకి గొడ్డలిపెట్టు అయ్యింది. ఎడిసన్ తో పాటుగా ఇందులో బయోగ్రాఫ్ స్టూడియో, అమెరికన్ ప్యాతే (ఫ్రెంచ్ కంపెనీ), విటాస్కోప్, ఎస్సెనే మొదలైన సినిమా నిర్మాణ సంస్థలు, జార్జి క్లీనీ వంటి డిస్ట్రిబ్యూషన్ దిగ్గజాలు, ఈస్ట్ మెన్ కొడాక్ వంటి ముడి సరుకు (సినిమా రీలు) పంపిణీదారులు అంతా కుమ్మక్కయ్యి “మోషన్ పిక్చెర్స్ పేటంట్స్ కంపెనీ” స్థాపించారు. ముడి సరుకు నుంచి, నిర్మాణం, ప్రదర్శన దాకా అన్నింటి పైనా గుత్తాధిపత్యం సాధించడం ఈ సంస్థ వుద్దేశ్యం. అనుకున్నట్టుగానే వీరి రాకతో సినిమా నిర్మాణం, ప్రదర్శన కొంత మంది చేతుల్లోనే వుండి పోయింది. అప్పటికీ కొంత మంది ఔత్సాహికులు తమంతట తామే సినిమా రీలు, కెమెరా, ప్రొజక్టర్లు తయారు చేసుకోని, “ఎడిసన్ ట్రస్ట్” కు వ్యతిరేకంగా పోరాటం చేస్తునే వున్నారు.

సరిగ్గా అదే సమయంలో అనూహ్యంగా తెరపైకి వచ్చినవాడు డీ.డబ్లూ. గ్రిఫిత్. అసలు రచయితగా ఎదగాలనుకొని న్యూయార్క వచ్చిన గ్రిఫిత్ నటుడిగా మారి చివరకు బయోగ్రాఫ్ కంపెనీలో చేరాడు. అక్కడ ప్రధాన దర్శకుడు అనారోగ్యం పాలై, అతని కొడుకు కూడా నిర్మాణం సాధిచలేను పరిస్థితిలో ఆ పగ్గాలు గ్రిఫిత్ చేతికి వచ్చాయి. ఆ తరువాత గ్రిఫిత్ ఆ కంపెనీ కోసం “ద అడ్వెంచర్స్ ఆఫ్ డాలీ” తో మొదలుపెట్టి ఎన్నో సినిమాలు తీసాడు.

1910లో బయోగ్రాఫ్ కంపెనీ గ్రిఫిత్ ను కొంత సినీ పరివారంతో లాస్ ఏంజలస్ లో ఒక సినిమా తీయమని పురమాయించింది. నగర సివారుల్లో వున్న జార్జియా స్ట్రీట్ దగ్గర మొదలై, కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తూ ఉత్తర దిశగా సాగిపోయింది ఆ బృందం. అక్కడ వారు చూసిన ఒక అధుతమైన వాతవరణం సినిమా తీయడానికి ఎంతో అనువైనదని గుర్తించారు. “ఇన్ ఓల్డ్ కాలిఫోర్నియా” అనే సినిమాని అక్కడ తీసారు. తిరిగి న్యూయార్క్ చేరుకోని, ఆ సినిమాని ప్రదర్శించాక ఆ సినిమా తీసిన ప్రాంతం పైన అందరికీ ఆసక్తి కలిగింది. స్వతహాగా అందమైన, అనువైన ప్రదేశం కావటం ఒక కారణమైతే, ఎడిసన్ ట్రస్ట్ కి దూరంగా, పేటంట్ల తో సంబంధం లేని సినిమాలు తీసే అవకాశం వుండటం మరో కారణం. ఏమైతేనేం, అప్పటికే గుత్తాధిపత్యాన్ని సాధించిన ఎడిసన్ ట్రస్ట్ ని ఎదిరించాలనుకున్నవారంతా అక్కడికే వెళ్ళి సినిమా తీయటం ప్రారంభించారు.

ఇలా నిర్మాణమౌతున్న చిత్రాలు విజయవంతం అవటం, ఇలా నిర్మాణమైన ఇండిపెండెంట్ సినిమా కోసమే ప్రత్యేకంగా థీయేటర్లు వెలియటంతో, నిర్మాణ రంగం వైపు ఆసక్తి వున్న సామ్యుల్ గోల్డ్వైన్, లూయీస్ మేయర్, వార్నర్ బ్రదర్స్ అక్కడే స్టూడియోలు నెలకొల్పడం మొదలుపెట్టారు. ఆ విధంగా అమెరికా సినిపరిశ్రమ మొత్తం అక్కడే స్థిరంగా నిలిచిపోయింది. ఆ వూరి పేరు హాలీవుడ్.

హాలివుడ్ సినిమాలు మొదలయ్యాక వాటి లభించిన ఆదరణ, ఇండిపెండెంట్ సినిమా నిడివి పెరిగి వాటి పై ప్రేక్షకుల ఆసక్తి పెరగటం, ఎడిసన్ ట్రస్ట్ చట్టపరంగా పేటంట్లు నిలుపుకోలేక పోవటం తదితరకారణాల వల్ల సినిమా గుత్తాతిధిపత్యం నుంచి బయటపడింది. ఇందాక చెప్పినట్లు దీనంతటికి మూల కారకుడు గ్రిఫిత్. ఇలా తొలి సినిమా వుద్యమానికి నాంది పలకటమే కాకుండా, సినిమా బాషలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినవాడు గ్రిఫిత్. ఆయన 1915లో తీసిన “ద క్లాన్స్ మెన్” (ది బర్త్ ఆఫ్ ఎ నేషన్) సినిమా స్థాయిని, ప్రేక్షకుల అంచనాలని పెంచేసింది. ఆ రోజుల్లో 1.12 లక్షల డాలర్లతో (ఇప్పటి ధరలో 26 లక్షల డాలర్లు), తీసిన అత్యంత భారి చిత్రంగా, నిర్మాతలకు కనకవర్షం కురుపించి అంత వరకు అత్యధిక వసూళ్ళు (ఇప్పటి ధరలో 22 కోట్ల డాలర్లు) సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. ఆ రికార్డును దాదాపు ఇరవై రెండేళ్ళ వరకూ మరే చిత్రం తాకలేకపోయింది. ఈ సినిమా పైన ఎంత డబ్బు వచ్చాయంటే ఇంగ్లాడులో పంపిణీకి తీసుకున్న లూయిస్. బీ. మేయర్ ఈ సినిమా పై వచ్చిన లాభాలతో ఒక స్టూడియోనే కట్టేశాడు. అదే ఈ నాటి మెట్రో-గోల్డ్విన్-మేయర్ స్టూడియో.

కేవలం కలక్షెన్ల పరంగానే కాకుండా ఈ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలో ఒక మైలు రాయి అని చెప్పవచ్చు. సినిమా టెక్నిక్ పరంగా డీప్ ఫోకస్, క్రాస్ కట్, ఫేషియల్ క్లోజ్ అప్ వంటివి మొదటిసారి వాడిన చిత్రంగా కూడా ఇది ముఖ్యమైనది. ఈ టెక్నిక్ లు అన్నీ గ్రిఫిత్ కనిపెట్టాడాని చెప్పలేము కానీ, సినిమా బాషలో ఈ అంశాలు వచ్చి చేరినది గ్రిఫిత్ సినిమాల తరువాతే. అలాగా నిడివి విషయంలో కూడా పాత మూసలను బద్దలు చేస్తూ మూడు గంటల పది నిమిషాలు సాగుతుందీ సినిమా. అంతే కాదు మొదటిసారి అమెరికా రాష్ట్రపతి (వుడ్రో విల్సన్) చూసిన చిత్రంగా, వర్ణ వివక్షత గురించి చేసిన వ్యాఖ్యల వల్ల అప్పటికి అతధిక నిరశనలు పొందిన చిత్రంగా కూడా ఈ సినిమా నిలిచిపోయింది.

 సినిమా ప్రపంచంలో తొలి విప్లవం తెచ్చిన వ్యక్తిగా, సినిమా బాషకు గ్రామర్ నేర్పిన గురువుగా, హాలీవుడ్ ఆవిర్భావానికి ఆద్యుడుగా గ్రిఫిత్ ను చిరస్మరణీయుడు. 1908 – 1931 ల మధ్య దాదాపు 554 చిన్న పెద్ద సినిమాలు తీసాడు గ్రిఫిత్. మహానటుడు చాప్లిన్ అంతటివాడే “మేమంతా గ్రిఫిత్ శిష్యులం” అని ప్రకటించుకున్నాడంటే గ్రిఫిత్ గొప్పతనం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.

(తర్వాత వ్యాసం – పొట్టివాడైనా గట్టివాడి గురించి…)