Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 6: సత్తు నాణానికి సినిమా ప్రదర్శన

పిట్స్ బర్గ్, స్మిత్ ఫీల్డ్ స్ట్రీట్ లొ డైమండ్ ఎవన్యూ, ఫిఫ్త్ ఎవన్యూ మధ్యలో వున్న ఒక చిన్న దుకాణం (Store Front) ఒకరోజు కొత్త అవతారం ఎత్తింది. “నికలోడియన్” అన్న పేరుతో, చుట్టూ వెలుగు చిమ్మే రంగురంగుల లైట్లతో ఆ వీధి మొత్తానికి కొత్త శోభ తెచ్చి పెట్టింది. ఆ “స్టోర్ థియేటర్” ముందు నిలబడి ఒక వ్యక్తి అరుస్తున్నాడు –

“పిల్లల్లారా, పెద్దల్లారా.. రండి.. నేడే చూడండి.. లోపలికి దయఛేయండి.. ఇంతవరకూ మీరు చూడని ఒక వింతైన ప్రదర్శన చూడండి.. పాతైనా కొత్తైనా.. కథ ఏమైనా.. నిజజీవితంలాగే… మీ కళ్ళముందే ప్రత్యక్షమయ్యే చిత్రాన్ని చూడండి..” అంటున్నాడు. అతనికి పక్కనే అమర్చిన ఫోనో గ్రాఫ్ నుంచి సాంప్రదాయ, జానపద గీతాలు బిగ్గరగా వినిపించేవి. ఆ వీధిలో వున్న జనం అంతా అటే ఆకర్షితులయ్యేవారు. ఈ తాకిడికి తట్టుకోలేని ఆ వీధి వ్యాపారస్తులంతా, తమ కస్టమర్లంతా థియేటర్ల వైపే మొగ్గు చూపడంతో “నికలోడియన్” ముందు ఫోనోగ్రాఫ్ పెట్టకూడదని గొడవ చేశారు. చివరికి ఆ ఫోనోగ్రాఫ్ తీసెయ్యక తప్పింది కాదు. అయినా జనం తాకిడి తగ్గలేదు లేదు సరి కదా ఇంకా పెరిగింది… పెరుగుతూనే వుంది. అలా పుట్టినదే ప్రపంచంలో మొట్టమొదటి సినిమా థియేటర్.

అప్పటికే ఉత్తర అమెరికా మధ్యతరగతి వినోదమాధ్యమాలలో ప్రముఖ స్థానంలో “వౌడివిల్” ప్రదర్శనశాలలు వుండేవి. ఇలాంటి చోట పలు వైవిధ్యమైన అంశాలతో ప్రదర్శనలు జరిగేవి. సాంప్రదాయక గానం, హాస్య ప్రదర్శనలు, నృత్యాలు, గారడి, పెంపుడు జంతువులు చేసే విన్యాసాలు, కసరత్తులు వంటివి అక్కడ చూపించేవారు. ఇలాంటి ఒక వౌడవిల్ (హారిస్ కామెడి అండ్ స్పెషాలిటీ కంపెనీ) కి వారసుడైన జాన్.పి.హారిస్ అందులో ఒకసారి చిత్ర ప్రదర్శన కూడా చేశాడు. ప్రేక్షకుల స్పందన గమనించిన జాన్, ఇలాంటి సినిమాలకు ఒక ప్రత్యేకమైన థియేటర్ అవసరం వుంటుందని, అది మంచి వ్యాపారం చేస్తుందని భావించాడు. తన బావమరిది అయిన హారీ డేవిస్ తో కలిసి, నికలోడియన్ అనే థియేటర్ ను ప్రారంభించాడు. నికిల్ అంటే సత్తుతో చేసిన అయిదు సెంట్ల నాణెం. ఓడియన్ అంటే గ్రీకు ప్రదర్శన శాల. ఆ రెండూ కలపగా వచ్చిన “నికలోడియన్” అంటే సత్తు నాణానికి థియేటర్లో సినిమా అని అర్థం.

ఈ అయిదు సెంట్ల సినిమా చూసే ఆలోచన అందరికి చాలా నచ్చింది. ముఖ్యంగా మధ్యతరగతికి. అప్పటి వరకూ సినిమా ప్రదర్శన అంటే ఎక్కడో, ధనికులు కలిసే క్లబ్బుల్లో జరిగే ప్రదర్శన మొదటిసారి సామాన్య ప్రజానీకానికి దగ్గరైంది. జాన్ హారిస్, హారీ డేవీస్ వూహించినట్లే ప్రజలు “నికలోడియన్” కు బ్రహ్మరధం పట్టారు.

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే సినిమా ప్రదర్శన రాత్రి పన్నెండు గంటలదాకా సాగుతూనే వుండేది. అప్పటికి అందుబాటులొ వున్నది లఘు చిత్రాలే కాబట్టి దాదాపు ఇరవై ఆటలు నడిచేవి. వంద మంది పట్టే ఆ హాలులో, వారానికి దాదాపు ఐదు వేలమంది సినిమా చూసేవారు. సినిమా తీయటమనే ప్రక్రియ అప్పటికే ప్రపంచవ్యాప్తమవడంతో నికలోడియన్ నడపడానికి కావాల్సిన సరుకుకు కొదవుండేది కాదు.

అప్పటి మూకీ సినిమాలు అర్థం కావటం కోసం ఒక దుబాసి అక్కడ నిలబడి, సినిమా లొ జరుగుతున్నదేమిటో గట్టిగా వివరించేవాడు. సినిమా అయిపోగానే, “సినిమా ముగిసిందని” అతను ప్రకటించగానే ప్రేక్షకులు బయటికి కదిలేవారు. మరో ద్వారం గుండా కొత్త ప్రేక్షకులు వచ్చేవారు. ఇలా నిరాటంకంగా ప్రదర్శనలు సాగేవి. తరువాత తరువాత దాదాపు నాలుగు వేల నికలోడియన్ లు వెలిశాయి. 1905 నుండి 1913 వరకు అప్రతిహతంగా సాగిన జైత్ర యాత్ర ఆ తరువాత వచ్చిన పూర్తి నిడివి సినిమాలు, పోటీగా వచ్చిన పెద్ద థియేటర్లు, పెరిగిన టికెట్ ధరల కారణంగా క్రమేపి మూత పడుతూ వచ్చాయి. అయినప్పటికి ప్రపంచ సినిమా ప్రదర్శనలో నికలోడియన్ ఒక సువర్ణాధ్యాయం.

***

అక్కడ అమెరికాలో నికలోడియన్ మూత పడుతున్న సంవత్సరం (1913) లొనే, భారత దేశంలోని మొదటి శాశ్వత సినిమా హాలు నిర్మాణమవడం చిత్రమైన యాదృశ్చికం. అప్పటికే డేరా సినిమాలతో మద్రాసు, బెంగుళూరు వంటి పట్టణాలతో పాటు, బర్మా, సింహళ దేశాలలో ప్రదర్శనలు ఇచ్చిన తెలుగువాడు రఘుపతి వెంకయ్యకు, సినిమా ప్రదర్శనకు ఒక శాశ్వతమైన హాలు వుండాలని అనిపించింది. మద్రాసులోని వ్యానెల్స్ రోడ్డు లొ కూవమ్ నది పక్కన (హారిస్ బ్రిడ్జి పక్కన) గెయిటీ హాలుని నిర్మించాడు. అదే భారత దేశంలొ నిర్మాణమైన తొలి సినిమా థియేటర్. సినిమా చరిత్రలోనే మైలురాయి అయిన “గెయిటీ” హాలు నిర్మించినవాడు తెలుగువాడని గర్వించినా, ఆ హాలు 2009లో కూల్చివేతకు గురై నేడు ఒక షాపింగ్ కాప్లెక్స్ గా మారటం విచారించదగ్గ విషయం

 

(తరువాత వ్యాసం: సినిమా తొలివిప్లవం గ్రిఫిత్)