Menu

ప్రపంచ సినిమా చరిత్ర 11: సినిమాకి మేలు చేసిన ప్రపంచ యుద్ధం

1930లలో టాకీ సినిమాలతో ఊపందుకున్న ప్రపంచ సినిమా పరిశ్రమలు శబ్దగ్రహణం, చాయాగ్రహణం, స్పెషల్ ఎఫెక్ట్ లలో అభివృద్ధి చెందుతూ క్రమ క్రమంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనటం ఆరంభమైంది. 1946వ సంవత్సరం అత్యధిక వీక్షకులకు అందుబాటులోకి వచ్చిన వినోదసాథనంగా సినిమాని గుర్తించింది హాలీవుడ్. అయితే దాదాపు ఇదే ప్రాంతంలో నడిచిన రెండొవ ప్రపంచ యుద్ధం, సినిమా గతిని ప్రగతిని చాలా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.

ఈ సమయంలోనే సినిమా కథలలో యుద్ధ నేపథ్యం, సైనికులు ప్రథాన పాత్రలుగా రూపొందించబడిన యుద్ధ సినిమాలు ప్రాచుర్యం పొందాయి. ప్రేక్షకుల్ని యుద్దం పట్ల ఉత్తేజపరచడానికీ, సైనికుల వీరగాథల్ని చెప్పడానికీ, శత్రువుల వైఖరిని నిరసించడానికి కూడా సినిమాలు ఒక ప్రథాన సాధనంగా తయారయ్యాయి. డైవ్ బాంబర్ (1941), ది యాంక్ ఇన్ ద ఆర్. ఏ. ఎఫ్. (1941) నుంచి మొదలై మిసెస్ మినివర్ (1942), హాలీవుడ్ క్యాంటీన్ (1944), ద స్టోరీ ఆఫ్ జీ ఐ జో (1945) వంటి ఎన్నో చిత్రాలద్వారా దేశభక్తిని చాటాలని ప్రయత్నించారు దర్శకులు. ఇలాంటి కథలే కాకుండా సైనికుల ఆత్మకథలు, యుద్ధ నేపధ్యంలో ప్రేమ కథలు కూడా అనూహ్య విజయాలు సాధించాయి. ఇలాంటి వాటిలో మరీ ప్రముఖంగా చెప్పుకోదగ్గ చిత్రం కాసాబ్లాంకా (1942). ఇక ఆ తరువాత ప్రపంచ యుద్ధం నేపధ్యంగా ఈ నాటికీ ఎన్నో ఆణిముత్యాలవంటి సినిమాలు రూపొందించబడ్డాయి. ఆ రకంగా ప్రపంచ యుద్ధం ఎన్నో సినిమాలకు ముడి సరుకు అందించిందన్నమాట.

ఇదంతే ఒక ఎత్తైతైతే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధం కారణంగా సినిమా నిర్మాణాలు కష్టమై చాలా మంది ప్రపంచ సినీ దర్శకులు హాలీవుడ్‌కి వలసెళ్లారు. అలా వచ్చిన వారు, క్రమంగా హాలీవుడ్ చిత్ర నిర్మాణ శైలిని ఎంతో ప్రభావితం చేశారు. ముఖ్యంగా ఫ్రాంక్ కాప్రా (సిసిలీ), ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ (బ్రిటన్) వంటి వారు ఎంతో మంది యూరోపియన్ దేశాలనుంచి హాలీవుడ్ కి వలసవచ్చారు. 1940లో హిచ్‌కాక్ తీసిన “ఫారిన్ కరెస్పాండెంట్” అనే సినిమాలో యూరోపులో నాజీల ఆగడాలు ఎక్కువైనాయని, వారికి అమెరికా బుద్దిచెప్పాలని చివర్లో కోరుకుంటాడు దర్శకుడు హిచ్‌కాక్.

ఫ్రాన్స్ దేశం నుంచి వలస వచ్చిన రెన్వా అనే దర్శకుడి కథ మరోలా వుంది. ఆయన కొంతకాలం మిలటరిలో పనిచేసి, ఆ తరువాత గాయం కారణంగా మానుకోని, విరిగిన కాలు పుణ్యమా అని ఎన్నో సినిమాలు చూసి, తాను కూడా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. కొంత కాలం మూకి సినిమాలు, ఫ్రెంచ్ సినిమాలు తీసిన ఈయన 1940 జెర్మనీ ఫ్రాన్స్ ని ఆక్రమించడంతో పారిపోయి హాలీవుడ్‌లో ఆశ్రయం పొందాడు. ఆ తరువాతే ఆయన  “దిస్ లాండ్ ఈజ్ మైన్” (ఫ్రాన్స్ పై నాజీల దురాక్రమణ పై తీసిన చిత్రం), ఆ తరువాత ఆయన అమెరికాలో తీసిన ఉత్తమ చిత్రంగా చెప్పబడే “టెక్సాస్ షేర్ క్రాపర్స్” వంటి ఎన్నో సినిమాలను తీసాడు.

ఈ కాలంలో యుద్ధ నేపధ్యంలో సినిమాలు విరివిగా వచ్చిన మాట నిజమే అయినా అవన్నీ కేవలం సీరియస్ సినిమాలు అని అనుకోడానికి లేదు, సీరియస్ (ఏక్షన్ లేదా డ్రామా) సినిమాలతో పాటుగా రొమాంటిక్ చిత్రాలు (కాసాబ్లాంకా), కామెడీ చిత్రాలు (ముఖ్యంగా బ్రిటిష్ చిత్రాలు, చాప్లిన్ డిక్టేటర్) వంటివి కూడా వచ్చాయి. అయితే ఈ సమయంలోనే వచ్చిన “సిటిజన్ కేన్” (1941, ఓర్సన్ వెలెస్ దర్శకత్వం) అనే సినిమా ఒక సంచలనాత్మకమైన విప్లవమనే చెప్పాలి. ఒక పత్రికాధినేత జీవిత కథ ఆధారంగా తీసిని ఈ చిత్రం అప్పటి సినిమా పరిభాషని, కథ చెప్పే విధానాన్ని, సినిమాటోగ్రఫీనీ సమూలంగా కదిలించింది. సినిమా కథని ప్రథానంగా ఫ్లాష్ బ్యాక్ పథ్ధతిలో చెప్పడం, డీప్ ఫోకస్, లో యాంగిల్ షాట్లను వాడటం అప్పట్లో ఒక వింతగా భావించారు ప్రేక్షకులు, విమర్శకులు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచ సినిమా గతిని ఒక ప్రత్యేకమైన మలుపు తిప్పిన ఘనత మాత్రం ఇటాలియన్ సినిమాకి దక్కుతుంది. అప్పటి ఇటలీలో “సినిమా” అనే పత్రిక నడుపుతున్న ఆరుగ్గురు మిత్రులు ఇందుకు కారణమయ్యారు. అప్పటి యుద్ధ నేపధ్యం కారణంగా రాజకీయ వార్తలు వ్రాయలేక సినిమాల గురించి వ్రాయడం మొదలుపెట్టారు ఈ మిత్రులు. (ఆ పత్రిక అధినేత ముస్సోలినీ కొడుకు విట్టోరియో ముస్సోలినీ). అప్పటి అమెరికన్ సినిమాలను అనుకరిస్తూ వస్తున్న ఇటాలియన్ సినిమాలను గురించి అ పత్రికలొ ఘాటుగా విమర్శించేవారు వీరు.

ఆ తరువాత ఈ రచయితలే సినిమాలు తీయడం ప్రారంభించిన తరువాత ఆ చిత్రాలన్నీ వాస్తవికతకి దగ్గరగా తీయడం ప్రారంభించారు. అలా మొదలైనవే ఇటాలియన్ నియో రియలిస్ట్ (నవ్యవాస్తవిక) చిత్రాలు. వీరు అప్పటికే జీన్ రెన్వా దగ్గర పని చేసి వుండటం, ఫ్రెంచ్ కవిత్వాలలో వున్న వాస్తవికతతో పరిచయం ఇలాంటి సినిమాలు తీయటానికి దోహదం చేశాయి. 1943 లో ఆ ఆరుగ్గురు మిత్రులలో ఒకడైన లుచింటినో విస్కోటినీ తీసిన “ఒస్సెస్సెనైర్ (1943)” అనే చిత్రమే ఇలాంటి నవ్య వాస్తవిక చిత్రాలకు ఆరంభం అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి చిత్రాలలో ప్రపంచ ప్రఖ్యాతి పొంది, ప్రపంచ దర్శాకులనందరినీ ప్రభావితం చేసిన చిత్రం “ది బైసికిల్ థీవ్స్” (1948)

ఇది ఇలా వుండగా ఇక్కడ మన దేశంలో మూకీల నుంచి టాకిలకి ఎదిగిన సినిమా ఆ తరువాత దేశంలో రగులుకున్న స్వరాజ్యపోరాటం, రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన తదితర కారణాల వల్ల కాస్త కుంటు పడిందనే చెప్పాలి. అప్పటి బ్రిటిష్ పాలకులు విధించి ఫిలిం స్ట్రిప్ పరిమితి చట్టం వల్ల చాలా తక్కువ సినిమాలే తీయబడ్డాయి. అయితే అప్పటిదాకా తీస్తున్న పురాణ కథలను వదిలి, అప్పుడప్పుడే సామాజిక, రాజకీయ కథలను కూడా స్పృశించడం మొదలుపెట్టారు మనవాళ్ళు.

అప్పటి నుంఛే సంఖ్యా పరంగా, వస్తు పరంగా కూడా హిందీ సినిమా దేశంలో అన్ని భాషల కన్నా ముందుంటే, ఇతర భాషా చిత్రాలలో తెలుగు తమిళ చిత్రాలు రెండో వరసలో వుండేవి. 1936లోనే  ప్రేమ విజయం (కృతివెంటి నాగేశ్వర రావు దర్శకత్వం), 1939లో వచ్చిన వందేమాతరం (బీ. యన్. రెడ్డి దర్శకత్వం), మాల పిల్ల (గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం) వంటి సినిమాలు సామాజిక రాజకీయ పరిస్థుతులను మూల కథగా చేసుకోని సినిమా అనే అనుభవాన్ని మరింత సుసప్పన్నం చేశాయి. ఆ తరువాత రాబోయే సినిమా సువర్ణాధ్యాయానికి తెర తీసాయి. అప్పటి హిందీ సినిమాల గురించి మాట్లాడితే తప్పక స్మరించుకోవాల్సిన వ్యక్తి వి. సాంతారాం. మొదట “అయోధ్య కా రాజా” (1932) లాంటి సినిమా తీసినా ఆ తరువాత “అమ్రిత్ మంథన్” (1934), “ధర్మాత్మా” (19350), “అమర్ జ్యోతి” (1936) వంటి అనేక సినిమాల ద్వారా కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, స్త్రీ స్వాతత్ర్యం వంటి అంశాలను తెరకెక్కించడమే కాకుండా వాటిని విజయవంతం చేసి ఎందరో దర్శకులకు ఆదర్శమయ్యాడు.

(తరువాత: నవతరంగం)