Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 10: మూకీ నుంచి టాకీకి..

1920 లలో ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రక్రియ వూపందుకుంది. అయితే అంతకు ముందే సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ చాలా చోట్ల సినిమా నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. ప్రత్యేకించి యూరప్ దేశాలలో, ఆసియా ఖండంలో కూడా సినిమాలు ప్రపంచ యుద్ధం ప్రభావానికి లోనయ్యాయి. అయినప్పటికీ, 1930 నాటికి టాకీ చిత్ర నిర్మాణం ప్రారంభవమవడంతో మళ్ళీ సినిమా నిర్మాణం జోరందుకుంది. అక్కడి నుంచి మళ్ళీ రెండొవ ప్రపంచ యుద్ధం వచ్చేదాకా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయమని చెప్పుకోవచ్చు.

ఇరవైలలో వచ్చిన సినిమాలన్నీ నిజానికి మూకీ చిత్రాలే కానీ నిశబ్ద చిత్రాలు కావు. సినిమాతో భాగంగా చాలా చోట్ల ప్రత్యక్షంగా పాడే కళాకారులు, వాయిద్యకారులు, ఒకోసారి డైలాగులు చెప్పే కళాకారులు, మరికొన్ని చోట్ల ఏకంగా ఒక ఆర్కెస్ట్రా కూడా వుండేవి. అయితే సినిమాతో పాటే శబ్దం కూడా వినిపించే టెక్నాలజీని మొదటగా వార్నర్ బ్రదర్స్ తయారు చేసిన విటాఫోన్ ద్వారా సాధ్యమయ్యింది. సినిమాని ఒక రీలు పైన, శబ్దాన్ని ఒక డిస్క్ పైన వేరు వేరుగా రికార్డ్ చేసి ఆరెండింటిని ఒకే సారి ప్లే చేసే విటాఫోన్ అప్పట్లో పెను విప్లవం. అయితే అవి నేపధ్య సంగీతానికి, పాటలకు మాత్రమే వాడారు. ఇలాంటి పరికరాన్ని కనిపెట్టిన తరువాత అప్పట్లో సినిమాలు ప్రదర్శించే హాళ్ళలో శబ్దం వినపడేందుకు అనువుగా స్పీకర్లు వైర్లు అమర్చడానికి ఎంతో డబ్బు ఖర్చుకూడా పెట్టారు. ఆ ఖర్చు తడిసి మోపెడు అవ్వటం, విటాఫోన్ కన్నా మంచి సాకేతిక పరికరాలు చాలా త్వరగా రావటంతో వార్నర్ బ్రదర్స్ అప్పుల పాలైయ్యారని చెప్తారు.

ఇంతకీ వీటాఫోన్‌ని దెబ్బతీసిన సంస్థ మూవీటోన్. ఈ సంస్థ వేరుగా డిస్క్ మీద శబ్దాన్ని రికార్డ్ చేయకుండా, నేరుగా సినిమా రీలు పైనే శబ్దాన్ని అమర్చే విధానానికి నాంది పలికింది. అయితే ఈ కొత్త విధానాన్ని త్వరగా అర్థం చేసుకున్న వార్నర్ బ్రదర్స్ వెంటనే అదే టెక్నాలజీని వాడుతూ, సినిమాలు తీయటం మొదలు పెట్టింది. అలా వచ్చింది ప్రపంచంలో మొట్టమొదటి టకీగా చెప్పబడే జాజ్ సింగర్ అనే సినిమా. 1927 ఏప్రియల్ లో విడుదలైన ఈ సినిమాలో నేపధ్య సంగీతమే కాకుండా, ఆరు పాటలు అవసరానికి కొన్ని మాటలు కూడా వున్నాయి. దాంతో ఆ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలా మొదలైన టాకీ సినిమాలలొ మొట్టమొదట ప్రేక్షకులకి వినపడ్డ తొలి మాటలు ఏమిటో తెలుసా? – “ఒక్క నిముషం ఆగండి… మీరు ఇంకా వినవల్సింది ఎంతో వుంది..” (Wait a minute! Wait a minute! You ain’t heard nothin’ yet)

అయితే సినిమా మూకీ నుంచీ టాకీగా మారటంవల్ల ఎన్నో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అప్పటి వరకు ఎక్కడైనా తీయగలిగిన సినిమా, ఇప్పుడు వేరే శబ్దాలు రికార్డ్ కాని చోటే తీయాల్సివచ్చింది. దాంతో అప్పటిదాకా ఔట్‌డోర్‌లో తీయగలిగిన సినిమాలు స్టూడియోకి మారయి. స్టూడియోలు కూడా టాకీ సినిమాలకి అనువైనవిగా మారటానికి ఎంతో డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. అందం అభినయం బాగున్నా మాట స్పష్టత, వుచ్చారణ, గొంతు సరిగా లేని నటీనటులకు కాలం చెల్లింది. అంతే కాదు కెమెరాకి కనపడకుండా మైకులు పెట్టడం, ఆ మైకులు అడ్డం రావటం వల్ల నటీనటులు ఎక్కువ కదలకుండా మాట్లాడటం, షూటింగ్ లో శబ్దాలు చెయ్యని పరికరాలు మాత్రమే వాడటం ఇలాంటి మార్పులు అనివార్యమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సైలెంట్ సినిమాల శకం ముగిసిన తరువాతే, షూటింగ్‌లో సైలెన్స్ అన్న డైరెక్టర్ అరుపు మొదలైంది. ఇవన్నీ ఒక ఎత్తైతే సినిమా పరిభాషని ప్రభావితం చేసే మరో పెను మార్పుకి టాకీ సినిమాలు దోహదపడ్డాయి. అప్పటిదాకా దృశ్యం తప్ప మరోటి తెలియని ప్రేక్షకుడికి ఇప్పుడు శ్రవణరూపంలో కూడా సినిమా కథ తెలుసుకునే అవకాశం వచ్చింది. దాంతో దర్శకులు చూపించడం మానేసి చెప్పడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి దర్శకుల సృజనాత్మక ప్రతిభ మూలనపడిందని కూడా చాలా మంది సినిమా ప్రముఖులు వాదిస్తారు. అందుకే చాప్లిన్ టాకీ సినిమాలు ప్రారంభమైనా కూడా మూకి సినిమాలు తీయడానికే ఇష్టపడ్డాడు. చివరి మూకి చిత్రం తీసిన ఘనత ఆయనదే మరి.

ఇక మన దేశంలో జరిగిన మార్పులను పరిశీలిస్తే 1931 మార్చి 14న విడుదలైన ఆలం ఆరా అనే చిత్రమే తొలి భారతీయ టాకీ చిత్రమని అందరికీ తెలిసిన విషయమే. పూనాకి చెందిన అర్దేశిర్ ఇరానీ అనే నిర్మాత దర్శకుడు నిర్మించాడు. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా వూపందుకున్న టాకీ వుద్యమాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత ఆయనదే. అప్పటి బోంబే లోని మెజెస్టిక్ థియేటర్ లో ఈ సినిమాని విడుదల చేస్తే – ఆ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులను అదుపు చేయడానికి పోలీసు రంగప్రవేశం చెయ్యాల్సి వచ్చింది. ఈ సినిమాలో నేపధ్యసంగీతం, మాటలతోపాటు ఏడు పాటలు కూడా ప్రజల్ని అలరించాయి. ముఖ్యంగా వజీర్ మొహమ్మద్ పాడిన “దేదే ఖుదా కే నామ్ పే ప్యారే” పాట అప్పట్లో సూపర్ హిట్ సాంగ్.

ఇది ఇలా వుండగా, దేశంలోనే మొదటి టాకీ సినిమా తీసిన ఇరానీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఒక తెలుగు వ్యక్తి వున్నాడు. ఆయన పేరు హనుమప్ప మునియప్ప రెడ్డి – తర్వాత కాలంలో “టాకీ పులి”గా పేరు పడ్డ ఎచ్.ఎమ్. రెడ్డి. అప్పటికే కొన్ని మూకీ సినిమాలు తీసిన అనుభవంతో, ఇరానీకి అసిస్టెంట్ గా చేరాడు. ఆలం ఆరా నిర్మాణమప్పుడే సరిగ్గా ఇలాంటి మూకీ సినిమా తెలుగులో కూడా తీయాలని ఆయన భావింఛాడు. ఆ కాలంలో ఎంతో పాపులారిటీ వున్న సురభి నాటక సమాజం వారి “భక్తప్రహ్లాద” కథని అందుకు ఎన్నుకున్నారు. ఒక పక్క ఆలం ఆరాకి పని చేస్తూనే మరో పక్క భక్తప్రహ్లాద సినిమా నిర్మాణం ప్రారంభించారు. తరువాతి కాలంలో నటుడిగా స్థిరపడ్డ సీ.యస్.ఆర్ ఆంజనేయిలు ఈ సినిమాకి రచయిత. నటీనటులంతా సురభి నాటక సమాజం వారే. ఆలం ఆరా చిత్రానికి వేసిన సెట్టింగులే ఈ సినిమాకి కూడా వాడారు. న దేశంలోనే రెండో టాకీగా, తెలుగు తొలి టాకీగా ఈ సినిమా విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. తెలుగు సినిమా అనే మహావృక్షానికి తొలి బీజం వేసింది.

 

మీకు తెలుసా

దేశంలోనే మొట్టమొదటిదైన టాకీ ఆలం ఆరా చిత్రంలో మన తెలుగు వ్యక్తి ముఖ్యపాత్ర పోషించాడు. ఆయనే ఎల్వీ ప్రసాద్. గమ్మత్తేమిటంటే ఆ తరువాత వచ్చిన తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద”లో కూడా చండామార్కుల శిష్యుడు “మొద్దబ్బాయ్” గా కూడా కనిపిస్తాడీయన. తొలి తమిళ టాకీ చిత్రం “కాళిదాస” లో కూడా ఈయన నటించడంతో దేశంలోనే మొదటివైన మూడు టాకీ చిత్రాల్లోనూ నటింఛిన అరుదైన ఘనత ఆయనకు దక్కింది.

(తరువాత: ప్రపంచ యుద్ధాలు – సినిమాలు)