Menu

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట

సత్యలోకం లో ఓ అందమైన సాయంత్రం కచ్చపి తీవెలలో స్వరసుమాలు విరుస్తున్నాయి. బ్రహ్మదేవుడు తన్మయుడై ఆ రాగ పరిమళాలను ఆస్వాదిస్తున్నాడు. యింతలో మహతిని మీటుకుంటూ నారదుడు ప్రవేశించాడు , వెన్నంటే తుంబురుడూను , వీరిని చూడగానే బ్రహ్మదేముడికి భూలోకం గుర్తొచ్చింది . శూన్యం నుండి ధ్వని ప్రసరించదనీ స్పురణకొచ్చింది . తన భార్య సరస్వతికి ఎంతో ప్రియమైన ఆ వీణారావాలు భూలోక వాసులని చేరవని కొద్దిగా దిగులు చెందాడు . పాపం చతుర్ముఖుడు కదా అంతర్ముఖుడు కాలేకపోయాడు . సరస్వతీ వాహనమైన హంస ఆ దిగులు గమనించింది , తీర్చాలనుకుంది . అటూ యిటూ చూసి పుటుక్కున కచ్చపి నుండి ఓ తీవెని లాగి ముక్కున కరుచుకుని … వైకుంఠం వైపు ఎగిరింది అలాగే పాలకడలిలో ములిగింది . లక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ఆశ్రీర్వాదాన్ని పొందింది . రెక్కలు కట్టుకుని… కైలాసానికి ఎగిరింది పార్వతి ఆశీర్వదించింది, గంగ అభిషేకించింది, శివుడు సరే సరి… తిరిగి సత్యలోకానికి చేరింది . ఆ తీవె తునకని భక్తిగా బ్రహ్మదేవుడి పాదాల ముందుంచింది . బ్రహ్మకేదో సంకేతమందింది . నవ్వుతూ మానస పుత్రుడైన నారదుడి వైపు చూసాడు . నారదుడు మహతి లోని ఓ తీవెని తీసి ఆప్యాయంగా బ్రహ్మకిచ్చాడు, అలాగే తుంబురుడూను … ఈ మూడు తీవెలను కలిపి తను సృష్టించే కొంతమంది స్వరపేటికలలో అమర్చాడు బ్రహ్మ …

….యిది జరిగి సుమారు 164 సంవత్సరాలైంది . త్యాగరాయ స్వామి అవతరించాడు సుమారుగా అప్పుడే శ్యామాశాస్త్రీను …కాల క్రమేణా …1946 జూన్ నాలుగున నెల్లూరు జిల్లాలో కోనేరమ్మపేట గ్రామం లో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శ్రీమతి శకుంతల దంపతులకి శ్రీ బాల సుబ్రహ్మణ్యం జన్మించారు .

శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారికి ఇద్దరు సోదరులు అయిదుగురు సోదరిలు . మొత్తం ఎనిమిది మంది సంతానంలో ఈయన రెండవవారు . ఈయన తండ్రిగారు అప్పట్లో పేరెన్నికగన్న హరికథాపండితుడు . సంగీత సాహిత్య విశ్వరూపం హరికథ .వేదికపై పాత్రధారి ఒక్కడే పాత్రలనేకం , గాత్రధారీ ఒక్కడే … వేదికపై “ శ్రీకృష్ణుడై పాంచజన్యం పూరించాలి , అర్జునుడై గాండీవం సంధించాలి , రథమై , గజమై , ఘీంకారమై , ఓంకారమై , నృత్యమై , గానమై ..” సర్వం, సకలం తానే అయి కథ రక్తి కట్టించాలి . అలా తన తండ్రిగారు చెప్పే హరికథలలో బాల్యం నుంచీ లీనమై గాత్ర శుద్ది నే కాక పాత్ర ఔచిత్యాన్ని సరిగ్గా పట్టుకోగల హృదయ ఔన్నత్యాన్నీ పెంచుకున్నారు శ్రీ బాలు . సమాంతరంగా చదువు . తండ్రిగారి కోరిక మేరకు మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ ., లో చేరారు . 1964 లో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు లలిత సంగీత పోటీలు నిర్వహించారు . బాలు పాల్గొన్నారు . శ్రీ ఘంటసాల గారు , శ్రీ పెండ్యాల గారు , శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు , న్యాయ నిర్ణేతలు . మొదటి బహుమతి శ్రీ బాలుగారికే . రవంత లేతగా వున్న శ్రీ బాలు గారి గాత్రం కాస్త ముదిరితే సీమాలలో అవకాసం యిస్తానన్నారు శ్రీ ఎస్.పి.కోదండపాణి గారు ఆ పోటీలో బాలుగారి పాట విని, పాడే పద్దతి నచ్చి . …పాట మరింత ప్రాణమయింది. సార్థకమయే సాధనలో మెరీనా గాలులు మరింత పరిమళాన్ని పెంచుకున్నాయి .

దాదాపు రెండేళ్ళు నిరీక్షణ , నిరంతర సాధన . 1966 డిసెంబర్ లో శ్రీ కోదండపాణి గారు కబురు పంపారు . ఏదయినా ఓ పాట పాడమన్నారు . తనే వ్రాసి స్వరపరిచిన ` రాగమూ అనురాగము ‘ అనే పాటని పాడారు బాలు . మరొకటి పాడమన్నారు . తనదైన శైలిలో పాడారు బాలు పాత్రలో గాత్రాన్ని మమైకం చేయగలగడం తండ్రి గారి హరికథల వలన అబ్బిన విద్య మరి . ఆ పాడే పద్దతి నచ్చింది కోదండపాణి గారికి . శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ చిత్రంలో వీటూరి గారు వ్రాసిన ఏమి వింత మోహం … బాలు గారి తొలి సినిమా పాటగా పల్లవించింది . అదీ ఆరంభం …క్రమేణీ పాడిన ప్రతీ పాటలోనూ సంగీతానికి, సాహిత్యానికీ , సన్నివేశానికీ న్యాయం చేకూరుస్తూ , సన్నివేశబలానికి తగిన నటనని గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటిస్తూ వీటూరి , ఆరుద్ర , శ్రీశ్రీ , కృష్ణశాస్త్రి, ఆత్రేయ , వేటూరి సీతారామశాస్త్రి , వైరముత్తు వంటి మంచి సినీకవుల హృదయ స్పందనలను తన గుండెలో దాచుకుని గొంతులో పలికిస్తూ సుమారు నలభైవేల పాటలను , తెలుగు , తమిళ , కన్నడ , మళయాళ , హిందీ , తులు , ఒరియా , అస్సామీ , బడగ , సంస్కృత , కొంకిణి , బెంగాలి , మరాఠీ ,పంజాబీ , ఇంగ్లీష్ వంటి 11 భాషలలో పాడారు . నలభై సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు .

1981 ఫిబ్రవరి ఎనిమిదిన ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు 17 పాటలు పాడి రికార్డ్ సృష్టించిన శ్రీ బాలు తరువాత ఒకే రోజులో 19 తమిళ పాటలు రికార్డ్ చేసారు . హిందీలో ఒకే రోజున 16 పాటలు పాడి ఘనత వహించారు .

యిది గాయకుడిగా ఎస్.పి.బాలు విశ్వరూపం .

వివిధ పాత్రలలో నలభై అయిదు సినిమాలలోనూ చానల్స్ లోనూ పాత్రోచితంగా నటించారు.

ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి 29 సార్లు నంది అవార్డులని, కలైమామణి , విశ్వగానయోగి , విశ్వగానయోగి , నాదనిధి , గానగంధర్వ వంటి బిరుదులనీ పొందారు. 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ , 2009 లో సత్యభామ యూనివర్సిటీ వీరిని డాక్టరేట్ తో గౌరవించాయి .

భారత ప్రభుత్వం 2001 లో ఈయనకి పద్మశీ యిచ్చి గౌరవించింది . 2011 లో పద్మభూషణ్ యిచ్చి ఆ గౌరవాన్ని మరింత పెంచింది . ప్రతిభాపాటవాలని మించిన మంచితనం మానవీయత , మృదుస్వభావం , ఔదార్యం, బొండుమల్లెలవంటి నిండైన నవ్వు , ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన మనిషితనం …శ్రీ బాలు గారి స్వంతం .

వీరి శ్రీమతి సావిత్రి గారు , కుమారుడు చరణ్ , కుమార్తె పల్లవి .

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట . నిండయిన తెలుగుతనాన్ని వర్ణించే వాక్యంలో మొదటి మూడు పదాలూ కృష్ణశాస్త్రి కవిత , బాపూ బొమ్మ , బాలూ పాట…

ఈ పద్మభూషణుడి కోసం ….భారతరత్న ఎదురు చూస్తోంది .

సర్వేజనా సుజనోభవంతు

సర్వేసుజనా సుఖినోభవంతు

శుభం జయం సదా సర్వదా ……

ఆచాళ్ళ శ్రీనివాసరావు