బై.. బై.. బాబూమోషాయ్…

రాజేష్ ఖన్నా…!!

ఆ పేరులో ఎంత మహత్యం వుందో తెలియాలంటే డెబ్భైల్లో టీనేజ్ లో వున్న అమ్మాయిల్ని అడగాలి. ఆయన ఫోటో ఎదురుగా పెట్టుకోని, కత్తితో వేలు కోసుకోని దాన్నే సింధూరంగా పెట్టుకోని రాజేష్ ఖన్నా భార్యలుగా ఎంతమంది మారిపోయారో వాళ్ళే చెప్తారు. ఆయన హోటల్లో వున్నాడంటే బయట అర్థరాత్రి దాటినా వరసకట్టి నిలుచున్న అమ్మాయిల వివరాలు కావాలంటే ఆయనతో పనిచేసిన షర్మిలా టాగూర్ నో, ముంతాజ్ నో అడగాలి. కేవలం ఆయన కారు అయిన పుణ్యానికి దాన్నిండా అమ్మాయిల లిప్ స్టిక్ ముద్దులు ముద్దర్లు ఎన్ని పడ్డాయో తెలియాలంటే ముంబై నగర వీధుల్ని అడగాలి.

లేడు… ఇక లేడు. వెళ్ళిపోయాడు. రాజేష్ ఖన్నా వెళ్ళిపోయాడు.

“అరే ఓ బాబూ మోషాయ్… హమ్ తొ రంగ్ మంచ్ కి కట్ పుతిలియా హై జిస్కే డోర్ ఉస్ ఊపర్ వాలే కె హాతోం మేం హై. కబ్, కౌన్ కహాన్ ఉఠాయేగా ఏ కోయీ నహీ జాన్తా…”

(బాబూ మోషాయ్… మనం ఈ నాటకరంగంలో తోలు బొమ్మలం. ఈ బొమ్మల తాళ్ళు ఆ పైవాడి చేతిలో వున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఎవరిని పైకి లాక్కెళ్తాడో ఎవరికీ తెలియదు)

మనం అందరం ఆనంద్ లో అమితాబ్ బచ్చన్లం అయిపోయాం.

రాజేష్ ఖన్నా పాట పాడితే… అదేనండీ రాజేష్ ఖన్నా పాటన్నా, కిషోర్ కుమార్ పాటన్నా ఒకటే కదా? ఆ పాట ఎన్ని గుండెల్లో మోగిందో…

“జిందగీ… కైసె పహేలీ హాయె… కభి యె రులాయే… కభి యె హసాయే…”

ఏడుపైనా రాదు ఎవ్వరికీ… చెప్పాడుగా ముందే…

“పుష్పా… ఏ పుష్పా… ఐ హేట్ టియర్స్…”

ఈ మనిషి వరసగా సాధించిన పదిహేను విజయాలు మళ్ళీ ఎవరైనా సాధించగలరా? ఎంతమంది స్టార్లు వచ్చినా భారతదేశపు తొలి సూపర్ స్టార్ ఒకరే…

షూటింగ్ కోసం బ్రిడ్జి పైన పర్మిషన్ అడిగితే అభిమానుల తాకిడికి బ్రిడ్జ్ కూలుపోతుందని నిరాకరించారట… సినిమా పవర్ ని ప్రజలపైన సినిమా నటుడు వేసే ముద్రని నిరూపించడానికి వచ్చాడు… పనైపోయింది.

చివరిగా చేసిన అడ్వర్టైజ్మెంట్ లో చెప్పాడు కదా… Fans are forever అని…. నిజమే… ఆయన లేకపోయినా ఆయన సినిమాలు వున్నాయిగా… ఎప్పటికీ తరిగిపోని ఫాన్స్ ఇవ్వడానికి…!!