Menu

“కేరళ వర్మ పళసి రాజ” గురించి…

౨౦౦౯ జాతీయ చలనచిత్ర  అవార్డుల్లో ఇళయరాజా కి ఉత్తమ నేపథ్య సంగీతానికి అవార్డు వచ్చినప్పుడు ఈ సినిమా గురించి మొదటి సారి విన్నాను. అయితే, పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో ఈ సినిమా గురించి చదివినప్పుడు ఏం.టి.వాసుదేవన్ నాయర్ స్క్రిప్టు రాసారు అని తెలిసింది. మిథునం కథని ఆయన మలయాళంలో తీసిన పద్ధతి నచ్చినందువల్ల  ఈ సినిమాపై కుతూహలం కలిగింది. మొత్తానికి ఇన్నాళ్ళకి సినిమా చూడగలిగాను – ఆంగ్ల సబ్టైటిల్స్ తో! ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఇది:

సినిమా నేపథ్యం: ఇదొక చారిత్రిక కథ ఆధారంగా తీసిన సినిమా. కొట్టాయం రాజవంశీయుడు అయిన పయసి రాజా జీవిత కథ. తన రాజ్యాన్ని కోల్పోయినా అతను బ్రిటీషు వారికీ వ్యతిరేకంగా అడవిలో గిరిజనులతో కూడిన సైన్యం సమీకరించి బ్రిటీషు వారిని ఎదుర్కుని, ఓడిపోయి ఒకానొక పోరాటంలో మరణించాడు – అన్నది చరిత్ర.  తన రాజ్యం కొట్టాయం ని టిప్పు సుల్తాన్ ఆక్రమణ నుండి కాపాడేందుకు అతను టిప్పు కి వ్యతిరేకంగా బ్రిటీషు వారికి సహకరించాడు. అయితే, ఈ సహాయానికి ప్రతిఫలంగా కొట్టాయం స్వతంత్రాన్ని గౌరవిస్తాము అన్న బ్రిటీషు వారు తమ పద్ధతిలో కొట్టాయంను ఆక్రమించడం మొదలుపెట్టారు. కొన్ని పరిస్థితుల మధ్య పయసి రాజు తన రాజ్యంలో రాజుగా కాక, గెరిల్లా యుద్దాలతో బ్రిటీషు వారితో పోరాడవలసి వచ్చింది. అలా పోరాడి పోరాడి, చివరికి మరణించాడు. ఇదీ చాలా క్లుప్తంగా అతని కథ (మరిన్ని వివరాలకి అతని గురించిన వికీ పేజీ చూడండి. ఇతని జీవిత చరిత్ర ఆధారంగా ౧౯౬౪ లో కూడా ఒక మలయాళం సినిమా వచ్చింది (వికీ లంకె ఇదిగో.). అయితే, అంత విజయం సాధించలేదట. ప్రస్తుతం ప్రస్తావిస్తున్న సినిమాతో పోలిస్తే కథలో కూడా కొంచెం తేడా ఉంది. నాకు అర్థమైనంతలో అనిపించింది ఏమిటి అంటే – పాత సినిమాకి జనం నోట్లో నానుతున్న జానపద కథలు ఆధారం (అప్పుడు ఈ సినిమా “ఉరుమి” తరహాలో మరొక పీరియడ్ జానపద చిత్రం అయ్యి ఉండేది). కొత్త సినిమాకి బ్రిటీషు వారు రాసుకున్న నోట్సూ, చరిత్ర పుస్తకాలూ ఆధారం అని. రెంటి మధ్యా తేడాలు బాగానే ఉన్నట్లు ఉన్నాయి మరి.

కథ:  టిప్పు సుల్తాన్ ని మట్టి కరిపించడం అయిపోయాక, కొట్టాయం రాజ్యం జోలికి రాము అన్నది మొదట బ్రిటీషు వారు అన్నది. కానీ, పయసి చిన్నప్పటి స్నేహితుడు Pazhayamveedan Chandu (సుమన్) నూ, కొట్టాయం సింహాసనాన్ని ఆశిస్తున్న పయసి రాజు తాలూక వృద్ధ బంధువు వీరవర్మను (తిలకన్) బ్రిటీషు వారు తమవైపుకి తిప్పుకుని, పయసి ని తన భవంతి విడిచి అడవుల్లోకి వెళ్లి తలదాచుకునేలా చేస్తారు. ఇక్కడ మొదలవుతుంది మన కథ. అక్కడి నుంచి తన బావమరిది కైతేరి అంబు, సైన్యాధిపతి కుంకన్, కురిచ్య యోధుడు తలక్కల్ చందు తదితరులతో కూడిన సైన్యం ఏర్పరుచుకుని గెరిల్లా యుద్ధాల ద్వారా బ్రిటీషు వారితో పోరాటం సాగిస్తూ ఉంటాడు పయసి. మొదట్లో బ్రిటీషు వారు సంధికి సిద్ధం కావడంతో, కొట్టాయంలో శాంతి నెలకొంటుంది అన్న ఆశతో ఒప్పుకుంటాడు పయసి. కానీ, రాజ్యం తీసుకుని ప్రజలను సాధించడం మానరు వారు. దానితో పయసి మళ్ళీ యుద్ధం మొదలుపెడతాడు. అయితే,  బ్రిటీషు వారి సైన్యం – ఆయుధాలతో పాటు కుయుక్తులని కూడా ఉపయోగించి క్రమంగా పయసి సేనను బలహీనపరుస్తుంది. చివరికి యుద్ధంలో పయసి రాజు నేలకూలడంతో కథ ముగుస్తుంది.

నచ్చినవి: 

1) మమ్ముట్టి  హీరో పాత్రకు జీవం పోశాడు. అరవై ఏళ్ళు వచ్చినా ఎందుకు ఆయన ఇంకా మళయాళ సినిమాలలో అంత డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నాడు? అంటే ఇందుకే నేమో! పయసి రాజుగా రాజసం ఉట్టిపడింది. ఆట్టే వయసు తెలియలేదు ఆ మేకప్ లో. ఇక, కేవలం హావభావలతోనే ఎంతో మాట్లాడినట్లు అనిపించింది. ఆహార్యం కూడా బాగా సూట్ అయ్యింది ఆ పాత్రకి. ఈ సినిమా చూసాక నేను మమ్ముట్టి ఫ్యాన్ అయిపోయాను. అతనొక్కడే కాదు, శరత్ కుమార్, సురేష్ కృష్ణ, కనిక, మనోజ్ కే.జయన్ – అందరూ ఆ పాత్రల్లో చక్కగా అమరి పోయారు. ఈ సినిమాకి పాత్రధారుల ఏమ్పికలోనే సగం విజయం సాధించినట్లు – నిర్మాత,దర్శకులు!
౨) అదే పనిగా తప్పులు ఎంచాలని పట్టి పట్టి చూడనందుకు అనుకుంటాను – ఈ సినిమాలో వేసిన సెట్లు, పాత్రల వేషధారణా అన్నీ నాకు నిజంగా ఆ కాలం నాటి కేరళ ప్రాంతాలని, ప్రజలని చూస్తున్నట్లే అనిపించాయి.  అలాగే, సినిమా విజువల్ గా కూడా నాకు చాలా అందంగా తీసినట్లు అనిపించింది. (ఈ ముక్క మామూలుగా సినిమా చూసే మనిషి గా చెబుతున్నా. అక్కడికి నాకేదో సెట్ల గురించి, మేకప్పుల గురించి, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఏదో తెలుసనీ కాదు)
౩) నేపథ్య సంగీతం కూడా నాకు చాలా నచ్చింది. పాటలు అన్నీ సాహిత్యం అర్థం కాకపోయినా నచ్చాయి కానీ, అన్నింటికంటే ఒక ముస్లిం కమ్యూనిటీ పై చిత్రీకరించిన పాట చాలా నచ్చింది. ఆ పాట ఎందుకో “హే రాం” చిత్రంలోని “హర్ కోయీ సంజ్హే” పాటని గుర్తుకు తెచ్చింది. చిన్నప్పుడు బోలెడు సినిమాల్లో విలన్ గా చూసిన కెప్టెన్ రాజు ను ఈ పాట తాలూకా సన్నివేశాల్లో చూసి త్రిల్ అయిపోయాను 🙂

నచ్చనివి: బ్రిటీషు వారి పాత్రలు వేసిన నటులెవ్వరూ ప్రత్యేకంగా ఆకట్టుకోలేకపోయారు. కథలో ముఖ్య పాత్ర అయిన థామస్ బెబర్ పాత్ర వేసిన నటుడు కూడా ఏమాత్రం నచ్చలేదు నాకు. ఇంకా, సినిమా నిడివి మూడు గంటల పైచిలుకు. ఇవి రెండు తప్ప నాకు ఆట్టే నచ్చని అంశాలేవీ లేవు ఈ సినిమాలో.

నా అభిప్రాయం: తప్పక చూడాల్సిన సినిమా.