Menu

ఎర్ర సముద్రం (2008)

వీర తెలంగాణ” చూసాక, ఈసారి ఎలాగైనా మరిన్ని ఆర్.నారాయణ మూర్తి సినిమాలు చూడాలి అని నిశ్చయించుకున్నాను. ఆ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఒక డీవీడీ షాపులో ఆర్.నారాయణమూర్తి సినిమాలు ఏమన్నా ఉన్నాయా? అని అడిగితే, “ఎర్ర సముద్రం” డీవీడీ ఇచ్చారు. ఈ సినిమా గురించి ఏదో లీలగా విన్న గుర్తు ఉంది కానీ, అసలు దేని గురించి అన్నది ఏమీ తెలియదు. అయినా సరే, చూద్దమనుకుని కొన్నాను. చూసాను. ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం.

మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలు ఈ సినిమాలో ఆ రెండున్నర గంటల్లోనే చూపిద్దామని ప్రయత్నం చేసారు. అన్నీ రకరకాల ప్రైవేటైజేషన్ లకు సంబంధించినవి. ఓడరేవు ప్రైవేటైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం, చేపలు పట్టడంలో దిగి జాలర్ల కడుపు కొట్టిన కంపెనీలు, వరల్డ్ బ్యాంక్ అడుగులకు మడుగులొత్తే ప్రభుత్వం, రైతు సమస్యలు, రిలయెన్స్ ఫ్రెష్ రావడంతో దెబ్బతిన్న రోడ్ సైడ్ కూరగాయల వ్యాపారం, తెలుగు మీడియంలో చదువుల తరువాత ఆధునిక ఆంగ్ల-మయ ప్రపంచంలో ఉద్యోగాలు చిక్కని యువత, జూనియర్ డాక్టర్ల సమ్మె – ఇలా ఒకటి కాదు, అన్ని విషయాల గురించి ఈ కథలో ఉపకతలు ఉన్నాయి. నా ఉద్దేశ్యంలో ఇలా చెప్పాలని చూడడమే ఈ సినిమాకి బలం, బలహీనతా రెండూనూ. బలం ఎందుకంటే – ఈ ఒక్కసినిమాకి మాములు మెయిన్స్ట్రీం ప్రేక్షకులని లాగగలిగితే, ఎన్నో విషయాల గురించి వారిని ఆలోచింపజేసే అవకాశం ఉంది. బలహీనత: సరిగ్గా కథ అంటూ ఒకటి అనుకుని, దాన్ని పదునైన కథనం తో చెప్పాలంటే, మరీ ఇన్ని కథలుంటే కొంచెం కష్టం ఏమో!

నచ్చినవి: సినిమాలో ప్లస్ పాయింట్లు నాకు చాలా కనబడ్డాయి. కొన్ని చోట్ల సూటిగా తగిలే సంభాషణలూ, సినిమా వెనుక ఉన్న సిన్సియారిటీ, భిన్న సాంఘిక సమస్యలను చూపించి వదిలేయకుండా, ఈ ఉద్యమకారులకీ వారి కుటుంబ సభ్యులకీ ఉండే సంఘర్షణని కూడా కథలో భాగం చేయడం నాకు నచ్చాయి. అయితే, సినిమాలో అన్నింటి కంటే నాకు బాగా నచ్చినది – పాటల సాహిత్యం. ఒకట్రెండు పాటలు మరీ అతిగా అనిపించాయి కానీ, ఎలాగన్నా వాటిలో కూడా కొన్ని లైన్లు ఆలోచింపజేసాయి. (ఈ పాటలో రాగా.కాం లో ఇక్కడ వినవచ్చు). గోరటి వెంకన్న, వంగపండు వంటి వారు రాసినవి కనుక, చక్కటి పల్లె భాష కూడా ఉంది వీటిల్లో.

మైనస్: ఇక ఈ సినిమాకి అన్నింటికంటే పెద్ద మైనస్ – పాత్రధారులు. ఒక్కరు కూడా (ఆర్.నారాయణ మూర్తితో సహా) పెద్దగా ఆకట్టుకోలేదు. ఏదో, వీథి నాటకం చూస్తున్నట్లు ఉండింది చాలా చోట్ల. ఇక, కథనం… కథనంలోని ధ్వని : మరీ నెగటివ్ గా, కేవలం కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టి ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలా అనిపించాయి. సమస్యలన్నీ వాస్తవికమైనవే, కాదనేందుకు వీలు లేదు. కానీ, ఈ సినిమాలో మరీ అన్నింటినీ నలుపు-తెలుపు అన్న రెండు వర్గాలలోకి విడగోట్టేసినట్లు అనిపించింది. దీని వల్ల, కథనంలో అంత లోతు లేకపోయింది. కనుక, దర్శకుడి ఉద్దేశ్యం ఏమిటో ఒక పట్టాన అర్థం కాలేదు నాకు. తన మెసేజ్ అన్ని వర్గాల ప్రజలకీ చేరాలంటే మాత్రం ఈ బ్లాక్ అండ్ వైట్ పద్ధతి సబబు కాదు అని నా అభిప్రాయం. దానికి కథనం లో మరింత పట్టు ఉండడం అవసరం.

నిజానికి, సినిమా చూసేముందు ఇంటర్నెట్ లో తారసపడ్డ ఒకటీ అరా సమీక్షలు చదివాను. అవి చదివాక సినిమా చూడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే, సినిమా మామూలుగా విమర్శించ పూనుకుంటే, అంత గొప్పగా ఏమీ లేదు. ఇందాకే అన్నట్లు, నటీ నటుల ప్రదర్శన అంత గొప్పగా లేదు. మంచి పట్టు ఉన్న కథనం లేదు. పోనీ, కథలో ప్రస్తావించిన సమస్యల గురించి ఏదైనా లోతైన చర్చ ఉందా? అంటే, అది కూడా లేదు. కానీ, కనీసం వ్యక్తిగతంగా నాకు తాను తీస్తున్న ప్రతి దృశ్యాన్నీ నారాయణ మూర్తి ఒక కన్విక్షన్ తో తీసాడు అనిపించింది. అందువల్ల, సినిమాలో నన్ను కదిలించిన దృశ్యాలు చాలానే ఉన్నాయి. అలాగే, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చాలా మట్టుకు (కనీసం నేను చూసినంత మట్టుకు) కాలక్షేపం కోసం చూసేవి, అవాస్తవిక లోకాల్లో విహరిమ్పజేసేవి మాత్రమే ఉంటున్నాయి. నిజానికి, అలాంటి సినిమాల అవసరం గురించి నాకు ఎటువంటి సందేహమూ లేదు. నాకూ సరదాగా సాగే హాస్య చిత్రాలూ, నాన్సెన్స్ అనుకుంటూనే టైమ్పాస్ చేసేసుకునే చిత్రాలూ, త్రిల్లర్లూ, గట్రా గట్రా అంటేనే ఇష్టం. కానీ, ఒక్కొక్కసారి, మనం బ్రతుకుతున్న ప్రపంచం కాకుండా సమాంతరంగా మన చుట్టూనే ఇంకో ప్రపంచం ఉంది అని గుర్తు చేయడానికీ, నిజంగా మనం రంగంలోకి దూకేసి సర్వం త్యాగం చేసి సంఘానికి అంకితం కాలేకపోయినా కూడా – తోటి మనిషి సమస్యల గురించి సానుభూతితో అర్థం చేసుకోవడానికీ- ఇలాంటి సినిమాలు రావడం అవసరం అని నేను నమ్ముతున్నాను.

ఎలాంటి పరిస్థితులలో అయినా, ఎలాంటి పరిమితుల మధ్య అయినా, తాను నమ్మిన సిద్ధాంతాలతో, తాను చెప్పదలుచుకున్న విషయాలను తనదైన శైలిలో చెప్పుకుంటూ సాగుతున్న ఆర్.నారాయణ మూర్తి గారికి మరొక్కసారి నమస్సులు. ఈ సినిమా చూడాలా వద్దా? అంటే నేను చూడమనే చెబుతాను. ఈ సినిమాలో లోపాలు పట్టడం చాలా తేలిక. కానీ, ఇంతకంటే లోపాలు ఎన్నదగ్గ సినిమాలని సూపర్ హిట్లు చేయగల మనం, కనీసం ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడూ అన్నా చూడాలి అని నా అభిప్రాయం. ఇకపోతే, అన్ని వర్గాల ప్రజలూ ఆదరించడం మొదలుపెడితే, ఈ సినిమాలని ధైర్యంగా ప్రొడ్యూస్ చేసే నిర్మాతలు వచ్చి, మంచి నటులు కూడా జోడి, మంచి కథనం ఉండేలా దర్శకుడిని ప్రేరేపిస్తాయి ఏమో కూడానూ! “పీపుల్స్ స్టార్” అన్న పేరు సార్థకం చేసుకునే లాగ, నా బోటి సమాంతర ప్రపంచ వాసుల్ని కూడా ఆకర్షించేలా ఏదన్నా సినిమా తీయాలని ఎదురు చూస్తున్నాను.

3 Comments
  1. ashok July 3, 2012 /
  2. Anish July 6, 2012 /
    • Sowmya July 7, 2012 /