Menu

సైజు చిన్నదైనా రేంజ్ పెద్దదైన “ఈగ”

ఈగ సినిమా చేస్తున్న buzzzz ఈ పాటికే మీకు చేరి వుంటుంది. ఈ సినిమా హిట్టని, సూపర్ హిట్ అనీ, తెలుగు సినిమాకి సరికొత్త మైలు రాయి అనీ అటు ఇండస్ట్రీ, ఇటు మీడియా నిర్ణయించేశాయి. చూసిన ప్రేక్షకులు ఈలలతో ఈగకి బ్రహ్మరథం పడుతున్నారు. సమీక్షకులు, విమర్శకులు “సూపర్బ్” అని వందసార్లు అంటున్నారు. నిజమేనా అని నేను ఈగని “భూతద్దం”లోంచి చూశాను. చివరికి తేలిందేమిటంటే “ఈగ” సైజు చిన్నదైనా రేంజి పెద్దదే అని.

కథ ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది – ముహూర్తం రోజే రాజమౌళిగారు మెగాఫోన్ లో అరిచి మరీ చెప్పేశారు. నిజానికి అది చాలా తెలివైన పని. ఎందుకంటే ఈ సినిమా గొప్పదనం కథలో కాదు, కథ చెప్పడంలోనూ, చూపించడంలోనూ వుంది. బహుశా అందుకేనేమో సినిమాని ఫ్లాష్ బ్యాక్ లు, నాన్ లీనియర్ నరేటివ్ లు లాంటి హంగామా లేకుండా సూటిగా ఇదీ మొదలు, ఇదీ చివర అన్నట్లు చెప్పేశారు. ఈ రకంగా చెప్పడం కూడా చాలా బాగా పనిచేసింది.

“ఈగ” గురించి కాస్సేపు పక్కన పెడదాం. అసలు సినిమాలో మనకి నచ్చేదేంటి? నచ్చనిదేంటి? ఒకో సినిమా చూసి బాగానే వుంది కానీ సెకండాఫ్ కొంచెం స్పీడుగా వుంటే బాగుండేది అనో… హీరో హీరోయిన్లు ఇంటర్వెల్ కి ముందే కలిస్తే బాగుండేదనో అనేస్తుంటాం. అంటే కథలో ఎక్కడ ఎలా వుంటే బాగుంటుందో మనకి ముందే తెలుసన్నమాట. ఇలా ప్రేక్షకులకి నచ్చే “సినిమా ఆర్డర్” లో ఏదైనా సినిమా వస్తే అది హిట్ అవకుండా వుండే అవకాశాలు లేవు. ఈ సినిమా విషయంలో సరిగ్గా అదే జరిగింది. అసలు రాజమౌళి సినిమాలు అన్నింటిలోనూ ఇదే విధంగా వుంటుందని చాలా మంది సినీ విశ్లేషకులు అంటుంటారు. ఎక్కడ ఏ రసం పడితే సినిమా పండుతుందో సరిగ్గా అదే మోతాదులో “తూకం” వేసినట్లు కథ చెప్పగలగడం ఒక కళ. ఈ కళలో నిష్ణాతుడు రాజమౌళి. (దీని గురించి వివరంగా మరోసారి)

ఈ సినిమా కథ మనకి ముందే తెలిసిన రివెంజ్ స్టోరీ. రివెంజ్ కి ముందు హీరో (మరీ ముఖ్యంగా చనిపోబోతున్న హీరో) ఎంత అమాయకుడిలా, ఎంత సామాన్యుడిలా, ఎంత మన స్నేహితుడిలా అనిపిస్తే అతని రివెంజ్ మనకి అంత సంతోషాన్ని, అంత సంతృప్తిని ఇస్తుంది. ఇందులో నాని (నాని) సరిగ్గా అలాగే వుంటాడు. రివెంజ్ స్టోరీకి మరో ముఖ్యమైన పాత్ర విలన్ ది. విలన్ ఎంత బలవంతుడు, దుర్మార్గుడు అయితే రెవెంజ్ అంత కసిగా వుంటుంది. సుదీప్ (సుదీప్) సరిగ్గా అలాగే వున్నాడు. మధ్యలో ఈగ దెబ్బకి పిచ్చివాడైనా ప్రీక్లైమాక్స్ లో సొంత పార్ట్ నర్ ని చంపి నిలబడ్డప్పుడు అతని విలనిజం మళ్ళీ మనలో కసి పెంచుతుంది. ఇక రివెంజ్ కి కారణం అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎలా వుండాలో బిందు(సమంత) అలాగే వుంది.

ఇక ముఖ్యపాత్ర ఈగ గురించి. విలన్ ని చంపే హీరో వెయ్యేనుగుల బలం వున్నవాడైతే అతను విలన్ ని చంపేటప్పుడు మజా ఏముంటుంది. హీరో బలహీనతలను అధిగమించి విలన్ ని చంపితేనే అతను ధీరోధాత్తుడౌతాడు. నయాపైసా లేని హీరో విలన్ తో పందెం వేసి కోట్లు సంపాదిస్తేనే కదా మనకతను హీరో అయ్యేది. మరి ఈ సినిమాలో హీరో – ఒక సాధారణ ఈగ. ఈగ అంత మనిషి ముందు, అందులోనూ కర్కోటకుడైన విలన్ ముందు ఎంత అల్పమైనదో మనకి తెలుసు కాబట్టి ఆ రివెంజ్ ఎలా సాధ్యపడుతుందా అని అనిపించడంతోనే మనం సీట్లకు అతుక్కుపోతాం. ఇది impossible అని మనం అనుకున్నది, హీరో possible అని చేసి చూపిస్తే ఆ హీరో మనకి ఎంతో ఎత్తులో కనిపిస్తాడు. ఇక్కడ ఈగ సాధించిన విజయం కూడా అదే. కాకపోతే ఇక్కడ నిజంగానే ఎంతో ఎత్తులో ఎగురుతూ కనిపిస్తుంది ఈగ.

సినిమాటిక్ లిబర్టీ అని ఒకటుంది. ఉదాహరణకి నానీ ఈగగా పుట్టాక హీరోయిన్ ని కలిసి “నేనే నానిని” అని చెప్పాలి. ఇది సినిమాలో ఎలా సాధ్యం అనేది సమస్య. ఈగ మాట్లాడగలదు అని అనుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అది convenience. కానీ లాజిక్ వుండదు. దీన్నే సినిమాటిక్ లిబర్టీ అంటారు. అది ఎక్కువైతా ప్రేక్షకులకి “మోసం చేశాడ్రా” అన్న భావం కలుగుతుంది. ప్రేక్షకుల తెలివితేటల్ని అవమానించినట్లు అవుతుంది. అలా జరగకుండా లాజికల్ గా కథ చెప్పడం ద్వారా ప్రేక్షకుల తెలివితేటల్ని గౌరవించే విధంగా ఈ సినిమా కథ చెప్పారు రాజమౌళి. ఇదే సినిమాలో  అయితే ఈగకి అతీతశక్తులో, కనీసం మాట్లాడే అవకాశమే వుండి వుంటే కథ తేలిపోయేది.

ఇది కథ, పాత్రల గురించి. ఇక కథనం విషయానికి వస్తే – ఒక చిన్న ప్రేమకథ చెప్పేసి, అందులో హీరోని విలన్ చంపినట్లు చూపించి ఆ తరువాత మళ్ళీ జన్మఎత్తిన ఈగ కథ చెప్పాలి. ఆ ప్రేమకథని సాధ్యమైనంతవరకు కుదించేసి, ఈగ కథ మీదే ఎక్కువ కథ నడపడం సాహసంతో కూడుకున్న పని. సాహసం అని ఎందుకంటున్నానంటే, ఈగతో గిమ్మికులు చేసే అవకాశం తక్కువ. ఎప్పుడూ చెవి దగ్గర నసపెట్టే ఈగని ఎక్కువసార్లు/ఎక్కువసేపు చూపిస్తే అది నసలాగే వుంటుంది. అయితే రాజమౌళి మాయాజాలం ఏమిటంటే, కథ మొదలైన అరగంటకే ప్రేమ కథని ముగించేసి ఆ తరువాతంతా ఈగని, అది చేసే పనులని చూపించడం. ఇది ఎంతో ధైర్యంతో, నమ్మకంతో చెయ్యాల్సిన పని. అలాంటి నమ్మకం (confidence) వున్న ఏ సినిమా అయినా హిట్టు కాక మరేమౌతుంది.

మూడో ముఖ్యమైన విషయం గ్రాఫిక్స్ మరియూ సినిమాటోగ్రఫీ గురించి. సినిమా ఎక్కువ భాగంలో ఈగ వుంటుంది. ఎంతసేపు విలన్-ఈగ, విలన్-హీరోయిన్ ల మధ్య కథ నడుస్తుంటుంది. అలాంటప్పుడు ఏ మాత్రం గాడి తప్పినా, ఈగతో మన ప్రయాణం సాగదు. ఒక బుల్లి ఈగనీ, పెద్ద విలన్ ని ఒకేసారి చూపించాలంటే చాలా కష్టం. అయినా అది సాధ్యమైందంటే దాని వెనుకు సినిమాటోగ్రాఫర్ కృషి, గ్రాఫిక్స్ కృషి అభినందనీయంగా వుంది. పైగా గ్రాఫిక్స్ అనగానే ఏ హాలీవుడ్ సినిమాతోనో పోల్చుకోని పేలవంగా వుందని పెదవి విరిచే మనల్ని సంతృప్తిపరచటం చాలా కష్టం. కానీ జక్కన్నగా పేరుపడ్డ రాజమౌళి ఈ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఈగ ప్రోగ్రస్ రిపోర్టులోనే మనకి తెలుసు. ఆ కష్టం వృధాకాలేదు. ఎక్కడో ఒకటిరెండు సీన్లు మినహాయించి అది గ్రాఫిక్స్ అన్న సంగతి మర్చిపోతాము.

నటీనటులంతా బాగా చేశారు. ముఖ్యంగా సుదీప్ నటన అద్భుతంగా వుంది. సెట్ లో ఈగ లేకపోయినా వున్నట్లుగా నటించడం అంత సులభం కాదు. అలాంటిది ఆద్యంతం సుదీప్ చాలా బాగా చేసి మెప్పించాడు. తెలుగు వారికి మరో రఘువరన్ లా అనిపించాడు. మిగిలిన తారాగణం వున్నంతలో బాగానే చేసినా, వారికి సినిమాలో ప్రాముఖ్యత లేదు.

ఈ సినిమాకి మరో ప్లస్ కీరవాణి సంగీతం. సినిమా విడుదలకు ముందే పాపులర్ అయిన పాటలు సినిమాలో మరింత అందంగానూ కుదిరాయి. నేపధ్యసంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. కీరవాణి సమర్థంవంతంగా తన పని నిర్వర్తించారు.

అన్నీ perfectగా వున్నాయా అని అడగవచ్చు. దాదాపు అలానే వున్నాయి. ఒకటి రెండు సన్నివేశాలలో గ్రాఫిక్స్ సరిగా కుదరలేదు. ఈగ exercises చెయ్యడం, డాన్స్ చెయ్యడం లాంటివి కొంచెం సినిమాకి నప్పనట్లు వున్నా సినిమాటిక్ లిబర్టీ అని క్షమించేయచ్చు. తంత్ర పాత్ర బిల్డప్ ఎక్కువ, పని తక్కువ అయ్యింది. అసలు అలాంటి మంత్ర తంత్రాల ప్రసక్తిలేకుండా కథ నడిపివుండచ్చు. తాగుబోతు రమేష్ పాత్ర ఇంకొంచెం పెంచినా బాగుండేదేమో. ఇలాంటివి ఎన్ని వున్నా, సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఇబ్బందిపెట్టవు, కాబట్టి రంధ్రాన్వేషణ అనవసరం.

చివరిగా చెప్పేదేమిటంటే – చూసిన వెంటనే అడిగితే వందసార్లు సూబర్బ్ అనాలనిపించినా, కొంచెం తీరిగ్గా ఆలోచిస్తే ఒకసారే సూబర్బ్ అనాలనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తొడలు కొట్టి, బిల్డప్పులు ఇచ్చి, వంశాలగురించి సొల్లు చెప్పే హీరోలకన్నా ఈగ సూపర్ హీరో అని తేలిపోయింది. అసలు హీరో రాజమౌళి పేరు మారుమోగిపోయింది.

15 Comments
 1. Indian Minerva July 10, 2012 /
 2. ఆ.సౌమ్య July 10, 2012 /
 3. Alapati Ramesh Babu July 10, 2012 /
 4. Sowmya July 10, 2012 /
 5. Sowmya July 10, 2012 /
  • వెంకట్ July 10, 2012 /
   • subhadra July 10, 2012 /
   • వసంతం July 10, 2012 /
 6. ఆది July 20, 2012 /
 7. ఆది July 20, 2012 /
 8. vijay July 27, 2012 /
 9. రామ August 1, 2012 /