Menu

ప్రపంచ చిత్ర చరిత్ర 3: మొదటి సినిమా – మన సినిమా

అతని పేరు ఫ్రెడ్ ఓట్. పొడవైన బుర్రమీసాలు, కుదురుగా దువ్విన జుట్టు, చక్కటి సూటు, కుడి చేతిలో రుమాలుతో ప్రత్యక్షమయ్యాడు. ఎడమచేతిలో వున్న నశ్యం పొడిని ముక్కుతో ఎగబీల్చి గట్టిగా తుమ్మాడు.

కేవలం అయిదు సెకండ్లు నడిచే ఈ సినిమానే అమెరికాలో కాపీరైట్ పొందిన మొదటి సినిమా (9 జనవరి 1894). అంతకుముందు 1888లో లీప్రిన్స్ “రౌంథేయ్ గార్డెన్” సినిమా తీసినా, మరింకెంతోమంది సినిమా తీసే ప్రయత్నం చేసినా “ఫ్రెడ్ ఓట్ స్నీజ్” అనేదే మొదటి సినిమా గా గుర్తించాలి. ఎందుకంటే అంతకు ముందు తీసినవి కేవలం పరీక్షించడానికి తీసినవే కాని ప్రదర్శించడానికి కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ అనుచరుడు డిక్సన్ కెనిటోస్కోప్ కనిపెట్టి అందులో ప్రదర్శించడానికి తయారుచేసిన ఈ సినిమా తీశాడు. అయితే కెనిటోస్కోప్‌లో కేవలం ఒకసారి ఒక్కరు మత్రమే చూసే వీలు వుండటం వల్ల ఇది పూర్తిస్థాయిలో చిత్రం కాదని కూడా వాదనలున్నాయి.

ఆ తరువాత ఒక సంవత్సరానికి, అంటే 1895లో ల్యూమినర్ సోదరులు సినిమా ప్రదర్శనకి సంబంధించి సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. 1862, 1864లో పుట్టిన ఈ సోదరులు ముందు తమ తండ్రి ఫోటోగ్రాఫిక్ సంస్థలో పని చేసినా, 1892లో తండ్రి పదవీవిరమణ చేసిన తరువాత సొంతగా పరిశోధనలు ప్రారంభించారు. 1895 ఫిబ్రవరి 19న తాము తయరు చేసిన సినిమాటోగ్రాఫ్ అనే పరికరాన్ని పేటంట్ చేశారు. సినిమాని రికార్డ్ చేసే యంత్రంగా, డెవలప్ చెసే యంత్రంగా, ప్రదర్శించేటప్పుడు ప్రొజక్టర్‌గా, మూడు రకాల వాడుకునే సౌలభ్యం ఇందులో వుంది. అయితే ఈ పరికరాన్ని అప్పటికి రెండు సంవత్సరాలకు ముందే ఫ్రాన్స్‌కి చెందిన లెఓన్ బౌలే తయారు చేశాడన్న వాదన కూడా వుంది. ఏమైతేనేం ఆ తరువాత ల్యూమినర్ సోదరులు 1895 మార్చ్ 19న చిత్రీకరించిన ఫ్రెంచ్ చిత్రం “లా సార్టీ దెస్ ఉసినెస్ ల్యూమినర్ య లైన్” (ల్యూమినర్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న పనివాళ్ళు) అనే చిత్రమే ప్రపంచంలోనే మొట్ట మొదటి సినిమాగా భావించబడుతోంది. ఈ సినిమాని ల్యూమినర్ సోదరుల్లో ఒకడైన లూయిస్ ల్యూమినర్ 35 ఎం.ఎం. విధానంలో, సెకనుకు 16 ఫ్రేములు వుండేట్టు చిత్రీకరించాడు. అంటే 46 సెకన్ల కాలం నడిచే ఈ చిత్రం 17 మీటర్ల పొడవుతో 800 ఫ్రేములుతో తయారైందన్నమాట.

ఇలా చిత్రీకరించన మరో తొమ్మిది చిత్రాలతో కలిపి మొత్తం పది చిత్రాలతో 1895 డిసెంబరు 28న, ప్యారిస్‌లో మొదటి ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకి టికెట్ పెట్టి అమ్మడంతో ఇవి మొట్టమొదటి కమర్షియల్ సినిమాలుగా చెప్పుకోవచ్చు. 50 సెకండ్ల లోపు వున్న ఈ పది చిత్రాలని కలిపి దాదాపు ఏడున్నర నిముషాల సినిమాగా అక్కడ ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు వచ్చిన ఆదరణ చూసి తరువాత తరువాత ఇవే చిత్రాలతో ప్రపంచ దేశాలను ఎన్నింటినో సందర్శించి ప్రదర్శనలు ఇచ్చారు. ఆ ప్రయాణంలో మన భారత దేశానికి వచ్చి మనకి సినిమాని పరిచయం చేసిన  ఘనత కూడా ఈ సోదరులకే దక్కుతుంది.

1896 జూలై 7న అప్పటి బాంబేలోని ఎస్పలాండ్ మాన్షన్లోని వాట్సన్ హోటల్‌లో భారతదేశంలోనే తొలి ప్రదర్శన జరిగింది. ల్యూమినర్ సోదరులు తీసిన ఆరు చిత్రాలను అక్కడ ప్రదర్శించారు. అదే మన దేశానికి సినిమాకి జరిగిన తొలి పరిచయం. ఆ తరువాత 1898లో ఇద్దరు ఇటలీ దేశస్తులు కొలొరెల్లొ, కొర్నాగ్లియ బాంబేయ్ ఆజాద్ మైదానంలో టెంట్లు వేసి సినిమా ప్రదర్శన జరిపారు. ఇలా అంతర్జాతీయ సినిమాలు మనదేశంలో అడుగుపెట్టిన తరువాత మన దేశంలోనే సినిమా నిర్మాణం ఎందుకు కాకూడదు అని కొందరి మనసులో ఆలోచన మొదలైంది. అందులో ఒకరు ముంబైలో ప్రముఖ ఫొటోగ్రఫర్‌గా పేరుపొందిన హరిశ్చంద్ర సఖారాం భాతవ్దేకర్ (సేవ్ దాదా) అయితే, రెండొవ వ్యక్తి కలకత్తాకి చెందిన మరో ఫొటోగ్రాఫర్ హీరాలాల్ సేన్.

సఖారాం భాతవ్దేకర్ (సేవ్ దాదా) 1896లో జరిగిన లుమిరీ సోదరుల ప్రదర్శన చూసి, తనే స్వంతగా సినిమా తీయాలని భావించాడు. అందుకోసం లండన్ నించి కెమెరా, ప్రొజక్టెర్ తెప్పించి బాంబే నగరంలో జరిగే కొన్ని ప్రముఖ సంఘటనలని చిత్రీకరించాడు. మొట్టమొదటగా బాంబేయ్ హాంగింగ్ గార్డెన్స్‌లో జరిగిన ఒక మల్ల యుద్ధాన్ని అతను చిత్రీకరించాడు. పుండలిక్ దాదా, కృష్ణ నవి అనే మల్లయోధులు ఇందులో పాల్గొన్నారు. “వ్రెస్లెర్స్” అని పేరు కలిగిన ఈ చిత్రమే మనదేశంలో తయారైన తొలి చలన చిత్రం. అయితే పూర్తిస్థాయి సినిమా కాదుకాబట్టి దీన్ని మొదటి “ఫీచర్ ఫిలిం”గా గుర్తించలేదు. ఆ తరువాత సేవ్ దాదా “ది మాన్ అండ్ హిస్ మంకీస్”, “లోకల్ సీన్స్” వంటివి మరో ఆరు చిత్రాలు తీశాడు. అందులో ప్రముఖంగా “ఢిల్లీ దర్బార్” మొట్టమొదటి న్యూస్ రీల్‌గా, మొట్టమొదటి డాకుమెంటరీగా చెప్పబడుతుంది.

ఇక రెండొవ వ్యక్తి హీరాలాల్ సేన్ కలకత్తాలో జరిగిన ఒక సినిమా ప్రదర్శనతో ప్రొఫెసర్ స్టీవెన్సన్ చిత్రం చూసి స్పూర్తి పొంది సదరు స్టీవెన్సన్ దగ్గరే కెమెరా తీసుకోని తన తొలి చిత్రం రూపొందించాడు. అప్పట్లో సినిమాతోపాటుగా నాటకాలు, ఒపెరాలు జరిగేవి. అలా ఆ సినిమా ప్రదర్శనతో జరిగిన “ద ఫ్లవర్ ఆఫ్ పర్షియా” అనే ఒపెరాలో కొంతభాగాన్ని ఆయన చిత్రీకరించాడు. తరువాత లండన్ నుంచి వార్విక్ ట్రేడింగ్ కంపెనీ నుంచి బయోస్కోప్ తెప్పించి తాను తీసిన చిత్రాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. ఆ తరువాత రాయల్ బయోస్కోప్ కంపెనీ స్థాపించి మరెన్నో చిత్రాలు ప్రదర్శించాడు.  కలకత్తాలో 1905 సెప్టెంబర్ 22న జరిగిన స్వదేశీ వుద్యమాన్ని చిత్రీకరించి తొలి “రాజకీయ చిత్రం” తీసిన వ్యక్తిగా పేరుపొందాదు.అయితే 1917లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఈయన తీసిన చిత్రాలన్నీ కాలిపోయాయి.

ఇలా ప్రారంభమైన భారతీయ సినిమా ప్రస్థానం, దాదా సాహెబ్ ఫాల్కే రాకతో అసలుసిసలైన “ఫీచర్ ఫిలిం”ల నిర్మాణానికి నాంది అయ్యి, తదనంతరం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకుంది.

 

 

(వచ్చేవారం: హరిశ్చంద్రాచి ఫ్యాక్ట్రరీ)

2 Comments
  1. sonu June 28, 2012 /
    • Chandu June 29, 2012 /