Menu

గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్-సమీక్ష

వాసేపూర్. జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లాలోని ఒక చిన్న టౌన్.

స్వాతంత్రం రావడానికి పూర్వం వాసేపూర్ నివాసి అయిన పేరు మోసిన బందిపోటు సుల్తానా ఢాకు తన ఊరి నుంచి వెళ్లే గూడ్స్ రైళ్లను దోచుకుంటూ ఉంటాడు. ఇదే సమయానికి సుల్తానా ఢాకు పేరు చెప్పుకుని షాహిద్ ఖాన్ (జైదీప్ అహ్లావత్) కూడా దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ విషయం వల్ల సుల్తానా ఢాకు కి షాహిద్ ఖాన్ కి గొడవ జరుగుతుంది. తన వాళ్లందరూ ఈ గొడవలో చనిపోవడంతో షాహిద్ ఖాన్ దొంగతనాలకు స్వస్తి చెప్పి రామాధీర్ సింగ్ అనే వ్యక్తికి చెందిన బొగ్గు గనుల్లో పని చేయడానికి వెళ్తాడు. అక్కడ మొదట రామాధీర్ సింగ్ (తిగ్మాన్షూ ధూలియా) దగ్గర పని వాడిగా మొదలై ఆ తర్వాత కొన్నేళ్లకే సింగ్ కి కుడి భుజం లా ఎదిగి చివరికి రామాధీర్ సింగ్ పన్నిన కుట్రలో చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న షాహిద్ ఖాన్ కొడుకు సర్దార్ ఖాన్ (మనోజ్ బాజ్ పాయ్) పెరిగి పెద్ద వాడై రామా ధీర్ సింగ్ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు.అక్కడ్నుంచి రామా ధీర్ సింగ్ మరియు షాహిద్ ఖాన్ ల మధ్య జరిగే డ్రామాలో ఢాకూ సింగ్ మరియు షాహిద్ ఖాన్ కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు చెలరేగడంతో వాసేపూర్ రావణ కాష్టం లా తయారవుతుంది.ఒక గ్యాంగ్ వాళ్లని మరొక గ్యాంగ్ వాళ్లు చంపుకుంటూ ఆ కక్షలు తమ తర్వాతి తరం కూడా కొనసాగించేలా చేస్తారు.

సర్దార్ ఖాన్ తర్వాత అతని స్థానంలో పెద్ద కొడుకు డానిష్ ఖాన్ కొనసాగుతూ ఉంటాడు. సర్దార్ ఖాన్ చిన్న కొడుకైన ఫైజల్ ఖాన్ (నవాజుద్దీన్ షిద్ధికీ) మాత్రం ఎప్పుడూ ముభావంగా వీటన్నింటికీ కొంచెం దూరంగా ఉంటాడు. కానీ ఈ సినిమా మొదటి భాగంలో ఫైజల్ ఖాన్ పాత్ర ను ఎస్టాబ్లిష్ చెయ్యడం ద్వారా మరియు సినిమా మొదటి సీన్లో ఫైజల్ ఖాన్ మీద జరిగిన హత్యా ప్రయత్నం ద్వారా రెండో భాగం లో ఫైజల్ ఖాన్ దే ప్రధాన పాత్ర కాబోతుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు.

ఇలాంటి కథ తో గతంలో ఇండియన్ స్క్రీన్ మీద రాలేదని కాదు కానీ ఇంత అద్భుతంగా చిత్రీకరించిన గ్యాంగ్ స్టర్ సినిమా ఇంతవరకూ భారతీయ చలనచిత్ర చరిత్రలో రాలేదనే చెప్పాలి.

మొదట అరగంట పాటు కొంచెం స్లోగా నడిచినా ఆ తర్వాత సినిమా ఎక్కడా కూడా ఆగదు. ఆగకపోవడమే కాదు సినిమా చివర్లో వచ్చే షూటింగ్ సీన్ వరకూ మనల్ని సీట్లోనుంచి కదలనివ్వదు. ప్రస్తుతం సినిమాలు తీస్తున్న భారతీయ దర్శకుల్లో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ మొదటి భాగం అక్కడక్కడా కొంచెం స్లోగా అనిపించినా మొత్తానికి ఒక అత్యద్భుతమైన సినిమాటిక్ అనుభవం అని చెప్పుకోవచ్చు.

అక్కడక్కడా గాడ్ ఫాదర్ సినిమా ఛాయలు కనిపించినా అనురాగ్ కశ్యప్ తనదైన శైలిలో భారతీయ సినిమా స్క్రీన్ పై చూడని విజువల్స్ తో రెండున్నర గంటల పాటు నడిచే ఈ సినిమా లో షుమారు నాలుగైదు దశాబ్దాల కథను కుదించడంలో రచయితలు సక్సెస్ సాధించారు. వయొలెన్స్ ఎక్కువని నేను చెప్పను కానీ కొన్ని సీన్స్ చూడ్డానికి కొంచెం గుండె ధైర్యం కావాలి.

ఈ సినిమాకి అనురాగ్ కశ్యప్ దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. దాంతో పాటు జివి ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. అలాగే రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. 1940 ల నుంచి 1980 ల వరకూ జరిగే కథ ను ఆయా కాలాలకనుగుణంగా చేసిన ఆర్ట్ వర్క్ కూడా సూపర్.

ఇక అన్నింటికంటే చెప్పుకోతగింది ఈ చిత్రంలో నటీనటులు. జైదీప్ అలావత్, మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధికీ, తిగ్మాన్షు ధూలియా నటన అద్భుతం. వీళ్లే కాదు ఇంకా చాలా మంది కొత్త వాళ్లు సినిమాలో చాలా బాగా నటించారు. రీమా సేన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో చాలా బాగా చేసింది.

ఈ సినిమా లో వాడిన హిందీ కొంచెం డిఫరెంట్ గా ఉండి నాలాంటి థోడా థోడా హిందీ వచ్చిన వాళ్లకి కొంచెం ఇబ్బంది పెడ్తుంది. సినిమా లో మసాలాలన్నీ ఉన్నాయి.మామూలు హిందీ సినిమాలోలానే పడి పడి నవ్వుకునే కామెడీ సీన్లు, హింస, రొమాన్స్ అన్నీ ఉన్నా అనురాగ్ కశ్యప్ హ్యాండిల చేసిన తీరు మాత్రం చాలా వైవిధ్యంగా ఉండి ఆకట్టుకుంటుంది.

మొత్తానికి గాడ్ ఫాదర్ తో సమానంగా పోల్చదగిన సినిమా ఒకటి హిందీ స్క్రీన్ మీద రావడం మనందరి అదృష్టం. అలాగే ఇంతవరకూ అనురాగ కశ్యప్ సినిమాల్లో ఉండే ఒక సొఫెస్టికేషన్ కంటే కూడా rawness కే ఈ సినిమాలో ప్రాధాన్యమిచ్చారు. కానీ ఆ rawness లో కూడా అనురాగ్ తన సొఫెస్టికేషన్ చూఫించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

మొత్తానికి మొదటిభాగం సినిమా అయ్యే సరికి ఎక్కడో కొంచెం వెలితిగా అనిపించినా మొత్తానికి ఒక గొప్ప చలనచిత్ర అనుభవాన్ని మనకందించి రెండో భాగం కోసం ఎదురుచూసేలా చేయడంలో అనురాగ్ కశ్యప్ విజయం సాధించాడనే చెప్పాలి.

9 Comments
  1. Phaneendra June 22, 2012 /
    • venkat s June 22, 2012 /
  2. rahul June 23, 2012 /
  3. SHASHIPAL REDDY RACHAMALLA June 25, 2012 /
  4. SHASHIPAL REDDY RACHAMALLA June 25, 2012 /
  5. Sreedhar June 26, 2012 /
  6. VENKAT Balusupati June 28, 2012 /
  7. Sudhakar July 5, 2012 /