Menu

కొంత ఆశ కొంత నిరాశ మిగిల్చిన భాగాహారం : సశేషం

ఆలోచన కొత్తగా ఉన్న ఆచరణలలో కొత్తదనం లేకపోతే ఏ లెక్కలో అయినా తేడా వచ్చేస్తుంది. ముఖ్యంగా సినిమా భాగాహారంలో శేషాలు మిగలకూడదు. నిశ్శేషంగా మిగిలితేనే లెక్క సక్సెస్.

 

ఆమధ్య వచ్చిన ‘వైశాలి’ లాంటి జాన్రా మిక్సింగ్ తరహా కథతో వచ్చిన సశేషం సినిమా వెనకనున్న ఆలోచన చాలా విన్నూత్నంగా ఉంటుంది. కానీ సస్పెన్స్ జాన్రా నుంచీ, సైకో జాన్రా మీదుగా హార్రర్ రివీల్ అయ్యేసరికీ ప్రేక్షకుడిని కొంత అసహనానికి గురిచేస్తుంది. మధ్యలో వచ్చే హాస్యం కొంత ఓకే అనిపించినా, బహుశా ద్వితీయార్థంలో నిడివి తగ్గుంటే “బాగుంది” అనిచెప్పే స్థాయిలో మిగిలి ఉండేది.

 

నటనపరంగా విక్రం శేఖర్, సుప్రియ ఇద్దరూ కొత్తవాళ్ళు అని అనుకోలేని విధంగా చాలా కంఫర్టబుల్ అనిపించారు. ముఖ్యంగా సుప్రియ కు మొదటి సినిమాలోనే మంచి నటనావకాశం ఉన్న పాత్ర దక్కడంతో పరిశ్రమ దృష్టిలో పడే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం ఒళ్ళుతగ్గాలి. విక్రం శేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్లస్ అవుతుంది. సత్యం రాజేష్ ఉన్నంతలో హాస్యాన్ని పండించడానికి ప్రయత్నించారు.

 

బాలాజీ సానల కథలోని అంశాలు కొన్ని హాలీవుడ్ సినిమాల్ని తలపించినా జాన్రా మిక్సింగ్ స్క్రీన్ ప్లే ని ప్రతిభావంతంగానే లాక్కొచ్చాడు. అనిల్ మాటలు అక్కడక్కడా తళుక్కుమన్నా, “ఆధిపత్యం”లాంటి మామూలుగా వాడని పదాలు వినబడి కలుక్కుమంటాయి. కె.సి. మౌళి సంగీతం పాటలవరకూ బాగున్నా నేపధ్యసంగీతంలో పస తగ్గింది. హర్రర్ సినిమాలకు తగ్గ స్థాయిలో లేదు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సతీష్, జి.ఎల్ బాబుల సినెమాటోగ్రఫీ. క్యానన్ ఫైవ్-డి తో చేసి ఈ మధ్యకాలంలో హిట్టయిన ‘ఈరోజుల్లో’ సినిమా ఔట్ పుట్ కన్నా ఈ సినిమాలోని ఔట్-పుట్లో క్లాస్ ఉంది. దాదాపు ఫిల్మ్ క్వాలిటీ కనిపిస్తుంది. ఫైవ్-డి ఔత్సాహికులందరూ ఈ విషయం చూడటానికి ఈ సినిమా ఖచ్చితంగా చూసెయ్యాలి.

 

చివరిగా చెప్పాల్సింది దర్శకనిర్మాత శ్రీకిషోర్ గురించి. సాధారణంగా ఈ మధ్యకాలంలో తెలుగులో తియ్యని జాన్రాలో సినిమా తియ్యాలనుకునే సాహసం దగ్గరనుంచీ, సిన్సియర్గా ప్రయత్నించడం వరకూ అన్నీ మెచ్చుకోదగ్గ పరిణామాలే అయినా, మొదటిసారిగా సినిమా చేసిన తడబాటు సినిమాలో అక్కడక్కడా కనిపించక మానదు. స్క్రీన్ ప్లేలో ఉన్న బిగిని, చివరలో వచ్చే ట్విస్టును మరింత ప్రతిభావంతంగా తీసుండొచ్చు. హర్రర్ సినిమాను, క్యానన్ ఫైవ్-డి ని అభిమానించే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రం. పోస్టర్లోని ‘వేడి’ని చూసి ఖంగారుపడి సినిమాకు వెళ్ళనివాళ్లకు అవేవీ సినిమాలో లేవనేది నేను ఇవ్వగలిగే భరోసా…సో…గో ఫర్ ఇట్.

4 Comments
  1. Vennaravi May 19, 2012 /
  2. Vamsi May 25, 2012 /
  3. Sreedhar June 8, 2012 /
  4. sasank June 21, 2012 /