Menu

ఒక “గుప్త దాత” కథ – విక్కీ డోనార్

దానం చేసే దాతల్లో కొంతమంది గొప్పగా చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకుండా గుప్తంగా వుండటానికి ఇష్టపడచ్చు. కానీ చేసిన దానమే నలుగురికీ చెప్పుకోలేనిదైతే ఆ దాత “గుప్త దాత” గా వుండిపోవాల్సిందేనా? అతను చేసిన దానం గురించి తెలిసిన తరువాత అతని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇలాంటి కథాంశంతో రూపొందించిన చిత్రమే విక్కీ డోనార్. ఇంతకీ అతను అంత గుప్తంగా చేసిన దానం ఏమిటనా మీ అనుమానం? అయితే వినండి. విక్కీ ఒక sperm donor.

ఇలాంటి ఒక దానం వుందని చెప్పుకోలేని సామాజికుల సమాజం మనది. అందులోనూ ఇలాంటి కథాంశంతో ఏకంగా ఒక రొమాంటిక్ కామెడీ సినిమానే తీయడమంటే అది నిజంగా సాహసమే. అంత సాహసాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా బయటపడ్డ నిర్మాత జాన్ అబ్రహాం, దర్శకుడు షూజిత్ సర్కార్ అభినందనీయులు. ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మీద ఇంత గొప్ప కథ రాయగలిగిన రచయిత జూహీ చతుర్వేదికి జోహార్లు.

కథ ప్రకారం సరైన స్పర్మ్ డోనార్ లేక ఇబ్బందులు పడుతున్న  infertility specialist డాక్టర్ బల్దేవ్ చెడ్డా (అన్నూ కపూర్) పనీపాటా లేకుండా తిరుగుతున్న విక్కీ అరోరా (ఆయుష్మాన్ ఖురానా)ని చూడగానే తనకి కావాల్సిన ఎలెగ్జాండర్ లాంటి మగాడు దొరికాడని సంబరపడతాడు. అయితే అతనిని ఆ పనికి కోసం అతనికి వున్న అపోహలను దూరం చేసి, డబ్బు ఎరవేసి చివరికి ఎలోగోలా ఒప్పిస్తాడు చెడ్డా. మొదట డబ్బుకోసం, ఆ తరువాత బిడ్డ పుట్టిన తల్లిదండ్రులు ఇచ్చే బహుమతుల కోసం, ఆ తరువాత సమాజసేవ చేస్తున్నానన్న నమ్మకంతో స్పెర్మ్ డొనేషన్ కొనసాగిస్తాడు విక్కీ. ఈ లోగా బ్యాంక్ లో పనిచేస్తున్న ఆషిమా రాయ్ (యామీ గౌతమ్)తో ప్రేమలో పడి కాదన్న ఇరువైపుల తల్లిదండ్రులను (తన తల్లి, ఆమె తండ్రి) ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి తరువాత ఆషిమా తల్లి కాలేకపోవటం, విక్కీ డబ్బు సంపాదన వెనక వున్న అసలు రహస్యం బయటపడటంతో చిక్కుల్లో పడతాడు. ఆ కష్టాల నుంచి విక్కీ ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.

మొదటి సగం పూర్తి కామెడీతో, రెండో సగం పూర్తి సెంటిమెంట్ తో రెండు రకాల కథలూ infertility, sperm donation చుట్ట్టూ తిరుగుతాయి. మధ్యలో వచ్చే ప్రేమ, పెళ్ళి సంబంధించిన సీన్లు పంజాబీ, బెంగాలీ ల మధ్య వున్న సాంస్కృతిక వైరుధ్యాలపై అల్లిన కామెడీతో సరదాగా సాగిపోతాయి. Sperm donation లాంటి కథని వేరే ఎలాంటి భావం కలగకుండా, అపహాస్యం కాకుండా హాస్యం పండించడం అంటే కత్తి మీద సాము. అది ఎంతో సులువుగా చేసేసినట్లు కనిపించినా దాని వెనక కష్టమే ఒక గొప్ప సినిమాగా మారింది.

ఇలాంటి కథాంశం చెప్పేటప్పుడు ఆ కథలో మిగతా విషయాల పైన ఎంతో శ్రద్ద చూపిస్తేకానీ కథ రక్తి కట్టదు. ఢిల్లీకి చెందిన విక్కి కథలో కనిపించే పాత్రలు, సన్నివేశాలు ఎంత సహజంగా వున్నాయంటే ఢిల్లీలో వుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ పాత్రలు మనకి చాలా దగ్గరగా తెలుసు అని తప్పకుండా వుంటారు. ఢిల్లీ పంజాబీలు ఎలావుంటారో విక్కీ తల్లీ, బామ్మ, పక్కింటి అమ్మాయి, డాక్టర్ చెడ్డా అంతా సరిగ్గా అలాగే వుంటారు. మరో పక్క హీరోయిన్ తండ్రి, కుటుంబం బెంగాలు నుంచి వూడి పడ్డట్టు వుంటారు. (దర్శకుడు బెంగాలీ కదా..) దాంతో మన ఎదురుగా జరుగుతున్నవి సినిమా లో కాదు ఢిల్లీ లో లాజ్ పత్ నగర్ లోనో, సీ.ఆర్. పార్క్ దగ్గరో జరుగుతున్నాయా అన్నట్లే  వుంటాయి. ఇది దర్శకుడిగా షూజిత్ సర్కార్ సాధించిన విజయం.

నటన పరంగా అన్నూ కపూర్ ఎప్పటిలాగే అలరించాడు. విక్కీ తల్లిగా నటించిన నటి, బామ్మగా నటించిన నటి, హీరోయిన తండ్రి పాత్రలకు జీవం పోసారు (పేర్లు తెలుసుకోవాలి..). ముఖ్యంగా కొత్త నటులు ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్ అద్భుతంగా నటించారు. (యామీ గౌతమ్ ఇలియానాకి దగ్గర బంధువా అనిపించింది… నటనలో కాదు… రూపురేఖల్లో!!) . ఇంత మంచి నటులు వుంటే ఎలాంటి కథైనా హిట్ సినిమా అవుతుందని అనిపించేంత బాగా నటించారు.

హిందీ సినిమాలలో దేవ్ డీతో మొదలై, ఇష్కియా, లవ్ సెక్స్ ఔర్ ధోకా, సాహెబ్ బీవీ ఔర్ గులాం, ఢిల్లీ బెల్లీ మొదలైన సినిమాలు అడల్ట్ సినిమాలుగా వచ్చినా బోల్డ్ సినిమాలుగా గుర్తించబడ్డాయి. అదే కోవలో వచ్చిన మరింత మెరుగైన బోల్డ్ సినిమా – “విక్కీ డోనార్”

చివరిగా ఒక మాట – ప్రపంచ వ్యాప్తంగా సరిన sperm దొరక ఎన్నో జంటలు పిల్లల్ని కనలేకపోతున్నారు. ఎచ్.ఐ.వి. గురించి, ఐ డొనేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లే sperm donation గురించి కూడా (ధైర్యంగా) మాట్లాడుకోగలగాలి. ఇందుకు మొదటి అడుగుగా ఈ సినిమాని గౌరవించాలి. అలాగని సందేశాలతో నింపకుండా నవ్విస్తూ సందేశమిచ్చినందుకు దర్శకనిర్మాతలను అభినందించి తీరాలి. ధైర్యంగా వెళ్ళి చూడండి… బయటికి వచ్చాక ఈ సినిమా చూశానని ధైర్యంగా చెప్పగలుగుతారు…!!

చిత్రం: విక్కీ డోనార్

నటీనటులు: ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, అన్నూ కపూర్

నిర్మాతలు: John Abraham Enshrinement, Rising Sun Films, Eros

దర్శకుడు: షూజిత్ సర్కార్

9 Comments
 1. Indian Minerva April 21, 2012 /
 2. Mallik April 22, 2012 /
 3. rahul, April 22, 2012 /
  • అరిపిరాల April 22, 2012 /
   • rahul, April 22, 2012 /
 4. Purnima May 16, 2012 /
 5. sundar May 31, 2012 /
 6. Sowmya June 9, 2012 /