Menu

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Pirates of Silicon Valley

 

ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసించినవాళ్ళు ఇద్దరున్నారు.

స్టీవ్ జాబ్స్

టెక్నాలజీ అంటే ఏమిటో తెలిసినవాళ్ళకి ఈ పేరు తెలియకుండా వుండే అవకాశమే లేదు. ఆయన పేరు తెలియకపోయినా కనీసం ఐపాడ్, ఐఫోన్ అనే పేర్లు విని వుండకపోతే ఆ వ్యక్తిని సాంకేతిక నిరక్షరాస్యుడని (technology illiterate) ప్రకటించేయచ్చు.

బిల్ గేట్స్

కంప్యూటర్ల గురించి తెలియని సాంకేతిక నిరక్షరాస్యుడికి అయినా ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా బిల్ గేట్స్ సుపరిచితుడు. ఇక కంప్యూటర్ అంటేనే విండోస్ అనేంతగా చొచ్చుకుపోయిన ఆపరేటింగ్ సిస్టం గురించి కొత్తగా చెప్పాలిసిన పనేలేదు.

ఈ ఇద్దరు వ్యక్తులు లేకపోతే మనం కొన్ని తరాల వెనకపడిపోయి వుండేవాళ్లమేమో. కొన్ని వందల సంవత్సరాల తరువాత మానవ పరిణామక్రమం గురించి ఎవరైనా రాయాల్సివస్తే – మనిషి నిప్పుని కనిపెట్టడం, చక్రాన్ని కనిపెట్టడం, కంప్యూటర్‌ని కనిపెట్టడం కీలక సంఘటనలుగా పేర్కొంటారేమో. ఇంతగా మనల్ని ప్రభావితం చేసిన ఒక సాంకేతిక విప్లవానికి కారణమైన ఆ ఇద్దరి జీవితాలలో జరిగిన సంఘటనలే కథగా ఒక సినిమా తీస్తే? సరిగ్గా ఈ ఆలోచనతో రూపుదిద్దుకున్న చిత్రమే – “పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ”.

నిజానికి స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ ల జీవితాలు ఒకదానికొకటి పెనవేసుకోని వున్నా ఈ ఇద్దరి మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. ముఖ్యంగా వారిద్దరి నాయకత్వ లక్షణాలను (leadership qualities), మేనేజ్మెంట్ స్టైల్ లను పరిశీలిస్తే ఆ వైవిధ్యాలు ప్రస్ఫుటమౌతాయి. వారిద్దరి మనస్తత్వాలలో కూడా ఎంతో భేదం వుంది. స్టీవ్ జాబ్స్ ఒక కాళాకారుడి లాంటి మనస్తత్వం వున్న వాడైతే బిల్ గేట్స్ ఒక వ్యాపారవేత్త మనస్తత్వం కలవాడు. స్టీవ్ ఆలోచనలు వేదంత సిద్ధాంతాల మీద ఆధారపడితే బిల్ ఆలోచనలు చాలా వరకు ఆర్థిక సిద్ధాంతాల మీద ఆధారపడతాయి. ఉదాహరణకి చూడండి –  మొన్నటికి మొన్న స్టీవ్ జాబ్స్ చనిపోయినప్పుడు ఇంటర్నెట్‌లో వెల్లువలా వచ్చిన సంతాప సందేశాలను చూడండి. ఫేస్‌బుక్‌లోనూ, ట్విటర్‌లోనూ ఎక్కడ చూసినా ఆయన ఆత్మశాంతి కోరుతూ సందేశాలే. ఒక టెక్నాలజీ కంపెనీ అధిపతికి ఇంత మంది అభిమానులా అని ఆశ్చర్యపోయేంతగా వున్నాయా సందేశాలు. మరి బిల్ గేట్స్ కి కూడా అంత మంది అభిమానులు వున్నారా?

బహుశా వుండకపోవచ్చు. ఇంటర్నెట్‌లో వెతికితే బిల్ గేట్శ్ మీద, మరీ ముఖ్యంగా విండోస్ మీద కోకొల్లలుగా జోక్స్ దొరుకుతాయి. టెక్నాలజీ విప్లవాన్ని వీరిద్దర్లో ఎవరెంత ప్రభావితం చేశారు అనేది పక్కన పెడితే ప్రజాభిమానంలో మాత్రం బహుశా స్టీవ్ జాబ్స్ కే ఎక్కువ మార్కులు పడతాయేమో. ఎందుకంటే బిల్ గేట్స్ మన అవసరాలను గుర్తించి వ్యాపారం చేశాడు, స్టీవ్ జాబ్స్ తన మనసుకు నచ్చేవి తయారు చేసి వాటితో వ్యాపారం చేశాడు.

సరిగ్గా ఇదే విషయాన్ని వివరిస్తూ సాగే సినిమా “పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ”.  ఒక సినిమాగా ఇది స్టీవ్ జాబ్స్ గురించి కథ అని అనిపించినా నిజానికి ఇది ఇద్దరి కథ. ఎందుకంటే బిల్ గేట్స్ లేకపోతే స్టీవ్ జాబ్స్ లేడు. స్టీవ్ జాబ్స్ లేకపోతే బిల్ గేట్స్ వుండేవాడు కాదు. వీరిద్దరి జీవితాల గురించి తెలుసుకోవడానికి, సాంకేతిక విప్లవాలకు నాంది పలికిన ఏపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల పుట్టుక గురించీ వాటి అభివృద్ధి గురించి తెలుసుకోడానికి ఈ సినిమా తప్పకుండా చూడాలి. అలాగని ఇది కేవలం టేక్నాలజీ గురించిన కథే కాదు. ఇద్దరు వ్యాపారవేత్తల మధ్య నడిచే పోటీకారణంగా వారి మధ్య పుట్టే స్నేహాలు, వైరాలు, ద్రోహాలు అన్ని కలిసి ఈ సినిమాని బోర్ కొట్టే జీవితచరిత్రలా కాకుండా ఒక ఎంటర్టైనింగ్ కథలా వుంటుంది.

ఈ సినిమాలో మేనేజ్మెంట్ పాఠాలు వెతికితే రెండు ముఖ్యమైన విషయాలు గుర్తించవచ్చు. అందులో మొదటిది స్టీవ్ జాబ్స్ దార్శినికత (Vision). తాను సాధించబోయే సాంకేతిక విప్లవం తనకి ముందే తెలుసా అన్నంత ధీమాగా వుండే స్టీవ్ జాబ్స్ ని చూస్తే ఆశ్చర్యంతో పాటు, ఆరాధన కూడా కలుగుతుంది. అనూహ్యమైన నాయకత్వ లక్షణాలతో అతను టీమ్ ను ముందుకు నడిపించే విధానం చూస్తే అభినందించాలనిపిస్తుంది. మామూలుగా ఉద్యోగస్తులతో సరదాగా వుండే స్టీవ్ జాబ్స్ పని విషయానికి వచ్చేసరికి ఎంత కఠినంగా వ్యవహరించేవాడో చూస్తేకానీ తెలియదు. ఇది కాక కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆఫీసుకి రావటం, ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తితో అవసరంలేని వ్యక్తిగతప్రశ్నలు అడిగి ఖంగారు పెట్టడం ఇలాంటివి ఎన్నో వున్నాయి. ముఖ్యంగా తన కంపెనీలోనే ఏపిల్ టీమ్ ని మ్యాక్ టీమ్ ని విడగొట్టి వారిద్దరి మధ్య దాదాపు కొట్టుకునే పరిస్థితి తీసుకురావటం చూస్తే అది తెలియక చేస్తున్న పిచ్చి పనా లేక ఇందులో కూడా ఏదైనా కార్పొరేట్ పాఠం వుందా అని ఆశ్చర్యపోతాం. నిజానికి చాలా Leadership పాఠాలలో చెప్పే Create and Manage Conflict for result అన్న సూత్రాన్నే స్టీవ్ జాబ్స్ పాటిస్తుంటాడు.

మరో పక్క (ఈ సినిమాలో) బిల్ గేట్స్ ఈర్షాద్వేషాలు, పన్నాగాలు చూస్తుంటే ఈ సినిమాలో విలన్ గేట్సే నేమో అని అనిపించకమానదు. వాస్తవానికి ఇదే మనం నేర్చుకోవాల్సిన రెండో మానేజ్మెంట్ పాఠం. కాంపీటీషన్ ఎక్కువైనప్పుడు జరిగే Unethical Practises కి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. అలాంటి అనైతికమైన పోటీని తట్టుకోడానికి తెలివైన మేనేజర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో కూడా స్పష్టం చేస్తాడు స్టీవ్ జాబ్స్.

సినిమా చివరి భాగంలో స్టీవ్ జాబ్స్ బిల్ గేట్స్ ని పట్టుకోని నిలదీస్తాడు. తన టెక్నాలజీని దొంగిలించి విండోస్ తయారు చేసారని అభియోగం మోపుతాడు. అప్పటి దాకా చాలా ప్రశాంతంగా వున్న గేట్స్ ఆవేశంగా అరిచి – “నేను చేసింది దొంగతనం అయితే నువ్వు జిరాక్స్ దగ్గర చేసింది ఏమిటి?” అని అడుగుతాడు. ఆ ప్రశ్న తరువాత నిజంగా గేట్స్ విలనేనా అన్నప్రశ్న మనలో మిగిలిపోతుంది. బహుశ అందువల్లే ఈ సినిమాకి “పైరేట్స్ ఆఫ్ సిలికన్ వ్యాలీ” అని పేరు పెట్టారేమో.

కొత్తగా పుట్టుకొచ్చే టెక్నాలజీలను adopt చేసుకోవడంలో చాలా వరకు కంపెనీలు వెనకబడుతుంటాయి. ఆ విషయానికి వస్తే మార్పుకి ఎప్పుడూ విముఖత వుండనే వుంటుంది. ఈ సినిమాలో ఉదాహరణ చూస్తే జిరాక్స్ కంపెనీలో ఒక టీమ్ మౌస్ ని కనిపెడితే దాన్ని చూసిన జిరాక్స్ యాజమాన్యం “చచ్చిన ఎలకలా వుందని” తిరస్కరిస్తుంది. అదే పరిజ్ఞానాన్ని అందుకున్న స్టీవ్ జాబ్స్ మాకింటోష్ కంప్యూటర్ల ద్వారా ఆ పరికరాన్ని మనకి పరిచయం చేశాడు. సరిగ్గా ఇదే విధంగా మొదటిసారి ఏపిల్ పరికరాన్ని తయారు చేశాక స్టీవ్ జాబ్స్, అతని మిత్రుడు దాన్ని హేవ్లెట్ పేకార్డ్ దగ్గరకు తీసుకెళ్తే దాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు. అదే ఏపిల్ ఈ రోజు ఏమైందో మనందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే అప్పట్లో పేరు మోసిన కంపెనీలు సైతం కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాయి. కానీ ఆ టెక్నాలజీనే నమ్ముకున్న స్టీవ్ జాబ్స్ రాబోయే తరాల చరిత్రనే తిరగరాశాడు. అది కేవలం ఒక Visionary కి మాత్రమే సాధ్యం.

 

Cinema: Pirates of Silicon Valley

Cast: Noah Wyle, Anthony Micheal Hall, Joey Slotnick

Direction: Martyn Burke

Production: Leanne Moore

Management Lessons: Vision, Competition, New technology adaption

3 Comments
  1. Anon April 25, 2012 /
  2. Sowmya May 9, 2012 /
  3. kishore raja anumula June 15, 2012 /