Menu

బాగలేదు అని చెప్పలేని సినిమా: దేవస్థానం

ప్రస్తుత తెలుగు సినిమా ట్రెండ్ కి భిన్నంగా ఏ మాత్రం స్టార్ లు లేని సినిమా, అదీ కథను నమ్ముకున్న సినిమా రావటం అరుదుగా జరుగుతుంది. కానీ అలాంటి ప్రతి సినిమా శంకరాభరణం కాలేదు. ఇప్పుడు దేవస్థానం పరిస్థితి కూడా అంతే. కే. విశ్వనాధ్, యస్పీబీ, ఆమని వంటి దిగ్గజాలు వున్నారు, మానవ జీవితం గురించి ముఖ్యంగా మానవత్వం గురించి మంచి కథ వుంది – ఇన్ని వున్నా మంచి సినిమా చూశాం అన్న తృప్తిని పూర్తిగా ఇవ్వలేకపోయిన సినిమాగా దేవస్థానం మిగిలిపోయింది.

కొన్ని కథలు అద్భుతంగా వుంటాయి. అయినా సరే అద్భుతంగా వున్న కథలన్నీ సినిమాలు కాలేవు. ఇక్కడ జరిగింది కూడా అదే. కథ ప్రకారం తనకంటూ ఎవరూ లేని శ్రీమన్నారాయణ (విశ్వనాథ్) దేవస్థానాన్నే ఇల్లుగా భావిస్తూ, అడిగినవారికి ధర్మసూక్ష్మాలు చెప్తూ కాలం వెళ్ళదీస్తుంటాడు. అయితే తాను చనిపోయిన తరువాత తనకి తల కొరివి పెట్టేవాడు ఉండడని ఒక దిగులు అతనిని వెంటాడుతుంటుంది. సరిగ్గా అప్పుడే “తన ఇల్లే దేవస్థానం” అని భావించే మధ్యతరగతి సాంబమూర్తి (బాలు) ఆయనకి తారసపడతాడు. తనకు తల కొరివి పెట్టమని సాంబమూర్తిని అడుగుతాడు శ్రీమన్నారాయణ . ముందు కాదన్నా తరువాత భార్య సరస్వతి (ఆమని) హితబోధతో ఒప్పుకుంటాడు సాంబమూర్తి. అలా మొదలైన పరిచయం బంధమై, ఇద్దరూ సంఘహిత కార్యక్రమాలు, హరి కథా కాలక్షేపాలు చేస్తూ వుంటారు. ఆ తరువాత జరిగే అనూహ్య పరిణామాలు వారిద్దరి సంబంధానికి ఎలాంటి అర్థాన్ని ఇచ్చాయి – అనేది మిగతా కథ. ముందే చెప్పినట్లు కథగా ఇది బాగున్నట్టే వున్నా సినిమాకి సరిపోయేంత సరుకును ఇవ్వలేకపోయింది. బహుశా అందువల్లే కథలో హరి కథ, తద్వారా కళోద్ధారణ, సంఘసేవ వంటి ప్రహసనాలు వచ్చి అసలు కథను  డైల్యూట్ చేశాయి.

విశ్వనాథ్, బాలు, ఆమని నటన విషయంలో ఎప్పటిలానే అవసరానికి తగినట్లుగా గొప్పగా నటించారు. చాలా కాలం తరువాత తెరపై కనిపించిన ఆమని నటన బాగున్నా డబ్బింగ్ (సొంత గొంతు?) కారణంగా కొంత లోటుగా అనిపించింది.  అడపాదడపా బాలు కొంచెం శ్రుతి తప్పినా మిగతావారి నటనలో కొట్టుకోయింది. ముఖ్యంగా బాలు వయసుకి, భారీకాయానికి ఆమనితో సరసాలు కొంచెం ఎబ్బెట్టుగా వున్నాయి. రమణాచారి ఐఎయస్ పాత్ర పరిథిలో నటిస్తే, కోవై సరళ ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో తెలియని అనవసరపు హాస్యసన్నివేశానికి పరిమితం అయ్యింది. అయితే చాలా చోట్ల పంటి కింద రాయిలా తగిలేది మాత్రం బాలు, విశ్వనాథుల ద్వారా చెప్పించిన సూక్తులు. ఇప్పటికే పాడుతా తియ్యగా ద్వారా సూక్తులు ప్రచారం చేసే బాలుకి ఇది కొనసాగింపులా వుంది. ఇందులో ఇంకో చిక్కు వుంది. సూక్తిముక్తావళి పుస్తకాన్ని చేతికిచ్చి చదవమని ఎలా వుంది అని అడిగే ఏం చెప్పగలం. ఆసాంతం చదివించేంత గొప్ప పుస్తకం కాకపోవచ్చు, అలాగని తీసి పారేయాల్సిన పుస్తకం కాదు.. సరిగ్గా ఇదే పరిస్థితి దేవస్థానం చిత్రానిది కూడా. మెసేజ్ సినిమాలతో, దేశభక్తి సినిమాలతో ఇదే సమస్య – బాలేదని చెప్పాలంటే నాలుగుసార్లు ఆలోచించాల్సివస్తుంది.

ఇక సినిమాని టెక్నికల్ దృష్టితో చూస్తే దర్శకత్వం, సంగీతం ఫర్వాలేదనిపిస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా లైంటిగ్ సమస్యలు, కెమెరా షేక్ అవ్వడం, ఎడిటింగ్ లో ఒకోసారి అనవసరమైనవి కత్తెర పడకపోవటం స్పష్టంగా అనుభవరాహిత్యాన్ని చూపిస్తాయి. సంగీత సాహిత్యాలను రెండింటినీ నిర్వహించిన స్వరవీణాపాణి మంచి మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా “పలుకు తెలుపు తల్లివే”, “దేవస్థానం” పాటలు గుర్తుంటాయి. మరీ ముఖ్యంగా నేపధ్యసంగీతానికి వాడిన సంగీతంలో అడపదడప వినిపించే మోర్సింగ్, కంజీర అలరించాయి. మాటలు (జనర్దన మహర్షి) బాగున్నా, అవి ఎక్కువగా సూక్తులు కావటం కథతో అతకడానికి ఇబ్బంది పడ్డాయి.

మొత్తం మీద ఒక ఫీల్ గుడ్ సినిమా. ఇలాంటి సినిమాలను చూసే వాళ్ళు, ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళి రావచ్చు.

Film: Devasthanam (2012)

Cast: K. Viswanath, SP Balasubrahmanyam, Aamani, Kovai Sarala, Ramanachary

Music – Swara Veenapani

Camera – VN Suresh Kumar

Story, dialogues; Screenplay and direction – Janardhana Maharshi

6 Comments
  1. Anon April 26, 2012 /
  2. బాబు April 27, 2012 /
    • అరిపిరాల April 28, 2012 /
      • Rajya January 29, 2017 /
  3. Kiran Chikkala May 7, 2012 /
  4. Murali June 12, 2012 /