Menu

మూసలోకూడా ఒదగని ‘రచ్చ’

ఐదు ఫైట్లు, ఆరు పాటలు, వీలైనంత మంది కామెడియన్సూ, సాధ్యమైనన్ని డబుల్ మీనింగ్ డైలాగులూ, ఫ్యూడల్ ఫ్లాష్ బ్యాక్, కథకు సంబంధం లేకుండా సినిమా అంతా స్లీప్ వాకింగ్ చేసే హీరో, కథతోపాటూ కథానాయకుడి గమ్యాన్నీ నిర్దేశించే ఆపద్ధర్మ హీరోయిన్ ఇవి ‘రచ్చ’ సృష్టించిన కొత్త కమర్షియల్ సినిమా ఫార్ములా.

మాస్ సినిమాలు అనబడే ఫార్ములా చిత్రాలు చాలా అవసరం. ఎందుకంటే, అవి అసెంబ్లీలైన్ ప్రొడక్షన్స్ లాంటివి. సఫల ప్రయోగాల ఆధారంగా తయారయ్యే ప్రోడక్టుల్లాంటివి. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తరం పదేపదే ఒకేలాంటి చిత్రాలు చేసినా వాటికి కనీసం బైడిఫాల్ట్ అంతకుముందు చేసిన ప్రయోగాల ద్వారా సమకూరిన ఫార్ములా ఒకటి కథాకథనపరంగా ఉండేది. ఉదాహరణకు ప్రేమ కథ అయితే ఒక అబ్బాయి-ఒక అమ్మాయి, వాళ్ల మధ్య ప్రేమ, ప్రేమకి ఒక సమస్య, ఆ సమస్య నుంచీ ఇద్దరూ కలిసో లేక ఒకరు తెగించి మరొకరిని రక్షించో బయటపడి ప్రేమని నిలుపుకోవడం. ఒక పగ సినిమా అయితే, హీరోకి విలన్ లకీ ఈ జన్మలోనో మరో జన్మలోనో వ్యక్తిగత వైరం ఉండటం. కుటుంబానికి అన్యాయం చేసుండటం. అప్పటికి హీరో విలన్ ని ఎదిరించే బలంలేక కొన్నేళ్ళాగి పెద్దై హీరోయిన్ సహాయంతో, ఇతర కామెడీ బృదం హెల్ప్ తో విలన్ భరతం పట్టడం. ఇలా కొన్ని కథా ధర్మాలు కమర్షియల్ ఫార్ములాగా స్థిరపడ్డాయి.

గత కొద్ది సంవత్సరాలుగా స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలీని రచయితా దర్శకులు బయల్దేరి కథ ఎలా మొదలెట్టకూడదో, కథ ఎలా చెబితే కలగాపులగం అయ్యి కన్ఫ్యూజన్ లో ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ కాడో అలాంటి పంథాని ట్విస్టులనుకుని, ప్రేక్షకుడిని ఉత్తేజపరిచి ఆసక్తిని కనబరుస్తాయని డిసైడ్ అయ్యి మినిమం గ్యారంటీ అయిన పద్దతైన “ఫార్ములాని” అటకెక్కించి ఇలాంటి కుక్కమూతిపిందె సినిమాల్ని మనమీదికి వొదులుతున్నారు.

బెట్టింగ్ రాజ్ (రామ్ చరణ్) సాహసానికి, గెలుపుకి ఈర్షపడిన జేమ్స్(అజ్మల్) రాజ్ పెంపుడు తండ్రి చావుబ్రతుకుల్లో ఉంటే, ఇస్తానని ఒక ఫ్యూడల్ లార్డ్ కూతురు చైత్ర (తమన్నా)ను ప్రేమిస్తే ఆ సమస్య తీరడానికి సరిపడే డబ్బు ఇస్తానని బెట్ కడతాడు. దీంతో హీరో ఇరవైలక్షలకోసం హీరోయిన్ ని ప్రేమలో పడేసే సాహసాల్లో పడిపోతాడు. తీరా హీరోయిన్ ఇతగాడిని ప్రేమించాకైనా హీరోకి నిజమైన ప్రేమ కలుగుతుందా అంటే అదీ లేదు. హీరోయిన్ నేను ప్రేమిస్తున్నాను మొర్రో అంటే అది నాక్కాదు ఇంకొక కోన్కిస్కా గొట్టంగాడి ముందు నువ్వు చెప్పాలి అని బెట్టింగ్ డబ్బులకోసం తప్ప హీరోయిన్ మనసు గురించి ఆలోచించడు. ఈ పరిణామ క్రమంలో విలన్లు అటాక్ చెయ్యడ, ప్రమాదవశాత్తూ ఎప్పుడో చిన్నప్పుడు హీరోయిన్ తో పాటూ హీరో కుటుంబానికీ ఇదే విలన్స్ అన్యాయం చేశారని తెలియడంతో కథ క్లైమాక్స్ కొస్తుంది. ఇంతకీ సినిమా మొత్తానికీ అసలైన ట్విస్ట్ ఎంటంటే, ప్రి-క్లైమాక్స్ వరకూ హీరో ప్రమేయం లేకుండా జరిగిపోయిన కథకు కర్త,కర్మ,క్రియ అన్నీ హీరోయిన్ ఆ హీరోయిన్ ఫ్రెండ్ జేమ్స్ కారణం అవ్వడం.

కమర్షియల్ సినిమా ముఖ్యంగా హీరోయిజమున్న సినిమా అంటే హీరో ఫైట్లు చేసి వందమందిని అర్థరహితంగా చితగ్గొట్టెయ్యడం కాదు. ఆ కొట్టడం వెనక హీరోకి ఒక గమ్యం, ఒక మీనింగ్ ఫుల్ కోపం ఉండాలి. అప్పుడే పోరాట దృశ్యాలకు ఒక సార్థకత. హీరోయిన్ తో పనికిరాని తైతక్కలాడ్డం కాదు. ఆ తైతక్కల వెనక కొంత ఎమోషన్ ఉండాలి. ప్రేమ అనే ఎలిమెంట్ ఉండాలి. అవి ఉన్నప్పుడే ఎన్ని మెలికలు తిరిగి డ్యాన్స్ చేసినా అందంగా కనిపించేది. పాటలంటే స్కిల్స్ షోకేస్ చేసుకునే పోటీకాదుకదా, ఏ సినిమాలో అయినా అదొక భావవ్యక్తీకరణ చేసే సాధనం . రచ్చ సినిమాలో ఆ రెండూ కొరవడ్డాయి. నిజంగా ప్రేమించని హీరోయిన్ కోసం హీరో ఎంత మందితో ఫైట్ చేసినా ప్రేక్షకుడు మజ్జుగా పాప్ కార్న్ తింటూ సీట్లలో జోగడంతప్ప హీరోతో మమేకమై సీట్లలోంచీ కదలడు. ఎన్ని ఎముకలు విరిగే ఫీట్లు నృత్యాల్లో చేసినా కోతులాట చూసినట్లు తెరవైపు ఒక లుక్కేస్తాడే తప్ప హీరోతో పాటూ ఎగిరిగంతెయ్యాలనే ఆలోచన రాదు.

ఒక హాస్య దృశ్యాలంటారా… అవన్నీ అపహాస్య దృశ్యాలే. ప్రతి సినిమాలోనూ హీరో కోసం బకరా అయి హాస్యాన్ని పండించే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మళ్ళీ అదే చేస్తే, తాగుబోతు రమేష్ మరోసారి తాగుబోతయ్యాడు. వేణు మాధవ్ హీరో ఇంట్రడక్షన్ డైలాగు చెప్పడానికి, శ్రీనివాసరెడ్డి సైడ్ వాయింపుగాడిలాగా మిగలడానికీ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఎమ్మెస్ నారాయణ్ణి కామెడీ బ్యాచ్ నుంచీ పక్కనబెట్టి రామ్ చరణ్ కి పెంపుడు తండ్రిని చేసినా, అక్కడా వెకిలి తాగుడు హాస్యపు ప్రయత్నమే తప్ప పాత్ర మీద కనీసపు సింపతీరాని పరిస్థితి. ధర్మవరపు సుబ్రమణ్యం హేమలు ఆటలో అరటిపండు టైప్. హీరోయిన్ ఎంట్రీ వరకూ కొన్ని అందాలు కళ్ళముందు కనిపించాలి కాబట్టి సత్యకృష్ణన్ బౌలింగ్ లో బొడ్డు చూపడానికీ, ఝాన్సీ పాత్ర నడివయసులో ఉన్న నాకే చరణ్ ని చూస్తే ‘అదో రకంగా అయిపోతోంది’ లాంటి చవకబారు డైలాగులు చెప్పడానికి మాత్రం వాడుకున్నారు.

విలన్లుగా ఒకే ఎక్స్ ప్రెషన్ ముఖేష్ రుషి అలాగే ఉంటే, కోటశ్రీనివాసరావు సినిమాలో ఎందుకున్నాడో అర్థం కాదు. అతిధి పాత్రల్లో నాజర్, పార్తీబన్, ఆలి బాగానే ఉన్నారు. మణిశర్మ సంగీతం పాటల్లో పెద్దగా అనిపించకపోయినా నేపధ్యసంగీతం ద్వారా సినిమాలో ఎమోషన్ లేకపోయినా, దాన్ని తీసుకురాగలిగాడు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు ప్రాసభూయిష్టంగా పాతవాసనలతోనే ఉన్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో ప్రత్యేకమైన మార్క్ అంటూ ఏమీ లేదు.

చివరిగా, రచ్చ సినిమాలో కథాపరంగా హీరో అజ్మల్ (సినిమాలో పరుచూరి వెంకటేశ్వర్రావు చెప్పే మాటలు గుర్తుచేసుకోండి) అయితే, తెరవెనుక ఉండి సోకాల్డ్ కథానయకుడినే శాసించే పాత్రలో కథానాయిక తమన్నా ఉంటుంది. ఇక రామ్ చరణ్ చేసిందల్లా ఒక సెన్స్ లెస్, స్లీప్ వాకింగ్, రోబోటిక్ హీరో పాత్ర. అదే తెలుగు కమర్షియల్ సినిమాలో హీరోయిజం నిర్వచనం అనేది కొత్త ఫార్ములా అయితే ఇప్పటికే అధమస్థితిలో ఉన్న తెలుగు సినిమా అధోగతిపాలవ్వడం తప్ప మరో ఛాయ్స్ లేదు. కాబట్టి రచ్చ, కమర్షియల్ ఫార్ములాను కూడా రొచ్చులోకి నెట్టే పరమ చెత్త. అంతే.

 

16 Comments
 1. ramesh April 11, 2012 /
 2. prasad April 11, 2012 /
 3. ramnv April 11, 2012 /
  • rahul April 12, 2012 /
 4. mani April 11, 2012 /
  • rahul April 12, 2012 /
 5. తెలుగు అభిమాని April 11, 2012 /
 6. Raveendra April 12, 2012 /
 7. subba rao April 12, 2012 /
 8. pvr April 12, 2012 /
 9. geeyassar April 12, 2012 /
 10. ramnv April 17, 2012 /
 11. Vennaravi April 18, 2012 /
 12. srikanth April 21, 2012 /
 13. kishore raja anumula June 15, 2012 /