Menu

వై దిస్ గోల “వెర్రి” థ్రీ?

గత కొంతకాలంగా వేలంవెర్రిలా పాకిన కొలవెరి పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి పాటను రూపకల్పన చేసినవాళ్ళు తీసిన సినిమా అంటే అంచనాలు వుండటం సహజం. అందునా ఈ మధ్యకాలంలో వైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన తమిళ పరిశ్రమ చిత్రం కావడంతో ఆ అంచనాలు మరో నాలుగింతలయ్యాయి. అయితే నిన్న విడుదలైన “3” చిత్రం ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. గత కొంతకాలంగా తమిళ సినిమాని తెగపొగిడేసిన మా లాంటి వారి కళ్ళు తెరిపించేలా కుదేలైంది. కథని ముందుకు సాగనివ్వని Dragged Emotions, మూల కథ గురించి ఏ మాత్రం నిబద్ధత లేని Screenplay, ఏ మాత్రం రీసెర్చి చెయ్యని ఒక (మెంటల్)మెడికల్ ప్రాబ్లం – వెరసి కొలవెరి డి సినిమాని “గోల వెర్రి”గా మార్చింది.

సినిమా మొత్తంలో మొదటి సగంలో వున్న లవ్ స్టోరీ మాత్రం సహజంగా వుండటం వల్ల కొంతమందికి నచ్చే ప్రమాదం వుంది. అయితే ఒకే విషయం చెప్పడానికి ఐదారు సీన్లు వాడేయటం వల్ల వున్న కాస్త మంచి కూడా కొట్టుకుపోయింది. ఇంటర్వెల్ తరువాత వేరే సినిమా హాల్ లోకి వచ్చామా అన్నంతగా కథ మారిపోతుంది కాబట్టి మొదటి సగం బాగున్నా అది మర్చిపోయే అవకాశం ఎక్కువ. ఈ సినిమాతో ప్రేక్షకులు ఎంతగా Disconnect అయ్యారో ఎమోషన్ సీన్లలో హాలంతా నవ్వుకోవడం చూస్తే అర్థం అవుతుంది. ఒక మర్డర్ మిస్టరీలా మొదలై, క్యూట్ లవ్ స్టోరీలో ప్రయాణించి, అక్కడి నుంచి సైకలాజికల్ డ్రామా అయ్యి చివర్లో థ్రిల్లర్ రూపంలోకి మారే ఈ సినిమా ఇప్పటికే ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది కాబట్టి ఇంత కన్నా వివరాలు అనవసరం.

కథ, నటన వంటివి పక్కన పెడితే, చిత్ర పరాజయానికి ప్రధాన కారణమైన స్కీన్ ప్లే గురించి కొంచెం చెప్పుకోవాలి. ముందు కథ వినండి.(Spoilers Ahead. ఇప్పటికీ ఈ సినిమా చూడాలనుకునేవాళ్ళు ముందు చదవాలో లేదో ఆలోచించుకోండి.)

ఒక అందమైన ప్రేమ జంట. టీనేజ్ తో మొదలై అయిదేళ్ళపాటు సాగిన ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే, అబ్బాయి తండ్రి (తల్లి ఎందుకు వున్నట్టు?) అంటీ ముట్టనట్టు సమర్థిస్తాడు. పెద్దలు కాదన్నా పబ్ లొ పెళ్ళి చేసేసుకోని నెమ్మదిగా ఇరువర్గాలను ఒప్పించే స్థితికి వస్తారు ఆ ప్రేమ జంట. ఆ తరువాత ఆ అబ్బాయికి అనూహ్యమైన మానసిక సమస్య వుందని తెలియడంతో, అతను ఆ అమ్మాయికి విషయం చెప్పకుండా పరిస్థితి విషమం చేసుకుంటాడు. అదే సమస్యతో ఆత్మహత్య చేసుకుంటాడు. – ఇదీ కథ.

ఈ కథలో ఆత్మహత్యని పక్కన పెట్టి, మానసిక సమస్య స్థానంలో కాన్సర్ పెడితే ఏమౌతుంది? మనం చిన్నప్పటి నుంచి చూసిన ఎన్నో శోభన్ బాబు సినిమాలు గుర్తుకువస్తాయి కదా? అప్పట్లో ఇలాంటి కథలతో వచ్చిన అనేక సినిమాలు విజయవంతం అయిన సంగతి కూడా మనకి గుర్తు వుండేవుంటుంది. పోనీ మన పాత సినిమాల వదిలిపెడితే సరిగ్గా ఇలాంటి కథలతోనే వచ్చిన అనేక హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు వున్నాయి కదా. ఇన్ని సినిమాల చరిత్ర వున్నా ఇంత చెత్తగా స్క్రీన్ ప్లే రాసుకున్నారంటే అసలు సినిమా అనే ప్రక్రియ గురించి, స్క్రీన్ ప్లే విధానం గురించి అనుభవరాహిత్యం అన్నా వుండాలి, లేకపోతే నిర్లక్ష్యం అన్నా వుండి వుండాలి.

సినిమా జాన్రా సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పుడు దానికి ప్రేక్షకులను సిద్ధం చేసే సీన్లు మొదటి నుంచీ పెట్టుకోవడం ఉత్తమమైన పద్దతి. లేకపోతే అక్కడక్కడ కొన్ని ప్రశ్నలుగా వదిలేసి వాటి ముడులను రోగం గురించి చెప్పాక విప్పడం రెండో పద్దతి. ఇలా చెయ్యకపోతే సినిమా కాదా, నిజ జీవితంలో ఇలాగే వుంటాయా అని మీరు అడగచ్చు. కానీ ప్రపంచంలో ఏ ఉత్తమ థ్రిల్లర్ సినిమా చూసినా అందులో ప్రేక్షకులను షాక్ కి గురిచేసే ట్విస్ట్ వచ్చిన తరువాత వెనక్కి చూస్తే అవును అంతకు ముందే ఫలానా సీన్లో డైరెక్టర్ క్లూ ఇచ్చాడు అని మనం గుర్తుచేసుకుంటాం. (కహాని ఉత్తమ ఉదాహరణ). అలా లేనప్పుడు డైరెక్టర్ మనల్ని మోసం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలా ఒకసారి మనం Cheat చెయ్యబడ్డామని అనిపించాక సినిమాతో ప్రేక్షకుడు Connect అవడం దాదాపు అసాధ్యం. సరిగ్గా ఇలాంటప్పుడే ఎమోషనల్ సీన్లో కామెడీ కనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు గట్టిగా జోకు పేల్చడం, హాలంతా నవ్వడం జరుగుతుంది. “3” సినిమాలో జరిగింది అదే. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అన్ని ఎమోషనల్ సీన్స్ లో హాయిగా నవ్వుకోండి.

అన్నట్టు మర్చిపోయానండోయ్… కొలవెరి పాట కోసం సినిమా చూడచ్చు కదా అని అనుకుంటున్నారేమో… సినిమాలో కొలవెరి కన్నా ఇంటర్ నెట్ లో వున్న చాలా విడియోలు బాగున్నాయి…!!

 

4 Comments
  1. ramnv March 31, 2012 /
  2. Sri March 31, 2012 /
  3. Chakri April 1, 2012 /
  4. Praveen Sarma May 7, 2012 /